Thursday, 19 August 2021

తెలుగుపద్యం

 తెలుగుపద్యం

 

క: గుడికూలును నుయిపూడును

    వడినీళ్ళను చెరువుతెగును వనమును ఖిలమౌ

    చెడనిది పద్యం బొకటియె

    కుడియెదమల కీర్తిగన్న గువ్వలచెన్నా.

 

పద్యరచనలో స్థాయీభేదాలున్నా పద్యం చిరంతరం. పద్యానికి చావులేదు. "చెడనిది పద్యం బొకటియె" అన్న గువ్వలచెన్నుని మాట అక్షరసత్యం. అందుకు కారణం పద్యం ఛందోబద్దంకావడమే. సాహితీనందనంలో పద్యం వెయ్యివసంతాల పైబడి పూస్తూనేవుంది. తనకాంతిని సుగంధాన్ని విరజిమ్ముతూనేవుంది.

 

పద్యం జనజీవనయానంలో ఎదురీది ఎదురీది అలసిపోయింది. ఇక దాని కాలంచెల్లిపోయిందని వాదిస్తున్న సమయంలోనే  అది మూడుపువ్వులు ఆరుకాయలుగా వృద్ధిపొంది విమర్శకుల నోరుమూయించింది. శతసహస్రద్విసహస్రపంచసహస్రావధావాలతో పద్యం తన విశ్వరూపం చూపింది.

 

పద్యం రెండువిధాలుగా భాసిస్తున్నది. ఒకటి స్మరణదృష్ఠితోరెండు సౌందర్యదృష్ఠితో. ఈరెండింటికి భేదం గమనిద్దాం. వేమనయోగి 

 

ఆ:వె:  కట్టరాళ్ళు తెచ్చి కాలుసేతుల త్రొక్కి

            కాసెయులుల సేత గాసిచేసి

            దైవమనుచు మ్రొక్క తప్పది గాదొకో

            విశ్వదాభిరామ వినుర వేమ.

 

అని తనతాత్త్వక వాదాన్ని నేరుగా ఘాటుగా విమర్శనాదృష్టితో చెప్పివైచినారు. ఇచ్చట  సులభంగా మన స్మరణలో వుండటానికి పద్యం యెన్నుకోబడింది. ఇదే రాతివిగ్రహాలను చెక్కే విషయంలో సౌందర్యాతిశయం కనబరుస్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు 

 

మ: ఉలిచే రాలకు చ క్కిలింతలిడి ఆయు ష్ప్రాణముల్ బోయు శి

        ల్పుల మాధుర్య కళాప్రపంచము లయంబున్ జెందె పాతాళమున్

        గలసెన్ పూర్వకవిత్వ వాసనలు నుగ్గైపోయె ఆంధ్రావనీ

        తలమంబా యికలేవ ఆంధ్రులకు రక్తంబందు మాహాత్మ్యముల్.

 

అన్నారు. వేమనయోగి రాతిని ఉలితో తూట్లుబొడిస్తేనారాయణాచార్యులవారు ఉలితో శిలకు చక్కిలిగింతలిదినారు. ఒకటి స్మరణాదృష్టి. రెండవది సౌందర్యదృష్టి. ఇక ప్రబంధాలుభారతభాగవతాది ఇతిహాసాలూరామాయణాది కావ్యాలు, యీ రెండులక్షణాలు కలిగివున్నాయి. మరికొందరైతే సులభంగా గుర్తుబెట్టుకోవడానికి వీలుగా వుంటుంది గనుక వైద్యాదిశాస్త్రములను కూడా పద్యములలో వ్రాసుకున్నారు. మచ్చునకొకటి చూడుడు.

 

తే: గంటుశీకాయ గొనివచ్చి గరుకులేని

    రాతిమీదను గంధంబు రయముమీర

    తేసి కంటికి కలికంబు వేసి మరియు

    చల్ల ద్రాపిన పసరికల్ చప్పునణగు.

 

ఇలా సులువుగా స్మృతిపథంలో విద్యనుంచుకొని ఆనాటి వైద్యులు తమ వృత్తిని కొనసాగించారు.

 

సౌందర్య దృష్టితో పద్యనిర్మాణం చేయడం యేమంత సులభంకాదు. అందుకే నన్నయకు ముందుటి రచనలకు ప్రాధాన్యత రాలేదు. పద్యంరాయగల్గటం వేరుపద్యవిద్యను సాధించటంవేరు. విద్యా  వంతుడంటే పనిమంతుడని అర్థం. కల్పనాచతురతశిల్పాభిరామత్వమురమణీయార్థ ప్రతిపాదకశక్తిధారనానుడులుసామెతలుఛలోక్తులతో కూడిన భాషాశక్తి తనవశం చేసుకున్న పనిమంతుడు కనుకనే నన్నయ పద్యవిద్యకు ఆద్యుడైనాడు. ఆయనశైలి నేటికీ అనితరసాధ్యంగానే మిగిలిపోయింది. తర్వాతికవులు వారివారి ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. రసాభ్యుచితబంధంగా అలతి అలతి పదములతో గంభీరభావనలను వెలిబుచ్చగల నైపుణ్యంతిక్కనదైతేసీసపద్య వూగుతూగులతో శ్రీనాథుడుపోతనలు తెలుగుజనాన్ని ఓలలాడించారు. అప్పటినుండి ఇప్పటివరకు వచ్చిన పద్యరచనలను ప్రస్తుతిస్తే యిది ఉద్గ్రంధమే అయిపోతుంది. ఏదియేమైనా

 

క: చెప్పగవలె గప్పురములు

    కుప్పలుగా బోసినట్లు కంకుమ పైపై

    గుప్పిన క్రియ విరిపొట్లము

    విప్పినగతి ఘుమ్మనం గవిత్వము సభలన్

 

అంటారు రఘునాధనాయకులు. ఛందస్ అనునది "ఛద్" ధాతువునుండి నిష్పన్నమగుచున్నది. ఈధాతువునకు ఆహ్లాదం అని అర్థం. ఆహ్లాదము కలిగించు వాక్యసమూహమును తెలుగులో ఛందోబద్ధమైన పద్యమంటున్నాము. అందుకే పద్యమంటే అలావుండాలన్నారు రఘునాధ నాయకులు. ఆయనే మరొకచోట.

 

క: పలుకగవలె నవరసములు

    గులకం బద్యములు చెవులకున్ హృద్యముగా

    కళుకక యటుగాకున్నన్

    బలుకక యుండుటయె మేలు బహుమానముగన్.

 

అంటారు. నిజమేమరి. రీతివృత్తిశైలిపాకమురసముధ్వనిఅలంకారము యివన్నీ ప్రస్పుటించినగానీ అది కావ్యముగాదు. తేలికమాటలతో వ్రాసిన గ్రంథములు యేమైనా వాఙ్మయములు కావచ్చునేమోగానీ సారస్వతంగాదు. అది సాహిత్యమనిపించుకోదు. గణయతిప్రాసలు కూర్చిన మాత్రమున పద్యంకావచ్చుగానీ కవిత్వంకాదు.

 

కవిత్వం నాలుగు విధాలంటారు. అలా అనడంలోనూ విభేదాలున్నాయి. మృదుమధురచిత్తవిస్తరములని కొందరుమృదుమధురరసభావములని మరికొందరుఅలాకాదు ఆశుబంధగర్భచిత్రకవిత్వములని మరికొందరు చెప్పుచున్నారు. ఆశువంటే విల్లునుండి వెలువడిన బాణం. అడిగిన తక్షణం కోరిన భావంలో పద్యం చెప్పేయడం ఆశువు. ఆశువులో కవిత్వాంశం, చెప్పేవాని ప్రతిభపై ఆధారపడి వుంటుంది. బంధకవిత్వంలో ఖడ్గబంధముశేషబంధముచక్రబంధముఛత్రబంధముపద్మబంధము వంటివెన్నో ఉన్నాయి. ఇందులో పద్యం చిత్రంలో ఇమిడించబడుతుంది. దీన్ని మాటలలో వివరించడం కష్టం గనుకవ్యాసం చివరలో చిత్రరూపలో చూపించబడింది గమనించగలరు. గర్భకవిత్వమనగా ఒకపద్యంలో మరొకపద్యం యిమిడింపబడుతుంది. దీన్నే పద్యగోపనమనికూడా ఆంటారు. ఉదాహరణకు

 

.

చం:  హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ! ధీర! తత్

          స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్రజా

         వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వపాలకా!

         వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత జే!

 

ఈ చంకపమాల యందుగర్భితమై యున్న నాలుగు పద్యములుగమనింపుడు

ఒకటి కందము:

కం: శివ! శంకరా! త్రిపుర హం

        త! విధిస్తుత! లింగ! ధీర!తత్ స్మరహర! సం

        భవ నాశకా! విపది భం

        గ! వివేకద! విశ్వపాలకా! వరద! మృడా!

 

రెండు మధ్యాక్కర

హర! శివ! శంకరా! త్రిపుర హంత! విధిస్తుత! లింగ!

స్మరహర! సంయతా! విపుల! శాస్త! కవీశ్వర విశ్వ!

వర! భవ నాశకా! విపది భంగ! వివేకద! విశ్వ!

వరద! మృడా! ప్రభో! జప తపః పరిశాంతిత! శార్ఙ్గి!

 

 

మూడు తేటగీతి:

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీర!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గోత్ర!

విపది భంగ! వివేకద! విశ్వపాల!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జేత!

 

నాలుగు ద్రుతవిలంబిత వృత్తము:

 

త్రిపురహంత! విధిస్తుత! లింగ! ధీ!

విపుల! శాస్త! కవీశ్వర విశ్వ! గో

విపది భంగ! వివేకద! విశ్వపా!

జప తపః పరిశాంతిత! శార్ఙ్గి! జే!

 

ఇక చిత్రకవిత్వమంటే పేరుకు తగ్గట్టే చిత్రవిచిత్రాలుగా వుంటుంది. కొన్ని పద్యాలు మొదటి అక్షరం నుండి చదివినా చివరి అక్షరం నుండి చదివినా ఒకే తీరున వుంటాయి. కొన్ని మొదటినుండి చదివితే ఒక అర్థం చివరినుండి చదివితే మరొక అర్థం వస్తాయి. అంతేకాదు ద్వర్థిత్ర్యర్థికావ్యాలుకూడా తెలుగులో వెలువడ్డాయి. పింగళిసూరన రాఘవపాండవీయము,  హరిదత్తసూరి రాఘవ నైషదీయము, లోమేశ్వరకవి రాఘవ యాదవీయము, ధనుంజయుని రాఘవపాండవీయము, వేంకటాధ్వరి యాదవ రాఘవీయము ద్వర్థికావ్యాలు. చిదంబరకవి రాఘవ యాదవ రాఘవీయము, అనంతాచార్య యాదవ రాఘవ పాండవీయము  త్ర్యర్థికావ్యాలు.

 

క: సుబలతనయ గుణమహిమన్

     ప్రబలి తనకుదార ధర్మపాలనలీలన్

     సొబగొంది వన్నెదేరగా

     విబుధస్తుతు డవ్విభుండు వెలసెన్ ధరణిన్ .

 

ఇది సూరన రాఘవపాండవీయములోని పద్యం. భారతార్థంలో "సుబలతనయ" అంటే సుబలుడు అనే రాజుగారి కుమార్తె యైన గాంధారి. ఆమె గుణమహిమచే ప్రబలి, "తనకు దార" అంటే ధృతరాష్ట్రునకు భార్యగా ధర్మాత్మయై యుండగా అని అర్థం. అదే రామాయణార్థంలోనైతే "సుబలత నయగుణ మహిమన్" మంచిబలమూమంచి గుణములుగలిగి ప్రబలి "తనకుదార ధర్మపాలన లీలన్". ఉదారము మరియు ధర్మముగల తన పరిపాలనా చతురతతో దశరథుడు  అని అర్థం. ఇలా పదాల విరుపువిశ్రామస్ఠానల మార్పులతో భారతరామాయణాలు రెండూ నడిచాయీ కావ్యంలో. ఇది ఒక ఉదాహరణమాత్రమే. ఇలా తమప్రతిభను చాటారు పూర్వకవులుఇప్పుడిట్టి ప్రయోగాలు చేయువారరుదు. అయినా ఇదంతా పహిల్వానుల  సాముగరిడీల విద్య వంటిది. సామాన్యులకిది అర్థముకాదు. రసాస్వాదన చేయలేరు. అట్లుగాక రసాస్వాదన కనుకూలమై మనసునాహ్లాదపరచిమార్పును తీసుకొనిరాగల ప్రతిభ గలిగి కవిత్వ ముండాలంటారు సంకుసాల నృసింహకవి.

 

 

క: సమయజ్ఞుడు సమచిత్తుడు

    సమశబ్దార్థప్రయోగ చతురుడు మరియున్

    క్రమరస పోషణ రచనా

    కమనీయప్రతిభు డిల సుకవి యనబరగున్.

 

 

తే:గీ: యతి విటుడు గాకపోవు టెట్లస్మదీయ

          కావ్య శృగార వర్ణనాకర్ణనమున

         విటుడు యతిగాక పోరాదు వెస మదీయ

         కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున. 

 

పద్యమనగా పాదములుగలది. ఆపాదములు నియమబద్ధములు. గేయమునకు పల్లవిచరణములున్నవి. కానీ పద్యమునకున్నన్ని నియమములు లేవు. గేయమునకు మాత్రలు సరిపోయిన చాలును. పద్యమునకట్లు కాదుగదా! అక్షరములు సరిపోవలెను. గురులఘువులు ఛందస్సుప్రకారము కుదురవలెను. కనుకనే సంగీతమునకు పద్యము స్వతఃసిద్ధముగా ఒదిగిపోవును. పద్యముకూర్చునపుడే అదృశ్యరూపమున లయకూర్పు జరిగిపోవును. అందుకు తరలమత్తకోకిలలుమానినీ వృత్తములు చక్కటి ఉదాహరణలు. గమనింపుడు. 

 

మత్తకోకిల:   ఓసురారికులేంద్ర నీక్రియ నుగ్రమైన తపంబుమున్

 

తరలము:  క్రతుశతంబుల పూర్ణకుక్షివి గాని నీవిటు క్రేపులన్  

 

మానిని:   చాతకముల్ రథచక్రపుటాకుల సందుల పర్విడు చుండుట చేన్  

 

తెలుగుఛందస్సు సంస్కృతముకంటే విలక్షణమైనది. సంస్కృతఛందస్సు అదవిదారి వంటిది. తెలుగున అట్లుకాదు. ఇది రాచబాట. వేయుట కొంత కష్టమే. ప్రాస తెలుగుపద్యమునకు హొయలుగూర్చిపెట్టును. ప్రాస సంస్కృతమున లేదు. యతి సంస్కృతమున కేవలము విశ్రాంతినిచ్చు స్థలమేగాని  తెలిగులోవలె అక్షరమైత్రిలేదు. అక్ష్రమైత్రి క్రొత్త మెఱుపు కూర్చిపెట్టును.

 

పద్యములలో జాతులు(కందద్విపదతరువోజఅక్కరలు) ఉపజాతులు(తేటగీతఆటవెలదిసీసములు) కాక వృత్తములున్నవని మనమెరుగుదుము. ఇవి ఒక అక్షరముగలిగిన "శ్రీ" వృత్తము నుండి ఇరవైయారు అక్షరముల "మంగళమహాశ్రీ" వరకు వున్నవి. ఇవన్నీ గురులఘువుల స్థాన మార్పులవల్ల ఏర్పడుచున్నవి. గణితశాస్త్రంలో బైనరీ విధానలో సున్న ఒకటి మాత్రమే ఉపయోగించిలెక్కలన్నీ చేయుదురు. ఇదీ అటువంటిదే గురులఘువులు రెండింటితో యేర్పడు గణముల మార్పులవలన యీ వృత్తములు 13,42,17,726  కూర్చబడియున్నవి. వీటన్నిటికి పేర్లు పెట్టుటకూడా కష్టమే. వీటిలో చాలా వృత్తములు వాడుకలోలేవు. వాడిన తప్పుకాబోదు. చాలామంది కవులు ఉత్పలమాలచంపకమాలశార్దూలముమత్తేభముతరలముమత్తకోకిలస్రగ్దరమహాస్రగ్దరమానినిమాలినిపుండరీక వంటి వృత్తములతోనే సరిపుచ్చుకొనిరి. ఇన్ని వృత్తములుండుటవలన చెప్పవలసిన భావములను చెప్పుట కనుకూలములైన వృత్తము లెన్నుకొనుటకు మంచి అవకాశమేర్పడుచున్నది.

 

పద్యం ఛందోబద్ధమై క్రమశిక్షణకు లోబడియున్నది. అందువలన యేకారణము చేతనైనా కొంతభాగము ఖిలమైనాలుప్తమైనప్రాసయతిగణాల ఆధారంగా దాదాపుగా పద్యంలోని లుప్తభాగాన్ని పూరించి పద్యాన్ని పరిరక్షింపవచ్చును. ఈకారణం చేతనే కాబోలు పురాతన గ్రంథాలలో కొన్ని పాఠంతరాలు చోటుచేసుకున్నాయి.

 

పద్యం మన తెలుగుభాషకే ప్రత్యేకమైనది. పురాతనమైనది. పద్యాన్ని పరిరక్షించుకోవడం మనవిధి. పద్యానికి తగిన స్థానాన్నిస్తున్న ఆకాశవాణిదూరదర్శన్మరియు పత్రికల వారికి అభినందనలుధన్యవాదములు. ఇతర ప్రక్రియల ద్వారా కవిత్వం చెప్పడం, ప్రోత్సహించడం అభినందించదగ్గదే. కానీ ఆప్రక్రియలమీది వల్లమాలిన అభిమానంతో పద్యాన్ని నిరసించడం తగనిపని . ఇక చివరిగా

శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులవారి పద్యవిశేష పద్యంతో వ్యాసంముగిద్దాం.

 

ఆ:వె: తాళబద్దమైన లాలిత్యగతి గల్గి

          నడకసొంపు గలుగు నాట్యమగును

         శ్రవణ సుభగమైన ఛందోనియతిగల్గి

         పలుకుబడుల కూర్పు పద్యమగును.  

 

           బంధ కవిత్వమునకు రెండు ఉదాహరణలు 


                                                    ఖడ్గ బంధము












    ***

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...