Tuesday, 14 June 2022

అక్షతలు,akshatalu

 

అక్షతలు



అక్షతలు అంటే అక్షింతలు. అక్షింతలు తెలియని హిందువులుండరు. పండుగలలో, శుభకార్యాల్లో, దేవాలయాల్లో, పూజల్లో, వ్రతాల్లో ఆశీర్వాదంతీసుకునే పిన్నల తలపై పెద్దలు అక్షింతలువేసి దీవిస్తారు. పూజాసమయంలో యేలోటులేకుండా పూజచేయడానికి అక్షతలను సమర్పిస్తారు. అంటే, లభ్యంకాని పూజావస్తువులకుబదులు అక్షతలువేస్తే సరిపోతుందని పెద్దలుచెబుతారు. ఉదాహరణకు బంగారు దేవునికి సమర్పించలేనివారు, బంగారంసమర్పిస్తున్నామని అక్షతలు దైవంపై వేస్తారు. అదే,"హిరణ్యం సమర్పయామి" అని అక్షతలు వేస్తారు, సరిపోతుంది. అంతేగాదు, అన్నంనుండే జీవులు ఉత్పన్నమౌతాయని భగవత్గీత చెబుతున్నది. కనుక  మనకుఉత్పన్న మూలమైన  అన్నము బియ్యమే. అబియ్యమే  భగవంతునకు సమర్పించడమంటే మమ్మల్నిమేము నీకు సమర్పించికుంటున్నాం, శరణాగతిపొందుతున్నాం, అన్న అర్థం వస్తున్నది. ఇదే గొప్పసమర్పణ. ఇంత ఆర్థం భగవంతునివైపు అక్షతలువేయడంలోవుంది

 క్షతముకానటువంటి బియ్యమే అక్షతలు. అంటే విరగనిబియ్యపుగింజలనే అక్షతలుగా వాడాలి. వాటికి పసుపు లేక కుంకుమను కొద్దిపాటినీళ్ళుగానీ ఆవునెయ్యిలేక నువ్వులనూనెవేసికలిపి అక్షతలు తయారుచేసుకుంటాము. వాటిని శుభకార్యాలలో పెద్దలు పెద్దలు, పిన్నల తల(బ్రహ్మరంధ్రం)పై వేసి సుమంగళీభవ! ఆయుష్మాన్‍భవ! శుభమస్తు! అని దీవిస్తారు. అక్షింతలలో పసుపుకలిసి వుండటంతో దీవించేవారి జబ్బులు, ముఖ్యంగా చర్మవ్యాధులు అవీ చేతికుండే చర్మవ్యాధుదులను పసుపు అడ్డుకుని దీవెనలుపొందే వారికి ప్రాకకుండా చేస్తుంది.

 బియ్యం వాడటానికి యింకోగొప్ప కారణమున్నది. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహశాంతికి ఒక్కోధాన్యం, దానంగా జ్యోతిషశాస్త్రజ్ఞులు చెప్పారు. ఆక్రమంలో చంద్రునికి బియ్యం  చెప్పబడింది.  "మనఃకారకో ఇతి చంద్రః" చంద్రుడు మనస్సుకు  అధినాయకుడు. మనస్సు, బుద్ధి, వ్యసనములకు కారకుడు. కనుక బియ్యం తలపైని బ్రహ్మరంద్రంపై వేయడంద్వారా మనోధర్మాలు క్రమబద్ధమై నియంత్రణలోవుంటాయి. విరగని బియ్యం వేస్తారుగనుక దీవెనలు సంపూర్ణంగా నిండునూరేళ్ళు యేలోటులేకుండా హాయిగావుండాలన్న సందేశం అక్షతల్లోదాగివుంది. ఇక పసుపు బృహస్పతికిప్రతీక గనుక అది విద్యాబుద్ధిప్రదాయిని.

 అక్షతలువేసి దీవించడంలో మరోరహస్యం కూడా దాగివుంది. మనదేహంలో ఒకవిధమైన విద్యుత్కేంద్రాలు యిరువదినాలుగున్నాయి. వాటిలో శిరస్సులోని బ్రహ్మరంధ్రస్థానం అతిముఖ్యమైనది. అదిశక్తి ఉత్పత్తికి ప్రసారానికి ప్రధానకేంద్రం. అక్షింతలు వేసేవారు పెద్దలు శ్రేష్ఠులు, గనుక వారిలో యెక్కువగా, సాత్వికశక్తి వుంటుంది. ఒకవేళ తామస రజోశక్తులుంటే, పసుపుదాన్ని అడ్డుకుంటుందిఅందువల్ల సాత్వికవిద్యుచ్ఛక్తి అక్షింతలువేయించుకునే పిన్నలలలోకి ప్రవహించి వారిలో ముందున్నశక్తిని ఉత్తేజితంచేసి, వారుజీవితంలో సక్రమంగా అభివృద్ధిచెందటానికి తోడ్పడుతుంది.     

 పెద్దలు అక్షింతలువేసి దీవించే సమయంలో పిన్నలు వంగి పెద్దల పాదములకు తలనుఆనించి మ్రొక్కడం మరింతశ్రేయోదాయకం. ఎందుకంటే మనిషిలో అయస్కాంతశక్తికూడావుంది. దానికి ఉత్తరధ్రువం తల. దక్షిణద్రువం పాదాలు. పిన్నవారి ఉత్తరద్రువమైన తల, పెద్దల దక్షిణద్రువమైన పాదాలకు సోకినపుడు, ఆకర్షణప్రక్రియద్వారా పిన్నలలోనికి పెద్దల సాత్వికశక్తి ధారాళంగా ప్రసారమై క్షేమకారకమౌతుంది.

 ఇక వివాహసందర్భంలో అక్షతలదీవెనలతోపాటు తలంబ్రాలు(తలప్రాలు)అంటే తలలపై వధూవరులు బియ్యంపోసుకునే, తప్పనిసరి ఆచారం హిందువులలో వుంది. ప్రాలు అంటే బియ్యంగనుక యివీ ఒకరకంగా అక్షతలే, లేదంటే యివి బియ్యంమాత్రమేవధువుచేతిని దర్భలతోతుడిచి దోసిలిలో రెండుమార్లుగా బియ్యంపోసి పైన కొద్దిగా పాలనుచల్లి, తలంబ్రాలను పోయిస్తారు. అదేవిధంగా వరునిచేతకూడా తలంబ్రాలు పోయిస్తారు. ఇందులో కన్య, వరునివంశాన్నివృద్ధిచేయాలని, తద్వారా యిరువంశాలు తరించాలని, తలబ్రాలవలెనే, సమృద్ధిగా ధనధాన్యాలతో తులతూగాలనీ, శాంతి, పుష్ఠి, సంతోషాలతో యేవిఘ్నాలు లేకుండా సహజీవనంచేయాలన్న సందేశం యిందులో యిమిడివుందని విబుధులు చెబుతున్నారు.

 అక్షింతలు అనేమాట, మరోవిధంగా విపరీతార్థంలో కూడా తరచుగా వాడటం తెలుగువారికి పరిపాటి. ఎవరి తప్పునైనా ఎత్తిచూపి దండించడం, లేదా మందలించడాన్ని అక్షింతలువేయడం అని అంటుంటారు. అంతగా అక్షింతలనేమాట తెలుగువారి నోళ్ళలో మెదలుతూవుంటుంది మరి.     

 

Thursday, 9 June 2022

దర్భ, darbha.

 

దర్భ

   

"కుశాగ్రేచ సదావిష్ణుః కుశమధ్యే శివస్మృతః

కుశాంతేచ సదావిధిః కుశః త్రైమూర్తికోవిదుః


హిందువులకు శుభాశూభకార్యాలన్నింటీలో దర్భల  ఉపయోగం తప్పనసరి. దర్భమూలంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, కొసలో విష్ణువు విరాజమానమైవుంటారని శాస్త్రంచెబుతున్నది. శ్రీరామునిస్పర్శచే దర్భలు పవిత్రతను సంతరించుకొన్నవని బుధు ఉవాచ. యజ్ఞయాగాదుల నుండి దేవతాప్రతిష్ఠలలోను, పితరులకుపిండప్రదానాలలోనూ, కుంభాభిషేకాది సందర్భాలలోనూ దర్భలు తప్పనిసరి. యాగశాలకలశాలకు బంగారు, వెండితీగలతోబాటు దర్భనుచేర్చిచుడతారు. వినాయకునికి ప్రీతిపాత్రమైనదిగా భావించి గణపతిపూజలో మిగతాపత్రితోబాటు దర్భనుచేర్చి పూజిస్తారు. కృష్ణయజుర్వేద పరాయతంలో దర్భపవిత్రత గొప్పగాచెప్పబడింది. వైదికకార్యాలలో "పవిత్ర" అన్నపేరుతో కుడి ఉంగరపువ్రేలికి దర్భను ఉంగరంగంగాచుట్టి ధరించి కార్యక్రం నెరవేరుస్తారు. ఉంగరంవ్రేలిగుండ కఫనాడి వెళుతుంది. ఆవ్రేలికి దర్భ ఉంగరం ధరించడంద్వారా కఫంనివారించబడి కంఠంశుభ్రపడి వేదమంత్రాలు స్వచ్ఛంగా పలుకగలుగుతారు. అందుకే వేదాభ్యాసంచేసే విద్యార్థులు దర్భ ఉంగరం తప్పక ధరిస్తారు. ప్రేతకార్యనిర్వహనలో ఒకదర్భను ఉంగరంగాచేసుకుంటారు. వివిధశుభకార్యాలలో రెండు, పితృకార్యాలలో మూడు, దేవకార్యాలలో నాలుగుదర్భలు ఉంగరంగా చుట్టుకుంటారు. అందువల్ల అపవిత్రవస్తువులను తాకినా, చెడువార్తలువిన్నావచ్చే దోషం దర్భదారణతో నివారణమౌతుంది, అంతేగాక వారి ప్రాణశక్తి హెచ్చింపబడుతుంది. దర్భలుకోసేటప్పుడు మంత్రపూర్వకంగా కోసుకరావడం మంచిది. ఆమంత్రం యిది

                        విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ

                           నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

 పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు దర్భలు తీసురావడం అత్యంతశ్రేష్టం. సర్వసాధారణంగా

దర్భలు ఆదివారం కోసితెస్తే ఒకవారంవరకు పనికివస్తాయి. అమావాస్యదినం తెచ్చుకుంటే ఒకమాసం, పున్నమినాడు తెస్తే ఒకపక్షం పనికివస్తాయి. అదే శ్రావణమాసంలో తెచ్చుకుంటే సంవత్సరమంతా వాడుకొనవచ్చును. భాధ్రపదమాసంలోతెచ్చుకుంటే ఒకపక్షంలోనే వాడుకోవాలి. శ్రాద్ధకర్మలకోసం తెచ్చిన దర్భలుమాత్రం యేరోజుకారోజే ఉపయోగించాల్సి ఉంటుంది.

 మత్స్య, కూర్మ, వరాహ, పద్మ, నారద, అగ్ని, స్కాంద పురాణాలలో దర్భలప్రస్తావన, పురాణగాధలూ ఉన్నాయి. వరాహావతారంలో హిరణ్యాక్షుని వధించినతర్వాత బ్రహ్మ అవతారపురుషుని చుట్టూ మూడుప్రదక్షణలు చేస్తాడు. అప్పుడు వరాహమూర్తి సంతోషంతో శరీరం విదిలిస్తాడు. అప్పుడు ఆయన శరీరంనుండి కొన్నిరోమాలు రాలి భూమిమీదపడ్డాయి. అవే దర్భలైమొలిచాయి. కూర్మపురాణం ప్రకారమైతే, మంథరపర్వతాన్ని కూర్మావతారమూర్తి వీపుపై అటూయిటూ కవ్వంగా దేవదానవులు త్రిప్పినపుడు అవతారమూర్తివీపుపైనున్న కొన్ని వెండ్రుకలు రాలి పాలసముద్రంలో పడిపోయాయి. అమృతం ఆవిర్భవించినతర్వాత కొద్దిఅమృతం ఆవెండ్రుకలతోకలసి ఒడ్డుకుచేరి, తర్వాత అవే దర్భలుగా మొలకెత్తాయి. మరోకథనంప్రకారం ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడానికి సముద్రపుఒడ్డుకువచ్చాడు. వృత్రాసురుడు తడిపొడిగానివస్తువుతో తప్ప యితరంతో చావడు. ఆదివానికున్నవరం  తడిపొడిగాని సముద్రనురగను వజ్రాయుధానికిఅంటించి ఇంద్రుడు ప్రయోగించాడు. వృత్రాసురుడు, క్రిందపడిపోయాడు. ఆయాసంతో నీటికొఱకు తహతహలాడాడు. ఆసమయంలో అతనికి నీరుఅందకుండా చేయడానికి బ్రహ్మ దరిదాపుల్లోన్ని నీటిని గడ్డిమొక్కలుగా మార్చేసాడు. ఆగడ్డిమొక్కలే దర్భలు. మరోకథ ప్రకారం తల్లిబానిసత్వం బాపడానికి గరుడుడు అమృతకలశం స్వర్గమునుండి తెచ్చి నాగులుకోరినట్లు నేలపైవుంచాడు. ఆనేలపైదర్భలుండటంచేత ఆదర్భలు అమృతకలశస్పర్శచే అమృతగుణం పొందాయి.  పాములు స్నానంచేసి వచ్చేలోపల ఇంద్రుడు అమృతకలశాన్ని అపహరించుకపోయాడు. పాములువచ్చి కలశంవుంచిన చోటగల దర్భలను నాకాయి. అందువల్ల నాగులకు దీర్ఘాయువు గలగటమేగాక నాకేటప్పుడు వాటినాలుకలు తెగాయట, అందుకే పాములకు రెండుగాతెగిన నాలుకలున్నాయి.

దర్భలతోఅల్లిన చాపను దర్భాసనం అంటారు. ఈఆసనంపై కూర్చొని ధ్యానంచేయడంద్వారా ధ్యానంవల్లపొందిన శక్తి భూమిగ్రహించకుండా ఆపుతుంది. మంత్రపూరితజలప్రభావం తగ్గిపోకుండా ఉండటానికి ఆజలంలో దర్భవేసి ఉంచుతారు. పూజాసమయంలో సహోదరులూ, భార్యాపిల్లలతో అనుసంధింపజేయడానికి దర్భలను అందరికి తాకిస్తారు. హోమంచేసేసమయంలో నాలుగువైపులా దర్భలులుంచితే దుష్టశక్తులను పారద్రోలి యజ్ఞం నిరాటంకంగా జరిగేట్లు చేస్తాయి. బుధులు అష్టార్ఘ్యాలు చెప్పారు. వాటిలో దర్భకూడా ఉన్నది. అవి పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పుష్పములు, దర్భలు. 12 రకాల గడ్డిమొక్కలను  దర్భలుగా పరిగణిస్తారు. అవి కుశలు, కాశములు(రెల్లు), దూర్వ(గరిక), వీహ్రీ(ఎఱ్ఱబుడమగడ్డి), యవలు, ఉసీరములు(వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు(మొలవగడ్డి), గోదుమగడ్డి, కుందరముగడ్డి, ముంజగడ్డి, పుండరీకములు. ముఖ్యముగా దర్భజాతులను అపకర్మలందు, కుశజాతులను పుణ్యకార్యములందు, బర్హిస్సుజాతులను యజ్ఞయాగాదిశ్రౌతక్రతువులందును, రెల్లుజాతులను గృహనిర్మాణకార్యములందును వాడుట మంచిది. దర్భలను విశ్వామిత్రసృష్టిగా కొందరుభావిస్తారు. పితృకార్యములకు దర్భలను సమూలంగా గ్రహించడం అవసరం. దర్భకొసలు పదునుగావుంటాయి. ఇటువంటి దర్భలు దేవతలఆవాహనుకు ఉపయోగిస్తారు.

 దర్భలలో ఆడా, మగ, నపుంసక దర్భలుంటాయి. మొత్తందర్భ  క్రిందినుండిపైవరకు సమంగావుంటే పురుషదర్భయని, పైభాగంమాత్రమే దళసరిగావుంటే స్తీదర్భయని, అడుగుభాగంమాత్రమే దళసరిగావుంటే నపుంసక దర్భయని పరిగణిస్తారు.

 గ్రహణకాలంలో దర్భలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. గ్రహణకాలంలో చంద్రుని లేక సూర్యుని కిరణాలరేడియేషన్ విషయుల్యమై కీడుచేసే ప్రమాదముంది. ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా కిరణాలుతమపై పడకుండా చూసుకోవాలి. అంటే ఇంట్లోనేవుండాలి. నీరు మరియు ఆహారపదార్తాలలోకూడా దర్భవేసి వుంచితే అవి దూషితాలుకాకుండా వుంటాయి. ఈవిషయంపై అధ్యయనంచేసి పదార్తాలు చాలాకాలం చెడిపోకుండా నిలువచేయగల గుణం దర్భలకుందని తెలుసుకున్నారు. కనుక ప్రిజర్వేటివ్‍లుగా దర్భలువాడవచ్చని నిరూపణయింది.

 దర్భలు ఆయుర్వేదంలోనూ, హోమియోపతిలోనూ ఔషదములుగా వాడుతున్నారు. దర్భలతోచేసినమందులు చలువచేస్తాయి. మూత్రం సాఫీగాజారీఅయ్యెట్లు చేస్తాయి. మంటతో మూత్రం బొట్లుబొట్లుగా రావడాన్ని నయంచేస్తాయి. పాలిచ్చేతల్లులకు క్షీరవర్ధినిగా పనిచేస్తాయి. ఉబ్బసము, బంకవిరేచనాలు, కామెర్లు, పైత్యప్రకోపాలు నయమౌతాయి. వీర్యవృద్దికితోడ్పడుతాయి. ఇలా దర్భలు అనేకసుగుణాలు కలిగియున్నాయి.                

 

Friday, 3 June 2022

tulasi, తులసి

 


తులసి

  

శ్లో: యన్మూల్యే సర్వతీర్థాని యన్మధ్యేసర్వదేవతా

                         యదగ్రే సర్వవేదాని తులసిత్వామ్ నామామ్యాహమ్//

 తులసి హిందువులకు పరమపవిత్రమైనది. దేవతాస్వరూపం తులసిని విష్ణుకామిని యని, విష్ణుభూషణమని, విష్ణుపాదస్థల నివాసినియని వైష్ణవులుభావిస్తారు. తులసితీర్థం గంగాజలంతో సమానమంటారు. తులసిలో ఏడురకాలున్నాయి. కృష్ణతులసి, రామతులసి, లక్ష్మీతులసి, విష్ణుతులసి, వనతులసి రకాలు ముఖ్యమైనవి. అన్నీ పవిత్రమైనవే, అయినా కృష్ణతులసి ప్రాముఖ్యమెక్కువ. దైవకార్యాల్లోనూ, పితృకార్యాల్లోనూ తులసీదళాలు తప్పనిసరి. ఇదిలేనిదే దేవతలనుగానీ, పితృదేవతలనుగానీ ఆవాహనచేయలేరు. దుష్టశక్తులని దరిచేరనివ్వదు. అందుకే తులసిచెట్టును ప్రతిగృహంలోనూ పెంచుకుంటారు. కోటవలె రక్షణకల్పించాలని కోటరూపంలో తొట్టిని నిర్మించుకొని అందులో తులసిచెట్టును నాటుకొని, ఇరుసంధ్యలలో దీపంపెట్టి మరీపూజిస్తారు. తులసి ప్రతికూలతలను, వాస్తుదోషాలను తొలగిస్తుంది. శుక్రగ్రహదోషంవల్ల కలిగే వైవాహికసమస్యలు రామతులసిపూజవల్ల తొలగిపోతాయి. శనిగ్రహదోషంవల్ల కలిగే ఆయుర్ధాయసమస్యలు, అనారోగ్యాలు, ఏల్నాటిశనిబాధలూ కృష్ణ(నల్ల)తులసిపూజవల్ల తొలగిపోతాయి.


 తులసికిసంబంధించి అనేకపురాణగాథలున్నాయి. ఈమెతొలుత గోలోకవాసి. తులలేని సౌదర్యవతిగావున తులసియయ్యింది. సర్వలోకాధిపతి శ్రీకృష్ణుని పరమభక్తురాలు. ఈమెది మధురభక్తి. శ్రీకృష్ణమోహంతో ఒకదినమామె మూర్చపోయింది. రాధ ఆమెనుగమనించి కృష్ణప్రేమలో నాతోపోటీపడతావా? రాక్షసివైపుట్టుమని శపిస్తుంది. గోలోకంలోనే వుంటున్న మరొకకృష్ణభక్తుడు సుధామ, తులసిని శపించడం అన్యాయమనీ, శాపమునుపసంహరించమని రాధాదేవిని ప్రాధేయపడ్డాడు. కోపంతోవున్నరాధ తులసికీనీకు యేమి సంబంధం. నీవెందుకు జోక్యంచేసుకుంటున్నావు, నీవుకూడా రాక్షసుడవై జన్మించు అని శపించేసింది తర్వాతరాధాదేవి శాంతించి, తనతప్పు తెలుసుకొని, దయచూపి, నాశాపమునకు తిరుగులేదు. అయినామీరు శ్రీకృష్ణకృపాకటాక్షమునకు పాత్రులై లోకప్రసిద్ధిగాంచెదరని దీవించింది. తులసి కాలనేమిఅనే రాక్షసుని కూతురై జన్మిస్తుంది. సుధాముడు శంఖచూడుడనే రాక్షసుడైజన్మించి తులసిని వివాహమాడుతాడు. ఇది బ్రహ్మవైవర్తపురాణగాథ, ఈపురాణంప్రకారం గోలోకంలో రాధాకృష్ణులు విరాజమానమైయుండి, లోకాలను పాలిస్తుంటారు. త్రిమూర్తులు వారిఆజ్ఞానుసారం అప్పజెప్పిన కార్యనిర్వహణ జేస్తారు. శ్రీకృష్ణుడు విష్ణువుయొక్క అవతారం కాదు. కృష్ణుడే సర్వలోకాధిపతి. శివపురాణంప్రకారం తులసిభర్తపేరు జలంధరుడు. శివుని నయనాగ్నిజ్వలనుండి ఉద్భవించినవాడు. మిలిలినకథ దాదాపు సమానమే. జలంధరుడు మహాబలవంతుడు. దేవతలను ఓడించి స్వర్గంనుండి వారిని తరిమేస్తాడు. దేవతలు శంకరుని శరణుజొచ్చి కాపాడమని ప్రార్థిస్తారు. శంకరుడు విష్ణువుతోకలసి వ్యూహరచనజేస్తాడు. శివుడు జలంధరుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తులసి కీడునుశంకించి తనపతికి ఆపదకలుగకుండుటకై  ధ్యానంలోనిమగ్నమౌతుంది. జలంధరునితోయుద్ధం శివునకు దుస్సహమౌతుంది. తులసిధ్యానం భంగమైతేనేగాని జలంధరుడు చావడని గ్రహించిన విష్ణువు జలంధరునిరూపంలో తులసిదగ్గరకువెళ్ళి, తులసీ! నేను యుద్ధరంగంనుండి క్షేమంగా తిరిగివచ్చాను, బ్రహ్మరాయబారంవల్ల సంధికుదిరి యుద్ధం ముగిసింది. ఇకనీవు ధ్యానం విరమించు, అన్నాడు. భర్తక్షేమంగా రణభూమినుండి తిరిగివచ్చాడని సంతోషించి తపంచాలించింది తులసి. ఇదేఅదనుగా శంకరుడు జలంధరుని సంహరించేశాడుచారులు పరుగుపరుగునవచ్చి తులసికి జలంధరుని మరణవార్త చెబుతారు. విష్ణువు నిజరూపుదాల్చి, తులసీ! జలంధరుడు లోకకంటకుడు. అతడు శివునిచే మరణించక తప్పదు. మహాపతివ్రతవైన నీధ్యానం భంగమైతేనేగాని అతడుమరణించడు. అందుకే నేనిలాచేయవలసి వచ్చిందంటాడు. తులసి కోపోద్రిక్తురాలై, విష్ణువును శిలగామారమని శపిస్తుంది. అంతేగాకుండా, నావలెనీవూ వియోగబాధననుభవింపుమని శపిస్తుంది. ఆ కారణంగా విష్ణువు గండకీనదిలో సాలగ్రామమైపుట్టి ఆరూపంలోనే పూజలందుకుంటున్నాడు. అలాగే రామావతారంలో సీతావియోగక్లేశాన్ననుభవించాడు. మహావిష్ణువు తులసి శాపాన్నిచిరునవ్వుతో స్వీకరించి ,తులసిని నిందించక, ఆమెననుగ్రహించి తులసీ! నీవు పరమపవిత్రురాలవు. మరుజన్మలో తులసిచెట్టువై పుట్టి, నాతోసమానంగా పూజలందుకుంటావు. తులసీమాలధరింపజేసి, తులసీదళములతోచేసేపూజనాకు  ప్రియాతిప్రియమైవుంటుంది, అని శ్రీమహావిష్ణువు తులసిని దీవిస్తాడు. ఇదీ తులసి పురాణగాథ.              

 

తులసిచెట్టును యింట్లో ఏదిశలోనైనా పెంచుకోవచ్చు. కానీ ఈశాన్యదిశశ్రేష్ఠం. ఇంట్లోకి గాలివచ్చు మార్గంలో పెట్టుకుంటే గాలిశుభ్రమై యింట్లోకి ప్రవేసిస్తుంది. తులసిపూజవల్ల స్త్రీలకువైధవ్యప్రాప్తి కలుగదన్నది గొప్పవిశ్వాసం. తులసి సర్వపాపనాశిని. సంస్కృతంలో తులసిని సురసా, సులభ, బహుమంజరీ, దేవదుందుభి, వృందా అనే నామాలున్నాయి.

 

తులసిమాలధారణకొక ప్రత్యేక స్థానమున్నది. తులసికాండంతో పూసలుతయారుచేసుకొని, మాలలల్లుకుంటారు. ఇవి ఎవరికివారే తయారుచేసుకోవడం మంచిది. కృష్ణజన్మస్థానమైన మథురపట్టణంలోని నిధివన్ మరియు సేవాకుంజ్ వనాలలోని తులసిచెట్లనుండి తయారుచేసినవి విక్రయిస్తారు. వీటికి ప్రత్యేకశ్రేష్ఠత కలదని విశ్వసిస్తారు. మరణమాసన్నమైనపుడు తులసితీర్థం పోస్తారు. అంతేగాకుండా తులసిమాల ధరింపజేస్తారు. అందువల్ల పాపాలన్నీ తొలగిపోయి నేరుగా వైకుంఠం వెళతారని హిందువుల ప్రగాఢవిశ్వాసం. విష్ణుభక్తులు జపంచేసుకోవడానికి తులసిమాల నుపయోగిస్తారు.    

మెడలోమాలగాకూడా నిత్యంధరిస్తారుతులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి,” తులసీస్పర్శనేరైవ నశ్యంతి వ్యాదయో నృణామ్” అన్నది  అర్యోక్తి. తులసిమాల ధరించునప్పుడు,తులసితీర్థం తీసుకునేప్పుడు  యీ మంత్రంపఠించడం  అత్యంత శ్రేయోదాయకం.

      ప్రసీద దేవదేవేశి,  ప్రసీద హరివల్లభే

          క్షీరోదమాధనోద్భూతే  తులసి త్వాం నమామ్యహమ్”

 జపంవల్ల చేతిలోని ఆకుపంచర్ పాయింట్స్ పై ఒత్తిడికలిగి మానసికప్రశాంతతకు దారితీస్తుంది. మాలధారణద్వారా ఒకవిధమైన విద్యుత్ శక్తితరంగాలు ఉత్పన్నమై రక్తప్రసారం సజావుగాజరగడానికి తోడ్పడి తద్వార రక్తపోటు నియంత్రణలోవుంటుంది . ఈశక్తితరంగాలవలన సాత్వికతపెంపొంది స్వరం శ్రావ్యంగామారుతుంది. గుండె, ఊపితిత్తులు క్రమబద్ధంగా పనిచేయునట్లుచేసి రోగాలురాకుండా చూస్తుంది. అతిపురాతనమైన ఋగ్వేదంలోనూ చరకసంహితలోనూ తులసి ప్రస్తావనవుంది. ఇప్పుడుకూడా తులసిగింజలచూర్ణాన్ని, తులసిగింజలనుండి తీసిన తైలాన్ని వైద్యరంగంలో విరివిగా వాడుతున్నారు. గింజలలో ఆంటీఆక్సిడెంట్లు ఎక్కువగావుండటంవలన  రోగనిరోధకశక్తిని పెంచడమేగాకుండా, క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి మనకు రక్షణనిస్తుంది. ఒకగ్రాము తులసిగింజలచూర్ణం రాత్రికి నీళ్ళలోనానబెట్టి ఉదయంపడగడుపున సేవిస్తే వీర్యరక్షణకు, వృద్ధికి సహాయపడుతుంది. అధికబరువునుతగ్గిస్తుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తనాళాలలోక్రొవ్వు నియంత్రణలోవుంటుంది. వయస్సుపెరిగినా చర్మంపై  త్వరగాముడుతలు పడనీయదు. రక్తహీనతరానివ్వదు. విత్తనాలను నమలడంద్వారా నోటిదుర్వాసన పోతుంది. సేవనంద్వారా కడుపులో నులిపురుగుగులు నశిస్తాయి. మలబద్దకం పోతుంది. చర్మవ్యాధులు నయమౌతాయి. బొల్లి, ధనుర్వాతం, ప్లేగువ్యాధులను నయంచేస్తుంది. తులసితైలం, పట్టించడంద్వారా కీటకాలకాటువల్ల కలిగే మంటను నివారిస్తుంది. గాయాలను తొందరగామాన్పుతుంది. పులిపిర్లు రాలిపోయేట్లుచేస్తుంది. కాళ్ళపగుళ్ళును మాన్పుతుంది. అంతెందుకు కరోనాకుకూడా మంచిమందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తులసితైలాన్ని కేశతైలాలలోకూడాకూడా విరివిగావాడుతున్నారు. దీనివల్ల వెంట్రుకలురాలిపోవడం తగ్గుతుంది. తలలోపేలు, చుండ్రుపోయి జ్జాపకశక్తిని పెంచుతుంది. కంటిచూపునుమెరుగుపరుస్తుంది. ఇటువంటి ఐదువందల రుగ్మతలను నయంచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలుగల తులసిని ఎంతశ్లాఘించినా తక్కువే ఔతుంది.  

 

 

 

 

 

 

Monday, 16 May 2022

నవరత్నాలు

 

నవరత్నాలు

జ్యోతిషశాస్త్రానికి నవరత్నాలకు సంబంధం ఉందని వేలసంవత్సరాలనుండి జనులు విశ్వసిస్తున్నారు. స్వచ్ఛమైనరత్నాలు సకారాత్మకశక్తి ప్రకంపనలు (పాజిటివ్ ఎనర్జి వేవ్స్) ఉత్పన్నంచేసి భౌతిక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు మనిషికి చేకూస్తాయని నమ్ముతున్నారు. వైద్యశాస్త్రంలోగూడా వీటికి సముచిత స్థానమున్నది. నవరత్నాలను వేరువేరుగా స్వచ్ఛమైనసారాయి (ప్యూర్ ఆల్కహాల్) లో వుంచి వాటిశక్తిని సారాయిలోనికి ప్రవహింపజేస్తారు. ఆసారాయిని హోమియోవిధానంలో ఔషదాలుగా చక్కెరగుళిక (గ్లోబుల్స్) లలో కలిపి వైద్యంచేయుచున్నారు. ఆయుర్వేదంలోనైతే పగడభస్మం, ముత్యభస్మం వంటివి ఎప్పటినుంచోవాడుకలోఉన్నాయి. రత్నాలుధరించడంతోనే కొన్ని జబ్బులు నయమౌతాయని నమ్ముచున్నారు. రత్నాలలో దైవికశక్తులున్నాయని జ్యోతిష్యుల నమ్మకం.   ఆరోగ్యం, అదృష్టం, ఐశ్వర్యం , ఉద్యోగం పొందటానికి వారివారి గ్రహస్థితి, రాశి, నక్షత్రాన్నిబట్టి రత్నశాస్త్రనిపుణత్వంగల జ్యోతిష్యులు నిర్ధారించి ధరింపజేస్తున్నారు. రత్నాలు మానవజాతికందిన భూ మరియు జలసంపద. అందుకే భూమిని రత్నగర్భయని సముద్రాన్ని రత్నాకరమని పిలుస్తున్నారు.

ఈనవరత్నాలకు సంబంధించి ఒకపురాణగాథ వున్నది. అదేమంటే, ఇంద్రుడు బాలాసురుడనే రాక్షసుని దేవతలక్షేమార్థం సంహరించాడు. ఆరాక్షసుడి శరీరం తునాతునకలై వేర్వేరురంగులలో మెరుస్తూ నవగ్రహాలపై పడ్డాయి. ఆ ముక్కలే నవరత్నాలు. నవగ్రహాలు రత్నాలవర్ణాన్ని గ్రహించాయి. రత్నాలు నవగ్రహాలశక్తిని గ్రహించాయి. గ్రహాలనుండి వెలువడుతున్న విద్యుదయస్కాంతకాంతితరంగాలను నవరత్నాలు గ్రహించి తిరిగీ బయటికీ కాతితరంగాలుగా నవరత్నాలు వెదజల్లుతూవుంటాయి. ఈకాంతితరంగాలు కనబడనంత సూక్షంగావుండి రంగునుమార్చుకొని ప్రసారమౌతూవుంటాయి. ఇలా మార్చుకున్న రంగులనే "కాస్మిక్ కలర్స్" (అంతరీక్షవర్ణాలు) అంటారు. ఇవి మనిషిపై తమ అద్భుతప్రభావాన్ని చూపిస్తాయి. పసుపుపచ్చ బంగారు రంగులోవుండే పుష్యరాగం కాశ్మిక్ వర్ణం నీలంగా వుంటుంది. నీలంరత్నం యొక్క కాస్మిక్ వర్ణం వైలెట్. ఎఱుపుకాషాయం కలసియున్న పగడం కాస్మిక్ రంగు నారింజ. గోదుమవర్ణంలోగల గోమేదికం కాస్మిక్ రంగు అతినీలలోహితం (ఆల్ట్రావైలెట్). బూడిదరంగుగల వైడూర్యం కాస్మిక్ వర్ణం ఎఱుపు (ఇన్ఫ్రారెడ్). కెంపు (మాణిక్యం) అసలురంగు కాస్మిక్ రంగు ఎఱుపే. అట్లే పచ్చరత్నం అసలురంగు కాశ్మిక్ రంగు పచ్చే.

 ముత్యాలలో స్వాతిముత్యం అత్యంతశ్రేష్ఠమైనదిగా భావిస్తారు. స్వాతికార్తెలో అంటే సూర్యుడు స్వాతినక్షత్రంలో సంచరించేటప్పుడు ముడుచుకొనియున్న ముత్యపుచిప్పలు తెరుచుకుంటాయి. ఆసమయంలో పడే వర్షపుచినుకులు ముత్యపుచిప్పలో పడగానే ముడుచుకుంటాయి. అలా ముత్యపుచిప్పలో పడిన వర్షపుచినుకులే కొంతకాలానికి ఘనీభవించి స్వాతిముత్యాలౌతాయంటారు.

 మనశరీరం సప్తధాతునిర్మితం. ఈధాతువులపై నవగ్రహాలప్రభావంవుంటుంది. ఆ గ్రహాలతో సంబంధంవున్న రత్నాలు ధరించడంద్వార క్షీణదశలోనున్న ధతువులలో సతుల్యతను తీసుకవచ్చి శారీరక, మానశిక శక్తులకు పునర్జీవాన్నిస్తాయి. తద్వారా ఆరోగ్యం పరిరక్షింపబడుతుంది. సప్తధాతువులలో చర్మానికి శుక్రుడు, నాడీమండలానికి బుధుడు, క్రొవ్వుకు బృహస్పతి. కండరాలకు కుజుడు ఎముకలకు శని. ఉపస్తుకు శుక్ర కుజులు. స్నాయువులు (సన్నని నరాలు) కు రవి చంద్రులు ప్రాతినిథ్యయం వహిస్తారు. ఏరత్నం యేగ్రహానుకి సంబందించి   దో క్రిందతెలుపబడింది. నవరత్నాలను శుద్ధిచేసి ఆరత్నాల ప్రత్యేక మంత్రాలను నూటయెనిమిది సార్లుజపించి, పూజించి ధరించడంవల్ల వాటిశక్తి అధికమై సత్వరఫలితాలనిస్తాయి. శుద్ధికి ఉపయోగించు పదార్తాలు, మంత్రాలు, ఏరత్నాలు యేధాన్యంలోవుంచి పూజించాలో కూడ క్రిందతెలుపబడింది. ఆప్రకారం శుచియై పూజించి ధరించుట క్షేమకరం. పూజానంతరం ఉపయోగించిన ధాన్యాన్ని దానంచేయవచ్చును లేదా దేవాలయాలలోని నవగ్రహాలకు సమర్పించవచ్చును.

 1. కెంపు (మాణిక్యం). సూర్యునకు ప్రతినిధ్యం వహిస్తుంది. బాలసూర్యునువంటి ఎఱుపురంగులో వుంటుంది. రత్నాలలో యిది రాజు. ధరించునవారికి సమర్థప్రభులక్షణాలను ప్రసాదిస్తుంది. ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉత్తమస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగజేస్తుంది. శుద్ధికి ఆవుపాలు, గంగాజలం ఉపయోగించాలి. గోధుమధాన్యంలోవుంచి పూజించాలి. మంత్రం- ఓందృణిః సూర్యాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత అదివారం మధ్యవ్రేలికి ధరించడం మంచిది. సింహరాశివారికిది మిక్కిలి శుభకరం.

 2. ముత్యం (మౌక్తికం). చంద్రునకు ప్రతీక. పాలవంటితెల్లనిమెరుపుగలిగి వుంటుంది. రత్నాలలోయిది రాణివంటిది. వివాహయోగం, దాంపత్యానుకూలత, స్త్రీసౌక్యం, ధనధాన్యాభివృద్ధి, మేహశాంతి, హృదయరోగనివారణ గావిస్తుంది. స్త్రీలపాలిటి కామధేనువు. శుద్ధికి సైంధవలవణం, వరిపొట్టు ఉపయోగించాలి. బియ్యంలోవుంచి పూజించాలి. మంత్రం ఓంసోమాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలిసారి ఉంగరపువ్రేలికి సోమవార ధరించాలి. కర్కాటకరాశివారికిది మిక్కిలి శుభకరం.  

 3. పగడం (ప్రవాళం). చిలుకముక్కు లేదా దొండపండురంగులో వుంటుంది. కుజగ్రహానికి ప్రతినిధ్యం వహిస్తుంది. రత్నాలలో యిది సేనాపతి. నాయకత్వలక్షణాలను ప్రసాదించి ఉద్యమాలను విజయవంతంగా నడిపింపగల శక్తినిస్తుంది. శత్రుసంహారంలో సహాయపడుతుంది. సాహసం, ధైర్యం అధికారాన్నిస్తుంది. ఋణవిమోచనకారి. మాటకు గౌరవాన్నిచ్చి, చెల్లుబాటయ్యేట్లు చేస్తుంది. శుద్ధికి రక్తచందనగంధం కలిపిననీరు, ఆవుపాలు, కుంకుమపువ్వు కలిపిననీరు ఉపయోగించాలి. కందులలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం అం అంగారకాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత గురువారంనాడు బొటనవ్రేలికి ధరించాలి. మేషరాశివారికిది మిక్కిలి శుభకరం.

 4. మరకతం (పచ్చ). గరికచిగుళ్ళు లేక నెమలిపింఛం వర్ణంలోవుండి బుధగ్రహానికి ప్రతీకగావుంటుంది. వంశపారంపర్యంగావస్తున్న వ్యాపారంలో రాణింపునిస్తుంది. విషాన్నిహరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిలోపాలనుతొలగిస్తుంది. నరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. శుద్ధికి ఆవుమజ్జిగ, గోమూత్రం, పసుపుకలిపిననీరు ఉపయోగించాలి. పెసలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం బుధాయ నమః. ఉంగరంలోపొదిగించుకొని తొలుత బుధవారం ఉంగరంవ్రేలికి ధరించాలి. ఇది కన్య, మిథునరాసులవారికి మిక్కిలి ప్రయోజనకరం.

 5. పుష్యరాగం. పసుపుపచ్చ బంగారువర్ణంలో వుంటుంది. గురుగ్రహానికి ప్రతీక మేధస్సును పెంచుతుంది. ఆదర్శగుణాలను వృద్ధిచేస్తుంది. ఋణవిమోచనం గావిస్తుంది. శత్రులపై విజయాన్నిస్తుంది. ఉద్రేకం, ఆందోళనలను తగ్గిస్తుంది. పుత్రసంతానం, వంశవృద్ధికి తోడ్పడుతుంది. శుద్ధికి ఉలవలు ఉడికించిననీరు, శనగలుఉడికించిననీరు ఉపయోగించాలి. శనగలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం బృహస్పతయేనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత గురువారం బొటనవ్రేలికి ధరించాలి. ఇది మీన, ధనుర్రాశి వారలకు మిక్కిలి శుభకరం.

 6. వజ్రం. తీర్చినకోణాలతో తెల్లగా స్వయంప్రకాశంతో మెరుస్తూవుంటూంది. అన్నిటికంటే విలువైనది. శుక్రగ్రహానికి ప్రతీక. మేధస్సునుపెంచి స్వీయాభివృద్ధికి తోడ్పడుతుంది. నూతనతేజస్సునిస్తుంది. కళాకరులకు రాణింపునిస్తుంది. సంపదకలుగజేస్తుంది. సంసారజీవనం సాఫీగాసాగనిస్తుంది. సుఖాన్నిస్తుంది. స్త్రీలసుఖప్రసవాలకు తోడ్పడుతుంది. కలరా, ప్లేగు వంటి వ్యాధులనరికడుతుంది. శుద్ధికి బొబ్బర్లు (అలసందలు) ఉడికించిననీరు, బియ్యంకడిగిననీరు, ఆవుపాలు ఉపయోగించాలి. బొబ్బర్ల (అలసందలు) లోవుంచి పూజించాలి. మంత్రం- ఓం శుక్రాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత శుక్రవారంనాడు మధ్యవ్రేలికి ధరించాలి. వృషభరాశివారికిది అత్యంతశ్రేయస్కరం.

 7. నీలం. ఇది శనిగ్రహానికి ప్రతీక. ఇతరులఆలోచనలలోని మంచినిగ్రహించి అమలుపరచగల సమర్థతనిస్తుంది. అపమృత్యువును అడ్డుకుంటుంది సంఘంలో గౌరవం, పలుకుబడి పెంచుతుంది. ధనలాభం కలిగిస్తుంది. శనిగ్రహదోషలను తొలగిస్తుంది. ఇందులో ఇంద్రనీలం, మహానీలం, నీలమణి అని మూడు రకాలున్నాయి. మొదటిది కాస్తానల్లగాను, రెండవది నీలిఆకురంగులోనూ, మూడవది నెమలికంఠంరంగులోనూ వుంటుంది. శుద్ధికి నల్లనువ్వులనూనె, నీలిచెట్టుఆకురసం, నల్లద్రాక్షరసం ఉపయోగించాలి. నల్లనువ్వులోవుంచి పూజించాలి. మంత్రం- ఓం శం శనేశ్వరాయనమః. ఉంగరంలో పొదిగించుకొని తొలుత శనివారం చూపుడువ్రేలికి ధరించాలి. కుంభ, మకరరాశులవారికిది మిక్కిలి శుభకరం.

8. గోమేదికం. సహజమైనగోమూత్రవర్ణంలో మెరుస్తూ వుంటుంది రాహుగ్రహానికిది ప్రతీక. సంపాదించాలనేఉత్సాహానిస్తుంది. నష్టాలనురానివ్వదు. స్త్రీమూలంగాసహాయం లభింపజేస్తుంది. వశీకరణ సిద్ధింపజేస్తుంది. ఆవేదనలను దరిచేరనివ్వదు. శుద్ధికి మాదీఫలరసం, తేనె, గోమూత్రం ఉపయోగించాలి. మంత్రం- ఓం ఐం హ్రీం రాహవేనమః. మినుములలోవుంచి పూజించాలి. ఉంగరంలో పొదిగించుకొని తొలుత శనివారం చూపుడువ్రేలికి ధరించాలి. ఏరాశివారికైనా యిదిమంచిదే. 

 

9. వైడూర్యం. బూడిదరంగులో వుంటుంది. కేతుగ్రహానికిది ప్రతీక. దురాశనిది దూరంచేస్తుంది. అమితంగాఆర్జించాలనే దురాశను తగ్గిస్తుంది. తమోగుణాన్నిది అదుపులోపెడుతుంది. జ్ఞానం, మనోనిబ్బరాన్నిస్తుంది. సద్భావన, సజ్జనసాంగత్యం కలిగేట్లుచేస్తుంది. శుద్ధికి ఉలవలుఉడికించిననీరు, తేనె, పంచగవ్యాలు, పంచామృతాలు ఉపయోగపడతాయి. ఉలవలలోవుంచి పూజించాలి. మంత్రం- ఓం ఐం హ్రీం కేతవేనమః. ఉంగరంలో యీరత్నం పొదిగించుకొని తొలుత శనివారం చిటికెనవ్రేలికి ధరించాలి. ఏరాశివారికైనా యిదిమంచిదే.

 ఉంగరంలో మొత్తం నవరత్నాలు పొదిగించుకోవడం కూడా చాలామంది చేస్తున్నారు. బంగారుతోచేయించుకొని యీ నవరత్నఖచిత ఉంగరాలు ధరించవచ్చును. ఐతే రత్నాలన్నీ ఒకేసైజులోవుండాలి. కెంపు (మాణిక్యం) అతిముఖ్యమైన సూర్యగ్రహప్రతీక గనుక మధ్యలోవుండితీరాలి. కెంపుకు తూర్పున వజ్రం, పడమర నీలం, ఉత్తరాన వైడూర్యం, దఖ్షిణాన పచ్చ, ఈశాన్యాన పగడం. ఆగ్నేయంలో ముత్యం. నైరుతిన గోమేదికం. వాయువ్యమున పుష్యరాగం ఉండేటట్లు పొదిగించుకోవాలి. బ్రాస్లైట్ లేక యితరనగలలోనైతే కెంపు మధ్యలో ఉండేట్లు చేయించుకోవాలి. దక్షిణాదివారు హారంమధ్యలో నవరత్నాల దీర్ఘచతురస్రడాలర్ ఉండేట్లు ధరిస్తున్నారు. ఇందులో 12 వరుసల్లో నవరత్నాలు పొదిగించుకొనుచున్నారు. ప్రతివరుసమధ్యలో కెంపు వుండేట్లు పొదిగించుకోవడం ముఖ్యం.

 రత్నశాస్త్రం తెలిసిన వారి సలహా మేరకే రత్నాలు కొనడం మంచిది. నకిలీరత్నాలను గుర్తించడం సామాన్యులకు కష్టం. నకిలీరత్నాలు వాడటం శ్రేయస్కరంకాదు.

 "యోగం" అంటే కలయిక. ఇది భగవదైక్యాన్ని సూచిస్తుంది. నిష్కాములై యోగాభ్యాసం చేసేవారికి ఇతరవస్తువులతో, వేరుప్రక్రియలతో పనిలేదు. భగద్శక్తి వారిలోనికి కోరకనే ప్రసారమౌతూవుంటుంది. ఆశక్తి ముందు యితరశక్తులు నామమాత్రమే. ఇది మనందరం జ్ఞాపకముంచుకోవలసిన ముఖ్య విషయం. 

// ఓం తత్ సత్ //

 

 

 

 

 

Tuesday, 10 May 2022

రుద్రాక్ష

 

రుద్రాక్ష



రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
                                                                     ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః
                                                                     పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
                                                                     ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః

 రుద్రాక్షను హిందువులు అత్యంతపవిత్రంగా భావిస్తారు. శైవమతానుయాయులు దీన్ని సాక్షత్తూశివస్వరూపంగా పూజిస్తారు. పదునొకండువందల రుద్రాక్షలు ధరించిన జంగమదేవరను శివపరమాత్మగా భావించి పూజిస్తారు. "రుద్రాక్ష ధారణాత్ రుద్రోభవత్యేవ నసంశయః" అని దేవీభాగవతం చెబుతున్నది. రుద్రాక్షవృక్షాలు శివుని కన్నీటిబిందువులు భూమిపైబడి మొలిచాయని పురాణాలు చెబుతున్నాయి. శివునిబాష్పకణాలు భూమిపైబడిన సందర్భాలు వివిధములుగా చెప్పబడుతున్నాయి. శివుడు శక్తివంతమైన అఘోరాస్త్రం పొంది త్రిపురాసురులను సంహరించటానికి తీవ్రమైన బహుకాలతపమాచరించాడు. తపముఫలించి సమాధినుండిలేచి కళ్ళుతెరిచాడు. అప్పుడు ఆయనకళ్ళనుండి నీటిబొట్లురాలాయి. ఇదొకకథనం. మరొకకథప్రకారం, శివుడు త్రిపురాసురులను సంహరించి, వారిచావుకు చింతించి కన్నీరుకార్చాడు. మరోకథప్రకారం సతీదేవి, తండ్రిదక్షుని నిరాదరణకు గురై తన్నుతాను దహించుకొని ప్రాణత్యాగంచేసింది. అదితెలిసిన శివునికన్నులనుండి నీటిబొట్లు రాలాయి. ఏదియేమైనా శివునికన్నీటిబొట్లే రుద్రాక్షవృక్షాలైనాయన్నది మనం గ్రహించవలసియున్నది. ఈబాష్పజలబిందువులు శివుని ఎడమకంటినుండి 12 , కుడికంటినుండి 16, మూడవనేత్రమైన అగ్నినేత్రం నుండి నల్లని10 బిందువులు భూమిపైబడి మొత్తం 38 రకాల వృక్షాలు మొలిచాయి. ఇవి గౌడ, కాశి, అయోధ్య వంటి క్షేత్రాల్లోను, మలయ, హిమాలయ, సహ్యాద్రి ల్లాంటి పర్వతప్రాంతాల్లోను పడి రుద్రాక్షవృక్షాలు మొలిచాయంటారు.

శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చె బుతారు.

 “స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్,

    భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్

    లక్షంతు దర్శనా త్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్ ”-- జాబాలోపనిషత్.

 అంటే భక్తుల ననుగ్రహించ డానికే రుద్రాక్షలు స్థావరాలుగా (వృక్షాలుగా) అవతరించాయి. వీటినిధరించిన భక్తుల పాపాలు ఏరోజు కారోజుననే నశిస్తాయి. దర్శింనా, ధరించినా కోటిజన్మలపుణ్యం లభిస్తుంది  

 వృక్షశాస్త్రంప్రకారం ఇది మాగ్నొలియోఫైటా జాతికి చెందిన,ఎలాయోకార్పాస్ వర్గవృక్షాలు. నునుపుగా, గట్టిగా, ముడులుముడులుగా నున్న పెద్దరుద్రాక్షలు ధారణకైనా, జపానికైనా మంచివి. ఇవి ఉసరికకాయంతవి, రేగుపండంతవి, గురివింద(శనగ)లంతవిగా లభిస్తాయి.ఇవి ప్రమణాన్నిబట్టి ఉత్తమ,మధ్యమ,అధమ పలితలిస్తాయని శాస్త్రం. 

                            ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
                              బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే బుధై:
                             అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే

చిన్నరుద్రాక్షలు తాంత్రికవిద్యాసాధకులు ధరిస్తారు, రుద్రాక్షలనుగురించి శివపురాణం, రుద్రాక్షోపనిషత్తు, రుద్రకారుణ్యమహాత్మ్యం, దేవీభాగవతం, రుద్రజాబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కందపురాణం, పద్మపురాణాలలో వివరణలున్నాయి. అన్నివర్ణాలవారూ రుద్రాక్షలు ధరించవచ్చు. ఋషులు, మునులు, రాక్షసులు, దేవతలుసైతం రుద్రాక్షలు ధరించినవారే. పూజారులు, గురువులు, వేదాంతులు వీటిని ధరిస్తున్నారు. మామిడిచెట్టును పోలియుండు రుద్రాక్షచెట్లే ఫలాలనిస్తాయి. నీలిరంగులో పండ్లుంటాయి. కాస్తాపుల్లనిరుచిగల గుజ్జులో రుద్రాక్ష వుంటుంది. పండుగావుండగా కోడిగ్రుడ్డుఆకారంలోవుండి ఎండిపోయినతర్వాత గుండ్రంగా మారుతాయి. పండుమాగినతర్వాత గుజ్జు నుండివేరుచేసిగాని, ఎండినఫలాలనుండిగాని రుద్రాక్షలు సేకరిస్తారు. తొడిమ తొలగించిచూస్తే రుద్రాక్షమధ్య రంధ్రం కనబడుతుంది. ఈరంధ్రంద్వార దారం లేదా వెండి,బంగారు తీగగానీ పోనిచ్చి మాలలు తయారుచేస్తారు. వైద్యశాస్త్రరీత్యా ఇది క్షయనివారిణి, కఫ, వాతరోగాలను హరిస్తుంది. నీటితోఅరగదీసి నాకిస్తే మశూచిని, తేనెతోఅరగదీసినాకిస్తే మూర్ఛలను నయంచేస్తుంది.

 రుద్రాక్షకుండే చారలనుబట్టి రుద్రాక్షముఖాలను నిర్ణయిస్తారు. ముఖాలనుబట్టి వాటి ప్రత్యేకతలుంటాయి. అవసరాన్నిబట్టి ధరించదలచినవారు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో నిర్ణయించుకుంటారు. అలాకాక కొందరు వారిజన్మనక్షత్రాన్ని బట్టి రుద్రాక్షను ఎంపికచేసుకుంటారు. మరికొందరు నవరత్నాలకుబదులు రుద్రాక్షలను ఎంపికజేసుకుంటారు.

 రుద్రాక్షముఖాలు ~ వాటిమహాత్మ్యము ~ ప్రయోజనాలు

 ఏకముఖి:- ఇది చాలావిలువైనది. దీన్ని శివునిప్రతిరూపంగా భావిస్తారు. దర్శనభాగ్యంవల్లనే మహాపాతకాలు నశిస్తాయి. అర్చనవల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. కొరతలన్నీ తీరుతాయి. వ్యక్తివికాసం, జ్ఞానం వృద్ధిచెందుతుంది. దుష్టమంత్రతంత్రప్రయోగాలను త్రిప్పికొట్టగలదు. శిరోవేదనలను నయంచేస్తుంది.

 ద్విముఖి:- అర్థనారీశ్వరతత్త్వానికిది ప్రతీక. కుండలినీశక్తిని సులభంగామేల్కొలిపి శక్తివంతంగావిస్తుంది. గోహత్యాపాతకకారిణి. సంతానప్రాప్తి, ఏకాగ్రత, వ్యాపారవృద్ధిని కలిగించి మనోవ్యాకులతను మాన్పుతుంది.దీన్ని కొందరు బ్రహ్మరుద్రాక్ష అనికూడా వ్యవహరిస్తారు.

 త్రిముఖి:- ఇది అగ్నిస్వరూపిణి. అదృష్టదాయిని, ఆరోగ్యప్రదాయిని, అభ్యుదయభావదాయిని, ధనధాన్యసమృద్ధికితోడ్పడును. కార్యసిద్ధి, విద్యావృద్ధి కలిగించును. కామెర్లు, సర్పదోషములు హరించును.

 చతుర్ముఖి:- బ్రహ్మస్వరూపుణి, విద్యాప్రదాయిని, ఏకాగ్రతనిచ్చును. పరిశోధకులకు జ్యోతిర్గణితవేత్తలకు రాణింపు నిస్తుంది. స్పర్శమాత్రమున పాపనాశము, నరహత్యాదోషనునివారణ జరుగుతుంది. పాలలో యీ రుద్రాక్షవేసి ఆపాలుత్రాగితే మానసికరోగాలు నయమౌతాయి.

 పంచముఖి:- ఇది కాలాగ్నిస్వరూపం. మోక్షాన్నిస్తుంది. అకాలమృత్యువును తప్పిస్తుంది. శత్రునాశిని. సర్పవిషాన్ని విరిచేస్తుంది. హృద్రోగనివారిణి. మలబద్ధకాన్నిపోగొడుతుంది.

 షణ్ముఖి:- కుమారస్వామిస్వరూపం. సమస్తపాపహరం. శక్తినిచ్చి విజయాన్నందిస్తుంది. శరీరదారుఢ్యాన్నిపెంచి ఆరోగ్యాన్నిస్తుంది. హిస్టీయా, రక్తపోటువ్యాధిని నయంచేస్తుంది.

 సప్తముఖి:- మన్మథరూపిణి. వశీకరణి. అకాలమృత్యునివారిణి. సభావశ్యత, సంపద, ఉత్తేజం, కీర్తి కలుగజేస్తుంది. కామధేనువుకు ప్రతీకయనికూడా కొందరి విశ్వాసం.

 అష్టముఖి:- భైరవరూపిణి. దారిద్ర్యవిధ్వంసిని. దీర్ఘాయువునిచ్చును. ఆకస్మికధనలాభముకలుగజేయును. కుండలీనీశక్తిని హెచ్చించును. విఘ్నేశ్వరునకు ప్రతీకయనికూడా కొందరినమ్మకం.

 నవముఖి:- నవదుర్గాస్వరూపం. శివతుల్యవైభవకారిణి. భైరవస్వరూపమని కొందరి అభిప్రాయం. పరోపకారబుద్ధిని పుట్టిస్తుంది. అపమృత్యువునురానివ్వదు. రాజకీయపదవులలోఔన్నత్యాన్నిస్తుంది. దీన్ని ఎడమచేతికి ధరించుట మంచిది.

దశముఖి:- విష్ణుస్వరూపిణి. సకలాభీష్టప్రదాయిని. అశ్వమేధయాగంచేసినంత ఫలందక్కుతుంది. నవగ్రహదోషాలను తొలగిస్తుంది. గొంతుసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ఏకాదశముఖి;- రుద్రరూపిణి. విశేషఫలదాయిని. దుష్టశక్తులనంతంచేస్తుంది. వైవాహికజీవనసుఖప్రదాయిని. గర్భసంబంధవ్యాధులను నయంచేస్తుంది.

 ద్వాదశముఖి:- ద్వాదశాదిత్యులకు ప్రతీక. గౌరవంకలుగజేస్తుంది.

 త్రయోదశముఖి:- కామధేనువునకు ప్రతీక. కార్తికేయునకు ప్రతీకయని కొందరివిశ్వాసము. ఈరుద్రాక్ష పాలలోవేసి ఆపాలుత్రాగితే అందం వృద్ధియౌతుంది.

 చతుర్దశముఖి:- ఉపనిషత్తులప్రకారం ఇది పరమశివుని కన్ను. పరమేశ్వరప్రీతికరం.

 పంచదశముఖి:- పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మికసాధనకు సహాయకారి.

షోడశదశముఖి:-పరిపాలనా దక్షత కలుగజేస్తుంది. సత్య ధర్మమార్గంలో నడిచేట్లుజేస్తుంది.

సప్తదశముఖి:- విశ్వకర్మకుప్రతీక. సంపదనిస్తుంది.

అష్టాదశముఖి:- భూదేవికి ప్రతీక. స్థలాలవ్యాపారం లాభిస్తుంది. వ్యవసాయం మంచి ఫలితాలనిస్తుంది.

ఎకోనవింశతి ముఖి:- నారాయణునకు ప్రతీక. భక్తిని, ఆస్తికతను పెంపొందిస్తుంది.

వింశతిముఖి:- సృష్టికర్తబ్రహ్మకుప్రతీక. సంతానవృద్ధికరం.

ఏకవింశతి ముఖి :- భక్తిప్రదాయిని. జనన మరణ చక్రం నుండి విడుదలగావించి సాయుజ్యదశకుచేరుస్తుంది. దీన్నికొందరు కుబేరునికి ప్రతికగాను, మరికొందరు ఇంద్ర మాలగానూ భావిస్తారు.

 గౌరీశంకరరుద్రాక్ష:- ఇది ఇడ,పింగళనాడులను క్రమబద్ధీకరించి, క్రియశీలతకు తోడ్పడుతుంది. ప్రశాంతతనిస్తుంది.

 గణపతిరుద్రాక్ష :-రుద్రాక్షపైనుండే ముడుతలు గణపతి తుండం ఆకారంలో ఏర్పడి వుంటాయి. గణపతికి ప్రతీక. విఘ్ననాశిని. కన్యలవివాహాలకు ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తుంది. సంతానప్రాప్తికి దోహదపడుతుంది. విద్యాబుద్ధుల నిస్తుంది. పండితుల ప్రాభవాన్ని పెంచుతుంది.

 ప్రస్తుతం పదునాలుగుముఖాల రుద్రాక్షల వరకు లభ్యమౌతున్నాయి. 12,13,14ముఖాల రుద్రాక్షలు ఏదైనా ఒకకోరికను హృదయంలోతలంచి రుద్రాక్షను పూజాగృహములోవుంచి ఆరాధిస్తే నలువది(మండలం)దినములలో ఆకోరిక నెరవేరుతుంది.

 నిజమైనరుద్రాక్షను ఇండ్రస్ట్రియల్ స్కానింగ్ లేక  డెంటల్xరే ద్వరా గుర్తించవచ్చును. నకిలీరుద్రాక్షలు ఎఱ్ఱచందనంతో తయారుచేస్తున్నారు. ప్రతిసంవత్సరం వందలకోట్లలో రుద్రాక్షలవ్యాపారం మనదేశంలో జరుగుచున్నది. కాబట్టి నకిలీరుద్రాక్షలు మోసగాళ్ళు అమ్మజూపుతున్నారు. అంతేగాక బీహార్, ఉత్తరప్రదేశ్ లలో బద్రాక్షలు పండించి అమ్ముతున్నారు. ఇవి విషతుల్యమైనవి. కీడుచేస్తాయి. కనుక అనుభవంగలవారి సలహామేరకు రుద్రాక్షలు సేకరించుకోవడం మంచిది.

 జన్మనక్షత్రం తెలిసివుంటే, ఆనక్షతంప్రకారం ఎన్నిముఖాలరుద్రాక్ష ధరించాలో యీక్రింద తెలియజేయబడింది. ఈపద్ధతి బహుదాక్షేమకరం.

 అశ్వని-9ముఖాలు. భరణి-6ముఖాలు. కృత్తిక-1,12ముఖాలు. రోహిణి-2 ముఖాలు. మృగశిర-3ముఖాలు. ఆరుద్ర-8ముఖాలు. పునర్వసు-5ముఖాలు. పుష్యమి-7ముఖాలు. ఆశ్లేష-4ముఖాలు. మఖ-9ముఖాలు. పుబ్బ-6ముఖాలు. ఉత్తర-1,12ముఖాలు. హస్త-2ముఖాలు. చిత్త-3ముఖాలు. స్వాతి-8ముఖాలు. విశాఖ-5ముఖాలు. అనూరాధ-7ముఖాలు. జేష్ట-4ముఖాలు. మూల-9 ముఖాలు. పూర్వాషాడ-6ముఖాలు. ఉత్తరాశాడ-1,12ముఖాలు. శ్రావణం-2 ముఖాలు. ధనిష్ట-3ముఖాలు. శతభిషం-8ముఖాలు. పూర్వాభాద్ర-5ముఖాలు. ఉత్తరాభాద్ర-7ముఖాలు. రేవతి-4ముఖాలు.

 నవరత్నాలు చాల ధరగలిగినవి అందువల్ల నవరత్నజ్ఞానంగలిగినవారు గానీ తెలిసినవారి సలహాయం మేరకుగానీ నవరత్నాలకు బదులు ఎన్నిముఖాల రుద్రాక్ష ధరించాలో యీ క్రిందతెలిపిన ప్రకారం ఎంపికచేసుకొని ధరించి మేలు పొందవచ్చును.

 కెంపు-1,12ముఖాలు. ముత్యం-2,11ముఖాలు. పగడం-3,ముఖాలు. పచ్చ-4,13ముఖాలు. పుష్యరాగం-5,14ముఖాలు. వజ్రం-6,15ముఖాలు. నీలం-7,16ముఖాలు. గోమేదికం- లేక గౌరీశంకరరుద్రాక్ష. వైడూర్యం-9,18ముఖాలు.

 ఎన్నిరుద్రాక్షలు శరీరంలో ఏభాగమున ధరించవలెనో కూడా తెలుపబడింది.

 కంఠం-32. తలమీద-40. చెవులకొక్కదానికి-6. ఒక్కొకచేతికి-12. ఒక్కొకభుజానికి-16. రొమ్ముపై-108రుద్రాక్షలు ధరించాలని శివపురాణంలోనూ, దేవీభాగవతంలోనూ చెప్పబడింది. ఈరుద్రాక్షలను మంత్రపూర్వకంగా ధరించటం  అవసరం. అప్పుడవి శుద్ధియై శక్తివంతంగా పనిజేస్తాయని పెద్దలుచెబుతారు. సోమవారంగానీ పుష్యమినక్షత్రంనాడుగానీ లేదా ఏదైనా శుభదినంనాడు "ఓంనమఃశివాయ" అను మంత్రాన్ని నూటఎనిమిదిసార్లు జపించి ధరించాలని కొందరి అభిప్రాయం. మరికొందరు  "ఓంక్రీంహ్రీంక్షాంవ్రీంఓం" అనుమంత్రాన్ని పదునొకండుసార్లు జపించి ధరించాలంటారు. మరికొందరు 1,4,5,6,9,10,11,14ముఖాల రుద్రాక్షలు ధరించునపుడు "ఓంహ్రీంనమః" అను మంత్రాన్నీ, ముడుముఖాలరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్లీంనమః” అనుమంత్రాన్నీ ఏడు,ఎనిమిదిముఖాల రుద్రాక్షలుధరించునపుడు "ఓంహుంనమః" అను మంత్రాన్నీ, ద్వాదశముఖిరుద్రాక్ష ధరించునపుడు "ఓంక్రౌంనమః" అను మంత్రాన్నీ నూటయెనిమిదిసార్లు జపించి ధరించాలని సూచించారు. ఏఆశా లేకుండా యిలా రుద్రాక్షలుధరిస్తే భక్తివైరాగ్యలు కలిగి అధ్యత్మికజ్ఞానం  పెంపొందుతుంది.

 మునులు, ఋషులు సంవత్సరాలపాటు అడవులలో తపమాచరిస్తూ వుంటారుగనుక వారుత్రాగేనీరు మంచిదోకాదో తెలుసుకోవడానికి నీటికికొంతఎత్తులో రుద్రాక్షను అరచేతిలోవుంచిచూస్తే అది సవ్య(Anti clock)దిశలో తిరుగుతుంది. మంచినీరుకాకపోతే అపసవ్యదిశలో తిరుగుతుంది. ఇలావారు మంచినీటిని గుర్తించి త్రాగేవారు. అనుమానం వచ్చినప్పుడు ఆహారంవిషయంలోకూడా వారు యిలానేచేసి తెలుసుకొనేవారు. ఈపద్దతి మనంకూడా పాటించి జలాన్నాలను తీసుకోవచ్చు. తద్వార విషతుల్యమైన అన్నపానీయాలను(Food poisioning)గుర్తించి జాగ్రత్తపడవచ్చును.

 ఇక అఖరుగా రుద్రాక్ష ధరించువారు పాటించవలసిన కొన్నినియమాలను తెలుసుకొందాం అవి...

 1. మైలపడిన స్త్రీపురుషులనూ, ప్రసవస్త్రీకి స్నానంచేయించువరకు తాకరాదు.

2. శవయాత్రలోపాల్గొనుట, శవమునుత్రాకుట, స్మశానమునకువెళ్ళుట చేయరాదు.

3. ఎవరి రుద్రాక్షమాల వారే ధరించాలి. ఒకరిదిఒకరు ధరించరాదు.

4. రుద్రాక్షధరించి నిద్రించరాదు. నిద్రించుటకుముందు పూజగృహమందుంచవలెను.

5. రుద్రాక్షను ఉంగరములోపొదిగించుకొని ధరించరాదు.

6. రుద్రాక్షధరించి శృంగారములోపాల్గొనరాదు.

7. మధుమాంసాదులు రుద్రాక్షధరించి ముట్టారాదు.

 ఏదియేమైనా హైందవంలోని కర్మసిద్ధాంతమును నూటికినూరుపాళ్ళు నమ్మి సర్వత్రాసర్వకాలసర్వావస్థలందునూ భగవంతుడు నిత్యుడనినమ్మి, శరణుజొచ్చి, సర్వమూ భగవదిచ్ఛకువదిలి, ఏదిజరిగినా తనమేలునకేననీ, భగవదిచ్ఛానుసారమే అంత్యయూ జరుగుచున్నదనితలచి జీవించువారికి దేనిసహాయముగాని, ఏనియమముగానీ అవసరములేదనుట నిక్కము. ఇటువంటి నిష్కామకర్మయోగుల ధ్యానమునకు రుద్రాక్షధారణ, ప్రశాంతతనొసగి వారిసాయుజ్యమునకు తోడ్పడునని ఆధ్యాత్మవిదుల బోధ.

ఓం తత్ సత్

 


 

             

 



 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...