Saturday, 12 September 2020

సగంతప్పు

 సగంతప్పు

సాలంకృత వరకట్న కన్యాదానం  నవ్వుతూనే నిర్వర్తించాడు.

కట్నరహిత ఆదర్శకల్యాణం కొడుక్కు జరిపించాడు

ఏమిటీ విడ్డూరంఅంటే

ఇవ్వడం అమానుషం కాదులెమ్మంటాడు.

 

తనదగ్గర కాగితం ఆలస్యమవకుండా రాసేస్తాడు

మరితన బకాయీలకోసం ఓవెయ్యి టేబుల్‍క్రిందందిస్తాడు

ఏమిటీ అన్యాయంఅంటే

బ్రదర్యివ్వకుంటే గత్యంతరం లేదంటాడు

 

ఒక‍అడుగాక్రమించిన ఇరుగునేమనలేదు 

రెండడుగులు తా విదిచి పొరుగుసుఖం కోరాడు

ఏమిటి దీనర్థంఅంటే

ఇరుగుపొరుగు విరోధం స్థలముండీ యిరుకంటాడు.

 

ఏమైనా నీది సగం ఖచ్చితంగా తప్పేనంటే

నిజమేనని ఒప్పుకుంటాడు

అయితే ఆ సగంతప్పునుండి

సంఘం నన్ను కాపాడాలంటాడు

 

మీరేమంటారో మరి?


--- 

Search:  Sagam tappu

మారాలి మనిషి

మారాలి మనిషి

 

కోటానుకోట్లు నొక్కేసినా  ఆ రాజకీయనాయకుని
బినామీ లాకర్లు నిండలేదు.
మేజక్రింద ఎంత హస్తలాఘవం జూపినా
ఆ ఉద్యోగి జోబులు నిండలేదు.
ఎంతగా వంచన నిలువెల్ల పులుముకొన్నా
ఆ వ్యాపారి గల్లాపెట్టె నిండలేదు.
ఒకటేమిటి సంపాదనా పరుగుపందేలకు 
మితి గతి లేకుండాపోయింది
వారి ఇనుపపాదాలక్రింద నలిగిపోయే సామాన్యునికి
దిక్కేలేకుండా పోయింది.
 
ఎందుకలా?

ఇంతసంపాదించితి, నికయేల యని తనియరాదని
ఆశాపాశము తా కడునిడువు లేదంతంబు దానికని
తిన్నదికాదు పుష్టి మానవుల కెనకేసికొన్నదే పుష్టి యని
సర్దిచెప్పుకోవలసిందే కానీ మార్గామ్తరమే లేదుకదా?

 
తెనెటీగలు తమతుట్టె నిండగానే
ఆగి ఆస్వాదించి అనందిస్తాయి.
చీమలు తమపుట్ట నిండగానే
ప్రయాస చాలించి హయిగా ఆహారిస్తాయి.
పశుపక్షాదులు ఏపూటకాపూట
దొరికిందితిని తృప్తిగా విశ్రమిస్తాయి.
ప్రకృతిలో ఒకభాగంగా జీవిస్తాయి.

 
ఎందుకు మానవుడు మాత్రమే ప్రకృతితికి వైరియై
కృత్రిమసుఖాలకై పోరాడుతున్నాడు?
అంతులేని ఆరాటంతో అసంతృప్తికిలోనై
అతలాకుతలమౌతున్నాడు?

 
నూతనావిష్కరణలంటూ పోటీపడి
ప్రకృతిని మైలపరుస్తున్నాడు.
ఒకవైపు తోటిజీవుల హింసిస్తూ
మరోవైపు శాంతినాకాంక్షిస్తున్నాడు.
మ్రొక్కులతో పైశాచిక పూజలతో
ఆవేదనల కంతం వెతుకుతున్నాడు.
అది అందని పండైనా అర్రులుచాస్తూ
అలసిపోతున్నాడు.

 
మనిషి జన్మతః క్రూరుడా? కాదుగదా?
మనిషంటేనే మానవత్వంగల ప్రాణి గదా?
మేథోసంపత్తి సమృద్ధిగా గల జీవిగదా?
వివేచనాజ్ఞాన సంపదకు వారసుడు గదా?
సృష్టికి ప్రతిసృష్టి చేయగల అపర పరమేమేష్టి కదా?

 
 మరైతే ప్రకృతికి పట్టిన చీడ్పురుగై
వినాశన హేతువౌతున్నాడెందుకు?
ఆలోచించాలి...మనిషి మారాలి.
 

Thursday, 3 September 2020

శ్రీకృష్ణదేవరాయలు

 శ్రీకృష్ణదేవరాయలు

(రాయలు పట్టభిషిక్తుడై 500 సంవత్సరములైన సందర్భందా జరిపిన కవిసమ్మేలనంలో చదివిన పద్యాలు)

 

          తే:గీ.    గడచి గండముల్ ధీరత గద్దెనెక్కి

                    ఐదువందల యేండ్లయ్యె నని గణించి

                    యెరిగి ఈ గడ్డ పౌరుషం బీవటంచు

                    రహి జరుపరె పండువ కృష్ణరాయభూప.

 

          సీ.   కన్నబిడ్డలవోలె కాపాడి నీ ప్రజన్

                             మేటిరాజుగ ధర మెలగినావు

                 రణవిద్యలందున రాటుదేలిన ఘన

                              వీరావతారమై వెలసినావు

                   రత్నాలనంగళ్ళ రాసులుగాబోసి

                              అమ్మగా సిరులతో యలరినావు

                   అని పరాజితులైన అన్యరాజసతుల

                              పరువును గాపాడి పంపినావు

 

          తే:గీ.     అష్టదిగ్గజ కవుల నిష్టతోడ

                    నిలిపి సాహిత్య శారదన్ గొలిచినావు

                    శిలల శిల్పాలు జెక్కించి నిలిపినావు

                    కృష్నదేవరాయా! నీకు కేలుమోడ్తు.

 

        ఉ.       రాజులు రాజ్యముల్ గలుగ రాజసమేర్పడ యేలవచ్చు నా

                  రాజులవల్ల భూప్రజలు రంజనమై సుఖియించి యుండవ

                 చ్చా జనమే యెఱుంగునదియంతటితోసరికృష్ణరాణ్డృపా

                 రాజిత సుప్రబంధముల రవ్వలు రువ్విన మీర లక్షరుల్

 

          కం.     బహుభాషల కవియయ్యును

                    అహహా తెలుగే తగునని యల్లితివి గదా!

                    మహిమాన్విత కావ్యంబును

                   సుహృజ్జనస్తుత! తెలుగు సూరివనంగన్

 

          కం.     మను వసుచరిత్రముల చెం

                    తన మీ ఆముక్తమాల్యద వెలుంగన్ మీ

                    ఘనకీర్తియు ప్రాభవమున్

                    మనును గదా! కృష్ణరాయ! మహి యక్షమై.


                            ***

        Search:    Sree Krishnadevarayalu / Rayalu


Monday, 31 August 2020

పోతన్నా! మాప్రణుతి గైకొను మన్నా

   పోతన్నా! మాప్రణుతి గైకొను మన్నా

               

        

                    భావత నిగమమున్ బహురమ్యముగ వ్రాసి

                    భవబంధముల ద్రెంచిభాగవతులను జేసి

                    మముగమ్యమును జేర్చు మార్గమేర్పరచినా

                    వన్నపోతన్న మా ప్రణుతి గైకొను మన్నా.

 

                మెఱగుచెంగట నున్న మేఘముగ భావించి

                ధరణిజన్ శ్రీరాము దర్శించి ముదలగొని

                కరదీపికన్ బట్టి కైవల్యమున్ జూప

                ఏకశిలనగరాని కెతెంచి నావన్న ........ //అన్న పోతన్న మా//

   

                మందారసుమముల మకరందమిదియని

                మాధవుని సంస్తుతిన్ మాటిమాటికి జేసి

                మత్తెక్కగాజేసి మాయకావల జేర్చి

                భక్తి లహరుల దేల్చి ముక్తి జూపితివన్న .....//అన్న పోతన్న మా//

 

                ఇందునందేకాదు ఎందెందు చూచినన్

                నిండియున్నట్టి యా నీలమేఘశ్యాము

                పదిలముగ మా హృదయ భద్రపీఠమ్మున

                కొలువుండజేసి మా కొఱత దీర్చితివన్న.......... .//అన్న పోతన్న మా//

 

                విశ్వమోహనరూపు వేణుగానమ్మును

                మా కర్ణరంద్రముల మారుమ్రోగగ జేసి

                పరవశుల గావించి పరతత్త్వమెఱిగించి

                హరిభక్తిలో మమ్ము కరిగించినావన్న....//అన్న పోతన్న మా//


                        ***

Search : Pothana

        



పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...