Wednesday, 8 March 2023

కొబ్బరికాయ,Coconut

 

కొబ్బరికాయ



కొబ్బరికాయను టెంకాయ, శ్రీఫలం, నారికేళం అనికూడాఅంటాఋ. ఇదిహిందువులకు అతిముఖ్యమైన పూజావస్తువు. పాంజాతికి చెందిన వృక్షమిది. ఇసుకనేలలలో బాగాపెరుగుతుంది. వందసంవత్సరాలు బ్రతుకుతుంది. ఏడుసంవత్సరాల తర్వాత ఫలిస్తుంది. ముఫ్పై మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. వేదాలలో కొబ్బరికాయ ప్రస్తావనలేదుకానీ పురావస్తుశాఖ త్రవ్వకాల్లో, ఆయుర్వేద గ్రంథాల్లో, చైనా, అరేబియా, ఇటలీ, యాత్రికుల అనుభవాలు లిఖించిన గ్రంథాల్లో నారికేళప్రస్తావన కనబడుతుంది. అమరకోశం (క్రీ.శ 500 -800)లో నారికేళం కనబడుతుంది. మనిషి ఆవిర్భానికిముందే, రెండుకోట్ల సంవత్సరాలక్రితము  నుండే కొబ్బరివుందని పురవస్తుశాఖ శిధిలాల పరిశోధనలప్రకారం నిర్ధారించారు. ఒకటి, రెండు శతాబ్దాలనుండి కొబ్బరికాయ ధార్మికకార్యక్రమాలలో వాడటం మొదలైందట. మధ్యయుగంనాటి శిలాశాసనాలలో దేవాదాయఆస్తులుగా కొబ్బరితోటలున్నాయి. చరకసంహితలో ఔషదవృక్షంగ కొబ్బరినిపేర్కొనడం జరిగింది. ఆగ్నేషియా, ఇండోనేషియా, ఆష్త్రేలియా, పసిపిక్‍దీవులు, ఇండియాలో కొబ్బరిసాగు జరుగుచున్నది. ఇండియాలోని కేరళరాష్త్రం,  ఆంద్రప్రదేశ్‍లోని కోనసీమ కొబ్బరిపంటకు ప్రసిద్ధిచెందింది.

 డిల్లీకిచెందిన పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకరశర్మగారు కొబ్బరికాయను మానవశరీరంతో పోల్చారు. పీచు టెంక అహంకారం. లోపలికొబ్బరి మనస్సు. నీరు నిర్మలత్వం. మనిషితన అహంకారాన్ని తొలగించుకొని, తననుతాను నిర్మలంగా భగవంతునికి సమర్పించుకోవడమే, అనగా ఆత్మసమర్పణమే నారికేళసమర్పణమన్నారు. కొబ్బరికాయను మరికొందరు పండితులు మనిషితలతో పోల్చారు. పైపీచు వెంట్రుకలు, గుండ్రని‍ఆకారం ముఖం, లోపలినీరు రక్తం, తెల్లటికొబ్బరి మనస్సు అన్నారు. ఇంకొందరు పెద్దలు టెంకాయకున్న మూడుకళ్ళు స్ఠూల,సూక్ష్మ,కారణ శరీరాలకు ప్రతీకలన్నారు. కొందరైతే అవి శివుని త్రినేత్రాలన్నారు. కొబ్బరివృక్షం స్వర్గంనుండి భూమికి లక్ష్మీనారాయణులచే తేబడిందని చెబుతారు. ఇది భువిపైగల కల్పవృక్షమని హిందువులుభావిస్తారు. కొబ్బరికాయను దైవారాధనకేగాదు దోషనివారణకూ ఉపయోగిస్తారు.

 ఏవిధమైన పూజచేసినా, అది యజ్ఞారంభంకావచ్చు, పెళ్ళిళ్ళలోకావచ్చు, ఉత్సవాలలోకావచ్చు, క్రొత్తవాహనానికి పూజలోకావచ్చు, గృహనిర్మాణాలకుముందు శంకుస్థాపనలలోకావచ్చు, నూతనగృహ ప్రవేశాలలోకావచ్చు, అన్నిశుభకార్యాలలో, పండుగల్లో పూజానంతరం కొబ్బరికాయకొట్టాడం హిందువుల ముఖ్యాచారం. ఇది శాంతికారకమని వారినమ్మకం. టెంకాయకొట్టేటప్పుడు ముందుగా కాయను బాగాకడిగి జుట్టుపైకుండేటట్టు పట్టుకొని దేవునిప్రార్థించి, తర్వాత జుట్టువెనక్కు త్రిప్పుకొని, ఆగ్నేయదిశలో రాయినుంచుకొని, 8,9 అడుగుల ఎత్తుకు టెంకాయనెత్తి కొట్టాలని అర్చకస్వాములు చెబుతారు. టెంకాయపగిలి నీరుబయటికి వస్తున్నప్పుడు ఆనీటితో వెంటనే అభిషేకం చేయకుండా, నీటిని వేరొకపాత్రలోనికి పట్టుకొని, రెండిచిప్పలు విడదీసి, దేవునిముందుంచి, తర్వాత పాత్రలోని టెంకాయనీళ్ళతో అభిషేకంచేయవచ్చు, లేదా ఆనేటినే తీర్థంగా స్వీకరించవచ్చు. టెంకాయ ఎలాపగిలినా దోషంలేదు. కొట్టిన తర్వాత  జుట్టును తీసేయాలి. కొబ్బరికి కుంకుమ పసుపు పూయరాదు. కొబ్బరిని తీసి చిన్నచిన్నముక్కలుగాతరిగి అందులో అటుకులు చెక్కెర లేక కలకండపొడి కలిపి ప్రసాదంగా స్వీకరించడం శ్రేయస్కరం. కొబ్బరికాయకొట్టినతర్వాత అదిక్రుళ్ళినదని తెలిస్తే, చింతింతవలసిన పనిలేదు. అంతటితో దోషాలన్నీ పోయినవని భావించాలి. అలా అనుకోలేని పక్షంలో "సర్వంసర్వేశ్వరార్పితమ్" అనిగానీ లేక "శివాయనమః" అనిగానీ నూటాయెనిమిదిసార్లు జపిస్తే సరిపోతుంది. క్రొత్తదంపతులు కొట్టిన టెంకాయలో పువ్వువస్తే త్వరలో సంతానప్రాప్తి కలుగుతుంది. టెంకాయ నిలువుకు పగిలితే కూతురికిగానీ కుమారునికిగానీ సంతానం త్వారలో కలుగుతుందని సూచనగా తెలుసుకోవాలి. ఆలయంలో కొట్టిన టెంకాయ కుళ్ళితే, దాన్నిపారవైచి, కాళ్ళుచేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీపూజచేసి టెంకాయకొట్టవచ్చును. అందువల్ల తొలిటెంకాయతో దోషంతొలగి, మలిటెంకాయతో శుభములు కలుగుతాయని పూజారులు చెబుతారు. క్రొత్తవాహనాలకు పూజచేసి కొట్టిన టెంకాయ క్రుళ్ళితే దృష్టిదోషం నివారణ జరిగిందని తలంచాలి. అవసరమనిపిస్తే మరోటెంకాయకొట్టుకోవచ్చు. లేకుంటేలేదు. పెళ్ళిపందిరిగుంజలకు కొబ్బరాకుమట్టలుకట్టి శోభను పెంచుకోవచ్చు. కొందరు శవయాత్రకేర్పరచిన పాడెపైకూడా కొబ్బరాకుమట్టనుంచి తీసుకెళతారు. శవాలకు, సమాధులకు సైతం టెంకాయకొట్టి నమస్కరించడం పరిపాటి. కలశంపైకూడా కొబ్బరికాయనుంచి అది గణపతిగా భావించి పూజిస్తాము. కొబ్బరికాయను స్త్రీలు కొట్టకూడదంటారు. కొడితే ఆస్త్రీసంతానానికి హానికలుగుతుందని భావిస్తారు. ఇది కేవలం అపోహకావచ్చు. కొన్నిదేవాలయాల్లో కొట్టిన టెంకాయ‍అర్థభాగాలు హోటళ్ళలో చట్నీకివెళితుంది. ఇంకాయెక్కువైతే నూనెతయారీకి వెళుతుంది. ఇదికూడా ఒకరకంగా సద్వినియోగమే అవుతుంది. ఎక్కువై పారవేయడం మంచిదికాదుగదా? కొందరుకోరుకొన్న కోరికలునెరవేరి, గుడిలో నూరుటెంకాయలు కొడతారు. అలాచేయడం కేవలం వారిమ్రొక్కుకావచ్చు. అంతేగానీ అదేంశాస్త్రం కాదు. కలలో కొబ్బరికాయ కనబడినా శుభదాయకమేనంటారు.

 కొబ్బరికాయ దైవప్రసన్నత కొఱకేగాక దోషనివారణకు, దరిద్రనివారణకు కూడా ఉపయోగపడుతుందంటారు. శుక్రవారం ఎఱ్ఱనిదుస్తులు ధరించి లక్ష్మీపూజచేసి, టెంకాయకొట్టి, మరుదినం కొబ్బరిచిప్పలను ఎఱ్ఱటివస్త్రంలో చుట్టి బయటివారికి కనబడకుండా ఇంట్లో దాచివుంచితే, ఆర్థికకష్టాలు తొలగిపోతాయి. శనివారం దేవాలయంలో కొట్టిన కొబ్బరిచిప్పలను నదికిసమర్పిస్తే శనిదోషం పోతుంది. ఎండుకొబ్బరిరౌండ్‍ను రెండుగకోసి అందులో చెక్కెరనింపి ఇంట్లో దాచితే రాహు కేతుదోషాలు తొలగిపోతాయి. మంగళవారం కొబ్బరికాయ, నల్లనువ్వులు, ఉద్దిపప్పు, ఒకగోరు కలిపి నల్లగుడ్డలో చుట్టి నదిలో విడిచిపెడితే సర్పదోషనివారణమౌతుంది. లక్ష్మీనారయణులను పూజించి కొబ్బరికాయ తెల్లటితీపిపదార్తం పసుపుగుడ్డలో మూటగట్టి వ్యాపారస్థలంలో వుంచుకుంటే, నష్టాలురావు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కొబ్బరికాయను తలనుండి పాదముల వరకు పదకొండుసార్లు దిగదుడిచి, దానిని నిర్జనప్రదేశంలో కాల్చివేస్తే, పిల్లలలో కంటిచూపుదోషాలు తొలగిపోతాయి. టెంకాయను ఇరవైఒక్కసార్లు తలనుండి పాదములవరకు దిగదుదిచి ఆలయఆవరణలో కాల్చివేస్తే, అనారోగ్యసమస్యలు తొలగిపోతాయి. ఇలా ఐదు మంగళ,శనివారాలు చేస్తే ఆర్థికసమస్యలుకూడా తొలగిపోతాయి. ఎఱ్ఱనివస్త్రంలో టెంకాయనుచుట్టి ఏడుసార్లు వ్యక్తి పైనుండిక్రిందకుత్రిప్పి హనుమంతుని పాదాలచెంతవుంచితే యితరుల చెడుదృష్టిదోషం తొలగిపోతుంది. ఇంట్లో కొబ్బరిచెట్టునాటితే ఉద్యోగవ్యాపారాల్లో విజయంలభిస్తుంది. గురుగ్రహం అనుకూలించి అనుకున్నపనులు నెరవేరుతాయి. చెట్టును ఇంటికి దక్షిణంలేదా పడమరదిశలో నాటడం మంచిది. చట్టపరమైన కేసులు అనుకూలించి దరిద్రంవదలిపోవాలంటే, కృష్ణ శుక్లపక్షాలు రెండింటిలో అష్టమినాడు కాలభైరవునికి కొబ్బరిదీపం వెలిగించాలి. దీనితో ఏలినాటిశని ప్రభావంకూడా తొలగిపోతుంది. ఐదు గురువారాలు వినాయకునిగుడిలో స్వామికెదురుగా టెంకాయకొట్టి, రెండుచిప్పలలో “X” ఆకారంలో ఒక్కొక్కచిప్పలో నాలుగు వత్తులువేసి వెలిగించాలి. కోరినకోరికలు నెరవేరుతాయి. కొబ్బరిదీపాలలో వత్తులు వెలగడానికి నెయ్యినిమాత్రమే వాడాలి. శివునిగుడి ద్వజస్తంభంవద్ద, అమావాస్యసాయంత్రం ఆవునేతితో కొబ్బరిదీపాలు వెలిగిస్తే విపరీతంగా బాధిస్తున్న కష్టాలు తొలగిపోతాయి. ఈవిషయంలో మనిషికి ఎన్ని సంవత్సరాల వయస్సుంటే అన్ని దీపాలువెలిగిస్తే మంచిది.

 కొబ్బరిచెట్లవలన కేవలం నమ్మకంతోనేవున్న ప్రయోజనాలేగాకుండా మనకళ్ళయెదుటే కనిపించే ప్రయోజనాలెన్నోవున్నాయి. కొబ్బరి‍ఆకుతో బుట్టలల్లుకుంటారు. కొబ్బరిపీచుతో దృడమైన తాళ్ళు తయారౌతాయి. చలువకోసం సోఫాలలో కొబ్బరిపీచును వాడుతారు. కేరళలో కొబ్బరినూనెను వంటల్లో వాడుకుంటారు. కొబ్బరినూనెను మేలైన సబ్బులతయారీలో వాడతారు. ఉప్పునీటిస్నానానికిసైతం యీసబ్బులు బాగాపనిచేస్తాయి. తలనూనెగా కొబ్బరినూనె వాడకం అందరికీతెలిసిందే. కొబ్బరితురుముపొడి కూరలలో రుచి చిక్కదనం రావడానికి వాడతారు. పచ్చికొబ్బరిచట్నీ తెలియనివారుండరు.

 కొబ్బరికి ఔషదగుణాలుకూడా ఎక్కువే. కొబ్బరిబోండానీళ్ళు నిస్సత్తువను పోగొడతాయి. ఈనీళ్ళలో గ్లూకోస్, పొటాషియం, సోడియం, వుంటాయి. ఎలక్టోలిటిన్ వుండటంవలన జలోదరంలాంటి జబ్బులలో మూత్రం సజావుగా జారీయై ఉపశమనంకలుగుతుంది. కలరా నీళ్ళవిరేచనలలో కొబ్బరినీరు ప్రాణప్రదాయినిగా పనిచేస్తాయి. శరీరంలో నీటిశాతాన్నిపెంచి రక్షిస్తాయి. పైత్యప్రకోపాన్ని తగ్గిస్తాయి. శరీరంలోని విషపదార్తాలను బయటకు నెట్టివేస్తాయి. ప్రేగులను శుభ్రపరచి విషరహితంగావిస్తాయి.                       

ఉష్ణప్రాంతాల వారికి కొబ్బరినీరు అమృతంవంటిది.  సూర్యతాపం తగ్గించి చలువచేసి శరీరఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కొబ్బరిని పేస్టుగాచేచి రాస్తే గాయాలు మానిపోతాయి. కొబ్బరినూనె రెండు మూడు చంచాలు రాత్రిపడుకొనేప్పుడు తాగితే మలబద్దకం నివారణమౌతుంది. థైరాయిడు మస్యలు రావు. పైత్యరసాన్ని నియంత్రిస్తుంది. ఆహారం బాగాజీర్ణమౌతుంది. పొడిదగ్గు రొమ్మునొప్పికూడా తగ్గిపోతుంది. కాయముదిరితే లోపల పువ్వువస్తుంది. ఆపువ్వుజూస్ గర్భాశయానికి బలాన్నిస్తుంది. బాలింతల రక్తస్రావాన్ని అరికడుతుంది. కొబ్బరిరుబ్బి పాలుతీసుకోవచ్చు. ఈపాలలో సంతృప్త,అసంతృప్త ఆమ్లాలుంటాయి. ఎ,బి,సి,ఇ విటమిన్లు, లసిక్‍ఆసిడు, ఫాల్మటిక్,స్టరిక్,లినోలెయిక్‍ఆసిడులుంటాయి.రెట్లోప్లెవిన్, ఇనుము, క్యాల్సియమ్, భాస్వరం,పిండిపదార్తాలు, క్రొవ్వులు, ప్రొటీన్‍లు కూడా సమృద్ధిగవుంటాయి. ఇవన్నీ ఆరోగ్యప్రదాయినులే. కొబ్బరిపాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. మూత్రపిండ సమస్యలకు యివి మంచిఔషదంగా పనిచేస్తాయి. పచ్చికొబ్బరిదంచి వృషణాలకు పట్టించి గట్టిగాగోచిపెట్టుకొని రాత్రిపడుకొని తెల్లారి తీసేస్తూ, కొద్దిరోజులు చేస్తే వృషణాలవాపు బుడ్డ,వరిబీజము నయమౌతాయి. నూనెలో లారిక్‍ఆసిడు వుండటంవల్ల వంటలో  వాడుకొనేవారి గుండెకు మేలిచేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. నూనెలో "ఇ" విటమిన్‍కూడ వుండటంవల్ల, చర్మానికి రుద్దుకుంటే చర్మంకోమలంగా మారుతుంది. రాత్రిపడుకొనేముందు అరికాళ్ళకు అరిచేతులకు నూనె రుద్దుకుంటే నిద్రబాగా పడుతుంది. కొబ్బరిపాలు చర్మానికి పట్టిస్తే, మృతకణాలు మురికి తొలిగిపోయి శరీరం కాంతివంతమౌతుంది. ఈపాలు తలకుపట్టించుకొని స్నానంచేస్తే, వెంట్రుకలు మెరుస్తాయి. వెంట్రుకలు చిట్లకుండా కాపాడుతాయి. నూనె సూర్యరశ్మికి సన్‍బ్లాకర్‍గా పనిచేసి సూర్యకిరణతీవ్రతనుండి కాపాడుతుంది. నూనెలోని ఫాలిక్యులిటిన్ తామరవ్యాధిని అరికడుతుంది. ఆంటిబయోటిక్, ఆంటిఫంగల్ మందుగా పనిచేస్తుంది. కొబ్బరిపాలుగానీ, నూనెగానీ రాత్రిపూట ముఖానికి పట్టిస్తూవస్తే మొటిమలు తగ్గిపోతాయి. మళ్ళీమళ్ళీ ఎక్కువసార్లు ఎక్కువగా కాచిచల్లార్చిన కొబ్బరినూనె వంటలకు వాడటం మంచిదికాదని వైద్యులసలహా. కొబ్బరికున్న సుగుణాలు ఇన్నీఅన్నీ కావని, నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరి ప్రయోజనాలూ లెక్కపట్టవచ్చని ఫిలిప్పియన్స్ నానుడి వుండనేవుంది. అంటే లెక్కలేనన్ని సుగుణాలగని కొబ్బరి అనవచ్చు.                                         

 

 

 

 

 

Thursday, 22 December 2022

ముగ్గులు (రంగవల్లులు)

 

ముగ్గులు (రంగవల్లులు)



ఇంటిముందు ముగ్గులుపెట్టడం హైందవసాంప్రదాయంలో ఒకభాగం. ముగ్గులు పెట్టడమంటే భూమినలంకరించడమే.కంటికింపుగా అలంకరించిన భూమినిచూడటం వలన పీడలు తొలగిపోతాయి.దీర్ఘాయువు కలుగుతుందని హైందవవిశ్వాసం. ఇంటిగడపముందు రెండూడ్డగీతలుగీసి ముగ్గువేస్తే ఇంటిలోనికి దుష్టశక్తులు రావు. ఇంట్లోవున్న లక్షీదేవి బయటకువెళ్ళిపోదు. ముగ్గుకు నలువైపులా అదేముగ్గుపిండితో జంటగీతలువేసి ఇక శుభకార్యాలు నిరాటంకంగా జరుపుకోవచ్చు. ఆముగ్గుగీతలు రక్షగానిలుస్తాయి. నక్షత్రాకారంలో వేసేముగ్గు భూతప్రేతపిశాచాలను దూరంగా తరిమేస్తుంది. ముగ్గులోనిగీతలు యంత్రాలుగా పనిచేస్తాయి. కనుక వాటిని కాళ్ళతో త్రొక్కరాదు. ముగ్గుత్రొక్కకుండా వెళ్ళడానికి అనువుగా దారివదలి వేసుకోవాలి. యజ్ఞగుండాలచుట్టు జంటగీతలుగీసి ముగ్గులువేసి శుభకరం గావిస్తారు. త్రొక్కే ప్రమాదమున్నచోట దేవతలరూపాలనూ స్వస్తిక్ శ్రీ గుర్తులను ముగ్గుగా వేసుకోరాదు. దేవాలయాల్లో లక్ష్మీదేవి మహావిష్ణువుముందు ముగ్గులువేసే స్త్రీ నిత్యసుమంగళిగా వర్థిల్లుతుందని దేవీభాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.ఇంటిముందు ఇంటివెనుక తులసికోటకు ముందు వేసే గీతలముగ్గులు నకారాత్మకశక్తునను నిరోధించి దైవీయశక్తులను ఆకర్షిస్తాయి. ఇంటిముందు ముగ్గులేని ఇల్లు అశుభానికిగుర్తు. ఆ ఇంటిలో శ్రాద్ధకర్మలు జరిగుతున్నాయని భావించి పూర్వం యాచకులుకూడా ఆ ఇంటిముందుకు వచ్చేవారు కాదట.  

సంక్రాంతిపండుగ ముగ్గులకు ప్రసిద్ధి. నెలరోజులముందునుంచే ఇంటి ఇల్లాలు కల్లాపిజల్లి ముంగిళ్ళలో రకరకాలరంగులముగ్గులు వేస్తారు. పూర్వం ముగ్గుపిండిగా బియ్యంపిండి వాడేవారు. ఆ బియ్యంపిండి చీమలకు పిచ్చుకలవంటి చిన్నచిన్నపక్షులకు ఆహారంగా ఉపయోగపడేది.  తర్వాతికాలంలో తెల్లటిముగ్గురాళ్ళపిండిని సుద్దముక్కలను చాక్‌పీసులను వాడుచున్నారు. ప్రస్తుతం చిత్రాతిచిత్రంగా ముగ్గులువేయడానికి అనేకరకాలైన రంగులు మార్కెట్‌లో అభ్యమౌతున్నాయి. చుక్కలముగ్గులు గీతలముగ్గులు,నెమళ్ళు,చిలుకలు, పద్మాలవంటి బొమ్మలనుసైతం అందంగా రంగులతో  తీర్చిదిద్దితున్నారు. సంక్రాంతిముగ్గుల పోటీలను సైతం నిర్వహించి స్త్రీలలోని సృజనాత్మకతను ప్రొత్సహిస్తున్నారు. పూర్వమునుండి ప్రత్యేకంగా రథంముగ్గును సంక్రాంతి ఆఖరురోజున వేసేవారు. ఆ రథం ఒకయింటినుండి మరోయింటిని కలుపుకుంటూ వీధిలోని అన్నియిండ్లకూ వ్యాపించేది. అవి యిప్పుడు రంగులమయమై అందంగా కన్నులకింపుగ వుంటున్నాయి. ముగ్గులకు ప్రత్యేకంగా పుస్తకాలే వచ్చేసాయి. వార్తాపత్రికల్లోనూ క్రొత్తక్రొత్త ముగ్గులు పోటీపడి ముద్రిస్తున్నారు. ముగ్గులపై వ్యంగచిత్రాలుకూడా హాస్యస్పోరకంగా పత్రికలలో దర్శమిస్తున్నాయి. సంవత్సరాదిన అదేపనిగా శుభాకాంక్షలు   తెలిపేముగ్గులువేసి ఇంటిముదుకువచ్చే వారిని  సంతోషపెడుతున్నారు. దీపావళికైతే రంగుముగ్గులలో దీపాలుంచి మరీ శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఈముగ్గులువేయడానికి మహిళలు తెల్లవారుజాముననేలేచి నడుమువంచి ముగ్గులువేస్తారు. తద్వారా  త్వరగానిద్రలేచే మంచియలవాటు అలవడుతుంది. అంతేగాక తేలికపాటి వ్యాయామంకూడా చేసినటౌతుంది. ఈవిధంగా ముగ్గులు ఆరోగ్యదాయినిలౌతున్నాయి.

ముగ్గులువేయడం తెలుగురాష్ట్రాలకే పరిమితంకాలేదు. దేశవిదేశాలలో కూడా ఈసంస్కృతి వర్ధిలుతున్నది. ఈముగ్గులువేయటాన్ని కర్ణాటకలో "హేసే" యని "రౌంగోలి" యని పిలుస్తారు. మహారాష్ట్రాలో "రంగోలీ" అంటారు. తమిళనాడులో "పుల్లికోలం" అంటారు. మిథాలీప్రాంతంలో "అరిపన్" అంటారు. ఇంకా కేరళ, గోవా ప్రాంతాల్లోకూడా రంగవల్లులు తీర్చిదిద్దే ఆచారమున్నది. ఇతర ఆసియాదేశాలయిన శ్రీలంక, ఇండోనేషియా థాయిల్యాండ్, మలేషియాలలోకూడా ముగ్గులు దర్శనమిస్తాయి. మనభారతదేశంలో ఉత్తరాదిన ప్రకృతిలోని అందమైన జంతువులు, పక్షులు, చెట్లు రంగవల్లులలో కనిపిస్తాయి. అదే దక్షిణాదిన వృత్తాలు, చుక్కలు, సరళరేఖలు ఎక్కువగా ముగ్గులలో కనబడతాయి.

 ఇవీ మనముగ్గుల ముచ్చట్లు.

 


 


 

Tuesday, 20 December 2022

కలశం

 


కలశం

 


కలశం హిందువులకొక శుభచిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నం కూడా కలశమే. రాగి వెండి లేక మట్టికుండను కలశంగావాడుతారు. కలశం ఒకపూజావస్తువు. అది దేవతల ఆవాసం.

 కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |

మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |

కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |

ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |

 అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

 అనగా కలశముఖంలో విష్ణువు కంఠభాగంలో శివుడు, మూలంలో బ్రహ్మ, మధ్యభాగంలో మాతృగణాలు ఆశీనమై యున్న్రు. కలశంలోని జలాల్లో సముద్రాలు.  సప్తద్వీపసహిత భూమి, చతుర్వేదాలు, వేదాంగాలతోసహా సమస్తదేవాతాగణాలు ఆసీనులై వున్నారు. సకలపాపాలనూ నిర్మూలించడానికి సిద్ధంగావున్నారని భావనచేసి పూజకుపక్రమిస్తారు. ఋగ్వేదంప్రకారం సమృద్ధి మరియు జీవితమూలాన్ని సూచిస్తుంది కలశం.

 కలశంలో శుద్ధజలంపోసి చుట్టూ మామిడాకులు లేక తమలపాకులూ పెట్టాలి. ఆకులతొడిమలు కలశంలోని నీటిని తాకుతూ వుండాలి. అందువల్ల ఆకులు వాడిపోవు. కలశజలాలలో అక్షింతలు పుష్పాలు నాణాలు వుంటే రత్నాలు బంగారు నగలూ వేయవచ్చు. తర్వాత పైన కొబ్బరికాయనుంచాలి.కొబ్బరికాయపై ఎఱ్ఱటి క్రొత్తరవికగుడ్డను పొట్లంవలెచుట్టి టోపీగా వుంచాలి. కలశానికి దారాలుకూడా కొందరు చుట్టుకుంటారు. కలశానికి గంధం పసుపుకుంకుమలు పూలమాల

 ధరింపజేసి  పీటపై బియ్యం పరచి బియ్యంపై కలశాన్ని స్థాపిస్తారు. కలశం లోహమునదైనా మట్టిదైనా అదిభూతత్త్వానికి సంకేతం. అందులోనినీరు జలతత్త్వానికి సంకేతం. నీటికీ కొబ్బరికాయకూ మధ్యనున్న ఖాళీస్థలం ఆకాశతత్త్వానికి సంకేతం. చదివే మంత్రం వాయుజనితం. అది వాయుతత్త్వానికి ప్రతీక. కలశంముందు వెలిగించే దీపం  అగ్నితత్త్వానికి ప్రతీక. అందువలన కలశపూజ పంచభూతములకూ ఒకేసారి చేసే పూజగా భావిస్తారు.

 మరోవిశేషమేమంటే కలశం చేతులలోధరించి వేదమంత్రాలు పఠిస్తూ స్వాములకూ పెద్దవారికి స్వాగతంపలుకుతారు. వేదికవరకు వారి ముందునడుస్తారు. అలాచేస్తే వారిని గొప్పగా గౌరవించినట్లౌతుంది.

 మానవజీవితం నీటిఘటమంటారు. అందుకే కలశాన్ని మానవజీవితంతో పోలుస్తారు. ఆకులు ప్రకృతికి ప్రతీక. కొబ్బరికాయ సమస్తవిశ్వానికి మరోరూపం. కలశానికి చుట్టినదారాలు ప్రేమతో ఏర్పడ్డ  సత్సంబంధాలు. అందుకే వ్రత, పర్వ, గృహప్రవేశాదిశుభసందర్భాలలో కలశపూజచేస్తారు. ముఖ్యంగా శ్రావణమాసం పున్నమికిముందువచ్చే శుక్రవారం లక్ష్మీపూజలో కలశపూజచేయడం ఆనవాయితీ. అట్లని వేరేరోజులలో చేయరాదనికాదు. గురు శుక్రవారాలలో జరుపుకోవచ్చు. శ్రావణమాసంలోచేసే కలశసహిత లక్ష్మీపూజ అధికఫలదాయకమని చెబుతారు. ఈదినాలలో లక్ష్మీదేవిని

 ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:

ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:

  అనే మంత్రాలతో పూజిస్తే లక్ష్మీకటాక్షం మిక్కుటంగాకలిగి శుభాలుచేకూరుతాయని నమ్ముతారు.

 శ్రీహరి క్షీరసముద్రంలో శేషశాయియై ఉంటాడు. ఆయననాభికమలమునుండి బ్రహ్మజనించి సృష్టిప్రారంభిస్తాడు. అప్పుడున్నది కేవలం జలంమ్మాత్రమే. ఆ జలంతో సమానం కలశజలమని విశ్వసిస్తారు. అంటే సృష్ట్యాదిననున్న మహత్తరప్రశాంతస్థితి కలశపూజవల్ల కలుగుతుందని పురోహితభావన. సురాసురుల సముద్రమథనంలో అంతిమంగా ధన్వంతరి అమృతకలశంతో ఉద్భవిస్తాడు. ఆ అమృతకలశమే మనం స్థాపించుకున్న యీకలశమని భావిస్తే "యద్భావం తద్భవతి" అన్న సూత్రానుసారం కలశజలం తీర్థంగాసేవించడంవల్ల మనకూ అమృతత్వం సిద్ధిస్తుంది. అనగా దీర్ఘాయువు సంప్రాప్తమౌతుంది.

 కలశపూజానంతరం వచ్చే శనివారంనాడు కలశజలాన్ని తీత్థంగాసేవించి మిగిలినజలాన్నీ యితర పూజావస్తువులైన పూలు పసుపుకుంకుమలు అక్షతలు పారేనదీజలాలలో నిమజ్జనంచేయాలి. కొబ్బరికాయను దానంగాయివ్వచ్చు. లేదా కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించవచ్చు.   నదిలో నిమజ్జనమైనా చేయవచ్చు.

ఈదీ కలశ ప్రాశస్త్యం

 

Friday, 11 November 2022

ఉంగరం,అంగుళీయకం, Finger Ring

 

ఉంగరం (అంగుళీయకం)


ఉంగరం చేతివ్రేలికి ధరించే ఆభరణం. మణికట్టుపైన ధరించే కంకణం. మోచేతిపైన ధరించే వంకిణి కూడా ఉంగరంవంటి ఆభరణాలే. అన్నిజాతులూ, అన్నిమతాలవారు పురాతనకాలమునుండి ఉంగరాలు ధరిస్తూనే వున్నారు. హనుమంతుడు శ్రీరాముని ఉంగరాన్ని లంకలోని సీతాదేవికి ఆనవాలుగా చూపించాడన్నది మనందరకు తెలిసిన విషయమే. కొందరు ముస్లిములు వారి మతాచారాన్ననుసరించి ఉంగరం ధరించరు. హిందువులు జ్యోతిషశాస్త్రానుసారం రాశులు, నక్షత్రాలననుసరించి ముత్యాలు, వజ్రాలు, పగడాలు, రత్నాలు పొదిగిన ఉంగరాలు ధరిస్తారు. పాశ్చాత్యులు వివాహసందర్భంగా వధూవరులు ఒకరికొకరు ఉంగరం తొడుగుతారు. అందువల్ల ఒకరిస్పందనలు మరొకరికి తాకుతాయని నమ్ముతారు. ఇప్పుడు హిందువుల కుటుంబాలలో కూడా నిశ్చితార్థం రోజు వధూవరులు ఉంగరరాలు ఒకరికొకరు తొడిగే కార్యక్రమం చేస్తున్నారు. పూర్వపు రాజులు తాముధరించేఉంగరాన్నే తమ అధికరముద్రికగా ఉపయోగించేవారు. ఉంగరపువ్రేలికి చెవికి నరాల అనుబంధం వుంది. ఉంగరం ధరించడమువల్ల శరీరంలోని నరాలు ఉత్తేజితమౌతాయి. కుడిచేతికి ముఖ్యంగా రాగిఉంగరం ధరించడంవల్ల కలుషిత ఆహారాన్ని గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఆహారం విషపురితమైతే రాగిఉంగరం నీలిరంగులోకి మారుతుంది. రాగివల్ల యింకా ఎన్నోప్రయోజనాలున్నాయి. కుడి అనామిక (ఉంగరపు వ్రేలు) సూర్యునికి ప్రతీక. రాగికూడా సూర్యునినుండి అంగారకునినుండి అనుకూలశక్తిని గ్రహించి శరీరానికందిస్తుంది. తద్వరా శరీరం వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది. రాగి మానసికఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనిస్తుంది. తలనొప్పిని నివారిస్తుంది. తాపాన్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. అందువల్ల కీళ్ళనొప్పులు, ఉదరవ్యాధులు నయమౌతాయి. దగ్గు గొంతువ్యాధులు రావు. చర్మానికి జుట్టుకు మేలుచేస్తుంది. ఒకేవుంగరమైతే కుడి అనామిక (చిటికెనవ్రేలు ప్రక్కవ్రేలు)కు ధరిస్తారు. అనేకమైతే యిక పదివ్రేళ్ళకూ ధరించవచ్చు. బంగారు, వెండి, రాగి మరియూ మిశ్రమలోహాలతోగూడా స్తోమతనుబట్టి చేయించుకుంటారు. ఎడమచేతి ఉంగరం గుండెకు మేలుచేస్తుంది. సామాన్యంగా ఊరకున్నప్పుడు ఉంగరాన్ని పైకిక్రిందికి కదిలిస్తూ వుంటారు. అందువల్ల కలిగే ఒత్తిడివల్ల మేలే కలుగుతుంది. కిడ్నీల నరాల పనితీరు మెరుగౌతుంది. ఉంగరం బొటనవ్రేలికి ధరిస్తే ఆత్మవిశ్వాసం పెంపొంది, ఏపనినైనా సాధించాలనే పట్టుదల గలిగి ధైర్యంతో వ్యవహరిస్తారు. చూపుడువ్రేలికి ధరిస్తే నాయకత్వలక్షణాలు పెంపొంది, శ్రమకోర్చి ఆత్మగౌరవంతో మెలగుతారు. మధ్యవ్రేలికి ధరించడంవల్ల బాధ్యతగలవ్యక్తిగా జీవిస్తారు. అనామికకు (ఉంగరం వ్రేలికి) ధరిస్తే నూతనావిష్కరణలవైపు మొగ్గుచూపుతారు. ప్రేమ అనుబంధాలకు విలువనిస్తారు. చిటికనవ్రేలికి ధరిస్తే వృత్తివిద్యలలో, ప్రసారమాధ్యమవిద్యలలో నిపుణులౌతారు. బుధగ్రహం అనుకూలమై తెలివితేటలతో వ్యవహరిస్తారు.

         దర్భవుంగరం పవిత్రంగా యజ్ఞయాగాదులలో వ్రతాలలో ధరిస్తారు. దీని ఆధారంగా కేరళలోని కన్నూర్‌జిల్లా పయ్యనూర్ పురోహితుల సలహామేరకు దర్భ ఉంగరం ఆకారంలోనే బంగారువుంగరాలు పయ్యనూర్లోని కొన్నికుటుంబాలవారు మూడునుంచి ఏడురోజులు శ్రమించి తయారుచేస్తారు. మూడుగీతలుగల యీ ఉంగరం ఇడ, పింగళ, సుషుమ్ననాడులకు ప్రతీకగా భావిస్తారు. పయ్యనూర్‌ కుమారస్వామి వద్ద పూజలోవుంచి తదనంతరం ధరించడానికిస్తారు. కుడి అనామిక కొలతలతో 30.28,19,14,9,7,4 గ్రాములబరువుతో యీ ఉంగరాలు నిష్ఠతో తయారుజేస్తారు.ఈ ఉంగరం ధరించడంవల్ల కుండలినీశక్తి ఉత్తేజితమౌతుంది. దైవానుగ్రహం కలుగుతుందనీ, దైవం మీవెన్నంటివుండి విజయంచేకూరుస్తాడనీ నమ్ముతారు. ఈ ఉంగరం తయారుచేసేవారు జీవితాంతం పొగత్రాగరు, మధుమాంసాదులు ముట్టరు. ఉంగరాలలో మేరువు (తాబేలు) ఉంగరానికిగూడా చాలామహిమ గలదని నమ్ముతారు. ఈ ఉంగరాల శిరస్సుభాగం మణికట్టువైపు ఉండేట్టు ధరించాలి. అంటే గుప్పిటముడిచి కళ్ళకద్దుకొనుటకు వీలుగా వుండాలి. ఈపవిత్రవుంగరాలను స్ట్రీలు బహిష్టుసమయానికిముందే తీసి దేవునిగూట్లో భద్రంగావుంచాలి. భోజనంచేసేటప్పుడు ఎంగిలి ఉంగరానికంటరాదు. ధూమపానంచేయరాదు. సారాయిత్రాగరాదు. మాంసాహారాలు తినరాదు. ఈనియమాలు పాటించకపోతే అనిష్టమని పురోహితులు జాగ్రత్తలు చెబుతున్నారు.                                    











Monday, 31 October 2022

మొలత్రాడు,Molatradu

 

మొలత్రాడు




 హిందూసాంప్రదాయంలో మొలత్రాడుకట్టుకోవడం ఒకమంచి ఆచారం. "మొలత్రాడు లేదంటే మగాడేకాడు. వడ్డాణం పెట్టంది ఆడదేకాదు" అనే సామెత వుండనేఉంది. పిల్లలకుమాత్రం ఆడమగ అన్నతేడాలేకుండా అందరికి మొలత్రాడుకడతారు. ఆడపిల్లలకు మునుపు సిగ్గుబిళ్ళలు కట్టేవారు. వాటికాధారంగా మొలత్రాదు ఉపయోగపడేది. పెద్దలలో మగవారు తప్పక మొలత్రాడు కడతారు. వారివారి స్తోమతనుబట్టి. బంగారు,వెండి, ప్లాటినం, దారంతో తయారుచేసిన సన్ననిత్రాడును నడుముకు మొలత్రాడుగా కడతారు. దారంతోచెసినవిమాత్రం నల్లని లేక ఎఱ్ఱని మొలత్రాడును ఉపయోగిస్తారు. బాలకృష్ణుని వర్ణిస్తూ..

         ఆ:వె: చేత వెన్నముద్ద  చెంగల్వపూదండ
                    బంగరు మొలతాడు పట్టుదట్టి
                   సందెతాయెతులును సరిమువ్వగజ్జెలు
                  చిన్నికృష్ణ నిన్ను చేరికొలుతు
---------- అన్నారు.

 కలవారు కాబట్టి కృష్ణునకు పసిడిమొలత్రాదు కట్టారు. సర్వసామాన్యంగా సంపన్నులు చలువజేస్తుందిగాబట్టి వెండిమొలత్రాడు కడతారు. మొలత్రాడు మార్చవలసివస్తే ముందుగా క్రొత్తదిగట్టి తర్వాత పాతది తీసేస్తారు. అయితే ధర్మసింధువు ..

                శ్లో: మౌంజీం యజ్ఞోపవీతంచ  నవదండంచ ధారయేత్

                      అజినం కటిసూత్రంచ నవవస్త్రం  తదైవచ: -- అంటున్నది

  అంటే దర్భత్రాడును, జంధ్యాన్ని, ఊతగావాడే మోదుగకఱ్ఱను, జింకచర్మాన్ని,మొలత్రాడును, వస్త్రాన్ని ఏటా విధిగా క్రొత్తవి ధరించాలి. అని ధర్మసింధువులో ఉన్నది.  మగవారు మొలత్రాడును భార్య చనిపోయినప్పుడు తీసేస్తారు. లేదా మగమనిషి చనిపోయినతర్వాత మొలత్రాడు త్రెంచేసి కాల్పోబూడ్పో చేస్తారు. చనిపోయినవ్యక్తి బంధరహితంగా వెళ్ళిపోవాలని దీనర్థం. హిందూసాంప్రదాయంప్రకారం సచేలస్నానమే చేయాలి. కనీసం గోచిమాత్రమైనా లేకుండా స్నానం చేయరాదు. ఎప్పుడైనా గుడ్డలులేకుండా స్నానం చేయవలసివస్తే మొలత్రాడు వుండటంవల్ల దోషమంటదు. అది సచేలస్నానమే ఔతుంది. మొలత్రాడు ధరించటానికి, బుధ, ఆదివారాలు మంచివి. మంగళ శుక్రవారాలు ధరింపరాదు.

బొడ్డుతాడు (stem cell) చికిత్స అన్నదొకటున్నది. శిషువు జన్మించినపుడు బొడ్డుకోసి తల్లిని బిడ్డను వేరుచేస్తారు. అప్పుడు బొడ్డుతాడు తుంటను లేదా దాని రక్తబిందువును పసరుమందుతో కలిపి వెండితాయత్తులోవుంచి బిడ్డమొలత్రాడుకు కడతారు. అది బయటకుతీసి ఆబిడ్డకు భవిషత్తులో వచ్చు కాలేయవ్యాధులు, క్యాన్సరువ్యాధుల వంటి భయంకరవ్యాధులు నయంచేయటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడైతే stem cell Banks ఉన్నాయి. నైట్రస్ఆక్సయిడ్ వాయువు నుపయోగించి అతిసీతల వాతావరణంలో బొడ్డుతాడుతుంటను భద్రపరచి అవసరమైనపుడు యీ stem cells తో వైద్యంచేస్తున్నారు. ఇది చాలా ఖర్చుతోకూడుకున్నపని. మొలతాడు తాయెత్తుతోనే పూర్వీకులు యీపనిని అతిసులువుగా నెరవేర్చేవారు.

 

మొలత్రాడు దేహాన్ని రెండుభాగాలుగా విభజిస్తున్నది. పైభాగం దేవతాస్థానం. క్రిందిది రాక్షసస్థానం. పైభాగం దైవకైంకర్యాలకు, క్రిందిభాగం సంతానోత్పత్తికి, ప్రాపంచికకార్యనిర్వహనకు ఉపయోగపడాలన్నారు పెద్దలు. అందుకే పైభాగాలను బంగారుతో మొలభాగాన్ని (క్రిందిభాగాన్ని) వెండితో అలంకరించుకుంటారు. వెండిమొలత్రాడు అందుకేశ్రేష్టం.

మొలత్రాడు ధరించకపోవడం వల్ల నష్టమున్నదో లేదో తెలియదుగానీ ధరిస్తే మాత్రం చాలాలాభాలే వున్నాయి. కనుక ధరించడం ధరించకపోవడం ఎవరియిష్టం వారిది.

 పాముకరచినా, తేలుకుట్టినా విషం రక్తంద్వార గుండెకు తలకు ఎక్కకుండా, కరచిన లేక కుట్టిచోటికి పైభాగాన కట్టివేయడానికి వెంటనే అందుబాటులోవుండేతాడు మొలత్రాడే. పంచగానీ లుంగీగానీ జారిపోకుండా మొలత్రాడుక్రిందికి దోపుకోవచ్చు. ఇంట్లోవున్నప్పుడు బెల్టుపని మొలతాడు చేస్తుంది. భోజనప్రియులు మితిమీరితినకుండా అదుపుచేస్తుంది. తద్వారా జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. ఆడవారిలో వడ్డాణం యిందుకు ఉపయోగపడుతుంది. అంతేగాదు బరువుపెరగడాన్ని తెలియజేసి జాగ్రత్తపడమని హెచ్చరిస్తుంది. బానపొట్ట రాకుండ అడ్డుకుంటుంది. నల్లమొలత్రాడు చెడుదృష్టి తగలనీదు. అందుకే పిల్లల మొలత్రాడుకు రంగురంగుపూసలు యెక్కిస్తారు. జాతకరీత్యా గ్రహదోష నివారణకు తాయెత్తులుకట్టడానికి ఆధారంగా కూడా మొలత్రాడు ఉపయోగపడుతుంది. అధికవేడిని గ్రహించి మొలత్రాడు దేహతాపాన్ని శాంతింపజేస్తుంది. అందుకే ఆడపిల్లల మెడిమ పైభాగాన నల్లదారం కడతారు. మొలత్రాడు మగవారిలోనైతే వృషణాలు వేడెక్కకుండాజేసి వీర్యకణాలసంఖ్య తగ్గకుండాచూసి సంతానోత్పత్తిసమస్యలు రాకుడా కాపాడుతుంది. వెన్నెముకకు support గా  వుంటుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరుస్తుంది. ఎముకలకు, కండరాలకు పటుత్వాన్నిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. హెర్నియా వంటివాటిని రానివ్వదు. పురుషాంగాన్ని సమతుల్యంగా వృద్ధిచెందేట్లు చేస్తుంది. నకారాత్మక శక్తి(negative energy)ని అడ్డుకుంటుంది. సకారాత్మకశక్తి (positive energy)ని ఆహ్వానిస్తుంది. మొలత్రాడువల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యమేస్తుందికధా! వీటిని శాస్త్రజ్ఞులు కూడా ఆమోదిస్తున్నారు. కనుక నమ్మాలి.                                

   

Monday, 17 October 2022

కాటుక కళ్ళు, kaatuka kallu


 

కాటుక కళ్ళు

 
"సర్వేంద్రియానాం నయనంప్రధానం" అన్నారు పెద్దలు. అట్టి నయనము (కన్ను)నకు చక్కటి అందాన్నిచ్చి సంరక్షించేదికాటుక. కులమతాలకతీతంగా అందరూ కాటుక పెట్టుకుంటారు. శారదాదేవికి విన్నవించుకుంటూ "కాటుక కంటినీరు..."అన్న పద్యం లిఖించారు పోతన తన భాగవతంలో . అంటే సరస్వతీదేవి కాటుకధరించిందనేగదా! కనుక హిందువులు అతిపురాతన కాలమునుండి కాటుక ధరిస్తున్నారని అర్థమౌతున్నది. 12 వేలసంవత్సరాలకు పూర్వమునుండి ఈజిప్టు, మెసపుటేమియా ప్రజలు కంటికికాటుక పెట్టుకొనేవారని చరిత్రకారులు తేల్చిచెప్పారు. మంగళద్రవ్యాలలో ఒకటిగా కాటుకను హిందువులు భావిస్తారు. శ్రావణమంగళవారవ్రతగాథలో దీని మహాత్మ్యం గొప్పగాచెప్పబడింది. గౌరీదేవిని యీవ్రతంలో పూజిస్తారు. పూజాద్రవ్యాలలో కాటుక చాలా ముఖ్యమైనది. ఈవ్రతంలో వాయనంగా పొందినకాటుకధరించడంవల్ల ఒక ఇల్లాలు అల్పాయుస్కుడైన భర్తను దీర్ఘాయుస్కునిగా మార్చుకొని నిత్యసుమంగళిగా జీవిస్తుంది. కాటుక దిష్టిదోష  నివారిణి. అందుకే చంటిబిడ్డలకు బుగ్గపైనా అరికాలికి కాటుకచుక్కను దిష్టిచుక్కగ పెడతారు. పెండ్లిలో వధూవరులకు తప్పనిసరిగా చెక్కిలిపై కాటుకచుక్కపెడతారు. కంటికాటుకవల్ల కుజగ్రహదోషం తొలగిపోతుంది. వివాహం ఆలస్యమవ్వడం, వైవాహికసమస్యలవంటి చిక్కులు కూడా తొలగిపోయి శుభములు చేకూరుతాయి.
 
ఒక్కమనిషికి మాత్రమే నల్లటికనిగ్రుడ్డు చుట్టూ తెల్లటిభాగముంటుంది. అందువల్ల కాటుకధరిస్తే కళ్ళు విశాలంగా కనిపిస్తాయి. అంతేగాదు భరతనాట్యం కథాకళి నృత్యాలలో కళ్ళు కలువల్లామెరుస్తూ భావప్రకటనకు అనుకూలమై ప్రదర్శన రక్తిగట్టడానికి యీ కంటికాటుక ఉపకరిస్తుంది.
 
మహమ్మదీయులు"సుర్మా"అనే కాటుకను ధరిస్తారు. ఈజిప్టు సిరియాదేశాల సరిహద్దులోగల కోహితూర్ (సైనాయి) పర్వతాల్లో లభించే నల్లనిరాయిని మెత్తగాచూర్ణించి రోజ్‌వాటర్‌తోకలిపి కళ్ళకుసుర్మా(కాటుకగా) పెట్టుకుంటారు. రంజాన్‌నెల ఉపవాసదినాల్లో ప్రార్థనకుముందు కాళ్ళూచేతులు,మొగం శుభ్రంచేసుకున్న(వజూ)తర్వాత సుర్మా వేసుకోవడం పరిపాటి. మహమ్మదుప్రవక్త సహితం సుర్మా వేసుకునేవారట. అందుకే యింటికివచ్చిన అతిథులకు ముస్లింలు సుర్మా, సెంటు యిచ్చి గౌరవిస్తారు. రంజాన్‌మాసంలో ఆడమగ అందరూ సుర్మా ధరిస్తారు. ఈసుర్మారాళ్ళు నల్లగావుండటానికికారణం, మూసా ఎ ఇస్లాం (మోషే) ప్రవక్తవారికి సైనాయిపర్వత ప్రాంతంలో దైవీయకాంతి కనిపించింది. ఆవెలుగు అగ్నియై పర్వతాన్ని దహించింది. అక్కడిరాళ్ళు కాలి నల్లగామారిపోయాయి. అవే సుర్మారాళ్ళు. హైదరాబాద్,పాతబస్తీ, చార్మినార్‌ప్రాంతంలో యీరాతిముక్కలను అరేబియానుండి తెప్పించి సుర్మాచేసి విక్రయిస్తున్నారు. సుర్మా చలువచేస్తుంది. క్రైస్తవులు కాటుకవద్దంటారు. బైబిలు ప్రకారం దేవుడిచ్చిన అందంచాలు. కాటుకతో దైవనిర్మితమైన అందం సరిజేసుకోవడం. హెచ్చించుకోవడం అవివేక మని భావిస్తారు. దైవనిర్మితాన్ని యథాతథంగా వుంచుకోవడం ధర్మమని వారనుకుంటారు. ఎవరినమ్మకం, యెవరియిష్టం వారిది. తప్పుపట్ట నవసరంలేదు.  
 
కాటుక కంటినరాలకు బలంచేకూరుస్తుంది. ప్రారంభంలోవున్న కంటివ్యాధులను నయంచేస్తుంది. కళ్ళు చల్లబడతాయి. దుమ్ముధూళి పొగనుండి రక్షణ నిస్తుంది. కళ్ళలోని ఎర్రచారలను తొలగిస్తుంది. తదేకంగా కంప్యూటర్‌చూడ్డంవల్ల కలిగే శ్రమనుతగ్గిస్తుంది. సూర్యునికిరణాలవేడిమివల్ల కలిగే కళ్ళమంటలు తగ్గిస్తుంది. దృష్టిదోషాలను పోగొడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. కనురెప్పల వెంట్రుకలు పెరిగి కంటికి అందం రక్షణ కాటుక కలుగజేస్తుంది.
 
అనేకరకాల కాటుకలు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఘాడమైన నలుపుకోసం కొన్నింటిలో సీసం మరియు లెడ్‌సల్ఫయిడ్(గలీనా)వడుతారు. ఇది కంటికి మంచితిదికాదు. అలర్జీ కలుగవచ్చు. రాగి, ఆంటిమొనీ వంటి లోహాలపొడితో చేసిన కాటుకలు ఐలైనర్స్ పేరుతో లభిస్తాయి. ఇవి కంటికి మంచిదే. వీటన్నిటికంటే ఇంట్లో తయారుచేసుకొనే కాటుకలు శ్రేష్ఠం. వీటిలోకూడా నాలుగైదు రకాలున్నాయి. అందులో నేత్రసంజీవని ఒకటి. ఆవుపేడతో తయారుచేసిన పిడకను ఆవునెయ్యి 15చంచాలు, ఆముదం 15చంచాలు కలిపి పిడకను తడిపిపెట్టుకోవాలి. ఇటుకలతో 2,3 అంగుళాల ఎత్తుగల పొయ్యిని తయారుచేసుకోవాలి పిడకను పొయ్యిలోవుంచి అగ్గిపెట్టాలి. పొగప్రక్కకు పోకుండా ఇటుకలపైన రాగిలేక ఇత్తడిపళ్ళెంపెట్టి పళ్ళెరంపై కొన్నిచల్లని నీళ్ళుపోయాలి. పిడకనుండి వచ్చినపొగ పళ్ళెరానికి మసిగా అంటుకుంటుంది. పిడక బాకాకాలి చల్లారినతర్వాత పళ్ళెరంలో నీరుమిగిలివుంటే తుడివేయాలి. పళ్ళెరానికి అంటిన మసితుడిచి ఒకరాగి బరిణలో వేసుకొని అందులో అరగ్రాము పచ్చకర్పూరం, కాస్తా ఆవునెయ్యి కలిపితే నేత్రసంజీవనికాటుక తయారౌతుంది. దీనికికొద్ది మార్పుతో చందనకాటుక తయారుచేసుకోవచ్చు. ఇందులో పిడకకుబదులు ఆముదపుదీపం ఉపయోగించుకోవాలి. పళ్ళెరానికి లోపలివైపున చందనంపేస్టును పట్టించాలి.ఆచందనానికే సెగ పొగబాగతగిలి మసి తయారౌతుంది. మిగిలినదంతా నేత్రసంజీవని వలెనే చేసుకోవాలి. దీపానికి బదులు బాదంపప్పులు ప్రమిదలోపెట్టి అగ్గి అంటించాలి. వాటిపొగతో ఏర్పడిన మసితో కూడా కాటుక తయారుచేసుకోవచ్చు. ఇవికాకుండా బజారులో చార్కోల్(బొగ్గు)క్యాప్సూల్స్ దొరుకుతాయి. వాటిలోని బొగ్గుపొడిని అముదంతో తడిపి కాటుకగా వాడుకోవచ్చు.
 

ఆఖరుగా మరొక్కమాట. కొందరు కాటుక సరిగ్గా అంటడంలేదని ఎక్కువసేపు వుండటంలేదని చీకాకుపడి కాటుకజోలికి పోరు. అలా విసుగుపడాల్సిన పనిలేదు. తొలుత ఐస్క్యూబ్(మంచుగడ్డ)తో కంటిరెప్పలురుద్ది, శుభ్రంచేసుకొని కాటుక పెట్టుకోవాలి. తర్వాత ఇయర్‌బడ్స్ తో కనురెప్పలకు టాల్కంపౌడరు అద్ది పైపైన తుడుచుకుంటే కాటుకబాగుంటుంది. తొందరగా చెదిరిపోదు.                           


 

Thursday, 29 September 2022

ముక్కుపుడక-చెవిపోగులు,mukkupudaka-chevipogulu

 

ముక్కుపుడక-చెవిపోగులు


ముక్కుపుడకను అడ్డకమ్మ,నత్తు, బాసర,బులాకి, ముక్కెర అనికూడాఅంటారు. మతాలకతీతంగా భారతీయ స్త్రీలందరూ అనాదిగా ముక్కెరను ధరిస్తున్నారు. ఇది ఒకఆచారమే గాకుండా ముక్కుకందాన్నిస్తున్నది. దక్షిణభారతీయులు కుడిముక్కుకు ఉత్తరభారతీయులు ఎడమముక్కుకు ఆచారంగా ధరిస్తారు. పైపెదవిపై వ్రేలాడునట్లు రెండుముక్కులకు నడిమిభాగాన కూడా ధరించడం చూస్తున్నాము. ముఖ్యంగా ఆటవికజాతివారు యీపద్ధతినవలంభిస్తున్నట్లు గమనిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా రకరకాల రత్నాలు, వజ్రాలుపొడిగిన ముక్కెరలు అందంకోసం మగువలు ధరిస్తున్నారు. టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ముక్కుపుడక నిరంతరం ధరిస్తున్నట్లు గమనించగలం. పూర్వం ముక్కుపుడకలేని స్త్రీలను దేవుని ప్రసాదంవండటానికి అనుమతించేవారు కాదు. దుష్టశక్తులను ముక్కుపుడక అడ్డగిస్తుందని హిందువుల ప్రగాఢవిశ్వాసం. అందుకే వివాహానికిముందే ఆడపిల్లలకు ముక్కులుకుట్టిస్తారు. సర్వసామాన్యంగా 5,7,11 సంవత్సరాల్లో ఆడపిల్లలకు ముక్కులుకుట్టించడం ఆనవాయితీ.

 

ముక్కు కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటుంది, కాబట్టి కుడివైపు మండలాకారపు (గుండ్రని) పుడకను, ఎడమవైపు అర్ధచంద్రాకారపు పుడకను ధరింపజేస్తారు.లేదా యేవైపైనా ఒంటిరాయిబేసరి ధరింపజేస్తారు. ముక్కెరను హిందువులు తాళితోసమానంగా చూస్తారు. కనుక కాబోయేభర్త పెండ్లిసంబరాల్లో భాగంగా వధువుకు ముక్కెర నిస్తాడు. కొన్నికుటుంబాలలో మేనమామ ముక్కెర నిస్తాడు. మిగిలినవారెవరిచ్చినా ముక్కెరస్వీకరించరు. దేవదాసి మాత్రమే యెవరిచ్చినా ముక్కెర స్వీకరిస్తుంది. తాళివలెనే స్త్రీలు ముక్కుపుడకనుకూడా తమకు వైధవ్యము రాకుండ కాపాడుతుందని ఎల్లప్పుడు ధరిస్తారు. హిందూదేవతలందరికీ ముక్కెర తప్పకుండా వుంటుంది. బాలకృష్ణుని వర్ణనలో కూడా "నాసాగ్రే నవమౌక్తికం" అని వుంది. ప్రళయసమయంలో బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరను కృష్ణాజలాలు తాకుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞాంలో తెలియజేశారు. భామాకలాపంలో సత్యభామ ప్రణయకలహంతో కృష్ణునితో అలుగుతుంది. తర్వాత విరహంభరించ లేక తనచెలికత్తెను కృష్ణునివద్దకు రాయబారం పంపాలనుకుంటుంది. ఆచెలికత్తెను మంచిచేసుకోవడానికి సత్యభామ యేవేవో కానుకలివ్వజూపుతుంది. కానీ చెలికత్తె అవేమీవద్దని సత్యభామధరించిన ముక్కెర కావాలంటుంది. ఇలా పురాణకాలమునుండి ముక్కెర ప్రస్తావన వుండనేవుంది.

 

ఆరోగ్యపరంగకూడా ముక్కులుకుట్టించడం, ముక్కెరధరించడంవల్ల మేలుజరుగుతుందని నమ్ముతారు. ముక్కులుకుట్టడం "ఆకుపంచర్" వైద్యవిధానంతో సమానమంటారు. దీనివల్ల ప్రాణశక్తికి సంకేతమైన ఇడ,పింగళ నాడులు ఉత్తేజితమై శక్తివంతంగాపనిచేసి మెదడులోని నాడీవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వెండి,బంగారు,రాగితో ముక్కెరరలుచేస్తారు గనుక ఆలోహాలు పీల్చేగాలిని శుభ్రపరచి, రోగాలను నిరోధిస్తాయి. అంతేగాకుండా ముక్కులు కుట్టించడంద్వారా గర్భకోశదోషాలు తొలగిపోయి సంతానప్రాప్తికి దోహదంలభిస్తుంది. సుఖప్రసవంజరుగుతుంది. కన్ను,చెవివ్యాధులు రావు. శ్వాశకోశవ్యాధులు కూడా రావని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది. ఈవైద్యవిధానం భారతదేశమునుండే చైనాకు వెళ్ళిందని అనేకులు నమ్ముతున్నారు.  

 

ఇక చెవిపోగుల గురించికూడా తెలుసుకుందాం. చెవులు కుట్టించడంకూడా హిందువుల పురాతన ఆచారమే. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు భీష్ముని చంపుతానని రథం నుండి దుమికి ఆయనపైకి వెళ్ళే సమయంలో కృష్ణుని కుండలములకాంతి గగనభాగంక్రమ్మినదట. ఇలా అనేకచోట్ల మన పురాణాలలో చెవికమ్మల (కుండలాల) ప్రస్తావన వుంది.  ఆడపిల్లకైతే ఒకసంవత్సరం వయసురాగానే చెవులుకుట్టిస్తారు. ఇప్పుడు చెవితమ్మకు రెండుమూడుచోట్లకూడా కుట్టించి ఆభరణాలు ధరింపజేస్తున్నారు. అమ్మాయిలకు ముందు ఎడమచెవి, అబ్బాయిలకు ముందు కుడిచెవి కుట్టిస్తారు. మేనమామ ఒడిలో తూర్పువైపుగాముఖంబెట్టించి కూర్చోబెట్టి ఉదయాన్నే కుట్టిస్తారు. మొదటిసారి తలనీలాలు దైవక్షేత్రములో తీయించే సమయంలోనే బిడ్డలకు చెవులుకుట్టించే ఆచారం చాలాకుటుంబాల్లో వుంది. తొలుత ఆడమగ పిల్లలందరికి చెవులు కుట్టించేవారు. తర్వాత ఆడపిల్లలకే కుట్టిస్తూవచ్చారు. ఇప్పుడు మగవారుసైతం అందంగావుంటాయని చెవిరింగులు, కమ్మలు ధరిస్తున్నారు. అయితే కొందరు చెవులుకుట్టించుకోకుండ అణచిపట్టుకోనుండేవిధంగా కమ్మలు ధరిస్తున్నారు. అవికూడా ఒకచెవికే ధరిస్తున్నారు. అలాకాకుందా కుట్టించుకోవడమే మంచిదని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది.

 

చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలు నాడులద్వారా అనుసంధింపబడి వున్నాయి. చెవులు కుట్టించడంద్వార ఆకుపంచర్ రీతిలో నాడులు ఉత్తేజితమై కంటిచూపు మెరుగౌతుంది. చెవి, పంటిసంబంధమైన వ్యాధులురావు. స్త్రీలలో ఋతు సంబంధ మైన హెచ్చుతగ్గులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందని శుశ్రుతసంహితలో చెప్పబడింది. నాడీమండలవ్యవస్థ ఉత్తేజితమవడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, మానసిక రుగ్మతలు దూరమై ప్రశాంతత కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయంరాదు. మగపిల్లలకు బుడ్డ (హైడ్రోసీల్) హెర్నియా వంటి వ్యాధులురావు. పక్షవాతం రాదు. రక్తపోటు, ఆయాసం అధికమవ్వడం జరుగదు. రంగురంగులలో ఆకర్షనియ్యంగావున్నాయని ప్లాస్టిక్ లేదా తగ్గులోహాలతోచేసిన చెవిరింగులు ధరించడం మంచిదిగాదు. బంగారం, వెండి, రాగితోచేసిన వాటినే వాడుకోవాలి. నొప్పితక్కువగా వుండటం కోసం ముక్కుచెవులు కుట్టడానికి పియర్సింగ్ గన్లను వాడుతున్నారు. అయితే ముక్కు చెవులు కుట్టడంలో ఇంఫెక్షన్ కలుగవచ్చు. ఇంకా చిన్నచిన్నబుడిపెలు (సిస్ట్ గ్రాన్యులోమా) యేర్పడవచ్చు. అటువంటప్పుడు తెలిసినవైద్యుని సంప్రతించడం మంచిది.             

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...