Tuesday, 10 May 2022

రుద్రాక్ష

 

రుద్రాక్ష



రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
                                                                     ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః
                                                                     పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
                                                                     ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః

 రుద్రాక్షను హిందువులు అత్యంతపవిత్రంగా భావిస్తారు. శైవమతానుయాయులు దీన్ని సాక్షత్తూశివస్వరూపంగా పూజిస్తారు. పదునొకండువందల రుద్రాక్షలు ధరించిన జంగమదేవరను శివపరమాత్మగా భావించి పూజిస్తారు. "రుద్రాక్ష ధారణాత్ రుద్రోభవత్యేవ నసంశయః" అని దేవీభాగవతం చెబుతున్నది. రుద్రాక్షవృక్షాలు శివుని కన్నీటిబిందువులు భూమిపైబడి మొలిచాయని పురాణాలు చెబుతున్నాయి. శివునిబాష్పకణాలు భూమిపైబడిన సందర్భాలు వివిధములుగా చెప్పబడుతున్నాయి. శివుడు శక్తివంతమైన అఘోరాస్త్రం పొంది త్రిపురాసురులను సంహరించటానికి తీవ్రమైన బహుకాలతపమాచరించాడు. తపముఫలించి సమాధినుండిలేచి కళ్ళుతెరిచాడు. అప్పుడు ఆయనకళ్ళనుండి నీటిబొట్లురాలాయి. ఇదొకకథనం. మరొకకథప్రకారం, శివుడు త్రిపురాసురులను సంహరించి, వారిచావుకు చింతించి కన్నీరుకార్చాడు. మరోకథప్రకారం సతీదేవి, తండ్రిదక్షుని నిరాదరణకు గురై తన్నుతాను దహించుకొని ప్రాణత్యాగంచేసింది. అదితెలిసిన శివునికన్నులనుండి నీటిబొట్లు రాలాయి. ఏదియేమైనా శివునికన్నీటిబొట్లే రుద్రాక్షవృక్షాలైనాయన్నది మనం గ్రహించవలసియున్నది. ఈబాష్పజలబిందువులు శివుని ఎడమకంటినుండి 12 , కుడికంటినుండి 16, మూడవనేత్రమైన అగ్నినేత్రం నుండి నల్లని10 బిందువులు భూమిపైబడి మొత్తం 38 రకాల వృక్షాలు మొలిచాయి. ఇవి గౌడ, కాశి, అయోధ్య వంటి క్షేత్రాల్లోను, మలయ, హిమాలయ, సహ్యాద్రి ల్లాంటి పర్వతప్రాంతాల్లోను పడి రుద్రాక్షవృక్షాలు మొలిచాయంటారు.

శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చె బుతారు.

 “స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్,

    భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్

    లక్షంతు దర్శనా త్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్ ”-- జాబాలోపనిషత్.

 అంటే భక్తుల ననుగ్రహించ డానికే రుద్రాక్షలు స్థావరాలుగా (వృక్షాలుగా) అవతరించాయి. వీటినిధరించిన భక్తుల పాపాలు ఏరోజు కారోజుననే నశిస్తాయి. దర్శింనా, ధరించినా కోటిజన్మలపుణ్యం లభిస్తుంది  

 వృక్షశాస్త్రంప్రకారం ఇది మాగ్నొలియోఫైటా జాతికి చెందిన,ఎలాయోకార్పాస్ వర్గవృక్షాలు. నునుపుగా, గట్టిగా, ముడులుముడులుగా నున్న పెద్దరుద్రాక్షలు ధారణకైనా, జపానికైనా మంచివి. ఇవి ఉసరికకాయంతవి, రేగుపండంతవి, గురివింద(శనగ)లంతవిగా లభిస్తాయి.ఇవి ప్రమణాన్నిబట్టి ఉత్తమ,మధ్యమ,అధమ పలితలిస్తాయని శాస్త్రం. 

                            ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
                              బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
                             అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే

చిన్నరుద్రాక్షలు తాంత్రికవిద్యాసాధకులు ధరిస్తారు, రుద్రాక్షలనుగురించి శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారుణ్యమహాత్మ్యం, దేవీభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కందపురాణం, పద్మపురాణాలలో వివరణలున్నాయి. అన్నివర్ణాలవారూ రుద్రాక్షలు ధరించవచ్చు. ఋషులు, మునులు, రాక్షసులు, దేవతలుసైతం రుద్రాక్షలు ధరించినవారే. పూజారులు, గురువులు, వేదాంతులు వీటిని ధరిస్తున్నారు. మామిడిచెట్టును పోలియుండు రుద్రాక్షచెట్లే ఫలాలనిస్తాయి. నీలిరంగులో పండ్లుంటాయి. కాస్తాపుల్లనిరుచిగల గుజ్జులో రుద్రాక్ష వుంటుంది. పండుగావుండగా కోడిగ్రుడ్డుఆకారంలోవుండి ఎండిపోయినతర్వాత గుండ్రంగా మారుతాయి. పండుమాగినతర్వాత గుజ్జు నుండివేరుచేసిగాని, ఎండినఫలాలనుండిగాని రుద్రాక్షలు సేకరిస్తారు. తొడిమ తొలగించిచూస్తే రుద్రాక్షమధ్య రంధ్రం కనబడుతుంది. ఈరంధ్రంద్వార దారం లేదా వెండి,బంగారు తీగగానీ పోనిచ్చి మాలలు తయారుచేస్తారు. వైద్యశాస్త్రరీత్యా ఇది క్షయనివారిణి, కఫ, వాతరోగాలను హరిస్తుంది. నీటితోఅరగదీసి నాకిస్తే మశూచిని, తేనెతోఅరగదీసినాకిస్తే మూర్ఛలను నయంచేస్తుంది.

 రుద్రాక్షకుండే చారలనుబట్టి రుద్రాక్షముఖాలను నిర్ణయిస్తారు. ముఖాలనుబట్టి వాటి ప్రత్యేకతలుంటాయి. అవసరాన్నిబట్టి ధరించదలచినవారు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో నిర్ణయించుకుంటారు. అలాకాక కొందరు వారిజన్మనక్షత్రాన్ని బట్టి రుద్రాక్షను ఎంపికచేసుకుంటారు. మరికొందరు నవరత్నాలకుబదులు రుద్రాక్షలను ఎంపికజేసుకుంటారు.

 రుద్రాక్షముఖాలు ~ వాటిమహాత్మ్యము ~ ప్రయోజనాలు

 ఏకముఖి:- ఇది చాలావిలువైనది. దీన్ని శివునిప్రతిరూపంగా భావిస్తారు. దర్శనభాగ్యంవల్లనే మహాపాతకాలు నశిస్తాయి. అర్చనవల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కొరతలన్నీ తీరుతాయి. వ్యక్తివికాసం, జ్ఞానం వృద్ధిచెందుతుంది. దుష్టమంత్రతంత్రప్రయోగాలను త్రిప్పికొట్టగలదు. శిరోవేదనలను నయంచేస్తుంది.

 ద్విముఖి:- అర్థనారీశ్వరతత్త్వానికిది ప్రతీక. కుండలినీశక్తిని సులభంగామేల్కొలిపి శక్తివంతంగావిస్తుంది. గోహత్యాపాతకకారిణి. సంతానప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపారవృద్ధిని కలిగించి మనోవ్యాకులతను మాన్పుతుంది.దీన్ని కొందరు బ్రహ్మరుద్రాక్ష అనికూడా వ్యవహరిస్తారు.

 త్రిముఖి:- ఇది అగ్నిస్వరూపిణి. అదృష్టదాయిని, ఆరోగ్యప్రదాయిని, అభ్యుదయభావదాయిని, ధనధాన్యసమృద్ధికితోడ్పడును. కార్యసిద్ధి, విద్యావృద్ధి కలిగించును. కామెర్లు, సర్పదోషములు హరించును.

 చతుర్ముఖి:- బ్రహ్మస్వరూపుణి, విద్యాప్రదాయిని, ఏకాగ్రతనిచ్చును. పరిశోధకులకు జ్యోతిర్గణితవేత్తలకు రాణింపు నిస్తుంది. స్పర్శమాత్రమున పాపనాశము, నరహత్యాదోషనునివారణ జరుగుతుంది. పాలలో యీ రుద్రాక్షవేసి ఆపాలుత్రాగితే మానసికరోగాలు నయమౌతాయి.

 పంచముఖి:- ఇది కాలాగ్నిస్వరూపం. మోక్షాన్నిస్తుంది. అకాలమృత్యువును తప్పిస్తుంది. శత్రునాశిని. సర్పవిషాన్ని విరిచేస్తుంది. హృద్రోగనివారిణి. మలబద్ధకాన్నిపోగొడుతుంది.

 షణ్ముఖి:- కుమారస్వామిస్వరూపం. సమస్తపాపహరం. శక్తినిచ్చి విజయాన్నందిస్తుంది. శరీరదారుఢ్యాన్నిపెంచి ఆరోగ్యాన్నిస్తుంది. హిస్టీయా, రక్తపోటువ్యాధిని నయంచేస్తుంది.

 సప్తముఖి:- మన్మథరూపిణి. వశీకరణి. అకాలమృత్యునివారిణి. సభావశ్యత, సంపద, ఉత్తేజం, కీర్తి కలుగజేస్తుంది. కామధేనువుకు ప్రతీకయనికూడా కొందరి విశ్వాసం.

 అష్టముఖి:- భైరవరూపిణి. దారిద్ర్యవిధ్వంసిని. దీర్ఘాయువునిచ్చును. ఆకస్మికధనలాభముకలుగజేయును. కుండలీనీశక్తిని హెచ్చించును. విఘ్నేశ్వరునకు ప్రతీకయనికూడా కొందరినమ్మకం.

 నవముఖి:- నవదుర్గాస్వరూపం. శివతుల్యవైభవకారిణి. భైరవస్వరూపమని కొందరి అభిప్రాయం. పరోపకారబుద్ధిని పుట్టిస్తుంది. అపమృత్యువునురానివ్వదు. రాజకీయపదవులలోఔన్నత్యాన్నిస్తుంది. దీన్ని ఎడమచేతికి ధరించుట మంచిది.

దశముఖి:- విష్ణుస్వరూపిణి. సకలాభీష్టప్రదాయిని. అశ్వమేధయాగంచేసినంత ఫలందక్కుతుంది. నవగ్రహదోషాలను తొలగిస్తుంది. గొంతుసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ఏకాదశముఖి;- రుద్రరూపిణి. విశేషఫలదాయిని. దుష్టశక్తులనంతంచేస్తుంది. వైవాహికజీవనసుఖప్రదాయిని. గర్భసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ద్వాదశముఖి:- ద్వాదశాదిత్యులకు ప్రతీక. గౌరవంకలుగజేస్తుంది.

 త్రయోదశముఖి:- కామధేనువునకు ప్రతీక. కార్తికేయునకు ప్రతీకయని కొందరివిశ్వాసము. ఈరుద్రాక్ష పాలలోవేసి ఆపాలుత్రాగితే అందం వృద్ధియౌతుంది.

 చతుర్దశముఖి:- ఉపనిషత్తులప్రకారం ఇది పరమశివుని కన్ను. పరమేశ్వరప్రీతికరం.

 పంచదశముఖి:- పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మికసాధనకు సహాయకారి.

షోడశదశముఖి:-పరిపాలనా దక్షత కలుగజేస్తుంది. సత్య ధర్మమార్గంలో నడిచేట్లుజేస్తుంది.

సప్తదశముఖి:- విశ్వకర్మకుప్రతీక. సంపదనిస్తుంది.

అష్టాదశముఖి:- భూదేవికి ప్రతీక. స్థలాలవ్యాపారం లాభిస్తుంది. వ్యవసాయం మంచి ఫలితాలనిస్తుంది.

ఎకోనవింశతి ముఖి:- నారాయణునకు ప్రతీక. భక్తిని, ఆస్తికతను పెంపొందిస్తుంది.

వింశతిముఖి:- సృష్టికర్తబ్రహ్మకుప్రతీక. సంతానవృద్ధికరం.

ఏకవింశతి ముఖి :- భక్తిప్రదాయిని. జనన మరణ చక్రం నుండి విడుదలగావించి సాయుజ్యదశకుచేరుస్తుంది. దీన్నికొందరు కుబేరునికి ప్రతికగాను, మరికొందరు ఇంద్ర మాలగానూ భావిస్తారు.

 గౌరీశంకరరుద్రాక్ష:- ఇది ఇడ,పింగళనాడులను క్రమబద్ధీకరించి, క్రియశీలతకు తోడ్పడుతుంది. ప్రశాంతతనిస్తుంది.

 గణపతిరుద్రాక్ష :-రుద్రాక్షపైనుండే ముడుతలు గణపతి తుండం ఆకారంలో ఏర్పడి వుంటాయి. గణపతికి ప్రతీక. విఘ్ననాశిని. కన్యలవివాహాలకు ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తుంది. సంతానప్రాప్తికి దోహదపడుతుంది. విద్యాబుద్ధుల నిస్తుంది. పండితుల ప్రాభవాన్ని పెంచుతుంది.

 ప్రస్తుతం పదునాలుగుముఖాల రుద్రాక్షల వరకు లభ్యమౌతున్నాయి. 12,13,14ముఖాల రుద్రాక్షలు ఏదైనా ఒకకోరికను హృదయంలోతలంచి రుద్రాక్షను పూజాగృహములోవుంచి ఆరాధిస్తే నలువది(మండలం)దినములలో ఆకోరిక నెరవేరుతుంది.

 నిజమైనరుద్రాక్షను ఇండ్రస్ట్రియల్ స్కానింగ్ లేక  డెంటల్xరే ద్వరా గుర్తించవచ్చును. నకిలీరుద్రాక్షలు ఎఱ్ఱచందనంతో తయారుచేస్తున్నారు. ప్రతిసంవత్సరం వందలకోట్లలో రుద్రాక్షలవ్యాపారం మనదేశంలో జరుగుచున్నది. కాబట్టి నకిలీరుద్రాక్షలు మోసగాళ్ళు అమ్మజూపుతున్నారు. అంతేగాక బీహార్, ఉత్తరప్రదేశ్ లలో బద్రాక్షలు పండించి అమ్ముతున్నారు. ఇవి విషతుల్యమైనవి. కీడుచేస్తాయి. కనుక అనుభవంగలవారి సలహామేరకు రుద్రాక్షలు సేకరించుకోవడం మంచిది.

 జన్మనక్షత్రం తెలిసివుంటే, ఆనక్షతంప్రకారం ఎన్నిముఖాలరుద్రాక్ష ధరించాలో యీక్రింద తెలియజేయబడింది. ఈపద్ధతి బహుదాక్షేమకరం.

 అశ్వని-9ముఖాలు. భరణి-6ముఖాలు. కృత్తిక-1,12ముఖాలు. రోహిణి-2 ముఖాలు. మృగశిర-3ముఖాలు. ఆరుద్ర-8ముఖాలు. పునర్వసు-5ముఖాలు. పుష్యమి-7ముఖాలు. ఆశ్లేష-4ముఖాలు. మఖ-9ముఖాలు. పుబ్బ-6ముఖాలు. ఉత్తర-1,12ముఖాలు. హస్త-2ముఖాలు. చిత్త-3ముఖాలు. స్వాతి-8ముఖాలు. విశాఖ-5ముఖాలు. అనూరాధ-7ముఖాలు. జేష్ట-4ముఖాలు. మూల-9 ముఖాలు. పూర్వాషాడ-6ముఖాలు. ఉత్తరాశాడ-1,12ముఖాలు. శ్రావణం-2 ముఖాలు. ధనిష్ట-3ముఖాలు. శతభిషం-8ముఖాలు. పూర్వాభాద్ర-5ముఖాలు. ఉత్తరాభాద్ర-7ముఖాలు. రేవతి-4ముఖాలు.

 నవరత్నాలు చాల ధరగలిగినవి అందువల్ల నవరత్నజ్ఞానంగలిగినవారు గానీ తెలిసినవారి సలహాయం మేరకుగానీ నవరత్నాలకు బదులు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో యీ క్రిందతెలిపిన ప్రకారం ఎంపికచేసుకొని ధరించి మేలు పొందవచ్చును.

 కెంపు-1,12ముఖాలు. ముత్యం-2,11ముఖాలు. పగడం-3,ముఖాలు. పచ్చ-4,13ముఖాలు. పుష్యరాగం-5,14ముఖాలు. వజ్రం-6,15ముఖాలు. నీలం-7,16ముఖాలు. గోమేదికం- లేక గౌరీశంకరరుద్రాక్ష. వైడూర్యం-9,18ముఖాలు.

 ఎన్నిరుద్రాక్షలు శరీరంలో ఏభాగమున ధరించవలెనో కూడా తెలుపబడింది.

 కంఠం-32. తలమీద-40. చెవులకొక్కదానికి-6. ఒక్కొకచేతికి-12. ఒక్కొకభుజానికి-16. రొమ్ముపై-108రుద్రాక్షలు ధరించాలని శివపురాణంలోనూ, దేవీభాగవతంలోనూ చెప్పబడింది. ఈరుద్రాక్షలను మంత్రపూర్వకంగా ధరించటం  అవసరం. అప్పుడవి శుద్ధియై శక్తివంతంగా పనిజేస్తాయని పెద్దలుచెబుతారు. సోమవారంగానీ పుష్యమినక్షత్రంనాడుగానీ లేదా ఏదైనా శుభదినంనాడు "ఓంనమఃశివాయ" అను మంత్రాన్ని నూటఎనిమిదిసార్లు జపించి ధరించాలని కొందరి అభిప్రాయం. మరికొందరు  "ఓంక్రీంహ్రీంక్షాంవ్రీంఓం" అనుమంత్రాన్ని పదునొకండుసార్లు జపించి ధరించాలంటారు. మరికొందరు 1,4,5,6,9,10,11,14ముఖాల రుద్రాక్షలు ధరించునపుడు "ఓంహ్రీంనమః" అను మంత్రాన్నీ, ముడుముఖాలరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్లీంనమః” అనుమంత్రాన్నీ ఏడు,ఎనిమిదిముఖాల రుద్రాక్షలుధరించునపుడు "ఓంహుంనమః" అను మంత్రాన్నీ, ద్వాదశముఖిరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్రౌంనమః" అను మంత్రాన్నీ నూటయెనిమిదిసార్లు జపించి ధరించాలని సూచించారు. ఏఆశా లేకుండా యిలా రుద్రాక్షలుధరిస్తే భక్తివైరాగ్యలు కలిగి అధ్యత్మికజ్ఞానం  పెంపొందుతుంది.

 మునులు, ఋషులు సంవత్సరాలపాటు అడవులలో తపమాచరిస్తూ వుంటారుగనుక వారుత్రాగేనీరు మంచిదోకాదో తెలుసుకోవడానికి నీటికికొంతఎత్తులో రుద్రాక్షను అరచేతిలోవుంచిచూస్తే అది సవ్య(Anti clock)దిశలో తిరుగుతుంది. మంచినీరుకాకపోతే అపసవ్యదిశలో తిరుగుతుంది. ఇలావారు మంచినీటిని గుర్తించి త్రాగేవారు. అనుమానం వచ్చినప్పుడు ఆహారంవిషయంలోకూడా వారు యిలానేచేసి తెలుసుకొనేవారు. ఈపద్దతి మనంకూడా పాటించి జలాన్నాలను తీసుకోవచ్చు. తద్వార విషతుల్యమైన అన్నపానీయాలను(Food poisioning)గుర్తించి జాగ్రత్తపడవచ్చును.

 ఇక అఖరుగా రుద్రాక్ష ధరించువారు పాటించవలసిన కొన్నినియమాలను తెలుసుకొందాం అవి...

 1. మైలపడిన స్త్రీపురుషులనూ, ప్రసవస్త్రీకి స్నానంచేయించువరకు తాకరాదు.

2. శవయాత్రలోపాల్గొనుట, శవమునుత్రాకుట, స్మశానమునకువెళ్ళుట చేయరాదు.

3. ఎవరి రుద్రాక్షమాల వారే ధరించాలి. ఒకరిదిఒకరు ధరించరాదు.

4. రుద్రాక్షధరించి నిద్రించరాదు. నిద్రించుటకుముందు పూజగృహమందుంచవలెను.

5. రుద్రాక్షను ఉంగరములోపొదిగించుకొని ధరించరాదు.

6. రుద్రాక్షధరించి శృంగారములోపాల్గొనరాదు.

7. మధుమాంసాదులు రుద్రాక్షధరించి ముట్టారాదు.

 ఏదియేమైనా హైందవంలోని కర్మసిద్ధాంతమును నూటికినూరుపాళ్ళు నమ్మి సర్వత్రాసర్వకాలసర్వావస్థలందునూ భగవంతుడు నిత్యుడనినమ్మి, శరణుజొచ్చి, సర్వమూ భగవదిచ్ఛకువదిలి, ఏదిజరిగినా తనమేలునకేననీ, భగవదిచ్ఛానుసారమే అంత్యయూ జరుగుచున్నదనితలచి జీవించువారికి దేనిసహాయముగాని, ఏనియమముగానీ అవసరములేదనుట నిక్కము. ఇటువంటి నిష్కామకర్మయోగుల ధ్యానమునకు రుద్రాక్షధారణ, ప్రశాంతతనొసగి వారిసాయుజ్యమునకు తోడ్పడునని ఆధ్యాత్మవిదుల బోధ.

ఓం తత్ సత్

 


 

             

 



 

Saturday, 1 January 2022

శంఖం

 

శంఖం


                  శ్లో:  శంఖం చంద్రార్క దైవతం

                        మధ్యే వరుణదేవతాం

                        పృష్టే ప్రజాపతిం వింద్యాత్

                        అగ్రే గంగా సరస్వతీమ్   //


క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితోపాటు ఉద్భవమైనది శంఖం. సముద్రంనుండి పుట్టిన పదునాలుగు రత్నములలో యిదీ ఒకటి. ఇది సాక్షాత్తు లక్ష్మీదేవి తోబుట్టువు గనుక సంపదకారిణి, అరిష్టనివారిణి, వాస్తుదోషపరిహారిణి. కనుకనే శంఖాన్ని కోవెలలలో, పూజాగదుల్లోను వుంచి పూజిస్తారు. యజ్ఞయాగాది క్రతువుల్లో, పర్వదినాల్లో, రాజ్యాభిషేకాల్లో యుద్ధారంభ సమయాల్లో శంఖనాదం చేస్తారు. జంగందేవరలు బిక్షాటనసమయాల్లో ప్రతియింటిముందు శంఖనాదం చేస్తారు. హైందవులు దీనిని నవనిధుల్లో ఒకటిగాను, శుభసూచకంగానూ భావిస్తారు. పితృతర్పణ సమయాల్లోనూ శఖనాదం చేయటం పరిపాటి. హరిహరాదులచేతుల్లోనూ శంఖం విరాజమానమై వుంటుంది. దుకాణాలల్లో, కర్మాగారాల్లో, కార్యాలయాల్లో కూడా శంఖపూజలు నిర్వర్తిస్తారు. అష్టసిద్ధులకై ప్రయత్నించేవారు శంఖనాదం విశేషంగా చేస్తారు. అందువల్ల షడ్చక్రాలు శుద్ధిగావింపబడి ఫలితం శీఘ్రగతిన ప్రాప్తిస్తుందని వారి విశ్వాసం.

బ్రహ్మవైవర్తపురాణంలో శంఖంపుట్టుక గురించి మరోవిధంగా చెప్పబడింది. తులసిభర్త తపస్సుచేసి బ్రహ్మదేవుని మెప్పించి కృష్ణకవచం వరంగా పొందుతాడు. దాంతో అతడజేయుడై స్వర్గాన్నీ జయిస్తాడు. ఇంద్రుడు శంకరుని ప్రార్ధిస్తాడు. శంకరుడు అతన్నేమీ చేయలేడు. విష్ణువు బ్రాహ్మణవేషంలో వెళ్ళి కృష్ణకవచాన్ని దానంగా స్వీకరిస్తాడు. ఇదేఅదనుగా శివుడు తులసిభర్తను వధించి సముద్రంలో పడేస్తాడు. తులసి తన పాతీవ్రత్యమహిమతో భర్తను శంఖంగా మార్చేసిందట. అతడు శంఖచూడుడుగా ప్రసిద్ధికెక్కాడు.

శంఖాలలో అనేకరకాలున్నాయి. అన్నింటిలో దక్షిణావృతశంఖం ప్రశస్తమైనది. దీన్నీ ఎడమచేత్తో పట్టుకొని వాయిస్తారు. దీన్ని ముఖ్యంగా పూజించడానికే ఉపయోగిస్తారు. అదే ఉత్తరావృతశంఖమైతే వాయించటానికి ఉపయోగిస్తారు. మధ్యావృతశంఖాలు కూడా వుంటాయి. వీటికి నోరు మధ్యలో వుంటుంది. ఇంకా ఆకారలనుబట్టి లక్ష్మీ, గోముఖ, వినాయక, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని ,రాహూ,కేతు, కూర్మ, వరాహశంఖాలుగా గుర్తిస్తారు. శనిశంఖానికి నోరుపెద్దది పొట్టచిన్నదిగా వుంటుంది. రాహుకేతుశంఖాలు సర్పాకారంలో వుంటాయి.  రాక్షసశంఖంపైన ముళ్ళుంటాయి. వినాయకశంఖానికి తొండాలుంటాయి. ఈ వినాయకశంఖంలో నీరునింపి గర్భవతులకు తాపిస్తే అంగవైకల్యం లేని బిడ్డలు కలుగుతారు.

కూర్మపీఠంపై అరుణవర్ణపు వస్త్రం పరచి దానిపై దక్షిణావృతశంఖం వుంచి పూజించి, మరొక ఉత్తరావృతశంఖం పూరించి, శంఖంలో గంగాజలం, కపిలగోక్షీరం తేనే, నెయ్యి, బెల్లంకలిపిననీరు పోసి పూజానంతరం తీర్థంగా సేవించటం అత్యంతశ్రేయస్కరమని భావిస్తారు. శంఖంలో శుద్ధజలంపోసి, ఆనీళ్లు ఇల్లంతా చల్లితే, వాస్తుదోషలు పోతాయి. "శంఖంలో పోస్తేనే తీర్ఠం" అన్న నానుడి మనందరమెఱిగినదే.  ఏకట్టడమైనా తొలుత కొంతమట్టిని తీసి పసుపునీళ్ళుచల్లి శంఖము నుంచి పూజచేసి  పనిమొదలుపెడతారు. దీన్నే శంకుస్థాపన మంటారు. దీనివల్ల కట్టడం నిరాటంకంగా సాగి  క్షేమకరంగ వుంటుందని హైందవుల నమ్మకం. పూరీజగన్నాథ రథయాత్రను శంఖక్షేత్రయాత్ర అనికూడ పిలుస్తారు, ఇది ఆ పవిత్రక్షేత్ర చిహ్నంగా భావిస్తారు. 

మహాభారతయుద్ధారంభంలో శ్రీకృష్ణపరమాత్మతోసహా వీరాధివీరులందరూ వారివారి శంఖాలను పూరించారు. వారు పూరించిన శంఖాలకు వేరువేరు పేర్లున్నాయి. ఆ శంఖనాదాలకు శత్రువుల గుండెల్లో దడపుట్టేదట. శ్రీకృష్ణుడు పాంచజన్యం, ధర్మరాజు అనంతవిజయం, భీముడు పౌండ్రకం, అర్జునుడు దేవదత్తం, నకులుడు సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం, కాశీరాజు శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటరాజు సాత్వికమనే శంఖాలతో రణభూమిని భయానకంగావించారట.

ఈశంఖాలు మనకెక్కువగా రామేశ్వరం, కలకత్తా, విశాఖపట్నం, చెన్నై, కన్యాకుమారి, ముంబాయ్, పూరి, మానససరోవర్, కోరమాండల్, శ్రీలంక, ప్రాంతాల్లో లభిస్తున్నాయి. శంఖం నత్తజాతికిచెందిన సముద్రప్రాణి రక్షణకవచం. ఈప్రాణి ముఖ్యంగా ఇసుకమేటవేసిన ఉష్ణప్రాంత సముద్రగర్భంలో జీవిస్తాయి. శంఖనాదానికి క్రిమికీటకాదులు నశిస్తాయని 1929 లో బెర్లిన్ యూనివర్సిటీ నిర్ధారించింది. 2600  అడుగుల దూరంలోగల క్రిములు శంఖనాదానికి స్పృహదప్పిపోయాయట. శంఖనాదంతో శుభశక్తిప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జిటిక్ వేవ్స్) ప్రసారమౌతాయట. అసలు శంఖం (శం+ఖం) ఆంటే అర్థం ప్రశస్తజలం. శంఖంలో నింపినజలం త్రాగడం వల్లనూ, శరీరంపై రుద్దడం వల్లనూ చర్మవ్యాధులు బాగౌతాయి. శంఖం ముఖంపై సున్నితంగా రుద్దడం వల్ల ముడతలుపోయి అందంగా మారుతుంది. ఆయుర్వేదంలో శంఖభస్మం చాలా ఉపయోగకారికా చెప్పబడింది. ముఖ్యంగా కుక్షిశూలకు యిది మంచి మందు. శంఖంలో క్యాల్సియం మెగ్నీషియం సమృద్ధిగా వుంటాయి. అందువల్ల మందుల తయారీలో దీని ఉపయోగం మెండు.

వైజ్ఞానికశాస్త్రపరంగా చూస్తే శంఖం ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. సముద్రజలాల్లో నివసించే గాస్ట్రోపోడా తరగతికిచెందిన స్ట్రాంబిడే కుటుంబంలోని స్ట్రాంబస్‍ప్రజాతికిచెందిన జీవియిది. స్ట్రాంబస్‍గిగాస్ శంఖాలనుండి ఖరీదైన ముత్యాలు లభిస్తాయి. శంఖం చెవిదగ్గర పెట్టుకొని వింటే ఓంకారనాదం వినబడుతుంది. ప్రముఖ భారతీయశాస్త్రవేత్త జగధీష్‍చంద్రబోస్ కూడా యీశంఖ విశిష్టతను తెలియజేయడం గమనార్హం. శంఖాలు మనకు గోదుమగింజంత ప్రమాణంనుండి ఐదుకిలోల బరువుగల పెద్దపెద్ద ఆకారాలలోకూడా లభిస్తాయి. శంఖం వల్లకలిగే శుభాలను దృష్టిలో వుంచుకొని చాలా సంస్థలు వాటి లోగోలలో శంఖంగుర్తును చిత్రీకరించుకుంటున్నాయి. ఉదాహరణకు కేరళ ట్రావెంకోర్‍రాజుల రాజముద్రికలో శంఖంచిహ్నముంది. ఒడిస్సారాష్ట్ర విషూజనతాదళ్ ఎన్నికలచిహ్నం శంఖం. ఈ శంఖంలోని నత్తలను కొన్నిజాతులవారు ఆహారంగా వండుకొని తింటారు కూడా. మొత్తంమీద బహుళ ప్రయోజనకారి యీ శంఖం.

 

          సముద్రతనయాయ విద్మహే 

శంఖరాజాయ ధీమహీ

             తన్నో శంఖ ప్రచోదయాత్ // 

 

 

 

Friday, 17 December 2021

సాలగ్రామం

 

సాలగ్రామం



సాలగ్రామం దేవీభాగవతంప్రకారం విష్ణుప్రతీకమైన ఒక శిలావిశేషం. హైందవులు దీనిని తులసి,శంఖం తో సమానంగా పూజిస్తారు. ఈ సాలగ్రామాలు నేపాల్‍దేశపు రాజధాని ఖాట్మండుకు 192 మైళ్ళదూరంలో ప్రవహిస్తున్న గండకీనదిలో లభిస్తాయి. నదినానికొనియున్న సాలగ్రామగిరిపై కూడా యివి దొరుకుతాయి. నదిలో దొరికేవాటిని జలజాలని, గిరిపై దొరికేవాటిని స్థలజాలని అంటారు. వీటి మహాత్మ్యాన్ని క్రీ.పూ  ఆపస్తంబుడు డనే మహనీయుడు తెలియజేసియున్నాడు. సాలగ్రామంచుట్టూ సానుకూల శక్తిప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జిటిక్ వేవ్స్) నిత్యం సజీవంగావుంటాయని పెద్దల అభిప్రాయం. అందుకే వీటిని దేవతామూర్తులను నిర్మించటానికి ఉపయోగిస్తారు. హైందవంలోని అద్వైత, ద్వైత, విశిష్టాద్వైతాల శాఖల వారందరూ వారివారి దేవతామూర్తులను సాలగ్రామాలతో చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఆలయాలలోనూ, గృహాలలోనూ కూడా సాలగ్రామవిగ్రహం పూజలందుకుంటుంది. మణి, స్వర్ణ, శిలావిగ్రహాలకు ఆవాహనాది షోడశోపచారాలు అవసరమౌతాయి. కానీ సాలగ్రామప్రతిమలకు వాటిఅవసరంవుండదు. అవి సర్వదా దైవశక్తిపూరితాలు. ఈ సాలగ్రామాలవెనుక కొన్ని పురాణగాథలు కూడా ఉన్నాయి.

 చతుర్ముఖబ్రహ్మ తన సృష్టిలో ద్రోళ్ళిన తప్పులనుగూర్చి పరితపించాడట. ఆ పరితాపం దుఃఖంగామారి  ఆయన నయనాలనుండి నాలుగుఅశ్రువులు రాలాయి. ఆ అశ్రుజలాలే గండకీనదిగా మారింది. గండకీనదీ స్నానంవల్ల జనులు పుణ్యాత్ములై బ్రహ్మసృష్టి సవరింపబడుతూ వచ్చిందట. మరోకథలో జలంధరుడనే లోకకంటకుడు అతనిభార్య బృంద పాతివ్రత్యమహిమ వల్ల అజేయుడై మరణంలేనివాడయ్యాడట. అతన్ని అంతమొందించటం శివునివల్లకూడా కాలేదు. విష్ణువు అతని అజేయత్వానికి కారణం అతని భార్యబృంద పాతీవ్రత్యమని గ్రహించి, జలంధరునిరూపంలో వెళ్ళి బృందపాతీవ్రత్యాన్ని భంగపరిచాడు. అదే అదనుగా శివుడు జలంధరుని వధించాడు. విషయంతెలిసి బృంద విష్ణువును శిలగామారమని శపించింది. విష్ణువు గండకీనదిలోని సాలగ్రామంగామారి కలియుగజనులచే పూజలందుకొని మోక్షం ప్రసాదుస్తున్నాడనీ, విష్ణువు బృందశాపం పొందికూడా ఆమె తులసిగా రూపాంతరంచెంది పూజలందుకుంటుందని వరమిచ్చాడట. అందుకే తులసి, సాలగ్రామం పూజార్హతపొందాయి. మరోకథప్రకారం గండకీ అనునది ఒకవేశ్య పేరు. ఆమెదొక చిత్రాతిచిత్రమైన పవిత్రగాథ.

 గండకీ (ప్రియంవద) జన్మతః ఒక అందమైన వేశ్య. తనవృత్తిధర్మాన్ని పవిత్రభావంతో ఆచరిస్తూ కాలంగడిపేది. వృత్తిధర్మం ప్రకారం, ఎవరితో యేదినం ఒప్పందం కుదుర్చుకుంటుందో అతన్నే ఆరోజంతా తనభర్తగా భావించి నిండుహృదయంతో సేవించేది. ధనాశతో దుర్మార్గులను, దూర్తులను దరిచేరనిచ్చేదికాదు. ఈమె కులధర్మాచరణనూ, సద్బుద్ధిని పరీక్షింపనెంచి విష్ణువే ఒకదినం ఆమెవద్దకు విటునిగా విచ్చేశాడు. గండకీ ఆదినం ఆయన్నే భర్తగాభావించి సేవచేయడం ప్రారంభించింది. విష్ణువు తనశరీరంనిండా పుండ్లుకనబరచాడు. అయినా ఆమె అసహ్యించుకోలేదు. స్నానపానాదులు చక్కగాచేయించి రాత్రి కి తనశయ్యపై చేర్చుకొన్నది. కానీ రాత్రంతా జ్వరంగావున్నట్లు కనిపించాడు విష్ణువు. అయినా విడిచివెళ్ళలేదు గండకి. ఉదయనికల్లా ఆ మాయావిటుడు మరణించాడు. గండకీ ధర్మానుసారం ఇతడే యీనాటి నాభర్త అని అందరికీ తెలియజేసి, అతనితో సతీసహగమనానికి పూనుకొంది. ఎంతచెప్పినా, ఎందరు వారించినా వినలేదు. అగ్నిప్రవేశం చేసేసింది. మహావిష్ణువు ప్రసన్నుడై ఆమెను వరంకోరుకోమన్నాడు. గండకీ తన గర్భవాసంలో హరి మాటిమాటికీ జన్మించేవరం కోరుకొన్నది. ఆమే గండకీనదిగా మారింది. అందులో సాలగ్రామాలు పుడుతూనేవున్నాయి. ఆ సాలగ్రామాలు సాక్షాత్తు విష్ణురూపాలు.  సాలగ్రామాలు రకరకాలుగావుంటాయి. వాటిలోకొన్ని సౌమ్యం మరికొన్ని ఉగ్రం. చక్రశుద్ధి, వక్రశుద్ధి, శిలాశుద్ధి, వర్ణశుద్ధి గల సాలగ్రామాలు పూజకు ఉపయోగిస్తారు. వివిధరూపాల్లోను వివిధరంగుల్లోను సాలగ్రామాలు లభిస్తాయి. ఆకార వర్ణాలనుబట్టి వాటిగుణాలను నిర్ణయిస్తారు. తెల్లనివి సర్వపాపహరం. పసుపుపచ్చనివి సంతానభాగ్యదాయకం . నీలం  సర్వసంపదకారకం. ఎరుపు రోగకారకం. వక్రం దారిద్ర్యకరం. నలుపురంగులోవుండి చక్రంకలిగి, చక్రంమధ్య ఉబ్బివుండి ఒకపొడవాటిరేఖ వుంటే అది ఆదినారాయణం. తెల్లగావుండి, రంధ్రంగలిగి, రంధ్రం వైపున రెండుచక్రాలు ఒకదానితోఒకటి కలిసిపోయివుంటే అది వాసుదేవం. గుండ్రని పసుపుపచ్చనిదై రంధ్రంగలిగి, రంధ్రంవైపు మూడురేఖలుండి, పద్మచిహ్నం పైముఖంగా వుంటే అది అనిరుద్ధం. ఇవి బహుదా క్షేమకరములు. కపిలవర్ణంగలిగి పెద్దచక్రం వుంటే నరసింహం అంటారు. దీన్ని బ్రహ్మచర్యదీక్షతో పూజించుకోవాలి. బంగారురంగులో వుండి పొడవుగా మూడుబిందువులో వుంటే అది మత్స్యమూర్తి. ఇది ముక్తిప్రదాయిని, సంపదకారి. నల్లని మెఱుపుతో ఎడమన గదాచక్రాలు, కుడివైపు రేఖ వుంటే అది సుదర్శనమూర్తి. ఇది శత్రుబాధానివారిణి. అనేకరంగులతో అనేకచక్రాలు పద్మాలతో రేఖలతోగూడివుంటే అది అనతమూర్తి. ఇది సకలాభీష్టప్రదాయిని. మూడుముఖాలు ఆరుచక్రాలుగలిగి నేరేడుపండుఆకారంలో వుంటే అది షట్చక్రసీతారామం. ఇది దొరకడం కష్టం. చాలాఅరుదు. ఇది మహామహిమాన్వితం.

సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరి. అదికూడా అనుదినం ఒకే రకమైన నైవేద్యనివేదన జరగాలి. అందుకే చాలామంది అతిసులువైనది గనుక జలంనివేదిస్తారు. ప్రయాణాలలోకూడా వెంటతీసుకొనివెళ్ళి క్రమంతప్పకుండా పూజాదికాలు నిర్వర్తించి నైవేద్యం సమర్పిస్తారు. మరీ అంతకూ వీలుగాని పక్షంలో జాగ్రత్తగా పూజాదికాలు జరిగే దేవాలయంలో వుంచి వెళతారు. నైవేద్యం మార్పువల్ల జరిగే అనర్థానికి సంబంధించిన ఒకకథ వుంది. అదికూడవిందాం--  

సరైనవ్యాపారం జరగని ఒక మాంసందుకాణందారుడు నదిలో ఒకనల్లని నున్ననిరాయి దొరికితే, ఆందంగా బాగుందని తీసుకవచ్చి తనగల్లాపెట్టెలో పెట్టుకున్నాడు. అది సాలగ్రామం. దాన్ని మాంసంతాకిన చేతులతో తాకడంవల్ల ఆ సాలగ్రామం తనకు తగిలిన మాంసాన్నే  నైవేద్యంగా స్వీకరించి ఆ మాంసంవ్యాపారిని సంపన్నునిచేసింది. ఇదంతా ఒక పండితుడు జాగ్రత్తగా గమనించి, సాలగ్రామాన్ని దొంగిలించి తనయింట మంచిమంచి నైవేద్యాలు సమర్పించి పూజించాడు. కానీ నైవేద్యం మారడంవల్ల అతనికి దరిద్రంచుట్టుకొని కష్టాలపాలయ్యాడు. ఇది యెంతవరకు నిజమోగానీ కథమాత్రం ప్రచారంలో వుంది.

 శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం సాలగ్రామం ఒకశిలాజం. ఒకవిధమైన జలచరం దీనిని నిర్మిస్తుంది. ఇందులో "అమోనైట్" వుంటుంది. "అలి" అనే చేప శీతాకాలంలో ఒకవిధమైన రసాయనికపదార్తం విడుదలచేస్తుంది. అది ఆ చేప కవచంగా మారుతుంది. ఈ కవచమే

 సాలగ్రామం అని కొందరి అభిప్రాయం. భారతసముద్రజలాల్లో నివసించే టెడైన్ అనే ప్రాణివల్లగూడా సాలగ్రామం తయారౌతుందని కొందరంటారు. శంఖంవలెనే ఒకప్రాణి విడచిన గట్టిపదార్తమేగానీ నిజంగా సాలగ్రామం శిల (రాయి) కాదని చాలామంది అభిప్రాయం. ఇదే నిజంకావచ్చు, గానీ సాలగ్రామంనుండి సానుకూలప్రకంపనలు (Positive energetic waves)   వస్తూవుంటాయని, అవి మన ఆలోచనలను క్రమబద్ధంచేసి ఉత్సాహానిస్తాయని, ఇది తమ అనుభవమని అనేకమంది చెప్పడం గమనార్హం.   

  

 

 

Friday, 3 September 2021

 

 

భార్యాబాధితుడు - ఉద్దాలకుడు


 Who was Uddalaka Aruni? – Part Three | sreenivasarao's blogs

 ప్రపంచంలో పురుషాహంకారం మిక్కుటంగానేవుంది. ఒప్పుకుంటాం. భర్తలచే పీడింపబడే భార్యలు, అత్యాచారాలకు బలౌతున్న స్త్రీలు, అందునా బాలికలగురించి కూడా ఎక్కువగానే వింటున్నాం. ఇది నిజంగా విచారించదగ్గ విషయమే. అట్లని భార్యలచేత బాధింపబడే భర్తలే లేరని మాత్రం అనలేము. ఈ విషయం మన టీవీసీరియళ్ళు చూస్తే బాగా అర్థమైపోతుంది. అప్పట్లో సీనీనటి సూర్యకాంతంగారి నటనను చూచిన వాళ్ళకు ఇక వేరుగా చెప్పవలసిన అవసరమేలేదు. ఈవిషయాన్నే యోగివేమన తనజీవితానుభవాన్ని రంగరించి--

 

//వె// చెప్పులోనిఱాయి చెవిలోనిజోరీగ

                  కంటిలోనినలుసు కాలిముల్లు

                  ఇంటిలోనిపోరు ఇంతింతగాదయా

                 విశ్వదభిరామ వినుర వేమ .               ---   అన్నారు.

 

"ఇంటిలోనిపోరు" అంటే భార్యా కలహమే! అంతేగదామరి! ఈ విషయాన్ని తెలియజేసే ఒకకథ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచించిన "జైమినీభారతం" లో వుంది. ఆయన "శిలామోక్షణఘట్టం" అన్న మకుటంబెట్టి కథవ్రాశారు. పురాణకథ గదా! అందుకే ఒకసారి చూద్దాం-

 

అది వింధ్యాటవీ ప్రాంతం. కౌండిన్యమహర్షి శిష్యులలో ఉద్దలకుడనే ముని వుండేవాడు. అతడు వివాహముజేసుకొని గృహస్థాశ్రమ జీవితం గడపాలనుకున్నాడు. గురువుకూడా దానికనుమతిస్తూ, శిష్యా! గృహస్థుగా తరించినవారెందరో వున్నారు. గృహస్థే అందరికీ ఆధారం. అన్నదాత. సాంసారికజీవనంలోని ఒడిదుడుకులను ప్రశాంతంగా భరిస్తూ, నిజాయితీగా జీవించడం గొప్పతపస్సు. గృహస్థజీవనంలో పతనానికిచేర్చే జారుడుమెట్లు ఎక్కువ, కనుక జాగ్రత్తగా మెలుగు. శుభం. అనిదీవించి పంపాడు. ఉద్దలకుడు ఒకశుభముహూర్తాన చండిక అనే కన్యను పెండ్లాడి సాంసారికజీవనం ప్రారంభించాడు. అంతే! అంతటితో అతని సుఖసంతోషాలు హరించుకపోయాయి. భార్య, యితడేదిచెప్పినా కాదనటం అలవాటుగా మార్చుకొంది. అరి అంటే తిరి అనసాగింది. ఉద్దాలకుని సహనానికి ఒక పరీక్షగా మారిపోయింది. ఇక అతడు భరించలేక గురువునాశ్రయించాడు. ఆయన ఉద్దాలకుని కష్టమంతావిని, శిష్యా! నీ భార్యసహచర్యంలో ఇప్పటికే నీవు చాలా సహనాన్ని అలవరచుకున్నావు. అదినీకు కలిగినమేలు, మరచిపోవద్దు. అయినా నీవు చాలా అలసిపోయవు. ప్రస్తుతం నీకు కొంతస్వాంతశ్శాంతి కలగటానికి ఒక సులువైన మార్గం చెబుతాను విను, నీకేది ఇష్టమో అది నాకవసరంలేదనీ, నీవు చెయ్యాలనుకున్నది చేయననీ, నీ భార్యతో చెప్పు. ఆమె నీకెలగూ విరుద్ధంగా మాట్లాడుతుంది గాబట్టి, నీపనులు నీవనుకున్నట్లు చేసుకోవచ్చు. ఇక నీకేయిబ్బంది వుండదు. ఈదినంనుండే నేనుచెప్పినట్లు చెయ్యి. పదిదినాల తర్వాత నేనే మీయింటికొస్తాను. పరిస్థితులు గమనించి, ఇంకా యేమైనా చేయాల్సివస్తే, అప్పుడాలోచిద్దాం. ఇకనీవు వెళ్ళిరా! అన్నాడు.

 

గురువుచెప్పిన కిటుకు ఫలించింది. భార్య తనపనులకు అడ్డుపడని రీతిలో దినాలు దడుస్తున్నాయి. ఇక గురువు రేపటిదినమే తనయిల్లు సందర్శిస్తారు. గురువుగారిని ఘనంగా సన్మానించి గౌరవప్రదంగా చూసుకోవాలనుకున్నాడు. భార్యను పిలిచి ప్రియసఖీ చండికా! రేపు మాగురువు మనయింటికొస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా గౌరవమర్యాదలేమీ నేను చేయదలచుకోలేదు. వస్తూనే యెదోఒకటి చెప్పి పంపించేస్తాను. నువ్వుకూడా ముబావంగా వుండిపో అన్నాడు. వెంటనే చండిక అదేంమాట రాకరాక మీగురువు అదేపనిగా మనింటికొస్తే గౌరవించకుండావుండాలా? కుదరదు. ఆయన్ను గొప్పగా గౌరవించాల్సిందే, విందుభోజనం పెట్టాల్సిందే నన్నది. నీయిష్టం నేను చెప్పాల్సింది చెప్పానని ఊరకుండిపోయాడు ఉద్దాలకుదు. గురువు రావదమూ సకలమర్యాదలూ సజావుగా సాగిపోవడమూ ఉద్దాలకుడు లోలోపల ఆనందపడిపోవడమూ జరిగిపోయాయి. గురువును ఆశ్రమానికి సాగనంపుతూ మంచి ఉపాయం చెప్పినందుకు ఉద్దాలకుడు దారిలో గురువుగారికి మరీమరీ ధన్యవాదాలు తెలిపాడు.

 

కాలం సజావుగా గడవసాగింది. ఉద్దాలకుడు తన పితరులకు శ్రాద్ధకర్మ జరుపవలసిన తద్దినం తిధి వచ్చింది. సరే! భార్యనుపిలిచి రేపు మాతండ్రి తద్ధినం. ఆ కార్యక్రమాలేవీ నేనుచెయ్యను. బ్రాహ్మణులకు భోజనాలూగీజనాలూ పెట్టదలచుకోలేదు. అంతా దండుగ అన్నాడు. అలా అనడంతగదు. రేపు శ్రాద్ధకర్మ సక్రమంగా జరపాల్సిందే. సద్బ్రాహ్మణులనే పిలవండి. దక్షిణమిగులుతుందని ఎవరినంటేవారిని పిలవకండి. గొప్ప పండితప్రకాండులనే పిలవండి. పిండివంటలుకూడా కాస్తా ఎక్కువేచేద్దాం. వెళ్ళి సంబారాలు సమకూర్చండి. అంటూ తొందరపెట్టింది. ఉద్దాలకుడు సంతోషంతో తలమునకలైపోయాడు. తనమనసులో యేమనుకున్నాడో అదంతా సక్రమంగా జరిపించేశాడు. ఇక పారణచేసి పార్వణాన్ని(పిండాలను) జలధిలో కలపాలి. సంతోషంలోమునిగిపోయివున్న ఉద్దాలకుడు. కాస్తా ఆదమరచి, భార్యతో చండికా! శ్రాద్ధకర్మ నీసహకారంతో చాలా చక్కగా జరిగింది, ఇక పార్వణాన్ని పవిత్రజలాలో నిమజ్జనం చేసివస్తే కార్యక్రమం సంపూర్ణమౌతుంది అన్నాడు. అంతే! అన్నదేతడవుగా చండిక పిండాలను తీసుకొనిపోయి పెంటకుప్పలో పడేసింది. ఇంత చక్కగా జరిగిన శ్రాద్ధకర్మ కడకు పెంటకుప్పపాలైనందుకు ఉద్దాలకుడు అగ్రహోదగ్రుడయ్యాడు. చండికా! నీవెంత కఠినురాలవే. నీవేమాత్రమూ క్షమార్హురాలవుకావు. బండరాయివై పోదువుగాక! అని శపించేశాడు.  తనుచేసిన దుష్కృత్యాలేమిటో అప్పటికిగానీ అర్థముకాలేదు చండికకు. వెంటనే భర్తకాళ్ళపైబడి శాపవిముక్తికై ప్రాధేయపడింది. ఉద్దాలకుడు శాంతించి, ఆనందములో తనభార్య మనస్తత్వాన్ని మరచి వక్రమముగాగాక సక్రమముగా భార్యతో మాట్లాడినందుననే యింత అనర్థము జరిగినదని గ్రహించి, భార్యను క్షమించి, చండికా! నరనారాయణులు భూమిపై అర్జునకృష్ణులుగా అవతరిస్తారు. వారిలో అర్జునుని స్పర్శతో నీకు శాపవిముక్తి గలిగి తిరిగీ నన్ను చేరుకుంటావని శాపవిముక్తి తెలిపి, తపమాచరించటానికి వెళ్ళిపోయాడు.

 

మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు అశ్వమేధయాగం తలపెట్టాడు. అశ్వరక్షకునిగా అర్జునుడు వెళ్ళాడు. ఆసమయంలో ఒకచోట అశ్వం శిలకు అతుక్కపోయింది. సైనికులు ఎంతప్రయత్నించినా ఆరాతి నుండి అశ్వాన్ని విడదీయలేకపోయారు. అర్జునుడు దిగులుజెంది దగ్గరలోనున్న సౌబరిమహర్షి ఆశ్రమంచేరుకొని, మహర్షికి నమస్కరించి, యాగాశ్వం రాతికి అతుక్కున్న విషయం వివరించి, అశ్వంవిడివచ్చే ఉపాయం తెలుపవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడా మహర్షి తనదివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, అర్జునునకు ఉద్దాలకచండికల వృత్తాంతం వినిపించి, ఆశిల శాపగ్రస్తురాలయిన చండికయని తెలిపి, వెళ్ళి అర్జునా ఆశిలను నీచేతులతో తాకు. శుభం జరుగుతుందన్నాడు. ఆర్జునుని స్పర్శతో శిల అశ్వాన్ని వదిలేసి చండికగా మారిపోయింది. ఉద్దాలకుడుకుడా వెంటనే అక్కడకు వచ్చిచేరాడు. అర్జునుడు వారికి నమస్కరించి ఆశీర్వాదములుపొంది, ఆశ్వంతోపాటు దానిరక్షణకై ముందుకు కదిలాడు. ఉద్దాలకచండికలు తదనంతరం జీవితం సుఖమయంగా గడిపి, పుణ్యకార్యాలాచరించి, తరించారు.          

       

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...