Saturday, 29 April 2023

బిల్వం (మారేడు),

బిల్వం(మారేడు)

 

 హిందూమతంలో శివపూజకు బిల్వపత్రం అత్యంతముఖ్యమైనది. సంస్కృతంలో దీనిని శ్రీఫలం, మాలూర, శైలూష, అనే నామాలుకూడా వున్నాయి. బిల్వవృక్షాన్ని శివస్వరూపంగా భావిస్తారు. మరికొందరు శివుడు బిల్వవృక్షంక్రింద నివాసముంటాడంటారు. సర్వసామాన్యమైన మారేడు ఆకులు ఒకేకాడకు మూడుంటాయి. కుడిఆకున విష్ణువు ఎడమఆకున బ్రహ్మ నడిమిఆకున శివుడు వుంటాడంటారు. మరికొందరు యీఆకులు శివుని త్రిశూలానికి ప్రతీకగా భావిస్తారు. ఇంకొందరు శివుని త్రినేత్రములకు ప్రతీక అంటారు. ఆకు ముందుబాగంలో అమృతము వెనుకభాగంలో యక్షులు వుంటారని కొందరు నమ్ముతారు. శివపురాణంలో ఒక కథవున్నది. శని ఒకనాడు కైలాసంవెల్లి శివునిదర్శించి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడైనాడు. అయినా శనిని పరీక్షింపనెంచి శివుడు నన్ను పట్టగలవా? అన్నాడు. శని, స్వామీ మీరే అడిగితే కాదంటానా? రేపు ఉదయమునుండి సాయంత్రందాక పట్టివుంచుతానన్నాదు. శివుడు తప్పించుకోదలచి మారేడువృక్షంలో ఇమొడిపోయాడు. సాయంత్రం చెట్టునుండి బయటకువచ్చి, శనీ! నన్ను పట్టలేకపోయావుగదా? అన్నాడు. లేదుశివా! నేనుపట్టబట్టే ఆదిదేవులైన తమరు దినమంతా దాక్కోవలసి వచ్చింది అన్నాడు శని. శివుడు వాస్తవం గ్రహించి, శనియొక్క కర్తవ్యనిర్వహణను మెచ్చుకొని దినమంతా నాలోవుండి నన్నుపట్టివుంచితివి గనుక నేటినుండి నీవు శనీశ్వర నామంతో వెలుగొందుతావని వరమిచ్చిపంపాడు. ఆదినమునుండి బిల్వపత్రములతో నన్ను పూజించినవారికి శనిగ్రహదోషం పీడించదని హరుడు లోకములకు అభయమిచ్చినాడు. మరొకకథలో  హరుడు సతీవియోగముతో విరాగియై, బిల్వవృక్షముక్రింద తపముచేయుచుండెను. పార్వతీదేవి శివునిపై ప్రేమతో ప్రతిదినం శివపూజచేయుచుండెను. ఒకరోజు ఆమె శివపూజకు పూలు మరచి వచ్చెను. అప్పుడామె అందుబాటులోనున్న బిల్వపత్రములతో శివుడు మునిగిపోవునట్లుగా అర్చించెను. శివుడందుకు సంతోషించెను. శివుడు పార్వతిని వివాహమాడుటకు యిదికూడా ఒక కారణమాయెను.  

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వముద్భవమైనదని నమ్మువారున్నారు. అందుకే లక్ష్మిని బిల్వనిలయఅంటారు. బ్రహ్మవర్చస్సు పొందాలనుకున్నవారు, సూర్యుని అనుగ్రహంకొరకు చేసే కామ్యయాగంలో మారేడుకొయ్యను యూపస్తంభంగా నాటుతారు. అశ్వమేధయాగంలో కూడా ఆరు బిల్వయూపస్తంభాలు నాటడం పరిపాటి. బిల్వదళాలను సోమ మంగళవారాల్లోను, ఆరుద్రనక్షత్రంలోనూ, గ్రహణ సమయాల్లోనూ, సంధ్యాసమయాల్లోనూ, రాత్రులందూ, అశౌచదినాల్లోనూ, శివరాత్రి, సంక్రాంతి వంటి పర్వదినాల్లోనూ కోయకూడదు. కనుక ముందురోజే కోసివుంచుకొని పూజకుపయోగించాలి. కాస్తావాడిన దళలైనా పూజకు పనికివస్తాయి. మారేడుదళాలు గాలిని నీటిని పరిశుభ్రపరుస్తాయి. ఇంటి ఆవరణలో బిల్వవృక్షం ఈశాన్యంలోవుంటే ఆపదలు దరిచేరవు. ఐశ్వర్యం వృద్ధియగును. తూర్పునవుంటే సుఖప్రాప్తి. పడమరవుంటే పుత్రసంతానప్రాప్తి. దక్షినానవుంటే యమబాధలుండవు. బిల్వవృక్షమూలాన్ని గంధము పుష్పాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. వృక్షంచుట్టూ దీపాలువెలిగించి నమస్కరిస్తే శివజ్ఞానం కలుగుతుంది. మారేడునీడన ఒకరికి అన్నంపెడితే, కోటిజనానికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. శివభక్తునికి బిల్వవృక్షం క్రింద క్షీరాన్నం ఘృతసహితంగా సమర్పిస్తే, జన్మజన్మాంతరాలలో అన్నానికి కొదువుండదు. బిల్వాష్టకం పేరుతో ఎనిమిది శ్లోకాలున్నాయి. అవి శివునకు చాలా ఇష్టమని నమ్మి పూజలో భాగంగా పఠిస్తారు. అలా ఒక వృక్షంపేర అష్టకం వుండటం ఒక బిల్వానికే చెల్లింది. వినాయకపూజలో ఉపయోగించే, 21 పత్రాలలో మొదటిది మాచిపత్రి రెండవది బిల్వపత్రమే, తర్వాతవరుసగా దుర్వాయుగ్మందత్తూర( ఉమ్మెత్త)   పత్రము, బదరీపత్రం,  అపామార్గపత్రం, తులసిపత్రం, చూత(మామిడి)పత్రం, కరవీర(గన్నేరు)పత్రం, విష్ణుకాంతపత్రం, దాడిమపత్రం, దేవదారుపత్రం, మరువకపత్రి, సిందువారపత్రి, జాజిపత్రి, గండకీపత్రి, శమీపత్రి, ఆశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం, బృహతీపత్రం వుంటాయి.

బిల్వములలో ఆకుస్వరూపాన్నిబట్టి చాలారకాలే వున్నాయి. 1, 3, 4 6 ,7, ఇంకా అనేకదళాలుగలవిగా వుంటాయి.

6 నుండి 21 రేకుల బిల్వపత్రాలతో పూజిస్తే అన్నికార్యాలలో అఖండవిజయం లభిస్తుంది. అలాగే ఏకపత్రబిల్వం సర్వశ్రేష్టమనిభావిస్తారు. వ్యాపారాభివృద్ధికి గల్లాపెట్టెలో బిల్వపత్రముంచుకోవడం ఒక ఆనవాయితీ. అట్లేకొందరు జేబులోకూడా బిల్వపత్రం వేసుకొని బయటకు వెళతారు. ఇంట్లో బిల్వపత్రాలతో పూజచేస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి. త్రిదళం ఉమ్మెత్తపూలు కలిపిపూజచేస్తే చతుర్విధ(ధర్మ,అర్థ,కామ,మోక్ష)పురుషార్థాలు లభిస్తాయి. ఆధ్యాత్మవిధులు సామాన్యముగాదొరికే మారేడు మూడుదళాలు త్రిగుణాలకు(సత్వ,రజస్,తమో గుణాలకు)ప్రతీకగాను, పూజకుడు, పూజ్యము, పూజగానూ స్తోత్రము,స్తుత్యము,స్తుతిగానూ జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానముగానూ భావిస్తారు.అంతేగాక బిల్వోపనిషత్తు అనుపేరున  ఒక ఉపనిషత్తేవున్నది. జైనమత 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు, బిల్వవృక్షంక్రింద తపమాచరించి మోక్షం పొందుటచేత,  జైనమతస్తులుకూడా బిల్వాన్ని శుభప్రదంగా భావిస్తారు.

 మారేడు వెలగజాతివృక్షం. 8 నుండి 10 మీటర్లవరకు పెరుగు తుంది. ఆశియాదేశాలన్నింటిలో అన్నికాలాలలో యిది వృద్ధిచెందుతుంది. ఆకులు, పండ్లగుజ్జు సువాసన గలిగివుంటాయి. కాయ వెలగకాయవలెనే గట్టిగావుంటుంది. పువ్వులు చిన్నవిగా ఆకుపచ్చ తెలుపుకలసిన రంగులో వుంటాయి. ఆయుర్వేదవైద్యంలో యీచెట్టు సర్వాంగాలూ ఉపయోగపడతాయి. సగంమాగిన పండ్లరసం జిగటవిరేచనాలకు, నీళ్ళవిరేచనాలకు మందుగా ఉపయోగిస్తారు. ఆకురసం మధుమేహాన్ని హరిస్తుంది. మారేడువేళ్ళు ఔషదగుణంగల దశమూలాలాలలో (మారేడు,తుందిలం, గుమ్మడి, కలిగట్టు, నెల్లి, ముయ్యాకుపొన్న, కోలపొన్న,వాకుడు, పెద్దములక, పల్లేరు) ఒకటిగా పరిగణిస్తారు. మారేడుగుజ్జు, పాలు, పంచదారకలిపి వేసవిపానీయంగా తయారుచేసుకుంటారు. దీనివల్ల వేసవితాపం తగ్గడమేగాకుండా ప్రేవులను శుభ్రపరచిశక్తినిస్తుంది. పండినపండు విరేచనకారి. సగంపండినఫలం విరేచనాలను నిలుపుతుంది. పండులోని గుజ్జును ఎండబెట్టి పొదిచేసికుడా వాడుకొనవచ్చును. ఇది మొలలకుకూడా బాగా పనికివచ్చేమందు. ఆకుకషాయం పైత్యగుణాలను నయంచేస్తుంది. కడుపులోని గ్యాసును బయటికి పంపుతుంది. ఆకులచిక్కటి కషాయం లో నువ్వులనూనెపోసి నూనెమిగిలేట్లు కాచుకొని మారేడుతైలం తయారుచేసుకోవచ్చు. ఈనూనె తలకు బాగామర్ధనచేసి తలస్నానంచేస్తే, జలుబు,తుమ్ములు తగ్గిపోతాయి. ఆకుకషాయం సేవించడంవల్ల రక్తం శుద్ధిగావించబడుతుంది. తద్వార చర్మరోగాలు నయమౌతాయి. అంతేగాక శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్‌B,C, క్యాల్సియం, భాస్వరం, ఇనుము , కెరోటిన్, కూడా లభించి, ఆరోగ్యం మెఱుగుపడుతుంది. హోమియోవైద్యంలో కూడా మారేడు ఆకులనుండి, పండ్లగుజ్జునుండి రెండురకాల( Aegle Folia, Aegle Marmelos)మందులు తయారౌతున్నాయి. ఇవి మధుమేహం (చెక్కెర వ్యాధి), జిగటవిరేచనాలు, మొలలు వంటి దీర్ఘరోగాలను  నయంచేయడానికి వాడుతున్నారు.


బిల్వాష్టకమ్


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం
 

 

 

 

Friday, 7 April 2023

ఘంటానాదం,Temple Bells

 

ఘంటానాదం

 ఘంటను గంట అనికూడా అంటారు. హైందవపండితులు పూజకు ఉపక్రమించేముందు ఘంటానాదం చేయాలంటారు. " ఆగమార్థంతు దేవానాం, గమనార్థంతు రాక్షసాం, కుర్వాత్‍ఘంటారావంతు తత్ర దేవతాహ్వానం లాంఛనం." దేవతలు ప్రవేశించేందుకు, రాక్షసులు పారిపోయేందుకూ గుర్తుగా ఘంటానాదం లాంఛనంగా చేయాలని దీనర్థం. ఘంట మ్రోగినప్పుడు, శబ్దతరంగాలు పెద్దపెద్ద వృత్తాకారాలలో వెలువడతాయి. ఇవి శక్తిసంపన్నాలు. పూజకనుకూల పరిస్థితుల నేర్పరుస్తాయి. క్రైస్తవులు నూతన సంవత్సరానికాహ్వానంగా పాతసంవత్సరానికి వీడ్కోలుగా చర్చీల్లో గంటలు వాయిస్తారు. మిగిలిన సమయాలలో, సమయసూచికంగా గంటలు కొడతారు. బౌద్ధ, జైన మతాలలోకూడా ఘంటానాద ప్రసక్తి వున్నది. హిందూదేవాలయాలలో ప్రధానద్వారం వద్ద మహాఘంట వ్రేలాడదీసివుంటుంది. ప్రాతఃకాలంలో పూజారి ఆలయప్రవేశం చేయగానే మూడుసార్లు దీన్ని వాయిస్తాడు. ఇది అందరినీ మేల్కొల్పుతుంది. శివాలయాల్లో గంటపై నంది చెక్కబడి వుంటుంది. వైష్ణవలయాల్లోనైతే హనుమ లేక గరుత్మంతుడు చెక్కబడి వుంటుంది. ఈఘంటానాదం అభిషేకసమయాల్లోను, హారతినిచ్చే సమయాల్లోనూ, యజ్ఞోపవీతం వేసేటఫ్ఫుడూ, ధూపంవేసేటప్పుడూ, ఘంటానాదం చేస్తారు. నైవేద్యసమర్పణ సమయాల్లో మాత్రం ఘంటానాదం చెయ్యరు. అలాచేయడం నరకహేతువని శాస్త్రంచెబుతున్నది. " ఘంటానాదంతథా వాద్యం నృత్యం గీతం తదైవచ నైవేద్యకాలేయః రౌరవాద్ నరకంవ్రజేత్."

 ఘంటనాలుకలో సరస్వతీ, ముఖభాగంలో బ్రహ్మ, కడుపుభాగంలో రుద్రుడు, కొసభాగంలో వాసుకి (శివుని మెడలోని సర్పం) ఉంటారని హిందువులు నమ్ముతారు. గంటపిడి భాగంలో ప్రాణశక్తి వుంటుంది. ఘంటలు తయారుచేయడం కూడా ఒకకళ. శబ్దం మృదువుగాను కర్ణపేయంగానూ, వెలువడటానికి శాస్త్రనిర్దేశానుసారం కొన్ని కొలతలుపాటించి తయారుచేస్తారు. నిర్మాణానికి కంచులోహం వాడుతారు. "కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా" అన్న వేమనమాట ఉండనేవున్నది. ఘంటనుండి వెలువడే శబ్దతరంగాలలో ఓంకారనాదం (ప్రణవం) ఉన్నది. ఇది ఆధ్యాత్మిక సారం. సకలశుభాలకూ సంకేతం. చంచలమైన మనస్సును కుదుటపరచి దైవంపై లగ్నమయ్యేట్లు చేస్తుంది. అసలు శబ్దం రెండురకములు. ఒకటి ధ్వని. ఇది ఉత్పన్నమై వెంటనే నిలిచిపోతుంది. రెండు నాదం. ఇది కొంతసమయం ప్రతిధ్వనిస్తూ కొనసాగుతుంది. "నా" అనగా ప్రాణం. "" అనగా అగ్ని. ప్రాణాగ్నుల కలయికే నాదం. నాదం శబ్దకాలుష్యం చేసేదిగా గాక హృద్యంగా వుండాలి. కనుక గంటవాయించే టప్పుడు సున్నితంగా వాయించాలి. "ఘంటాతు తాడయేద్దీమాన్ అస్త్ర మంత్ర సముచ్ఛరన్" క్రమపద్ధతిలో మెల్లగా వాయిస్తే దైవికపూజ సఫలమౌతుంది. శాస్త్రప్రకారం ఘంటకు అధిష్టానదేవత బ్రహ్మ. కొందరిభావనలో గంటలోని నాళం (నాలుక) ఆదిశేషునకు ప్రతీక. ఉత్పన్నమయ్యే నాదం శబ్దబ్రహ్మంగా పరిగణిస్తారు.

 గంటలు మూడురకాలు. 1. చేగంట. పూజాసమయంలో వాయించే చిన్నగంట.  దీన్ని ఎడమచేత్తో, వాయిస్తూ, కుడిచేత్తో నీరాజనాది ఉపచారాలు చేస్తారు. 2. జేగంట. ఇది గుండ్రముగావున్న కంచుపలక. దీన్ని చెక్కగూటముతో వాయిస్తారు. ఆలయంంలో బలిహరణ సమయాల్లోనూ, ఊరేగింపుల్లోనూ వాయిస్తారు. 3. వ్రేలాడు గంట. ఇది దేవాలయాల్లో వ్రేలాడదీయు పెద్దగంట. ఆలయప్రవేశం చేయగానే దీన్ని వాయిస్తారు. దీన్ని మృదువుగా ఒకవైపు మాత్రమే తగిలేట్లు వాయిస్తారు. దేవాలయం విడిచిలెళ్ళేప్పుడు దీన్ని వాయించరు. గంట శాస్త్రానుసారం మూడుసార్లు వాయించాలి. "ఏకతాడే మరణం చైవ. ద్వితాడే వ్యాధిపీడనం. త్రితాడే సుఖమాప్నోతి. తత్ఘంటానాద లక్షణం". గంట ఒకసారికొడితే మరణాన్ని, రెండుసార్లు కొడితేరోగన్ని, మూదుసార్లు కొడితే సుఖసంతోషాలను కలిగిస్తుందని దీనర్థం.

 ఘంటానాదాన్ని వినడానికి కూడా ప్రత్యేక వార నక్షత్ర సమయాలను జ్యోతిష్కులు నిర్ధారించారు.

1.ఆదివారం అశ్వని,మూల నక్షత్రాలున్న రాహుకాలం సా: 4-30 నుండి 6-౦౦ వరకు.

2.సోమవారం ఆరుద్ర,స్వాతి,శతభిష నక్షత్రాలున్న రాహుకాలం ఉ: 2-30 నుండి 9-00 వరకు.

3.గురువారం ఫుష్యమి నక్షత్ర మున్న రాహుకాలం మ: 1-30 నుండి 3-00 వరకు.

4.శుక్రవారం హస్తా నక్షత్ర మున్న రాహుకాలం ఉ: 10-30 నుండి12-00 వరకు.

5.శనివారం రేవతి నక్షత్రమున్న రాహుకాలం ఉ: 9-00 నుండి 10-30 వరకు.

 ఈసమయాలలో శుక్లపక్షమైతే ఘంటానాదం భక్తునకు ఎడమవైపు నుండి వినబడాలి. అదే బహుళపక్షమైతే, కుడివైపునుండివినబడాలి. పూర్ణిమ దినాలలో ఏవైపునుండైనా పరవాలేదు. అమావాస్యనాడు వదిలేయండి. ఒకవేళ అమావాస్యనాడు గుడిలోనైతే గంటమ్రోగించేముందు పితృదేవతలను స్మరించి తర్వాత గంటలు మ్రోగించాలి. ఇలా చేయడం అత్యంత శుభదయకం.        

Thursday, 6 April 2023

తీర్థం,Tirtham

 

తీర్థం

తీర్థమనగా భగవంతుని అభిషేకించినజలం లేదా గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర వంటి పుణ్యనదుల నావాహనజేసిన, కలశంలోని పవిత్రజలం. ఒక పవిత్రజలాశయం లేదా నదినాశయించియున్న దేవస్థానన్ని కూడా తీత్థమనే అంటారు. దేవాలయాల్లోగాని గృహాల్లోగానీ పూజానంతరం తీర్థంపుచ్చుకుంటూ వుండడం హిందువుల ఆచారం. కొన్నిచోట్ల చర్చీలలోకూడా క్రీస్తు పాపులకోసం కార్చిన రక్తమనిచెప్పి ద్రవాహారాన్ని యివ్వడం జరుగుచున్నది. ఒక రాజకీయ నాయకుడు ఉన్నపార్టీవదలి మరోపార్టీ లోచేరితే అతడు ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నాడంటారు. ఇలా హేళన చేయడానికి కూడా యీ తీర్థమనే పదం వాడబడుతున్నది. హిందువులకు మాత్రం ఇది పూజానంతరం నిర్లక్ష్యము చేయరాని ప్రక్రియ, పూజారి "అకాలమృత్యు హరణం. సర్వవ్యాధినివారణం. సమస్తపాపక్షయకరం. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం" అని ఉచ్చరిస్తూ రాగిపాత్రలోని తీర్థాన్ని తొలుత అర్చకస్వాములు, తరువాత సర్వసంగపరిత్యాగులు (సన్యసించినవారు), తర్వాత అధ్యాపకులు, యజమానులైన ధర్మకర్తలు ఆతర్వాత మిగిలిన భక్తులందరు వరుసగా స్వీకరిస్తారు.  పరమేశ్వర”  బదులుగా  ఆసమయంలో పూజించిన దైవనామాన్ని ఉచ్చరించవచ్చును. సర్వసామాన్యంగా తులసీదళాలు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, శ్రీగంధం కలిపిన మంచినీటితో శుద్ధోదకాభిషేకం చేసినతర్వత అదేజలాన్ని తీర్థంగాసేవించడం జరుగుతుంది. ఒలికిపోకుండ క్రిందపదకుండా వుండేందుకు పురుషులైతే, ఉత్తరీయాన్నీ (కండువాను), స్త్రీలైతే చీరకొంగు లేక చున్నీపైటకొసను నల్గుమడతలు మడిచి ఎడమ అరచేతిపై వేసుకొని, పైన కుడి అరచేతినుంచి, గోకర్ణ ముద్రలోనికి మడిచి, అంటే కుడిమధ్యవ్రేలు చూపుడువ్రేలు మధ్యకు బొటనవ్రేలు పోనిస్తే తీర్థం తీసుకోవడానికి అనువుగా గుంత యేర్పడుతుంది. అందులో తీర్థము వేయించుకొని కళ్ళకద్దుకొని భక్తిపూర్వకంగా స్వీకరించాలి. పూజారి ముడుసార్లు ఉద్దరనితో తీర్థంవేసిన తర్వాత, సేవించాలి. లేదా వేరువేరుగా మూడుసార్లు తీర్థంసేవించాలి. మొదటితీర్థం మానసిక, శారీరక శుద్ధిని, రెండవది సద్బుద్ధిని, న్యాయవర్తనను, కలిగిస్తుంది. మూడవది పరమపదాన్ని చేరుస్తుంది. తీర్థం స్వీకరిచేటప్పుడు, జుర్రుకొన్నశబ్దం రాకుండ, వీలైతే కుదురుగా కూర్చొని భక్తిశ్రద్ధలతో తీసుకోవాలి.  

 తీర్థాలు నాలుగురకాలుగా, ఆయాదేవస్థానాల ఆచారాన్ని బట్టి వుంటున్నాయి. 1.జలతీర్థం - ఇది అంతటా సర్వసామాన్యంగా యిస్తూవుంటారు. ఈ తీర్థసేవనంవల్ల పవిత్రత జేకూరుతుంది. అకాలమాణాలను (60సంవత్సరములు దాటకుండా చనిపోవడాన్ని) నివారిస్తుంది.  ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, పాపాలను పరిహరిస్తుంది. 2. కషాయతీర్థం- ఇది తీర్థంగా స్వీకరించే ఓషదుల కషాయం. కొల్హపురి లక్ష్మిదేవి గుడిలోనూ, కొల్లూరు మూకాంబికా దేవాలయంలోనూ, హిమాచలప్రదేశ్ జ్వాలామాలిని ఆలయంలోనూ, అస్సోం లోని శ్రీకామాఖ్యదేవాలయంలోనూ, యీతీర్థం రాత్రి పూజానంతరం యిస్తారు. ఇది సమస్తరోగనివారిణి. కనిపించని రోగాలనుసైతం బాగుచేస్తుంది. 3. పంచామృతతీర్థం- ఇది పాలూ, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలిపినతీర్థం. కొన్నిఆలయాలలో పాలూ పెరుగుకు బదులుగా కొబ్బరి, అరటిగుజ్జు వినియోగిస్తారు. ఈతీర్థం నరసిహస్వామి ఆలయాలలో ఎక్కువగా యిస్తారు. ఈతీర్థం పయత్న విజయకారిణి, కడకు బ్రహ్మలోకప్రాప్తి కలుగజేస్తుంది. 4. పానకతీర్థం- ఈతీర్థం శ్రీమంగళగిరి నరసింహస్వామివద్ద, అహోబిళ నరసింహస్వామివద్ద ఇస్తారు. ఈతీర్థం చైతన్యదాయిని. ఉత్సాహాన్నిస్తుంది. శరీరవేడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కలుగజేస్తుంది. నోరెండిపోవడాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తినిపెంచి, ఆకలిని కలుగజేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. శత్రుపీడలనుండి విముక్తి కలుగజేస్తుంది. ఇవిగాక బిళ్వతీర్థం కూడావుంది. వైష్ణవాలయాల్లో తులసితీర్థ మెంతముఖ్యమో, శివాలయాల్లో బిళ్వతీర్థమంత ముఖ్యం

 తీర్థం రాగిపాత్రలో వుంటుందిగనుక శరీరంలోని అధికవేడిని తగ్గిస్తుంది. అంతేగాక రాగిపాత్రలోని తీర్థసేవనంవల్ల ఆహారంలోని యితర లవణాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. అలాగే తీర్థంలోని పచ్చకర్పూరం మానసికోల్లాసాన్ని కలుగజేస్తుంది. తులసీదళాలు కఫహారిగా పనిజేస్తాయి. మరణశయ్యపై ఉన్నవారికి గళంలో కఫమడ్డపడి బాధిస్తుంది. తులసితీర్థంపోయడంవల్ల కఫం తొలగిపోయి బాధలేని మరణం ప్రాప్తిస్తుంది. తీర్థం స్వీకరించిన తర్వాత చేతులు కడుక్కోవాలి, లేదా వస్త్రంతో తుడుచుకోవాలి. అంతేగాని తలకు రాసుకోరాదు. తల బ్రహ్మస్థానం. దాన్ని ఎంగిలి చేయబడ్డ తీర్థంతో అపవిత్రంచేయరాదు. అంతేగాక శఠకోపం తలపైపెడతారు. శఠకోపమంటే దేవునిపాదాలు. కనుక పవిత్రమైన దేవునిపాదాలను మనం ఎంగిలితో మైలపరచరాదు. అంతేగాక తీర్థంలో తేనె, పంచదార ఉంటాయిగనుక అవి తలకురాయడం తగదని వైద్యులసలహా. అయినా కొందరు తీర్థసేవనం తరువాత తలకురాస్తే బ్రహ్మహత్యాదోషం తొలగుతుందని నమ్ముతారు. గంగాజల(కాశీ)తీర్థం తలకుతగిలితే దోషం లేదని కూడా అంటారు. ఈవిషయంలో ఎవరి విశ్వాసం వారిదని వదిలేద్దాం. "శంఖంలోపోస్తేనేతీర్థం" అన్నసామెత ఒకటున్నది. దీన్ననుసరించి తులసి తీర్థాన్ని  ఉద్దరణితోగాకుండా శంఖంలో పోసి, దానిద్వారా భక్తుల కివ్వడం కూడా జరుగుతుంది .  ఇక ఆలయాల్లోగానీ ఇంట్లోగాని తీర్థం మిగిలిపోతే తులసికోటలోని తులసిచెట్టుకు పోయాలి. లేదా ప్రవహించే నదిలో కలిపేయాలి. తీర్థానికి సంబంధించిన అనేక విషయాలను "తీర్థగోష్టి" గ్రంధంలో వ్రాయబడి ఉన్నాయి.                      

Thursday, 30 March 2023

నైవేద్యం -ప్రసాదం

                           నైవేద్యం -ప్రసాదం


నైవేద్యం అంటే దైవానికి సమర్పించిన ఆహరపదార్తం. ప్రసాదమంటే పూజానంతరం అందరికీపంచి మనమూస్వీకరించే పదార్తం. సాదమంటే ఆహారం.ప్ర చేర్చడంవల్ల అది మహత్తరమైంది. మనం పరిశుభ్రులమై పరిశుభ్రంగా  తయారుచేసిన ఆహారపదార్తానే దైవానికి సమర్పిస్తాం. ఆపదార్తాన్నే ప్రసాదంగా స్వీకరిస్తాం. అదికూడా మనకిష్టమైన పదార్తాన్నే నైవేద్యంగా పెడతాం. నైవేద్యం ఎంగిలిపడుతుందని రుచికుడా చూడం.   అంత శుచిగాసమర్పిస్తాం. ఎలా ఆలోచించినా భక్తితో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం, ముక్తిదాయకం. విగ్రహరూపంలోని దేవుడు తినడుకదా? ఆంటే, ఔను తినడు. కానీ పవిత్రభావనతో తయారు చేసి ప్రశాంతచిత్తముతో సమర్పించి, భక్తిభావంతో స్వీకరించిన ఆహారం అన్ని విధాలా మేలేచేస్తుందన్నది నిర్వివాదాంశం. గ్రామదేవతల యెదుట బలులు, కొన్నికథలలో రక్తమాంసాదులు సమర్పించిన విధులు వున్నాయి. అందులో భూతదయ లేదు. హింస ప్రత్యక్షముగా కనబడుతున్నది. కనుక అటువంటి వాటిని గురించి చర్చించదలచలేదు. సాత్విక సమర్పణలు స్వీకరణలు మాత్రము శ్రేష్ఠములన్న విషయము నిర్వివాదాంశము. సాత్వికములనునవి మాత్రము దైవసృష్టికాదా? దైవమిచ్చినవే తిరిగి దైవమునకు సమర్పించుట సక్రమమా? అన్నవాదనా ఉండనే ఉండనే వున్నది. నిజమే సర్వం దైవమయం అన్న మహోన్నత సత్యాన్ని అనుభవ పూర్వకంగా గ్రహించిన మహనీయులు తమ ఆకలితీరడానికి తిన్నదంతా ప్రసాదమే, త్రాగిన నీరమంతా  తీత్థమే. ఒకసాధ్వీమణి తనకీ జన్మకు భగవంతుడిచ్చిన భర్తకు, బిడ్డలకు, అత్తమామలకు, తల్లిదంద్రులకు, నేను ప్రసాదాన్ని చేస్తున్నాను, అని సంకల్పంచేసి చేసిన సంగటిముద్ద కూడా తన వారందరికీ ప్రసాదమే ఔతుంది. అది తిన్న కుటుంబసభ్యులందరి ప్రవర్తన సక్రమంగా వుంటుంది. అయితే అంతదూరమాలోచించలేని సామాన్యజనాలు దేవుడు, దైవమనే భావనతో తాత్కాలికంగానైనా దైవచింతనతో నైవేద్యానికి సరకులు సమకూర్చుకొంటూ, నైవేద్యం తయారుచేస్తూ, దైవానికి నివేదిస్తూ, ప్రసాదంస్వీకరిస్తూ, భక్తిభావంతో కొంత సమయం గడపటానికి యీప్రక్రియ ఉపయోగపడుతున్నది. ఇలా చేస్తూపోతే, వారే క్రమేణా మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. చివరకు అర్పణలన్నిటికన్నా హృదయార్పణమే మిన్నయన్న మహోన్నతస్థితికి చేరుకుంటారు. అందుకు భగవంతుడే దారిచూపిస్తాడు. 

 దేవుడొక్కడే నంటూనే ఒక్కొకకోరిక నెరవేరడానికి, ఒక్కోదేవునికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఏపేరుతో ఏనైవేద్యం సమర్పించినా అంత నాకే చెందుతున్న గీతావాక్యానుసారం, “భక్తిగలుగు కూడు పట్టెడైననుచాలు” అన్న వేమన మాటప్రకారం, కొంతైనా మేలు జరుగకపోదు గదా! ఎందుకంటే ఇక్కడ కూడా దైవమన్నభావన వున్నదిగదా! అదే ముఖ్యం. భక్తిభావం చెదిరిపోకుండా ఉండేందుకు పండితులు కొన్ని విధివిధానాల నేర్పరచినారు. నైవేద్యం పెట్టేప్పుడు "ఓం సత్యం చిత్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి స్వాహా" అని నైవేద్యంచుట్టూ, నీటిబిందువులు చిలకరించి, తర్వాత "ఓం ప్రాణాయస్వహా. ఓం ఉదానాయస్వాహా. ఓం సమానాయస్వాహా. ఓం బ్రహ్మణే" అని కుడిచేత్తో నైవేద్యాన్ని దైవానికి చూపించాలి. "మధ్యే మధ్యే పానీయం సమర్పయామి" అని నైవేద్యం మీద మళ్ళీ నీటిబందువులు సంప్రోక్షించాలి. "నమస్కరోమి" అని సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆతర్వాత అక్కడున్నవారందరూ బయటికివెళ్ళి రెండునిముషాల తర్వాత తిరిగివచ్చి, మళ్ళీ దైవానికి నమస్కరించి, అక్కడున్న వారందరికి ప్రసాదంపెట్టి తనూస్వీకరించాలి. భగవంతునిముందు విస్తరిలో సంపూర్ణభోజనం నివేదిస్తే, అది మహానైవేద్యమౌతుంది. తీర్థస్వీకరణానంతరం ఇంటియజమాని దాన్ని భక్తితో  భుజించవచ్చును. ఇది సామాన్యులు సులువుగా చేయదగిన విధానము. ఇదికూడా పాటించకుండా, ఎందరుభక్తులు తమ యిష్టదైవానికి తమకిష్టమైన నైవేద్యంపెట్టలేదు? అంటూ కొందరు భక్తకన్నప్పను ఉదహరించవచ్చు. సరే అన్నింటికి మూలం భక్తి. భక్తిముఖ్యంగానీ విధివిధానాలంత ముఖ్యంగాదని చెప్పిన పెద్దలూ ఉన్నారు. సరే అలాగే ననుకున్నాం, "లొకో భిన్నరుచిహిః" అన్న నానుడి ఉండనేఉన్నది గదా!

 ఇక నైవేద్యం ఏమి సమర్పిస్తే, ఏఫలితం వస్తుందోకూడా పూజారులు తెలియజేశారు. అదీ సరేమరి! ఏదో ఫలితమాశించైనా దైవాన్ని తలచుకుంటున్నారు గదా! అదీ కొంతలోకొంత మంచిదేననుకున్నాం.  ఇక అవిషయానికొస్తే, కొబ్బరికాయ సమర్పిస్తే పనులు సానుకూలంగా నెరవేరుతాయట. అలాగే కమలాపండ్లు సమర్పిస్తే నిలచిపోయిన పనులలో కదలికవచ్చి సనుకూలంగా పూర్తౌతాయట. మమిడిపండు వల్ల పాతబాకీలు వసూలౌతాయట. చెల్లించవలసిన బాకీలు సకాలంలో చెల్లించగలుగుతారట. గణపతికి తేనె మామిడిపళ్ళరసం సమర్పిస్తే మోసంచేయడానికి వచ్చినవారు కూడా మారిపోయి మేలుచేస్తారట. సపోటాపండు సమర్పిస్తే, సంబంధాలు తొందరగా కుదిరి వివాహాలు శీఘ్రంగా జరుగుతాయట. చిన్న అరటిపండ్లు సమర్పిస్తే, పనులు వేగంగా పూర్తై, కార్యసిద్ధి కలుగుతుందట. అరటిగుజ్జు సమర్పిస్తే, శుభకార్యాలకు అడ్డంకులు తొలగిపోయి, నష్టాలనుండి బయటపడతారట. నేరేడుపండు భోజనంతోసహ నివేదిస్తే, అన్నపానాదులకు లోటురాదట. నేరేడుపండ్లు శనిదేవునికి సమర్పిస్తే, నడుము, మోకాళ్ళనొప్పులు నయమౌతాయట. ఈపండ్లు శివకేశవులకు సమర్పిస్తే, సమస్త శుభాలూ చేకూరుతాయట. ద్రాక్షపండ్లు సమర్పిస్తే, పక్షపాతం నయమౌతుందట. సుఖసంతోషాలు కలుగుతాయట, జామపండ్లు సమర్పిస్తే, ఉదరకోశవ్యాధులు నయమౌతాయట. వ్యాపారాభివృద్ధి జరుగుతుందట. ఈపండ్లు దేవికి సమర్పిస్తే, చెక్కెరవ్యాధి తగ్గుతుందట. దాంపత్యకలహాలు తొలగిపోయి, సంతానభివృద్ధి జరుగుతుందట. సంఘంలో  గౌరవం పెరుగుతుందట. గణపతి అనుగ్రహం కొఱకు ఉండ్రాళ్ళు వినాయకచవితినాడు సమర్పిస్తారు. శ్రీరామనవమికి వడపప్పు పానకం సమర్పిస్తారు. కృష్ణాష్టమికి వెన్నముద్దలు సమర్పిస్తారు. ఉట్టికొట్టేవేడుక జరుపుకుంటారు.

 అందరికీ తెలిసిన ప్రసాదాలు వుండనే వున్నాయి. తిరుపతి వేంకటేశ్వరునికి చాలాచాలా నైవేద్యాలే సమర్పిస్తారు. లడ్డూ, వడ మాత్రం చెచ్చుకోకుండా, పంచకుండా వుండలేరు. శబరిమల అయ్యప్ప ప్రసాదం అదోరకం. చిన్నచిన్న డబ్బలలో తెచ్చి పంచిపెడుతుంటారు. పేరుపొందిన దేవాలయాలన్నిటిలో రకరకాల ప్రసాదాలు యిస్తున్నారు, భక్తులు తెచ్చుకొని తాముస్వీకరించి, యితరభక్తులకూ పంచుతున్నారు.  ఏదియేమైనా సమర్పించేది, పత్రం, పుష్పం, ఫలం తుదకు తోయమైనా ( జాలమైనా) సరే, మనస్సులో సమర్పణభావం, శ్రద్ధ, భక్తి, ఉంటే అదిసార్థకమౌతుంది. శ్రీరాంచంద్రజీ తమ సహజమార్గ విధానంలో  నైవేద్య సమర్పణ మరొక పద్దతిలో చెప్పారు. వారు బూంది (లడ్డుపొడి) ని పెట్టి,  మానవ సమాజోద్ధరణకు పాటుబడిన మహనీయుల నావాహనజేసి, యీఆహార పదార్తమును శక్తివంతముజేసి, స్వీకరించిన వారందరికి ఆత్మోన్నతి  కలుగజేయు నట్టిదిగా జేయుడని వినమ్రతతో ప్రార్థించి, తొలుత పిల్లలకు పెట్టి, తర్వాత  మిగిలివారందరూ స్వీకరిస్తారు. ఈవిధానంలో దేవుడు తినడమన్నది లేదు. చాలాసమర్థనియముగా కుడా ఉన్నది.        

ఏదిఏమైనా,  కోరికలులేని, నిష్కామభక్తితో చేసిన సమర్పణ ఉత్తమోత్తమం. అలాకాక యాంత్రికంగా యెదోచేశాం, అయిపొయింది, అనే పద్దతిలోచెసే పూజలు, పెట్టే నైవేద్యాలు స్వీకరిచే ప్రసాదాలూ నిరుపయోగమని గ్రహించి, భక్తిని ఇష్టంగా పాటిద్దాం. భగవదనుగ్రహనికి పాత్రులమౌదాం.  కడకు హృదయార్పణకు మించిన సమర్పణ మరొకటిలేదన్న సత్యన్ని గ్రహించి, భగవంతుని శరణుజొచ్చి తరిద్దాం.                         

 

         

 

 

Saturday, 25 March 2023

దీపం,Dipam

 

దీపం


 


దీపంవెలిగించనిదే యేదైవారధన జరుగదు. అసలు దీపమే సర్వదేవత స్వరూపమని హిందువుల విశ్వాసం. దీపప్రమిద క్రిందిభాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణువు, ప్రమిద శివుడు, వత్తులవెలుగు సరస్వతి, మండేభాగం (విస్ఫులింగం) లక్ష్మియని పడితులు వివరిస్తున్నారు.  విద్యుద్దీపాలు లేని పూర్వకాలంలో అసలు దీపాలే వెలుగుకు ఆధారమన్న విషయం అందరెరిగినదే. చీకటి అజ్ఞానానికి సంకేతం. వెలుగు జ్ఞానానికి ప్రతీక. కనుకనే దీపం జ్ఞానదాయినయింది. దీపం తొలిమలిసంధ్యల్లో వెలిగించి దైవరధనచేయటమొక సదాచారం. కనీసం మలిసంధ్యలోనైనా దీపరధనచేయటం శ్రేయస్కరం. దీపం పంచభూతత్మకమని కొందరి అభిప్రాయం. మట్టిప్రమిద భూతత్వానికి, తైలం జలతత్వానికి, వత్తులు ఆకాశతత్వానికి, వెలగడానికి ప్రసరించేగాలి వాయుతత్వానికి. జ్యోతి అగ్నితత్వానికి ప్రతీకలు. విశ్వం కాంతిమయం. కాంతిశక్తిమయం. దైవాన్ని ప్రకాశంగా ఆరాధించే సంప్రదాయన్ని ఋషులు అనుష్టించారు. పూజను పారంభించడానికిముందు దైవానికి ప్రతిరూపమైన దీపాన్నివెలిగిస్తూ "దీపం జ్యోతి పరబ్రహ్మం. దీపం సర్వతమోపహం. దీపేన హరతే పాపం. దీపలక్ష్మీ నమోస్తుతే" అని శ్లోకం చెబుతూ దీపాన్నివెలిగించి ఇష్టదేవతాపూజలు యధావిధిగా కొనసాగించాలి. ఆలయంలోదీపం, వృక్షమూలంవద్ద దీపం. ఆలయధ్వజస్తంభంవద్ద దీపం, గృహంలోని దేవునిమూల దీపం, ఇంటిగుమ్మంవద్ద దీపం, తులసికోటవద్ద దీపం ముగ్గులమధ్య దీపం, పుష్పాలమధ్య దీపం,  ఇలా ఎక్కడ దీపంవెలిగించినా అసురశక్తులను, అసురగుణాలను నిలువరించి సత్వాన్నీ, సత్యాన్నీ ప్రతిష్టిస్తూ దీపశిఖవలె ఊర్ద్వముఖంగా భగవంతునివైపు మనస్సును మరల్చుతుంది. దీపంకొసనుండి వచ్చే మంటచుట్టూ ఒక కాంతివలయం ఏర్పడుతుంది. అది శక్తివంతమైన దైవానికి ప్రతిరూపం. సమస్త దోషాలను పరిహరించి వరుస విజయాయాల నివ్వగల శక్తిఅది. దీపాలను నేరుగా                                            

అగ్గిపుల్లతో వెలిగించరాదంటారు. ముందుగ ఒకదీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించి. ఆదీపంతోమిగిలిన దీపాలన్నీ వెలిగించి, అగ్గిపుల్లతో వెలిగించిన దీపాన్ని ఆర్పేయవచ్చు. దీపాలను ఆర్పేయాల్సివస్తే, నోటితో ఊదరాదు. ప్రమిదలో ముందుగా నూనెపోసినతర్వాతే వత్తులు వేయాలి. నేయివేసిన ప్రమిదలోగానీ దీపస్తంభంలోగానీ ఐదు వత్తులు కలిపివేసుకొని స్త్రీలు వెలిగిస్తే ,మొదటివత్తి వలన భర్త, రెండవవత్తివలన అత్తామామలు, మూడవవత్తివలన తోబుట్టువులు క్షేమంగవుంటారు, నల్గవది గౌరవ మర్యాదలు హెచ్చిస్తుంది. ధర్మవర్తనాన్ని ప్రోత్సహిస్తుంది. ఐదవవత్తివలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడుకూడా ఒకవత్తిదీపం వెలిగించరాదు. ఆవునెయ్యిలో నువ్వులనూనె, వేపనూనె కలిపి వెలిగిస్తే విశేష ఫలితాలుంటాయంటారు. పైవాటిలో ఏదోఒకదానితో దీపం వెలిగించవచ్చు. ఆముదం. కానుగనూనె కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించుకోవచ్చును. కానుగనూనెదీపాలు కంటికి చలువచేస్తాయి. ప్రమిదక్రింద మరొకప్రమిదగానీ తమలపాకుగాని, బియ్యంగానీపోసి దీపంపెట్టుకోవాలి. దిపాస్తంభానికైతే  క్రింద బియ్యంపోయడం  ఉత్తమం .

ఒకసారి ఐరావతంపై వెళుతున్న ఇంద్రునికి దూర్వాసమునీంద్రుడు పారిజాతసుమమాలను ఇచ్చాడు. ఇంద్రుడు నిర్లక్ష్యంగా మాలను ఐరవతంపై వేశాడు. ఆఏనుగు క్రిందవేసి కాలితోత్రొక్కి నలిపేసింది. దుర్వాసముని కోపించి ఇంద్రుని శపించాడు. అంతటితో ఇంద్రుడు సర్వంకోల్పోయాడు. దిక్కుతోచక ఇంద్రుడు శ్రీహరిని శరణుజొచ్చాడు. శ్రీహరి దీపరూపంలో లక్ష్మినిపూజింపమన్నాడు. ఇంద్రుడు శ్రీహరి చెప్పినట్లుచేసి, పూర్వవైభవాన్ని తిరిగిపొందాడు. దీపం దేవుని ఎదురుగాపెట్టరాదు. శివునిపూజలో ఎడమవైపు, శ్రీహరిపూజలో కుడివైపు పెట్టుకోవాలి. శనిదోషం పొవాలంటే, అరచేతిలో నల్లని వస్త్రంపెట్టుకొని అందులో నల్లనువ్వులు కొన్ని పోసిచుట్టి నువ్వులనూనె లోతడిపి నువ్వులనూనెదీపం పెడితే ,శనిదేవుడుకూడా అనుకూలఫలితాలనిస్తాడు. కార్తీకమాసం శివకేశవులకిద్దరికి ఇష్టమైనమాసం. ఈనెలలో దీపాలతో వారిని పూజిస్తే తెలియకజేసినపాపాలు హరించుకపోతాయి. కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీకమాసదినం దీపారాధనకు మరింత శ్రేష్ఠమైనది. కర్తీకపౌర్ణమినాడు 365 వత్తుల దీపారధనచేస్తే, ఏడాదిపొడవునా దీపారాధనచేసిన పుణ్యం లభిస్తుంది. కార్తీకమాసంలో ఆలయాల్లో ఆకాశదీపాలు వెలిగిస్తారు. చిన్నచిన్న రంధ్రాలుగలిగిన ఇత్తడిపాత్రలో నూనెపోసి దీపాలు వెలిగించి తాడుసహాయంతో ధ్వజస్తంభం పైకి పంపి వ్రేలాడదీస్తారు. ఈదీపాలు పితృదేవతలు మనలను దీవించి వెళ్ళేటప్పుడు వారికి దారిచూపిస్తాయని పండితుల అభిప్రయం. మార్గశిరపాడ్యమినాడు అరటిదొప్పలలో దీపాలువెలిగించి, పోలిఅనే ఒకభక్తురాలు ఉత్తమలోకాలకు పోతున్నట్లు భావించి నీటిలో వదులుతారు. ఈపోలి మహాభక్తురాలు. ఈమెను కార్తీకమాసంలో దీపారాధన చేయనీయకుండా, అత్తాతోడికోడళ్ళు, పూజవస్తువులు ఇంట్లోవుంచకుండా తవెంటతీసుకొని నదీస్నానానికి వెళ్ళేవారు. పోలి ఉపాయంగా పెరటిలోని ప్రత్తిచెట్టునుండి దూది సేకరించుకొని వత్తులుచేసుకొని, కవ్వానికంటుకొనివున్న వెన్నతీసి, వత్తులకు పట్టించి దీపారాధన సక్రమంగాచేసుకొని, అత్తా తోడికోడళ్ళు తిరిగివచ్చేసరికి ఒకబుట్టక్రింద దీపాలను దాచేసేదట. ఈమె భక్తికిమెచ్చి దేవతలు విమానంలో వచ్చి ఆమెనెక్కించుకొని ఉత్తమలోకాలకు బయలుదేరారు, వెంటనే అత్తాతోడికోడళ్ళు వచ్చి, ముందు అత్త పోలికాలు పట్టుకొని వ్రేలాడిందట, ఆమెకాలు కాలుపట్టుకొని మొడటికోడలు, ఆకోడలుకాలుపట్టుకొని రెండవకోడలు, అకోడలుకాలుపట్టుకొని మూడవకోడలు వ్రేలాడసాగారట. అప్పుడు అదిగమనించి దేవతలు అత్తను అనర్హురాలని క్రిందకుతోసేశారు. ఆమెతోపాటి వ్రేలాడుతున్న ఆమె కోడాళ్ళూ క్రిందపడిపోయరు. పోలినిమాత్రమే విమానంలో ఆకాశ గమనాన పరంథామానికి కొనిపోయారు దేవతలు. ఇదీ పోలిపాడ్యమికథ. ఈమార్గశిర పాడ్యమినాడు అరటిదొన్నెలలో దీపాలు వెలిగించి నీటిలో వదిలితే, తామూ పోలివలె పుణ్యలోకాలకు వెళతామని. బ్రతికినన్నాళ్ళు పసుపూకుంకుమలో సుమంగళిగా గౌరవంగా జీవిస్తామని నమ్ముతారు. దీపావళినాడు ఇంటింటా దీపాలవరుసలు దర్శనమిస్తాయి. నరకాసుర వధతో దూర్తపాలన అంతమంది, ప్రజలజీవితాలలో వెలుగులు నిండాయన్న శుభసంకేతంగా అమావాస్యచీకటి కనరాకుండా ఆనాడు దీపాలుపెట్టి ఆనందిస్తారు. ఇదీ దీపమహాత్మ్యం.  

 

 

మామిడాకులు,mango leaves

 

మామిడాకులు



మామిడాకుల తోరణాలు కట్టనిదే హిందువుల యే శుభకార్యమూ జరగదు. పండుగల్లో, వ్రతాల్లో, యాజ్ఞయాగాదుల్లో, ఆలయద్వజారోహణల్లో, వివాహాదిశుభకార్యాల్లో, పందిళ్ళకు, మంటపాలకు, తలవాకిళ్ళకు మామిడితోరణాలు కట్టవలసిందే. కలశంలో కూడా మామిడాకులుంచడం సర్వసామాన్యం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువుంటుందని మనవారి నమ్మకం. అందుకే మామిడాకుల మంగళతోరణాలు కట్టిన ఇంట్లోగానీ మంటపాల్లోగానీ లక్ష్మీదేవిఅనుగ్రహం మెండుగా వుంటుంది. మామిడాకుల ప్రస్తావన భారత రామాయణాల్లోకూడావుంది క్రీ.పూ 150 సంవత్సరాల నాడే సాంచీస్తూపంపై ఫలించిన మామిడి వృక్షం చెక్కబడింది. ఉగాది పచ్చడిలో మామిడికాయముక్కలు తప్పనిసరి. మామిడిచెట్టు భక్తి ప్రేమలకు ప్రతీక. ఈచెట్టు సృష్టికర్త బ్రహ్మకు సమర్పింబడినదని, దీని పువ్వులు చంద్రునికి సమర్పింపబడ్డాయని హైందవవిశ్వాసం. కాళిదాసు దీన్ని మన్మథుని బాణాల్లో ఒకటిగా వర్ణించారు. శివపార్వతుల వివాహం ఒక ఇతిహాసానుసారం మామిడిచెట్టు క్రిందేజరిగింది. హనుమంతునివల్ల మామిడి భారతావనిలో వ్యాప్తిజెందిందని పండితులు చెబుతున్నారు. హనుమ మామిడి సువాసనకు ఆకర్షితుడై మామిడి ఫలాలను భుజించి, ముట్టెలను సముద్రంలో విసిరేశాడట, అవి బారతభూభాగానికి కొట్టుకవచ్చి చెట్ట్లుమొలిచి వ్యాపించాయట. మామిడాకులు కట్టినయింటికి వాస్తుదోషం తగలదు. సకారాత్మకశక్తుల ప్రవేశం, నకారాత్మకశక్తుల తిరోగమనం జరిగితిరుతుందంటారు.  కనుక పట్టిందల్ల బంగారమౌతుంది. మామిడాకులు తోరణం కట్టినచోట మనస్సుకు ప్రశాంతత జేకూరుతుంది. ఆప్రదేశంలో ప్రాణవాయువుశాతం పెరిగి స్వచ్ఛత నెలకొంటుంది. ప్రతిదీ శుభప్రదమౌతుంది. రోగకారక సూక్ష్మజీవులు నశించించడంవల్ల ఆరోగ్య పరిరక్షన జరుగుతుంది. మామిడాకులు యేకారణంచేతనైనా దొరక్కపోతే రాగి, జివ్వి, మర్రి ఆకులతో తోరణాలు కట్టూకోవచ్చు. మామిది, జివ్వి, రాగి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటన్నిటినీ హిందువులు పవిత్రంగా భావిస్తారు. పూర్వకాలంలో పెళ్ళికిముందు వరుడు మామిడిచెట్టుకు పసుపుకుంకుమలతో పూజించి ప్రదక్షిణచేసి చెట్టును కౌగలించుకొని తర్వాత పెళ్ళిమంటపం ప్రవేసించే వాడట.

 ఆయుర్వేదంలోను, చైనావైద్యవిధానంలోనూ మామిడాకులు ఉపయోగపడుతున్నాయి. లేతమామిడాకులను నీడలో రెండబెట్టి చూర్ణం చేసుకొని రోజూ ఒకచంచా సేవించవచ్చు. లేదా ఆకులను సాంయంత్రం కషాయంకాచుకొని మరునాడు ఉదయం వడగట్టి త్రాగవచ్చు. అది రక్తంలో చెక్కెరను అదుపుచేస్తుంది. మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి. రక్తనాళాలు బలాన్నిపుంజుకొని రక్తపోటు అదుపులో వుంటుంది. ఈకషాయంతో గాయాలుకడిగితే తొందరగా మానిపోతాయి. చెవిలోవేస్తే చెవిపోటు తగ్గుతుంది. కేరళలో ఆకులబూడిదతో పళ్ళపొడి తయారు చేస్తున్నారు.  మామిడిచెట్టుబెరడు వేళ్లుకూడా ఆయుర్వేదం మరియు చైనా వైద్యవిధానంలో ఉపయోగిస్తుంన్నారు. ఊబకాయం, గుండెసమస్యలు, క్యాన్సర్‍వంటిరోగాలకు, కణుతులు, అజీర్ణం, నిద్రలేమి, మతిమరుపు, వణుకుడు, క్రొవ్వుపేరుకపోవడం, గర్భాశయవ్యాధులు, పోస్ట్రేటుగ్రంధి వాపు, కడుపులో పూతలకు మందులు తయరౌతున్నాయి. జుత్తుసంరక్షక ఔషదాల్లోనూ, తైలాల్లోనూ మామిడాకుల రసాన్ని వాడుతున్నారు. లేతమామిడిఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, రాగి, పొటాషియం, మెగ్నీషీయం, మరియు జీర్ణశక్తిని మెరుగుపరిచే ఎంజైములు ఉన్నాయి.కనుక పచ్చిచిగుళ్ళు నమిలి మ్రింగినా మంచిదే నంటున్నారు .అందువల్ల నోటిదుర్వాసన కూడా తగ్గుతుంది. మామిదాకులు నీళ్ళతో పేస్టుగానూరి కాస్తాతేనెకలిపి ముఖానికి మాస్కుగా వాడితే ముఖం కాంతివంత మౌతుంది. తేనెకలపని పేస్టును వెంట్రుకలకు (తలకు) పట్టించి ఓ 15 నిముషాల తర్వాత తలస్నానంచేస్తే జుత్తు బాగపెరిరుగుతుంది, వెంట్రుకలు రాలవు, తెల్లబడవు. ఎండిన మమిడాకులు కాల్చి ఆపొగ పీలిస్తే గొంతు సంబంధవ్యాధులు నయమౌతాయి. ఇలా మామిడాకులు చాలా ప్రతిభావంతములై వున్నవి.                      

 

Wednesday, 22 March 2023

సాంబ్రాణి,Benzoin

 


సాంబ్రాణి



సాంబ్రాణిచెట్టునుండి వచ్చే జిగురు (బంక) నుండి సాంబ్రాణి తయారౌతుంది. దీన్ని నిప్పులపై వేస్తే తెల్లటి సువాసనగలపొగ వస్తుంది. దైవం ముందు సాంబ్రాణి పొగవేయడం హిందువుల ఆచారం. ముస్లింలు, క్రైస్తవులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు. ముస్లింఫకీర్లు నిప్పులపళ్ళెరాన్ని పట్టుకొని తిరుగుతూ యీపొగను వేసి నెమలీకలకట్టతో పొగ మనవైపుకు త్రిప్పి, దీవిస్తారు. క్రీస్తుజననం సమయంలో తూర్పుదేశపు జ్ఞానులు ఆయనను సమీపించి ఇచ్చిన కానుకలలో సాంబ్రాణికూడా వుంది. రోమన్‍క్యాథలిక్  తెగవారు ప్రార్థనాలయాల్లో (చర్చీల్లో) సాంబ్రాణిని వాడటం యిప్పటికి జరుగుచున్నది. దర్గాలలోకుడా ముస్లింలు సాంబ్రాణిపొగవేయడం చేస్తున్నారు. దైవకైంకర్యంగా సాంబ్రాణిపొగలు వేయడం దాదాపు అన్ని మతాలవారు ఇష్టంగా చేస్తున్నారు. సొమాలియా, అరేబియా, ఓమన్, ఇండోనేషీయా, జోర్డాన్, ఆఫ్రికా, భారత్ లలో యీసాంబ్రాని చెట్లనుపెంచి, విరివిగా వ్యాపారంకూడా చేస్తున్నారు. దేవునిపూజకేగాకుండా చనిపోయిన వారికికూడా సాంబ్రాణిధూపం వేస్తారు. వ్యక్తిచనిపోయినతర్వాత 12 రోలుజులవరకు ఇంట్లోసాంబ్రాణి ధూపం వేస్తారు. దివసాలలో, తద్దినాలలో, ముఖ్యంగా మహాలయ అమావాస్యనాడు, సాంబ్రాణిధూపంవేసి పరమపదించిన తమపూర్వీకులను తలచుకుంటారు. సాంబ్రాణిపొగలు తమపితృదేవుళ్ళను చేరి, వారిదీవనలు మనకందేట్లు చేస్తుంని విశ్వసిస్తారు. దీనియందు నమ్మకమున్నా లేకపోయినా సాంబ్రాణిపొగలు ఇల్లంతా అలముకొని, సువాసనను వెదజల్లడమేగాకుండా, సూక్ష్మక్రిములను, దోమలను, కీటకాలను పారద్రోలుతాయి. దుష్టశక్తులను అడ్డుకొని నకారాత్మక శక్తులను పారదోలి సకారాత్మక శక్తులను ఇంట్లోకి ఆహ్వానిస్తాయన్నది పురోహితుల ఆభిప్రాయం. జ్యోతిషశాస్త్రజ్ఞులు సాంబ్రాణిధూపం యేరోజు వేస్తే యేఫలితం సమకూరుతుందో యిలా వివరించారు. ఆదివారం సాంబ్రాణి గుగ్గిలం కలిపినిప్పులపై పొగవేయడంద్వార సిరిసంపదలు, కీర్తి, దైవానుగ్రహం కలుగుతుంది. అదే సోమవారమైతే ఆరోగ్యం, ప్రశాంతత, దేవీకటాక్షం కలుగుతాయి. మంగళవారమైతే శత్రుభయం, అసూయ, ఈర్షా తొలగిపోయి, కంటిసమస్యలు, అప్పులబాధ వైదొలగుతాయి. బుధవారమైతే నమ్మకద్రోహులు, కుట్రదారులనుండి వచ్చే ఆపదలను పరిహరించి, వరుసగా శుభాలు కలుగుతాయి. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. గురువారమైతే సర్వకార్యములలో విజయం లభిస్తుంది. శుక్రవారమైతే లక్ష్మీప్రసన్నతతో నిర్విఘ్నంగా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. అదే శనివారమైతే ఈతిబాధలు తొలగిపోతాయి. శనీశ్వరుని అనుగ్రహం లభించి, సోమరితనం, అలసత్వం వదలిపోయి, తేజస్వంతులై వెలుగొందుతారు.

 ప్రస్తుతం సాంబ్రణికడ్డీలు, దిమ్మెలు విరివిగా లభిస్తున్నాయి. పూర్వం  ఆవుపేడతో చేసుకొన్న పిడకకు నిప్పంటించి దానిపై సాంబ్రాణి, గుగ్గిలం, శుద్ధచందనం కలిపివుంచుకొన్న పొడిని వేసిపొగను ఇల్లంతా వ్యాపింపజేసుకొనేవారు. కానీ యిప్పుడు కొన్నిరసాయనాలు కలిపిచేసిన సాంబ్రాణిదిమ్మెలు, బత్తీలు వస్తున్నాయి. వీటిపొగ మంచిదికాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  కనుక బాగాపరిశీలించి కొనాలి. శుద్ధ సాంబ్రాణిపొగ పీల్చడంవల్ల శ్వాససంబంధిత వ్యాధులు నయమౌతాయి. తలస్నానానంతరం శిరోజాలకు సాంబ్రాణి పొగవేసుకుంటే త్వరగా తల ఆరిపోవడమేగాకుండా, వెంట్రుకల కుదుళ్ళు బలపడతాయి. చంటిబిడ్డలకు యిలాచేస్తే రోగాలు దరిచేరవు. మంచినిద్రపడుతుంది. పిల్లలు చలాకీగావుంటారు. జుత్తు ఒత్తుగావున్న స్త్రీలకు తలస్నానానంతరం సాంబ్రాణిపొగపట్టడం సర్వదా స్రేయస్కరం.

 సాంబ్రాణి వైద్యపరంగానూ చాల ఉపయోగకారి. శరీరంలోని నీరసాన్ని పోగొట్టి నరాలను ఉత్తేజపరుస్తుంది. అనేక మానసికరుగ్మతలకు సాంబ్రాణిధూపం మంచిఔషదం. కీళ్ళనొప్పులకు అజీర్తికి చర్మవ్యాధులకు ఉబ్బసం అల్సర్ వ్యాధుల మందుల్లో సాంబ్రాణిని వాడుతారు. సాంబ్రణిపొగలు నాడీమండల వ్యవస్థను ప్రేరేపించి క్రమబద్దీకరిస్తాయి. సాంబ్రాణినుండి నూనెనుకూడా తీస్తారు. ఈనూనె సబ్బులు, బాడీలోషన్‍లు, పర్ఫ్యూమ్‍సు టూత్‍పేస్టులలో మరియు నొప్పినివారణ ఆయిట్‍మెంట్లలో వాడుతున్నారు.

  గుగ్గిలం, మైసాక్షి కూడా సాంబ్రణితో కలిపిగానీ వేరుగగానీ పొగవెయ్యడానికి ఉపయోగిస్తారు. ఇవికూడా వాటి చెట్లజిగురు నుండే తయారుచేస్తారు. మైసాక్షి (మహిషాక్షి) గుగ్గిలంలో మేలైన రకం.  ఇవికూడా ధూపానికేగాక ఆయుర్వేదమందుల్లో విరివిగా వాడుతారు. గుగ్గిలంతో తయారుచేసే యోగరాజగుగ్గులు అనే మాత్రలు ఆయుర్వేదంలో చాలా పసిద్ధిపొందాయి. ఇవి కీళ్ళనొప్పులను. వాతపునొప్పులను నయంచేస్తాయి. సాంబ్రాణిధూపం అనుదినం దైవంముందు వేద్దాం, ఇల్లంతా పొగలు వ్యాపింపజేద్దాం ఆనందంగా హుషారుగా వుందాం.         

 

 

 

 

 

 

 

 

 

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...