Thursday, 19 August 2021

నవనాగరికత

 నవనాగరికత

నాగరికత కందని కడు ఆదిమ కాలంలో

కారడవుల వసియించే  కరకు నరపశువుల కాలంలో

బలవంతునిదే కాలం,  ఎల్లకాలం

బలహీనుల కేమాత్రం కదదికాలం .

 

క్రమానుగత  పరిణామక్రమం 

హరించింది ఆటవిక న్యాయం

సమభావం సౌహార్దం దయా దాక్షిణ్యం

నవమానవ జీవన గమనంలో

వెలిసింది , వెల్లివిరిసింది.

 

కదిలేకాలంతో కదిలింది నాగరికత

కదిలి కదిలి , కడకది పడింది కర్కశ ముదురుపాకంలో

పొడుగుచేతుల  పందేరం   బక్కవాని బిక్కమొగం

పేరుకు సమభావం . పెత్తందార్లకే మరి పీఠం.

 

పోటీకొస్తే పీకలు తప్పించే నీతి

మదగజాల  మధ్యన సారంగానికి సద్యోవిముక్తి

ఎత్తుకు పైయెత్తుల్లో ఎగిసేదేమో

ఏమెరుగనివాని రుధిరం .

ఇది మరుగునపడి మరలివచ్సిన

ఆటవిక న్యాయమా?

లేక పరిణామ ప్రక్రియలో

పరిణత నొందిన నవనాగరికతా ?

 

అవని మానవజాతికిది సవాల్

భువిమేదావులకిది అసిధారావ్రతం

తీర్పునిచ్చుటకూ తిర్చిదిద్దుటకూ

ఇది తుదిసమయం

 

ఫలితంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా

ఆతురుడనై చావని ఆశల ఛాయల్లో  నిల్చున్నా .


    ***


search: 

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...