గోరింట
గోర్లకు రంగునంటించేదిగనుక దీనికి గోరింట అనేపేరు వచ్చిందంటారు. ఇది
గౌరియింటిలోనిది గనుక గోరింట అనేపేరువచ్చిందని హిందువుల నమ్మకం. సంస్కృతంలో
గోరింటను “మెహెందిక” అంటారు. హెన్నా అనికూడా గోరింటకు మరోపేరు. పసుపు సూర్యుని
వెలుగులోని వెలుపలిభాగానికీ, గోరింట లోపలిభాగానికి
ప్రతీక. గోరింటప్రసక్తి వేదాలలోను ధార్మికగ్రంథాలలోనూ వుంది.అన్నిమతాలమహిళలూ
యిష్టంగా ధరిస్తారీగోరింటను. పెళ్ళిళ్ళలో, పండుగలలోనేగాకుండా
సంతోషంగా ఉన్నప్పుడల్లా గోరింటను ధరిస్తారు. ఆషాడమాసంలోనైతే
దీన్నిధరించితీరాలంటారు. ఎందుకంటే ఆషాడంలో వర్షాలెక్కువ. మహిళలు నీళ్ళలో
కాళ్ళుచేతులు తడవకుండా పనులుచేసుకోలేరు. దానికితోడు వర్షం. అందువల్ల
సూక్ష్మక్రిములవృద్ధి యెక్కువగా వుంటుంది. జబ్బుచేసే ప్రమాదం పొంచివుంటుంది.
ఈగోరింటకును పెట్టుకోవడంవల్ల ఎర్రగాపండి అందానికందం, సూక్ష్మక్రిములనుండి
రక్షణా లభిస్తుంది. చేతుల్లో గోరింటాకు బాగాఎర్రగా పండితే కన్యలకు మంచిభర్తలు
లభిస్తారనేనమ్మకం వుండనేవుంది. మందారంలాపండితే మంచిమొగుడొస్తాడు. సిందూరంలాపండితే కలిగిన (ధనవంతుడైన) మొగుడొస్తాడని
స్త్రీలుపాడుకోవడం కద్దు.
ఈగోరింట వెనుక ఒకపురాణగాథకూడా వుంది.
పార్వతీదేవి చెలులతోగూడి వనవిహారంచేస్తున్న సమయంలో రజస్వల అయ్యింది. ఆరక్తం
ఒకబొట్టు నేలపైబడింది. అది వెంటనే ఒకమొక్కై మొలిచింది. అది గమనించిన ఆమెచెలులు
వెళ్ళి పార్వతీదేవి తల్లిదండ్రులకు ఆవింతను తెలియజేశారు. వారు (పర్వతరాజదంపతులు)
వచ్చి చూచేటప్పటికి మొక్కచెట్టయింది. గౌరీదేవి ఆచెట్టు ఆకునుగిల్లి చేతితోనలిపింది.
వెంటనే చేయిఎర్రగా మారింది. చేయియెర్రగాకందిందేమిటని తల్లి గాబరాపడి పరిశీలించి చూడగా
ఏమీకాలేదు. ఎర్రగామారి చేతికందాన్నిచ్చింది.
హిమవంతుడు (తండ్రి) ఆచెట్టును గౌరవభావంతోచూసి, ఇకపై స్త్రీలసౌభాగ్యచిహ్నంగా వర్ధిల్లమని వరమిచ్చాడు. అప్పటినుండి గోరింట
మహిళలకానందదాయినియై విలసిల్లుచున్నది. అయితే చరిత్రకారులు 5 వేలసంవత్సరాల క్రితమే
దీన్ని ఈజిప్షియనులు వాడేవారని, అందుకే వారి పిరమిడ్లలోని మమ్మీల (శవాల) కు గోర్లు వెంట్రుకలు ఎర్రగా
వున్నాయని తేల్చారు. క్రీ.పూ.700 సంవత్సరాలనుండి భారతదేశంలో గోరింట
వాడుకలోవుందనికూడా చెప్పారు. మరికొందరు మొగల్‌చక్రవర్తుల ద్వారా 12వ శతాబ్దంలో
మనదేశానికి వచ్చిందంటున్నారు. అప్పటికే అరబ్బులు గోరింటను అదృష్ట చిహ్నముగా
చూసేవారట. గుర్రాలజూలు అందాలకుగూడా గోరింటను వాడేవారట.
ఒకకప్పునీళ్ళలో 4 టేబుల్‌స్పూన్ల
గోరింటాకుపొడి కలిపి 8 గంటలు నానబెట్టాలి (రాత్రంతావుంచితే యింకామంచిది). తరువాత
బ్లాక్‌టీ డికాషన్ లేదా కాఫీడికాషన్ పోసి కలుపుకోవాలి. తర్వాత ఒకచంచా నిమ్మరసం, ఒకటేబుల్‌స్పూన్ ఉసరికపొడివేసి బాగాకలిపి పేస్టులా తయారుచేసుకోవాలి.
ఈపేస్టును గోర్లకు పట్టించవచ్చు. అరచేతులకు పాదాలకు వాళ్ళవాళ్ళ అభిరుచికితగ్గట్లు
చిత్రాలరూపంలో గోరింటపేస్టు పట్టించుకోవచ్చును. గోరింటాకుపెట్టుకోవడంకూడా ఒకకళే.
ముందు చేతులు శుభ్రంచేసుకొని తడిలేకుండా తుడుచుకొని గోరింతపేస్టు డీజైన్లను
వేసుకోవాలి. 7,8 గంటలు అలాగేవుంచుకోవాలి. తర్వాత నీళ్ళతో కడగకుండా అరచేతులు
రుద్దుకోవంద్వారా గోరింటను తొలగించుకోవాలి. ముందుగా చెక్కెర నీళ్ళలోకలిపి
లేతపాకంగా వేడిచేసుకోవాలి. చల్లారినతర్వాత ఒకచంచా నిమ్మరసంకలపాలి. ఈ సిరఫ్‌ను
గోరింట తొలగించుకున్న తర్వాత చేతులకు
పట్టించాలి. తర్వాత ఇంగువకానీ లవంగాలుకానీ పెనంపై వేయిస్తే వచ్చేపొగ చేతులకు
పట్టాలి. ఈపొగకుబదులు ఆవనూనెగానీ వ్యాసిలిన్‌గానీ లేక నీలగిరితైలం
(యూకలిప్టస్ఆయిల్)గానీ పట్టించవచ్చు. ఇలాచేస్తే బాగా పండుతుంది.
ఎక్కువనాళ్ళుంటుందికూడా. అయితే వీటిని ఎక్కువగా వాడరాదు. వాడితే ఎరుపుకుబదులు
ముదురుగోదుమరంగుకు మారుతుంది. తలకుపట్టించుకోవాలంటే చేతులకు గ్లోవ్స్ వేసుకొని
గోరింటపేస్టు పట్టించుకొని మూడుగంటలతరువాత కడిగేయాలి. అలాగేవుంచుకుంటే తలచర్మం
వెంట్రుకలు పొడిబారిపోతాయి.
గోరింటాకులో కూమరిన్, గ్లాంథోన్,గ్లైకోసైడ్లాంటి సేంద్రియరసాయనిక
మిశ్రమాలతో పాటు అరచేతికి ఎరుపునిచ్చే"లాసన్" కూడావుంటుంది. అరచేతిపై
మృతకణాలుంటాయి. వీటిగుండా లాసన్ చొచ్చుకపోతుంది. మృతకణాలక్రింద నశించడానికి
సిద్దంగావున్న కణాలూవుంటాయి. వీటీగుండాకూడా లాసన్ చొచ్చుకొనివెళ్ళి అరచేతులకు
ఎర్రదనాన్నిస్తుంది. ఈమృతకణాలు స్నానంచేసినప్పుడల్లా క్రమేణారాలిపోటూవుంటాయి. కనుక
ఎర్రదనంకూడా క్రమేణాతగ్గిపోతుంది. కోన్లద్వారా గోరింటాకు పెట్టుకొనే విధానం
వచ్చినతర్వాత గోరింట వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 1990 తర్వాత పాశ్చాత్యదేశాలలో
యిదొక ఫ్యాషనైపోయింది. రకరకాల డీజైన్లు అందుబాటులోనికి వచ్చేశాయి. అయినా
సాంప్రదాయపద్దతుల్లో తయారుచేసుకొన్న గోరింటపేస్టే ఉత్తమం. వీలుగానిపక్షంలో
మంచినమ్మకమైన కంపెనీలవి, వాటిలోనూ మరీపాతవిగాకుండా చూసుకొని
కోన్లు కొనాలి. ఎర్రదనంకోసం యిప్పుడు కొన్నిహానికర రసాయనాలుకలిపి గోగింటపేస్టులు,
పౌడర్లు బజారులోనికి వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి కొనడం మంచిది.
వైద్యశాస్త్రరీత్యాకూడా గోరింటకు
చాలాప్రయోజాలున్నాయి. గోరింటకు చలువచేసే గుణమున్నది. అందువల్ల నరాలు స్వాంతనజెంది
కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఉడుకుగడ్డలు నయమౌతాయి. కాళ్ళపగుళ్ళు రాకుండా చూస్తుంది.
గోరింట చర్మసమస్యలను నివారుస్తుంది. దెబ్బలుతగలి గాయాలైనా, కాలిగాయాలైన తొందరగా మానుపుతుంది. స్పోటకంవంటి అంటుజబ్బుల్లో అరికాళ్ళకు
గోరింటపెడితే ఉపశమనంకలుగుతుంది. బెణుకులు , పిప్పిగోళ్ళు,
గోరుచుట్టును నయంచేస్తుంది. కాళ్ళుచేతుల దురదలను పోగొడుతుంది.
చెట్టుబెరడు కామెర్లను బాగుచేస్తుంది. గోరింటపూలు తలక్రింద వేసుకొని పడుకుంటే
నిద్రబాగాపడుతుంది. గోరింటతలకు
పట్టించు కోవడంవల్ల వెంట్రుకలకు దృఢత్వకలిగి తొందరగారాలిపోవు. చుండ్రునశిస్తుంది.
గోరింటాకురుబ్బి నువ్వుల నూనెలో వేసి కాచుకొని గోరింటతైలం తయారుచేసుకోవచ్చు. ఇది
తలనూనెగా వడుకోవడంవల్ల వేడితగ్గి జ్ఞాపకశక్తికూడా పెరుగుతుంది. స్త్రీలు ఎక్కువగా
గోరింట వాడుతారుగనుక, వారి అరచేతి రక్తనాళాలు, నాడులు అధిక ఉష్ణానికి గురికాకుండా చూసి గర్భాశయదోషాలను తొలగిస్తుంది.
వారి హార్మోన్ల పనితీరు క్రమబద్దీకరించ బడుతుంది. తద్వారా అండాశయాలపనితీరు మెరుగై
సంతానోత్పత్తికి దోహదమౌతుంది. గోరింట కుష్టునివారిణి యని ఆయుర్వేదం చెబుతున్నది.
గోరింట అలంకరణగుణం కారణంగా ఉపయోగం ఎక్కువై కోన్లతయారీకి, పొడిప్యాకెట్లతయారీకి
గిరాకిపెరిగి, కడకు రైతులుదీన్ని వాణిజ్యపంటగా పండించి
లాభాలార్జించేదిశగా పురోగమించడం ఆశించగ్గపరిణామం.
No comments:
Post a Comment