Sunday, 13 September 2020

కులసంఘం

    కులసంఘం   

కులమోల్లంతా గలిసి సంఘం బెడుతున్నరంట

ఇంగ మనం యిక్కట్లనుంచి గట్టెక్కినట్టే నంట

ఇడుములమొయిళ్ళు సంఘంగాలికి కొట్టకపోతాయంట

ఇంగేంగావాల! శానా మంచిదే ననికొనిండొక కులపోడు.

ఒకరోజు పనిపంచేటైనా పోయేతీరాలనికొనిండు

ఈ బాధల బందిఖానానుండి

బయటబడిపోయినట్టే ననుకొనిండు.

 

రానే వచ్చిందారోజు -  కులసంఘం బెట్టేరోజు.

పట్టుదుకూలాలు గట్టి - పెద్దలంతా వచ్చేసిండ్రు

గొప్పసభదీర్చిండ్రు - మనకులం శానా గొప్పదనిండ్రు.

గుడిలేక కులదేవత గుర్రుతో ఉన్నదనిండ్రు

కట్టితీరాల గుడి ఎట్టైనా తప్పదనిండ్రు.

కులదేవతకు మొక్కిండ్రు  ఈయమ్మ

 మనకోసమే ఎలిసిందనిండ్రు.

 

సిన్నంగా యింగ రాజకీయాలకొచ్చిండ్రు

మనోళ్ళు శానా బుర్రగలోల్లనిండ్రు.

ఎట్టైనా మనకు సీటుగావా లనిండ్రు

మనోడు సట్టసభల్లో ఎలగాల్సిందే ననిండ్రు.

కులపోల్లంత కట్టగా వుండాలనిండ్రు

ఓట్లుసీలకుండా సూడాలనిండ్రు.

లెక్కెంతైనా సందాలేసుకుందా మనిండ్రు

బాంబులకేం మనకు కొదవలేదనిండ్రు.

దొంగోట్లు శానా ఏసుకోవాలనిండ్రు

మనోడీసారి గెలిసి తీరాలనిండ్రు

ఇట్టాంటియన్నీ శానా మాట్లాడిండ్రు

సభను సాగదీసి యిసిగించిండ్రు

కులపోల్ల కష్టాలమాట మరిసిండ్రు

సంఘమైతే ఒకటి బెట్టి పోయిండ్రు.

 

మనకులపోడి కొచ్చింది అనుమానం

అసలు కులమంటేఏందబ్బా? అని

పనినిబట్టి కులమనుకొనిండు

ఏపనోడు అకులం పొమ్మనిండు.

మళ్ళీ అనుమనమొచ్చింది కులపోడికి

ఈపట్టుఉడుపుల్లోని పెద్దలెవరని?

 

ఒకడేమో మనుషుల నెత్తురుపీల్చే వడ్డీవ్యాపారస్తుడు

మరొకడు సిండికేట్ల రింగులల్లే బడా కాంట్రాక్టరు.

ఇంగొకడు తగవుబెట్టి తగవుతీర్చే ఛోటా నాయకుడు.

మరొకడేమో వానితోకబట్టి బలకొట్టే పోకిరిగాడు.

కులవృత్తిని నమ్మిబ్రతుకు వాళ్ళసలుకాదు యీళ్లు.

శిలలకింద ముల్లెకొరకు గోతులుతీసే కొక్కులు యీళ్ళు

అమ్మోరి జాతరలో అల్లరిజేసి కూసే కుక్కలు యీళ్లు.

 

ఈళ్ళాంతా కులపోళ్ళా? కాదంటే కాదనిండు

మోసగాళ్ళు దగకోర్లు దొంగలు యీళ్ళనిండు.

చెట్టుపేరుజెప్పి కయలమ్ముకొనే నాయాళ్ళు యీళ్లు

కులంపేరుతో పబ్బంగడుపుకొనే కుటిలులు యీళ్ళు

 

ముడిసరుకుకై యాతన కులమంతా పడుతుంటే

ఒకమాటైనా మాట్లాడిండ్రా యీళ్ళు

పనిసాగక కులమంత పస్తుల్తో చస్తుంటే

పరపతి మాటేమైనా ఎత్తిండ్రా యీళ్లు

పనికిమాలిన మటలు మాట్లాడిండ్రు

పనిపంచేటుజేసి పోయిండ్రు.

 

కులసంఘం చేసిందేముంది - కుల్లుబెంచడం తప్ప

అని అనుకొనిండు మనోడు అసలు సిసలు కులపోడు

కడగండ్లలో వున్నోడు.. సరైన పనోడు.

 --- 

 

search: kulasangham  

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...