శ్రీకృష్ణావతారం
అవతారాలన్నింటిలో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది. తొలుత అవతారమంటే యేమిటో తెలుసుకుందాం. అవతరించుట అంటే దిగివచ్చుట. పరమాత్మ భువికి దిగివచ్చినాడు గనుకనే ఆయనను భగవదవతారం అంటున్నాం. భగవంతుడు ఎందుకు దిగివస్తాడు అన్నది ప్రశ్న? భగవద్గీతలో వివరించినట్లు భగవంతుడు మనకోసం, అంటే భుమిపై అరాచకం ప్రబలి సుజనులు పీడింపబడుతున్నప్పుడు, సాధువులు ఆత్రుతతో రక్షణకై ఎదురుచూస్తున్నప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. దూర్తులను దండించి సజ్జనులను కాపాడతాడు. అందుకోసం అవతారపురుషునిలో తాను నిర్వహించవలసిన పనికి తగిన శక్తినిక్షిప్తమై వుంటుంది. భగవంతుని అనంతశక్తితో పోలిస్తే యీ అవతారపురుషుని శక్తి అత్యల్పం. కారణం ఆ అవతారానికి అంతమాత్రంశక్తి సరిపోతుంది. ఒక ధనవంతుడు తాను కొనవలసిన వస్తువునుబట్టి జోబులో తగినంత డబ్బు పెట్టుకొని బజారుకెళతాడు. అంతేగాని తనసంపదనంతా వెంటతీసుకొని పోడుగదా! ఇదీ అంతే. అయితే మిగిలిన అవతారాలవలెగాక శ్రీకృష్ణావతారం అనేక కార్యకలాపాలను సుదీర్ఘకాలం నిర్వహించటానికి వచ్చింది. అందుకే మహాశక్తిమంత మైనది. మహత్తరశక్తులు, మహిమలు అవసరమయ్యే కృష్ణావతారానికి సమకూరాయి.
అది ద్వాపరయుగం. లోకం అల్లకల్లోలంగా మారింది. రాజులు ప్రజలను కన్నబిడ్డలవలె పాలించడంమాని వారిని పీడిస్తూ భోగలాలసులై దూర్తవర్తనులయ్యారు. వారిని అదుపుచేయాలి. ధర్మపరిపాలనను పునరుద్ధరించాలి. అమాయకులు, విద్యావిహీనులునైన సామాన్యజనులను ప్రేమద్వార భక్తిమార్గమునకు త్రిప్పి మోక్షము ననుగ్రహించాలి. ఆధ్యాత్మికబోధతో మానవులను విజ్ఞానవంతులను జేయలి. అంతేగాక శాపగ్రస్తులైన హరిద్వారపాలకులు జయవిజయులను మూడవజన్మబంధమునుండి విమిక్తులనుగావించి వైకుంఠవాసులను జేయాలి. ఇలా అనేకకార్యములను నిర్వర్తించుటకే గొప్ప శక్తిసంపన్నతతో కృష్ణావతారం సంభవించింది.
మథురాధిపతి శూరసేనునికుమారుడు వసుదేవుడు. అతనికి తనకూతురైన దేవకినిచ్చి ఉగ్రసేనుడు వివాహంజరిపించి అత్తవారింటికి పంపనెంచాడు. ఉగ్రసేనునికుమారుడు కంసుడు తనచెల్లెలు దేవకినీ బావగారైన వసుదేవుని రథంపై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి కంసుని హెచ్చరించింది. "కంసా! నీవు ప్రేమగా నీచెల్లినీ బావనూ రథంపై ఎక్కించుకొని స్వతహాగా రథం తోలుతూపోతూ సంబరపడుతున్నావు, నిజానికి దేవకిఅష్టమగర్భజనితుడు నీపాలిటి మృత్యువు" అన్నది. వెంటనే కంసుడు ప్రాణభీతితో దేవకిని చంపబోయాడు. వసుదేవుడు బ్రతిమాలి మాకు పుట్టే ప్రతిబిడ్డనూ నీకు అప్పజెప్పుతాను. బిడ్డలను చంపు, చెల్లెలిని వదలిపెట్టుమని కంసుని కోరాడు. దేవకికొడుకువల్లకదా నాకు చావు, ఆమెబిడ్డలను పురిటిలోనే చంపేస్తాను. సరిపోతుంది అనుకున్నాడు. చెల్లీబావలను నిర్భందించి తనాధీనంలో వుంచుకున్నాడు కంసుడు. మొదటిబిడ్డ కలగగానే వసుదేవుడు చెప్పినమాట ప్రకారం కంసునికందించాడు. వసుదేవుని నిజాయితీకిమెచ్చి కంసుడు బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇచ్చేసాడు. ఎనిమిదవసంతానం కదా నా శత్రువు. బిడ్డను తీసుకొనిపో అన్నాడు. అలా ఆరుమంది పిల్లలను తొలుత కంసుడు వదిలేశాడు.
కంసుడు తను పూర్వజన్మలో "కాలనేమి" అనే రాక్షసుడనని, వసుదేవుడు అతని బంధువర్గమంతా దేవతలనీ, తనను నశింపజేయడానికే వారంతా పుట్టారనీ, ఒకరోజు నారదునివల్ల తెలుసుకొని, కోపోద్రిక్తుడై దేవకీదేవి ఆరుగురు కుమారులను చంపి దేవకిని వసుదేవుని కారాగారంలో వేసి, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేనుని కూడా కారాగారంపాల్జేశాడు. కారాగారంలో దేవకి సప్తమ గర్భం ధరించింది. ఆబిడ్డను సంకర్షణవిధానంలో శ్రీహరి గోకులంలోవున్న వసుదేవుని మరోభార్యయైన రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టాడు. దేవకికి గర్భస్రావం జరిగిందనుకొని కంసుడు మిన్నకుండిపోయాడు.
రోహిణీనక్షత్రం శ్రావణబహుళ అష్టమి అర్ధరాత్రి దేవకీదేవి తన అష్టమకుమారుణ్ని కన్నది. పుట్టినవెంటనే తాను అవతారపురుషుడనన్న విషయం తెలిసేటట్లు, విష్ణుస్వరూపుడై తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. కర్తవ్యబోధ గావించాడు. తిరిగి పొత్తిళ్ళలో బిడ్డయై కనిపించాడు. వసుదేవుడు బిడ్డనుదీసుకొని దైవాజ్ఞప్రకారం గోకులానికి బయలుదేరాడు. దైవమాయచే కారాగారద్వారాలు తెరచుకున్నాయి. కారాగార రక్షకులు నిద్రలోనికి జారుకున్నారు. ఉప్పొంగిపారుతున్న యమునానది రెండుగాచీలి వసుదేవునికి దారికల్పించింది. బాలునికి శేషుడు తన పడగను గొడుగుగాపట్టి వర్షంలో నదిని దాటించాడు. నేరుగా వసుదేవుడు గోకులంలోని నందునియింట ప్రవేశించి, ఆయనభార్య యశోదాదేవిని సమీపించి, ఆమె ప్రసవించిన ఆడుబిడ్డ స్థానంలో బాలునుంచి బాలికను తీసుకొనివచ్చి దేవకీదేవి ఒడిలో పెట్టాడు. దేవకీదేవి ప్రసవించిన విషయం తెలిసి కంసుడు వచ్చాడు. చెల్లెలు "అన్నా యిది ఆడుబిడ్డ చంపకుము" అని వేడుకున్నా వినలేదు. కత్తిదూసి బాలికను చంపడానికి పైకెగురవేశాడు. అంతే ఆబాలిక మహామాయరూపుదాల్చి అష్టభుజియై, దివ్యాయుధధారియై "కంసా! నిన్ను సంహరించగలవాడు గోకులంలో వృద్ధిజెందుచున్నాడు. నీచావు థద్యం" అని హెచ్చరించి అంతర్థానమయింది.
కంసుడు భయంతో తనను చంపేవాడు పసిబాలుడుగా గోకులంలో వున్నాడని అక్కడి పిల్లలను చంపించి శిశుహంతకుడయ్యాడు. కానీ బాలుని గుర్తించలేక పోయాడు. గోకులంలో యశోదానందులకు పుత్రోదయమైనదని వారు పండుగజేసుకున్నారు. బాలునికి కృష్ణుడని నామకరణంజేశారు. అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు కృష్ణుడు. కంసుడు కృష్ణుని చంపటానికి పంపిన పూతనను, శకటాసుర తృణావర్తులను రక్కసులను బాలుడయ్యూ వధించాడు. యశోదాదేవికి తననోటిలో సమస్తలోకాలనూ చూపించాడు. మద్దిచెట్లరూపంలోనున్న కుబేరకుమారులకు శాపవిముక్తి కలిగించాడు. వత్సాసుర, బకాసుర, అఘాసుర, ప్రలంబాసురులను రాక్షసులను వధించాడు. కాళీయుని మదమణచాడు. దావాగ్నినిమ్రింగి గోపకులగాచాడు. గోవర్ధనపర్వతమెత్తి ఇంద్రుని గర్వమణచి గో గోపకుల రక్షించాడు. కడకు కంసుని ధనుర్యాగసందర్శన నెపమున అక్రూరునివెంటవెళ్లి, మార్గమధ్యమున అక్రూరునకు తనవిభూతులనుజూపి, జ్ఞానసంపన్నునిజేసినాడు, కంసుని పట్టణమున ధనువువిరచి, కువలయాపీడనమను గజమును, చాణూరుడను మల్లయుద్ధయోధుని, కడకు కంసుని వధించి కృష్ణుడు భూభారం కొంత తగ్గించాడు.
సుదీర్ఘమైన జీవితకాలంలో శ్రీకృష్ణుడు రాక్షసాంశతోపుట్టిన శిషుపాలదంతవక్రులు హరిద్వారపాలకులైన జయవిజయులుగా గుర్తించి వారిని శాపవిముక్తులను గావించుటకై సంహరించి సాలోక్యమనుగ్రహించినాడు. అమాయకులైన గోపగోపీజనమునకు తనపై ప్రేమగలుగజేసి వారికి ముక్తినొసగినాడు. గురుపుత్రుని బ్రతికించి గురువు ఋణముదీర్చినాడు. మిత్రుడైనకుచేలుని దీనావస్థను బాపినాడు. దుష్టులైన రాజలోక సంహరంకోసం మహాభారతయుద్ధన్ని కూర్చడమేగాకుండ అర్జునునికి మోహవిముక్తిగలిగించు నెపంతో గీతనుబోధించి లోకమున ఆధ్యాత్మికవిద్యను ప్రబలజేసినాడు.
కృష్ణుడు అంటే నల్లనివాడు అని అర్థం. నలుపు లోతుకు సంకేతం. కృష్ణుని భగవద్గీత లోతైన ఆధ్యాత్మికప్రబోధం. అట్లే కర్షయతి కృష్ణ అన్నది సంస్కృతార్థం. అనగా ఆకర్షించువాడు కృష్ణుడు. తానే జనులను ఆకర్షించి తనలో లీనంజేసుకొని సాయుజ్యం ప్రసాదించిన మహావతారం కృష్ణావతారం. విద్యాగంధంలేని గోపగోపీజనాన్ని ప్రేమమాధ్యమంగా తనవైపున కాకర్షించి అతిసులభంగా తరింపజేసిన అవతారం కృష్ణావతారం. ఇనుప కచ్చడాలుగట్టి కానలలో ఘోరతపస్సు జేయుటకంటే ప్రేమనుబధంతో మోక్షం సుసాధ్యమని నిరూపించి, జనసామాన్యానికి మోక్షం సానుకూలంజేసిన కృష్ణావతారం సదా స్మరణీయం.
ఈసంవత్సరం ఆగష్ఠు ముప్పైన కృష్ణాష్టమి వస్తున్నది. ఆనాడు ఉట్టిగొట్టే సంబరాలు జరుపుకుందాం. బాలకృష్ణుని పాదముద్రలు ముగ్గులుగా ముంగిట్లో వేసుకుందాం. భక్తిశ్రద్దలతో ఉపవాసదీక్షలతో పండుగజరుపుకుందాం, తరిద్దాం.
కృష్ణాయ వాసుదేవాయ
దేవకీనందనాయచ
నందగోపకుమారాయ
గోవిందాయ నమోనమః
***
Search: శ్రీకృష్ణావతారం, Sri Krishna, srikrishnavataram
No comments:
Post a Comment