Thursday, 19 August 2021

రవిరథసారథి- అనూరుడు

 రవిరథసారథిఅనూరుడు

 

మన పురాణగాథలు చాలా చిత్రాతిచిత్రంగా వుంటాయి. అయితే వాటిలో ఒకనీతిఒక‍ఉపదేశము దాగివుంటాయి. అద్దానిని గ్రహించవలెనేగానియిట్లెందు కున్నదియిది సరికాదని త్రోసిపుచ్చరాదు. పురాణపురుషుడైన అనూరుని కథ కూడా ఇట్టిదే.

 

"అనూరుడు" అనగా ఊరువులు(తొడలు) లేనివాడని అర్థము. ఇతనికి "అరుణుడు" అన్న మరొకపేరు కుడా వున్నది. శరీరము ఎఱ్ఱని వర్ణములో వుండుటచే ఇతని కాపేరు వచ్చినది. ఇతడు సూర్యుని రథసారథి. ఉదయము తూర్పుదిక్కున తొలుత కన్పించునది యితని కాంతియే. ఉదయము తొలుత కాన్పించు ఎఱ్ఱనికాంతిని అరుణోదయకాంతి అంటున్నాము. ఈతని పుట్టుకకు సంబంధించిన కథ మహాభారతములోని ఆదిపర్వము ద్వితీయాశ్వాసములో నున్నది. కథ పూర్వపరాలను పరిసీలిద్దాం-

 

బ్రహ్మమానసపుత్రుడైన "మరీచి" తనయుడు "కశ్యపప్రజాపతి". కశ్యపునకు అనేకమంది భార్యలు. అందులో పదమువ్వురు దక్షుని పుత్రికలు. వారిలో "దితి"కి దైత్యులు(రాక్షసులు), "అదితి"కి ఆదిత్యులు(దేవతలు), "కద్రువ"కు సర్పములు, "వినత"కు "అనూరుడు", "గరుత్మంతుడు"యిలా జీవజాలమంతా యీయన బిడ్డలే నన్నట్లువిశాలమైన సంసారమీయనది. ఇక ప్రస్తుతాంశానికొద్దాం-

 

దక్షపుత్రికలైన "కద్రువ", "వినత"లు భర్త "కశ్యపప్రజాపతిని" చాలాకాలం భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. వారికి ప్రసన్నుడై కశ్యపుడు వరం కోరుకో మన్నాడు. వారు పుత్రసంతానాన్ని కోరుకున్నారు. వారు, వారికి కలిగే సంతానం ఎలా వుండాలోకూడా భర్తకు వివరించారు.

 

తరలము :

అనలతేజులుదీర్ఘదేహులు నైనయట్టి తనూజులన్‌
వినుతసత్త్వుల గోరెఁ గద్రువ వేవురం గడువేడ్కతో;
వినత గోరె సుపుత్త్రులన్‌ భుజవీర్యవంతులవారికం
టెను బలాధికు లైన వారిగడిందివీరులనిద్దఱన్‌.

                                                           భారతం-అది-2-3.

 

అగ్నివలె తేజస్సుకలిగిపొడవాటిదేహాలు గల బలసంపన్నులైన వేయిమంది పుత్రులు కావలనీవారితో తను సంతోషంగా కాలం గడపగలననీకద్రువ కోరింది. కద్రువ కొడుకులకు మించిన గుణంబలంశౌర్యం గలిగిన యిద్దరు పుత్రులు కావాలని కోరుకున్నది వినత. అందుకంగీకరించి కశ్యపుడు పుత్రకామేష్టియాగం చేసియజ్ఞానంతరం, యజ్ఞాప్రసాదాన్నివినతకద్రువలకిచ్చి, "అభీష్ఠ సిద్దిరస్తు" అని దీవించాడు. అనతికాలంలోనే వినత రెండు అండములనుకద్రువ వేయి అండములను ప్రసవించింది. భర్త ఆజ్ఞానుసారం వారు ఆ అండములను నేతికుండలలో భద్రపరచిబిడ్డలకోసం యెదురు చూడసాగారు. 

 

 కొన్నేండ్లకు తొలుత కద్రువ గ్రుడ్లు పిగిలి వేయిసర్పములు పుట్టుకొచ్చాయి. వాటి తేజోవంతమైన పొడవాటి దేహములను చూచి సంతోషపడిపోయింది కద్రువ. ఆ సర్పాలలో "శేషుడు" శ్రీహరిపానుపయ్యాడు. "వాసుకి" శివకంఠాభరణమై నాగరాజుగా వర్ధిల్లాడు.

       

వినత తన సవతికి కలిగిన సౌభాగ్యానికి ఈర్షజెందింది. ఓపికనశించి ఒక‍అండాన్ని పగులగొట్టింది.

 

క.

తన గర్భాండంబుల రెం

టను బ్రియనందనులు వెలువడమినతిలజ్జా
వనత యయి వినత పుత్త్రా

ర్థిని యొకయండంబు విగతధృతి నవియించెన్‌.- భా ర-ఆది -2-5

క.

దాన నపరార్ధకాయవి

హీనుఁడుపూర్వార్ధతనుసహితు డరుణుడనం
గా నుదయించె సుతుండు

హానీతియుతుండు తల్లి కప్రియ మెసగన్‌.--భా ర-ఆది -2-6

 

అలా మధ్యాంతరంగా పగిలిన అండంనుండి శరీరంలోని పైభాగమే నిర్మాణమై. తొడలుకాళ్ళు ఇంకాయేర్పడక. పచ్చిగ్రుడ్డుగానున్న అరుణవర్ణపు కుమారుడు బయటపడ్డాడు. పుట్టినబిడ్డ వ్యధజెంది, బాధతప్తహృదయంతో తల్లిని శపించాడు.

 

వ.

----- నన్ను సంపూర్ణశరీరుం గానీక యండం బవియించిన యవినీతవు కావున నీవు నీసవతికి దాసివై యేనూఱేం డ్లుండు’ మని శాపం బిచ్చె--

                                                                            -- భార-అది-2-7.

                                                                                          

తదనంతరం శాంతించితల్లిని క్షమాపణవేడి, "తల్లీ నీవు తొందరపడక రెండవ అండమును సంరక్షింపుము. అందుండి నాతమ్ముడుమహాబలశాలిధీమంతుడుశౌర్యవంతుడునైన "గరుత్మంతుడు" ఉద్భవించగలడు. అతనివలన నీ దాస్యత్వము తొలగిపోవునని ఓదార్చిఏకచక్రముసప్తాశ్వములు గల సూర్యనారాయణుని రథమునకు సారథిగా నియమితుడై వెలుగొందుచున్నాడు అనూరుడు. తర్వాత పుట్టిన గరుత్మంతుడు విష్ణువాహనమై చిరకీర్తి నార్జించిన విషయము మనకు తెలిసినదే. 

 

ఈర్షాద్వేషముఓర్పులేని తోదరపాటు మనకు చేటుతెచ్చునని ఈకథ నీతిని బోధించుటేగాకవికలంగులైనంత మాత్రమున మనిషి నిరుపయోగి కాడని ధైర్యము నూరిపొయుచున్నది. –ఓమ్  తత్  సత్.

 

                                        ***


Search: Anurudu

No comments:

Post a Comment

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...