కపిల మహర్షి
ఆ:వె: అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజు డెవ్వడేని మాపురేపు
జాల భక్తితోడ జదివిన సంసార
దుఃఖరాశి బాసి తొలగిపోవు.
అని భాగవతం చెబుతున్నది. శ్రీమహావిష్ణువు యేకవింశత్యవతారములు (21) ప్రముఖముగా ధరించి లోకములందలి భక్తుల రక్షించినాడు. ఆదేవదేవుని అవతారములలో కపిలాచార్యుల అవతారము ఐదవది. ఈ అవరారము ముఖ్యముగా తత్త్వోపదేశమునకు అధికప్రాధాన్యత నిచ్చుచున్నది.
మహావిష్ణువు నాభికమలము నుండి బ్రహ్మ ఉద్భవించినాడు. బ్రహ్మమానసపుత్రుడు కర్దమప్రజాపతి. ఆ కర్దమప్రజాపతి పుత్రుడు కపిలుడు.
సరస్వతీనదీతీరంలో కర్దముడుచేసిన తపస్సుకు మెచ్చి హరి ప్రత్యక్షమై, స్వాయంభువమనువు నీకు తన పుత్రికనిచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ సాధ్వికడుపున నేను నీకుమారునిగా జన్మిస్తానని చెప్పి అంతర్ధానమైనాడు.
హరి ఆశీర్వాదంప్రాకారం కర్దముడు దేవహూతిని చివాహమై తొలుత కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి యను తొంమ్మండ్రుగురు కుమార్తెలను గనెను. తదనంతరం కర్దముడు సన్యసించదలచెను. కానీ దేవహూతి, బిడ్డలకు కల్యాణములు జరిపి, తనకొక పుత్రుని ప్రసాదించి, తదనంతరము సన్యసించుడని ప్రార్థించెను. కర్దముడు తొల్లి హరి పలికిన వచనములు గుర్థుకుతెచ్చుకొని, సాక్షాత్తు శ్రీహరియే దేవహూతిగర్భమున జన్మించనుండుట తెలిసి, భార్యకు వాస్తవము నెఱిగించి, వ్రతదీక్షలో నుండుమని నిర్దేశించినాడు. ఆ సాధ్వీమణి పరమానందభరిత యయ్యెను.
దేవహూతి పుత్రునిగన్నది. కర్దముడు తన ఆడుబిడ్డలకు వరుసగా మరీచి, అత్రి, అంగీరస, పులస్య, పులహువు, క్రతువు, భృగు, వసిష్ట అద్థ్వర్య మహర్షులకిచ్చి వివాహము జరిపించి, తపస్సుకై వెళ్ళిపోయెను. బంగారువన్నె జటాజూటముచే వెలుగొందుచున్న కర్దమపుత్రుడు కపిలుడని పిలువబడెను.
కపిలుడు మహాజ్ఞానియై తనతల్లి దేవహూతికి తత్త్వబోధ గావించినాడు. పరమాత్మ, ఆత్మ, ప్రకృతితత్త్వాలను విశదీకరించినాడు. ఏకాగ్రచిత్తంతో భక్తిపూర్వక హరిధ్యానమే మోక్షమునకు సరియగుమార్గమని నిర్దేశించినాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధవ్యూహములను వివరించినాడు. పిండోత్పత్తి క్రమమును తెలియజేసి తల్లికి మోహవిముక్తి గావించి మోక్ష మనుగ్రహించినాడు. దేవహూతి మోక్షముపొందిన క్షేత్రమే "సిద్ధిపథము" గా పిలువబడుచున్నది.
ప్రపంచములోనే మొదటి మనస్తత్త్వవేత్తగా కపిలమహర్షి గుర్తింపబడినాడు. పరిణామవాదాన్ని ద్రువీకరించినాడు. సాంఖ్యదర్శనం లోకానికందించినాడు. ఇంద్రియాలు విషయగ్రహణమొనర్చి, మనస్సునకందిస్తాయి. మనస్సు బుద్ధికి నివేదిస్తుంది. బుద్ధి విచక్షణతో కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. వీటన్నిటికతీతంగా ఆత్మ ఉంటుంది. అదికేవలం సాక్షీభూతంగా ఉంటుంది. అందుకే అది కల్మష రహితం. అని కపిలమహర్షి బోధించినాడు.
తను బోధగురువగుటేగాక శిష్యగణాన్నీ వృద్ధిజేసినాడు. న్యూమరశ్మి యను మునితో వాదించి వేదములు ప్రమాణములని నిరూపించినాడు. వేదశ్మి యను యతిచే వేదములు ప్రామాణికములని అంగీకరింపజేసి, శబ్దబ్రహ్మ మూలమున పరబ్రహ్మను దర్శించ వచ్చునని నిరూపించినాడు. ఆసురి యను శిష్యుడు తత్త్వగ్రామ నిర్ణయంబుగల సాంఖ్యమును వ్యాపింపజేయుచూ కపిలసాంఖ్య దర్శనాచార్యుడుగా పేరొందినాడు. ఆసురి శిషుడైన పంచశిఖుడు విదేహ రాజగు జనకుని నిరుత్తరుని గావించి, అతనికి గురువైనాడు. జనకుడు మహాజ్ఞానియై మునికుమారులకు సైతము శిక్షకుడైనాడు. అలా కపిలాచార్య సిద్ధాంతములు శిష్యప్రశిష్య పరంపరగా లోకవ్యాప్తమైనవి.
ఒకనాడు జైగీషవ్యుడను మునిని వెంటబెట్టుకొని కపిలాచార్యుడు అశ్వశిరుని యజ్ఞశాల ప్రవేశించినాడు. అశ్వశిరమహారాజు వారిని తగురీతిని గౌరవించి విష్ణువును సేవించి ప్రసన్నుని గావించుకొను విధిని తెలుపుమని వేడినాడు. అప్పుడు కపిలాచార్యుడు నేనే విష్ణువును నన్నే సేవింపమని ఆదేశించినాడు. రాజు నమ్మలేదు. విష్ణువు శంకచక్రధారి, గరుడవాహనుడుగదా! అన్నాడు. వెంటనే కపిలుడు శంకచక్రధారియై జైగీషవ్యుని గరుడునిగామార్చి అతనిపై అధిరోహించినాడు. ఐనా రాజు సందేహము వీడలేదు. విష్ణుదేవునకు బొడ్డున కమలము అందు బ్రహ్మ వుండవలె కదా! అన్నాడు. వెంటనే కపిలమహర్షి బొడ్డున కమలము మొలిచినది. దానిపై జైగీషవ్యుడు బ్రహ్మగా వెలుగొందినాడు. అయిననూ అశ్వశిరుడు అంగీకరించకపోవుటచే, అతని యజ్ఞము నిరుపయోగమై దుష్టమృగములకాలవాలమై, రాజు పతనమాయెను. ఆపిమ్మట రాజుకు జ్ఞానోదయమై చేసిన తప్పుకు క్షమాపణజెప్పి పరితపించెను. అంతట కపిలమహర్షి కరుణించి అతనికి తత్త్వబోధగావించెను. సర్వపదార్తములందు హరిగలడని యెఱుగుము. స్వధర్మమును చక్కగాపాటింపుము. దైవము సంతసించి నిన్ననుగ్రహించునని తత్త్వరహస్యమెరిగించి అతనినుద్ధరించెను.
సగరచక్రవర్తి యొక్క పెంపునకోర్వలేక ఇంద్రుడు సగరచక్రవర్తియాగాశ్వమును దొంగలించి పాతాళమున కపిలమహర్షి తపస్సుజేసుకొను ప్రదేశమున గట్టివైచివెళ్ళెను. సగరపుత్రులు వెదికివెదికి కడకు పాతాళమునకు వచ్చి, అశ్వము కపిలునిచెంతగాంచి, కపిలుడే దోషియని, ఆయనను బాధింపబూనిరి. అంత కపిలాచార్యుడు కన్నులుదెరచి చూడగనే వారు భస్మమైపోయిరి. ఆతర్వాత వారివంశజుడైన భగీరథుని ప్రయత్నమున గంగను వారి చితాభస్మముపై పారించినగాని వారికి ముక్తికలగలేదు.
కపిలమహర్షి శాంతుడు, ఆనందమూర్తి గనుక ఆయన సగరపుత్రులపై అలిగి భస్మముచేయలేదనియు, " పరాత్మభూతుడఖిల బోధకుడతనికి నరసిజూడ సఖులమిత్రులు నెవ్వరు? సగరసుతులు దాము తమచేయు నేరిమి దనువులందు ననలకీలలుపుట్టి నీఱైరిగాక!" అని భాగవతం తెలుపుతున్నది. సగరపుత్రుల యందలి దుర్గుణమువల్లనే, వారి కర్మానుసారులై శరీరమున మంటలుపుట్టి చచ్చిరని దాని భావము.
పుండరీకుడనురాజు వేటయందు అనురక్తి కలవాడైయుండెను. ఒకనాడు అతడు వేటాడిన జింక కపిలముని ఆశ్రమమున కరుదెంచి గిలగిలతన్నుకొనుచు బాధతో మరణించెను. కపిలముని దానినిచూచి చలించిపోయి, పుండరీకుని మందలించెను. అతడు బుద్ధితెచ్చుకొని తన రాజసగుణములను వీడి సాత్వికుడై సన్యసించదలచెను. కపిలమహర్షి అతనికి జ్ఞానబోధచేసి, కర్తవ్యమెఱుకపరచి, సజ్జనుడైన రాజుగా, మంచిపరిపాలకునిగా మార్చివైచెను.
రావణుడు మునులను బాధించు క్రమములో కపిలమహర్షినీ బాధించ యత్నించెను. కానీ కపిలమహర్షియే రావణుని శిక్షించి, తన ఉగ్రరూపమును చూపెను. మహర్షికన్నులనుండి అగ్నిజ్వాలలు కురియుచుండ, హస్తములలో ఆయుధములు, ఉరమున లక్ష్మి, శల్యముల మరుద్గణములు ఉదరమున సముద్రములు, నయనముల సూర్యచంద్రులను చూచి రావణుడు నిర్ఘాంతపోయెను. రావణుని సైన్యము వెనుకకు తగ్గెను. మహర్షి ఒకగుహ లోనికి వెళ్ళగా రావణుడు వెంబడించి అక్కడ లక్ష్మీసమేతుడై దేవతలచే సేవలు గొనుచున్న శ్రీహరిని దర్శించెను. శ్రీహరి దయామయుడై యీ రావణుడు సనక సనందాదుల శాపమున రాక్షసుడైపుట్టిన తన వైకుంఠమందిర ద్వారపాలకుడని గుర్తించి దండించక రావణుని వదలివైచి, గుహతోసహా అంతర్థానమయ్యెను.
కపిలమహాముని సాక్షాత్తు శ్రీహరియవతారమైన బోధగురుడు. మహాత్ముడు. ఆయనస్మరణవల్ల మనకు జ్ఞానోదయమై మోక్షార్హత సిద్ధించు గాక!
//ఒమ్ తత్ సత్//