ముక్కుపుడక-చెవిపోగులు
ముక్కుపుడకను
అడ్డకమ్మ,నత్తు, బాసర,బులాకి, ముక్కెర అనికూడాఅంటారు. మతాలకతీతంగా
భారతీయ స్త్రీలందరూ అనాదిగా ముక్కెరను ధరిస్తున్నారు. ఇది ఒకఆచారమే గాకుండా ముక్కుకందాన్నిస్తున్నది.
దక్షిణభారతీయులు కుడిముక్కుకు ఉత్తరభారతీయులు ఎడమముక్కుకు ఆచారంగా ధరిస్తారు.
పైపెదవిపై వ్రేలాడునట్లు రెండుముక్కులకు నడిమిభాగాన కూడా ధరించడం చూస్తున్నాము. ముఖ్యంగా
ఆటవికజాతివారు యీపద్ధతినవలంభిస్తున్నట్లు గమనిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా రకరకాల
రత్నాలు, వజ్రాలుపొడిగిన ముక్కెరలు అందంకోసం మగువలు
ధరిస్తున్నారు. టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ముక్కుపుడక నిరంతరం
ధరిస్తున్నట్లు గమనించగలం. పూర్వం ముక్కుపుడకలేని స్త్రీలను దేవుని
ప్రసాదంవండటానికి అనుమతించేవారు కాదు. దుష్టశక్తులను ముక్కుపుడక అడ్డగిస్తుందని
హిందువుల ప్రగాఢవిశ్వాసం. అందుకే వివాహానికిముందే ఆడపిల్లలకు
ముక్కులుకుట్టిస్తారు. సర్వసామాన్యంగా 5,7,11 సంవత్సరాల్లో
ఆడపిల్లలకు ముక్కులుకుట్టించడం ఆనవాయితీ.
ముక్కు
కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటుంది,
కాబట్టి కుడివైపు మండలాకారపు (గుండ్రని) పుడకను, ఎడమవైపు
అర్ధచంద్రాకారపు పుడకను ధరింపజేస్తారు.లేదా యేవైపైనా ఒంటిరాయిబేసరి ధరింపజేస్తారు.
ముక్కెరను హిందువులు తాళితోసమానంగా చూస్తారు. కనుక కాబోయేభర్త పెండ్లిసంబరాల్లో
భాగంగా వధువుకు ముక్కెర నిస్తాడు. కొన్నికుటుంబాలలో మేనమామ ముక్కెర నిస్తాడు.
మిగిలినవారెవరిచ్చినా ముక్కెరస్వీకరించరు. దేవదాసి మాత్రమే యెవరిచ్చినా ముక్కెర
స్వీకరిస్తుంది. తాళివలెనే స్త్రీలు ముక్కుపుడకనుకూడా తమకు వైధవ్యము రాకుండ
కాపాడుతుందని ఎల్లప్పుడు ధరిస్తారు. హిందూదేవతలందరికీ ముక్కెర తప్పకుండా వుంటుంది.
బాలకృష్ణుని వర్ణనలో కూడా "నాసాగ్రే నవమౌక్తికం" అని వుంది. ప్రళయసమయంలో
బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరను కృష్ణాజలాలు తాకుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞాంలో
తెలియజేశారు. భామాకలాపంలో సత్యభామ ప్రణయకలహంతో కృష్ణునితో అలుగుతుంది. తర్వాత
విరహంభరించ లేక తనచెలికత్తెను కృష్ణునివద్దకు రాయబారం పంపాలనుకుంటుంది.
ఆచెలికత్తెను మంచిచేసుకోవడానికి సత్యభామ యేవేవో కానుకలివ్వజూపుతుంది. కానీ
చెలికత్తె అవేమీవద్దని సత్యభామధరించిన ముక్కెర కావాలంటుంది. ఇలా పురాణకాలమునుండి
ముక్కెర ప్రస్తావన వుండనేవుంది.
ఆరోగ్యపరంగకూడా
ముక్కులుకుట్టించడం, ముక్కెరధరించడంవల్ల మేలుజరుగుతుందని నమ్ముతారు.
ముక్కులుకుట్టడం "ఆకుపంచర్" వైద్యవిధానంతో సమానమంటారు. దీనివల్ల
ప్రాణశక్తికి సంకేతమైన ఇడ,పింగళ నాడులు ఉత్తేజితమై
శక్తివంతంగాపనిచేసి మెదడులోని నాడీవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వెండి,బంగారు,రాగితో ముక్కెరరలుచేస్తారు గనుక ఆలోహాలు పీల్చేగాలిని
శుభ్రపరచి, రోగాలను నిరోధిస్తాయి. అంతేగాకుండా
ముక్కులు కుట్టించడంద్వారా గర్భకోశదోషాలు తొలగిపోయి సంతానప్రాప్తికి
దోహదంలభిస్తుంది. సుఖప్రసవంజరుగుతుంది. కన్ను,చెవివ్యాధులు
రావు. శ్వాశకోశవ్యాధులు కూడా రావని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది. ఈవైద్యవిధానం
భారతదేశమునుండే చైనాకు వెళ్ళిందని అనేకులు నమ్ముతున్నారు.
ఇక
చెవిపోగుల గురించికూడా తెలుసుకుందాం. చెవులు కుట్టించడంకూడా హిందువుల పురాతన
ఆచారమే. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు భీష్ముని
చంపుతానని రథం నుండి దుమికి ఆయనపైకి వెళ్ళే సమయంలో కృష్ణుని కుండలములకాంతి గగనభాగంక్రమ్మినదట.
ఇలా అనేకచోట్ల మన పురాణాలలో చెవికమ్మల (కుండలాల) ప్రస్తావన వుంది. ఆడపిల్లకైతే ఒకసంవత్సరం వయసురాగానే
చెవులుకుట్టిస్తారు. ఇప్పుడు చెవితమ్మకు రెండుమూడుచోట్లకూడా కుట్టించి ఆభరణాలు ధరింపజేస్తున్నారు.
అమ్మాయిలకు ముందు ఎడమచెవి, అబ్బాయిలకు ముందు కుడిచెవి కుట్టిస్తారు. మేనమామ
ఒడిలో తూర్పువైపుగాముఖంబెట్టించి కూర్చోబెట్టి ఉదయాన్నే కుట్టిస్తారు. మొదటిసారి
తలనీలాలు దైవక్షేత్రములో తీయించే సమయంలోనే బిడ్డలకు చెవులుకుట్టించే ఆచారం
చాలాకుటుంబాల్లో వుంది. తొలుత ఆడమగ పిల్లలందరికి చెవులు కుట్టించేవారు. తర్వాత
ఆడపిల్లలకే కుట్టిస్తూవచ్చారు. ఇప్పుడు మగవారుసైతం అందంగావుంటాయని చెవిరింగులు,
కమ్మలు ధరిస్తున్నారు. అయితే కొందరు చెవులుకుట్టించుకోకుండ
అణచిపట్టుకోనుండేవిధంగా కమ్మలు ధరిస్తున్నారు. అవికూడా ఒకచెవికే ధరిస్తున్నారు.
అలాకాకుందా కుట్టించుకోవడమే మంచిదని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది.
చెవికి
కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలు
నాడులద్వారా అనుసంధింపబడి వున్నాయి. చెవులు కుట్టించడంద్వార ఆకుపంచర్ రీతిలో
నాడులు ఉత్తేజితమై కంటిచూపు మెరుగౌతుంది. చెవి, పంటిసంబంధమైన
వ్యాధులురావు. స్త్రీలలో ఋతు సంబంధ మైన హెచ్చుతగ్గులు కలుగవు. ప్రత్యుత్పత్తి
వ్యవస్థ బాగా పనిచేస్తుందని శుశ్రుతసంహితలో చెప్పబడింది. నాడీమండలవ్యవస్థ
ఉత్తేజితమవడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, మానసిక
రుగ్మతలు దూరమై ప్రశాంతత కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయంరాదు.
మగపిల్లలకు బుడ్డ (హైడ్రోసీల్) హెర్నియా వంటి వ్యాధులురావు. పక్షవాతం రాదు.
రక్తపోటు, ఆయాసం అధికమవ్వడం జరుగదు. రంగురంగులలో
ఆకర్షనియ్యంగావున్నాయని ప్లాస్టిక్ లేదా తగ్గులోహాలతోచేసిన చెవిరింగులు ధరించడం
మంచిదిగాదు. బంగారం, వెండి, రాగితోచేసిన
వాటినే వాడుకోవాలి. నొప్పితక్కువగా వుండటం కోసం ముక్కుచెవులు కుట్టడానికి
పియర్సింగ్ గన్లను వాడుతున్నారు. అయితే ముక్కు చెవులు కుట్టడంలో ఇంఫెక్షన్
కలుగవచ్చు. ఇంకా చిన్నచిన్నబుడిపెలు (సిస్ట్ గ్రాన్యులోమా) యేర్పడవచ్చు.
అటువంటప్పుడు తెలిసినవైద్యుని సంప్రతించడం మంచిది.
No comments:
Post a Comment