Thursday, 29 September 2022

ముక్కుపుడక-చెవిపోగులు,mukkupudaka-chevipogulu

 

ముక్కుపుడక-చెవిపోగులు


ముక్కుపుడకను అడ్డకమ్మ,నత్తు, బాసర,బులాకి, ముక్కెర అనికూడాఅంటారు. మతాలకతీతంగా భారతీయ స్త్రీలందరూ అనాదిగా ముక్కెరను ధరిస్తున్నారు. ఇది ఒకఆచారమే గాకుండా ముక్కుకందాన్నిస్తున్నది. దక్షిణభారతీయులు కుడిముక్కుకు ఉత్తరభారతీయులు ఎడమముక్కుకు ఆచారంగా ధరిస్తారు. పైపెదవిపై వ్రేలాడునట్లు రెండుముక్కులకు నడిమిభాగాన కూడా ధరించడం చూస్తున్నాము. ముఖ్యంగా ఆటవికజాతివారు యీపద్ధతినవలంభిస్తున్నట్లు గమనిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా రకరకాల రత్నాలు, వజ్రాలుపొడిగిన ముక్కెరలు అందంకోసం మగువలు ధరిస్తున్నారు. టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ముక్కుపుడక నిరంతరం ధరిస్తున్నట్లు గమనించగలం. పూర్వం ముక్కుపుడకలేని స్త్రీలను దేవుని ప్రసాదంవండటానికి అనుమతించేవారు కాదు. దుష్టశక్తులను ముక్కుపుడక అడ్డగిస్తుందని హిందువుల ప్రగాఢవిశ్వాసం. అందుకే వివాహానికిముందే ఆడపిల్లలకు ముక్కులుకుట్టిస్తారు. సర్వసామాన్యంగా 5,7,11 సంవత్సరాల్లో ఆడపిల్లలకు ముక్కులుకుట్టించడం ఆనవాయితీ.

 

ముక్కు కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటుంది, కాబట్టి కుడివైపు మండలాకారపు (గుండ్రని) పుడకను, ఎడమవైపు అర్ధచంద్రాకారపు పుడకను ధరింపజేస్తారు.లేదా యేవైపైనా ఒంటిరాయిబేసరి ధరింపజేస్తారు. ముక్కెరను హిందువులు తాళితోసమానంగా చూస్తారు. కనుక కాబోయేభర్త పెండ్లిసంబరాల్లో భాగంగా వధువుకు ముక్కెర నిస్తాడు. కొన్నికుటుంబాలలో మేనమామ ముక్కెర నిస్తాడు. మిగిలినవారెవరిచ్చినా ముక్కెరస్వీకరించరు. దేవదాసి మాత్రమే యెవరిచ్చినా ముక్కెర స్వీకరిస్తుంది. తాళివలెనే స్త్రీలు ముక్కుపుడకనుకూడా తమకు వైధవ్యము రాకుండ కాపాడుతుందని ఎల్లప్పుడు ధరిస్తారు. హిందూదేవతలందరికీ ముక్కెర తప్పకుండా వుంటుంది. బాలకృష్ణుని వర్ణనలో కూడా "నాసాగ్రే నవమౌక్తికం" అని వుంది. ప్రళయసమయంలో బెజవాడ కనకదుర్గమ్మ ముక్కెరను కృష్ణాజలాలు తాకుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞాంలో తెలియజేశారు. భామాకలాపంలో సత్యభామ ప్రణయకలహంతో కృష్ణునితో అలుగుతుంది. తర్వాత విరహంభరించ లేక తనచెలికత్తెను కృష్ణునివద్దకు రాయబారం పంపాలనుకుంటుంది. ఆచెలికత్తెను మంచిచేసుకోవడానికి సత్యభామ యేవేవో కానుకలివ్వజూపుతుంది. కానీ చెలికత్తె అవేమీవద్దని సత్యభామధరించిన ముక్కెర కావాలంటుంది. ఇలా పురాణకాలమునుండి ముక్కెర ప్రస్తావన వుండనేవుంది.

 

ఆరోగ్యపరంగకూడా ముక్కులుకుట్టించడం, ముక్కెరధరించడంవల్ల మేలుజరుగుతుందని నమ్ముతారు. ముక్కులుకుట్టడం "ఆకుపంచర్" వైద్యవిధానంతో సమానమంటారు. దీనివల్ల ప్రాణశక్తికి సంకేతమైన ఇడ,పింగళ నాడులు ఉత్తేజితమై శక్తివంతంగాపనిచేసి మెదడులోని నాడీవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. వెండి,బంగారు,రాగితో ముక్కెరరలుచేస్తారు గనుక ఆలోహాలు పీల్చేగాలిని శుభ్రపరచి, రోగాలను నిరోధిస్తాయి. అంతేగాకుండా ముక్కులు కుట్టించడంద్వారా గర్భకోశదోషాలు తొలగిపోయి సంతానప్రాప్తికి దోహదంలభిస్తుంది. సుఖప్రసవంజరుగుతుంది. కన్ను,చెవివ్యాధులు రావు. శ్వాశకోశవ్యాధులు కూడా రావని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది. ఈవైద్యవిధానం భారతదేశమునుండే చైనాకు వెళ్ళిందని అనేకులు నమ్ముతున్నారు.  

 

ఇక చెవిపోగుల గురించికూడా తెలుసుకుందాం. చెవులు కుట్టించడంకూడా హిందువుల పురాతన ఆచారమే. కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు భీష్ముని చంపుతానని రథం నుండి దుమికి ఆయనపైకి వెళ్ళే సమయంలో కృష్ణుని కుండలములకాంతి గగనభాగంక్రమ్మినదట. ఇలా అనేకచోట్ల మన పురాణాలలో చెవికమ్మల (కుండలాల) ప్రస్తావన వుంది.  ఆడపిల్లకైతే ఒకసంవత్సరం వయసురాగానే చెవులుకుట్టిస్తారు. ఇప్పుడు చెవితమ్మకు రెండుమూడుచోట్లకూడా కుట్టించి ఆభరణాలు ధరింపజేస్తున్నారు. అమ్మాయిలకు ముందు ఎడమచెవి, అబ్బాయిలకు ముందు కుడిచెవి కుట్టిస్తారు. మేనమామ ఒడిలో తూర్పువైపుగాముఖంబెట్టించి కూర్చోబెట్టి ఉదయాన్నే కుట్టిస్తారు. మొదటిసారి తలనీలాలు దైవక్షేత్రములో తీయించే సమయంలోనే బిడ్డలకు చెవులుకుట్టించే ఆచారం చాలాకుటుంబాల్లో వుంది. తొలుత ఆడమగ పిల్లలందరికి చెవులు కుట్టించేవారు. తర్వాత ఆడపిల్లలకే కుట్టిస్తూవచ్చారు. ఇప్పుడు మగవారుసైతం అందంగావుంటాయని చెవిరింగులు, కమ్మలు ధరిస్తున్నారు. అయితే కొందరు చెవులుకుట్టించుకోకుండ అణచిపట్టుకోనుండేవిధంగా కమ్మలు ధరిస్తున్నారు. అవికూడా ఒకచెవికే ధరిస్తున్నారు. అలాకాకుందా కుట్టించుకోవడమే మంచిదని ఆకుపంచర్ వైద్యవిధానం చెబుతున్నది.

 

చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలు నాడులద్వారా అనుసంధింపబడి వున్నాయి. చెవులు కుట్టించడంద్వార ఆకుపంచర్ రీతిలో నాడులు ఉత్తేజితమై కంటిచూపు మెరుగౌతుంది. చెవి, పంటిసంబంధమైన వ్యాధులురావు. స్త్రీలలో ఋతు సంబంధ మైన హెచ్చుతగ్గులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందని శుశ్రుతసంహితలో చెప్పబడింది. నాడీమండలవ్యవస్థ ఉత్తేజితమవడంవల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆందోళన, మానసిక రుగ్మతలు దూరమై ప్రశాంతత కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఊబకాయంరాదు. మగపిల్లలకు బుడ్డ (హైడ్రోసీల్) హెర్నియా వంటి వ్యాధులురావు. పక్షవాతం రాదు. రక్తపోటు, ఆయాసం అధికమవ్వడం జరుగదు. రంగురంగులలో ఆకర్షనియ్యంగావున్నాయని ప్లాస్టిక్ లేదా తగ్గులోహాలతోచేసిన చెవిరింగులు ధరించడం మంచిదిగాదు. బంగారం, వెండి, రాగితోచేసిన వాటినే వాడుకోవాలి. నొప్పితక్కువగా వుండటం కోసం ముక్కుచెవులు కుట్టడానికి పియర్సింగ్ గన్లను వాడుతున్నారు. అయితే ముక్కు చెవులు కుట్టడంలో ఇంఫెక్షన్ కలుగవచ్చు. ఇంకా చిన్నచిన్నబుడిపెలు (సిస్ట్ గ్రాన్యులోమా) యేర్పడవచ్చు. అటువంటప్పుడు తెలిసినవైద్యుని సంప్రతించడం మంచిది.             

 

Friday, 5 August 2022

గోరింట,Gorinta,మెహంది,హెన్న

 

గోరింట


గోర్లకు రంగునంటించేదిగనుక దీనికి  గోరింట అనేపేరు వచ్చిందంటారు. ఇది గౌరియింటిలోనిది గనుక గోరింట అనేపేరువచ్చిందని హిందువుల నమ్మకం. సంస్కృతంలో గోరింటను “మెహెందిక” అంటారు. హెన్నా అనికూడా గోరింటకు మరోపేరు. పసుపు సూర్యుని వెలుగులోని వెలుపలిభాగానికీ, గోరింట లోపలిభాగానికి ప్రతీక. గోరింటప్రసక్తి వేదాలలోను ధార్మికగ్రంథాలలోనూ వుంది.అన్నిమతాలమహిళలూ యిష్టంగా ధరిస్తారీగోరింటను. పెళ్ళిళ్ళలో, పండుగలలోనేగాకుండా సంతోషంగా ఉన్నప్పుడల్లా గోరింటను ధరిస్తారు. ఆషాడమాసంలోనైతే దీన్నిధరించితీరాలంటారు. ఎందుకంటే ఆషాడంలో వర్షాలెక్కువ. మహిళలు నీళ్ళలో కాళ్ళుచేతులు తడవకుండా పనులుచేసుకోలేరు. దానికితోడు వర్షం. అందువల్ల సూక్ష్మక్రిములవృద్ధి యెక్కువగా వుంటుంది. జబ్బుచేసే ప్రమాదం పొంచివుంటుంది. ఈగోరింటకును పెట్టుకోవడంవల్ల ఎర్రగాపండి అందానికందం, సూక్ష్మక్రిములనుండి రక్షణా లభిస్తుంది. చేతుల్లో గోరింటాకు బాగాఎర్రగా పండితే కన్యలకు మంచిభర్తలు లభిస్తారనేనమ్మకం వుండనేవుంది. మందారంలాపండితే మంచిమొగుడొస్తాడు. సిందూరంలాపండితే  కలిగిన (ధనవంతుడైన) మొగుడొస్తాడని స్త్రీలుపాడుకోవడం కద్దు.

ఈగోరింట వెనుక ఒకపురాణగాథకూడా వుంది. పార్వతీదేవి చెలులతోగూడి వనవిహారంచేస్తున్న సమయంలో రజస్వల అయ్యింది. ఆరక్తం ఒకబొట్టు నేలపైబడింది. అది వెంటనే ఒకమొక్కై మొలిచింది. అది గమనించిన ఆమెచెలులు వెళ్ళి పార్వతీదేవి తల్లిదండ్రులకు ఆవింతను తెలియజేశారు. వారు (పర్వతరాజదంపతులు) వచ్చి చూచేటప్పటికి మొక్కచెట్టయింది. గౌరీదేవి ఆచెట్టు ఆకునుగిల్లి చేతితోనలిపింది. వెంటనే చేయిఎర్రగా మారింది. చేయియెర్రగాకందిందేమిటని తల్లి గాబరాపడి పరిశీలించి చూడగా ఏమీకాలేదు. ఎర్రగామారి చేతికందాన్నిచ్చింది.

హిమవంతుడు (తండ్రి) ఆచెట్టును గౌరవభావంతోచూసి, ఇకపై స్త్రీలసౌభాగ్యచిహ్నంగా వర్ధిల్లమని వరమిచ్చాడు. అప్పటినుండి గోరింట మహిళలకానందదాయినియై విలసిల్లుచున్నది. అయితే చరిత్రకారులు 5 వేలసంవత్సరాల క్రితమే దీన్ని ఈజిప్షియనులు  వాడేవారని, అందుకే వారి పిరమిడ్లలోని మమ్మీల (శవాల) కు గోర్లు వెంట్రుకలు ఎర్రగా వున్నాయని తేల్చారు. క్రీ.పూ.700  సంవత్సరాలనుండి భారతదేశంలో గోరింట వాడుకలోవుందనికూడా చెప్పారు. మరికొందరు మొగల్‌చక్రవర్తుల ద్వారా 12వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిందంటున్నారు. అప్పటికే అరబ్బులు గోరింటను అదృష్ట చిహ్నముగా చూసేవారట. గుర్రాలజూలు అందాలకుగూడా గోరింటను వాడేవారట.

ఒకకప్పునీళ్ళలో 4 టేబుల్‌స్పూన్ల గోరింటాకుపొడి కలిపి 8 గంటలు నానబెట్టాలి (రాత్రంతావుంచితే యింకామంచిది). తరువాత బ్లాక్‌టీ డికాషన్ లేదా కాఫీడికాషన్ పోసి కలుపుకోవాలి. తర్వాత ఒకచంచా నిమ్మరసం, ఒకటేబుల్‌స్పూన్ ఉసరికపొడివేసి బాగాకలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈపేస్టును గోర్లకు పట్టించవచ్చు. అరచేతులకు పాదాలకు వాళ్ళవాళ్ళ అభిరుచికితగ్గట్లు చిత్రాలరూపంలో గోరింటపేస్టు పట్టించుకోవచ్చును. గోరింటాకుపెట్టుకోవడంకూడా ఒకకళే. ముందు చేతులు శుభ్రంచేసుకొని తడిలేకుండా తుడుచుకొని గోరింతపేస్టు డీజైన్లను వేసుకోవాలి. 7,8 గంటలు అలాగేవుంచుకోవాలి. తర్వాత నీళ్ళతో కడగకుండా అరచేతులు రుద్దుకోవంద్వారా గోరింటను తొలగించుకోవాలి. ముందుగా చెక్కెర నీళ్ళలోకలిపి లేతపాకంగా వేడిచేసుకోవాలి. చల్లారినతర్వాత ఒకచంచా నిమ్మరసంకలపాలి. ఈ సిరఫ్‌ను గోరింట తొలగించుకున్న తర్వాత   చేతులకు పట్టించాలి. తర్వాత ఇంగువకానీ లవంగాలుకానీ పెనంపై వేయిస్తే వచ్చేపొగ చేతులకు పట్టాలి. ఈపొగకుబదులు ఆవనూనెగానీ వ్యాసిలిన్‌గానీ లేక నీలగిరితైలం (యూకలిప్టస్ఆయిల్)గానీ పట్టించవచ్చు. ఇలాచేస్తే బాగా పండుతుంది. ఎక్కువనాళ్ళుంటుందికూడా. అయితే వీటిని ఎక్కువగా వాడరాదు. వాడితే ఎరుపుకుబదులు ముదురుగోదుమరంగుకు మారుతుంది. తలకుపట్టించుకోవాలంటే చేతులకు గ్లోవ్స్ వేసుకొని గోరింటపేస్టు పట్టించుకొని మూడుగంటలతరువాత కడిగేయాలి. అలాగేవుంచుకుంటే తలచర్మం వెంట్రుకలు పొడిబారిపోతాయి.

గోరింటాకులో కూమరిన్, గ్లాంథోన్,గ్లైకోసైడ్లాంటి సేంద్రియరసాయనిక మిశ్రమాలతో పాటు అరచేతికి ఎరుపునిచ్చే"లాసన్" కూడావుంటుంది. అరచేతిపై మృతకణాలుంటాయి. వీటిగుండా లాసన్ చొచ్చుకపోతుంది. మృతకణాలక్రింద నశించడానికి సిద్దంగావున్న కణాలూవుంటాయి. వీటీగుండాకూడా లాసన్ చొచ్చుకొనివెళ్ళి అరచేతులకు ఎర్రదనాన్నిస్తుంది. ఈమృతకణాలు స్నానంచేసినప్పుడల్లా క్రమేణారాలిపోటూవుంటాయి. కనుక ఎర్రదనంకూడా క్రమేణాతగ్గిపోతుంది. కోన్లద్వారా గోరింటాకు పెట్టుకొనే విధానం వచ్చినతర్వాత గోరింట వాడకం విపరీతంగా పెరిగిపోయింది. 1990 తర్వాత పాశ్చాత్యదేశాలలో యిదొక ఫ్యాషనైపోయింది. రకరకాల డీజైన్లు అందుబాటులోనికి వచ్చేశాయి. అయినా సాంప్రదాయపద్దతుల్లో తయారుచేసుకొన్న గోరింటపేస్టే ఉత్తమం. వీలుగానిపక్షంలో మంచినమ్మకమైన కంపెనీలవి, వాటిలోనూ మరీపాతవిగాకుండా చూసుకొని కోన్లు కొనాలి. ఎర్రదనంకోసం యిప్పుడు కొన్నిహానికర రసాయనాలుకలిపి గోగింటపేస్టులు, పౌడర్లు బజారులోనికి వస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి కొనడం మంచిది.

వైద్యశాస్త్రరీత్యాకూడా గోరింటకు చాలాప్రయోజాలున్నాయి. గోరింటకు చలువచేసే గుణమున్నది. అందువల్ల నరాలు స్వాంతనజెంది కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఉడుకుగడ్డలు నయమౌతాయి. కాళ్ళపగుళ్ళు రాకుండా చూస్తుంది. గోరింట చర్మసమస్యలను నివారుస్తుంది. దెబ్బలుతగలి గాయాలైనా, కాలిగాయాలైన తొందరగా మానుపుతుంది. స్పోటకంవంటి అంటుజబ్బుల్లో అరికాళ్ళకు గోరింటపెడితే ఉపశమనంకలుగుతుంది. బెణుకులు , పిప్పిగోళ్ళు, గోరుచుట్టును నయంచేస్తుంది. కాళ్ళుచేతుల దురదలను పోగొడుతుంది. చెట్టుబెరడు కామెర్లను బాగుచేస్తుంది. గోరింటపూలు తలక్రింద వేసుకొని పడుకుంటే నిద్రబాగాపడుతుంది.  గోరింటతలకు పట్టించు కోవడంవల్ల వెంట్రుకలకు దృఢత్వకలిగి తొందరగారాలిపోవు. చుండ్రునశిస్తుంది. గోరింటాకురుబ్బి నువ్వుల నూనెలో వేసి కాచుకొని గోరింటతైలం తయారుచేసుకోవచ్చు. ఇది తలనూనెగా వడుకోవడంవల్ల వేడితగ్గి జ్ఞాపకశక్తికూడా పెరుగుతుంది. స్త్రీలు ఎక్కువగా గోరింట వాడుతారుగనుక, వారి అరచేతి రక్తనాళాలు, నాడులు అధిక ఉష్ణానికి గురికాకుండా చూసి గర్భాశయదోషాలను తొలగిస్తుంది. వారి హార్మోన్ల పనితీరు క్రమబద్దీకరించ బడుతుంది. తద్వారా అండాశయాలపనితీరు మెరుగై సంతానోత్పత్తికి దోహదమౌతుంది. గోరింట కుష్టునివారిణి యని ఆయుర్వేదం చెబుతున్నది. గోరింట అలంకరణగుణం కారణంగా ఉపయోగం ఎక్కువై కోన్లతయారీకి, పొడిప్యాకెట్లతయారీకి గిరాకిపెరిగి, కడకు రైతులుదీన్ని వాణిజ్యపంటగా పండించి లాభాలార్జించేదిశగా పురోగమించడం ఆశించగ్గపరిణామం.   

 


 

                        

Sunday, 17 July 2022

పసుపు కుంకుమలు-గాజులు మెట్టెలు

 

పసుపుకుంకుమలు-గాజులు మెట్టెలు


పసుపుకుంకుమలలేని శుభకార్యాలు హిందువులకసలేవుండవు. ముత్తైదువకు(సుమంగళికి)గుర్తు  యీపసుపుకుంకుమలు. ఆహ్వానం పలకాలంటే బొట్టుపెట్టి పిలవడఅనేది ఒకసామెతగా నిలచి పోయింది. మహిళలలకు కుంకుమబొట్టుపెట్టి శుభకార్యాలకు పిలవడం సత్సాంప్రదాయం. పెళ్ళిపత్రికలమూలలకు పసుపుకుంకుమలురాసి భగవంతునికి సమర్పించినతర్వాతే వాటిని పిలువవలసినవారికిస్తారు. అలా పిలవడంవల్ల ఆపిలుపు సాక్షాత్తు లక్ష్మీదేవిపిలిచినట్లుగా భావిస్తారు. సామాన్యంగా వ్రతాలకు పిలిచిన ముత్తైదువులకు (పేరంటాళ్ళకు) తొలుత కుంకుమబొట్టుపెట్టి కాళ్ళకు పసుపురాస్తారు. ఇంట్లో స్త్రీలుకూడా తొలుత కుంకుమబొట్టు పెట్టుకొని తర్వాతే కాళ్ళకు పసుపు రాసుకుంటారు. పండుగనాటి పూజల్లో మగవారుసైతం కుంకుమబొట్టు పెట్టుకుంటారు. పెండ్లిండ్లలో వధువుకు పసుపురాసి మంగళస్నానం చేయిస్తారు. చాలాకుటుంబాలు పసుపునీళలోతడిపి ఆరేసిన నూతన ధవళవస్త్రాలే వధూవరులు ధరించి పెళ్ళిపీటలమీద కూర్చుంటారు. మిగిలిన క్రొత్తబట్టలకు సైతం కొసలలో పసుపురాసి వాడుకుంటారు. అత్తవారింటికి బిడ్డనుసాగనంపేటప్పుడు చీరసారెలు పెడతారు. వాటితోపాటే పసుపుకుంకుమలు యివ్వడం తప్పనిసరి,  పూజల్లో తొలిపూజ పసుపుగణపతికిచేసి తర్వాత ఇష్టదైవాన్ని పూజిస్తారు. పసుపునీళ్ళుచల్లితే యేవస్తువైనా అపవిత్రతనువదలి పవిత్రతను సంతరించుకుంటుందన్నది పెద్దలమాట. పెళ్ళిసంబరాల ప్రారంభంలో రోలురోకలికి పసుపుకుంకుమలతో పూజచేసి, మిగతా కార్యాలకు కావలసిన పసిపుకోసం పసుపుకొమ్ములు దంచుతారు. కొందరు పెళ్ళివేడుకలకు నాందిగా ఒకకొయ్యకు పసుపుకుంకుమలురాసి, పూజచేసి ఆకొయ్యను  నాటుకుంటారు. తొలుత పసుపుతాడు కమర్చిన తాళినే వరుడు వధువుకు కడతాడు. తర్వాతే బంగారుగొలుసుకో నల్లపూసలహారానికో మార్చు కుంటారు. అంతెందుకూ, ఏకారణంగా నైనా బంగారుతాళి సమయానికి లభ్యంకాకపోతే, పసుపుకొమ్ము తాళిబొట్టుకుమారుగా ఉపయోగించుకుంటారు. అంటే పసుపుకొమ్ము బంగారుతో సమానమన్నమాట. పెండ్లిలో తల్లిదండ్రులు కుమార్తెకు కానుకగా యిచ్చే భూమి, నగలు, పైకం మొదలైనవి పసుపుకుంకుమలకిచ్చినవిగా చెప్పుకుంటారు. 

హైందవుల ఇళ్ళలో సింహద్వారానికి తప్పక గడపవుంటుంది. (లోపలిగదులకు ఇప్పుడు గడపలుపెట్టడం మానేశారు) సింహద్వారపుగడప భూమ్యాకాశాలకు మధ్యరేఖగా భావించి పసుపురాసి,  కుంకుమబొట్లు పెడతారు. "గడపలేనిగృహం కడుపులేనిదేహం” అన్నసామెత వుండనేవున్నది.రోజూ చేయకపోయినా  పండుగపూట గడపపూజ హిందువులు తప్పకచేస్తారు.  ఇంటిముందుచల్లే కళ్ళాపిలోగూడా గోమయంతోపాటు పసుపూ కలుపుతారు.

గడపను స్మార్తులు గౌరీదేవిగానూ, వైష్ణవులు లక్ష్మీదేవిగానూ భావిస్తారు. గడపను పసుపూకుంకుమలతో పూజించడంవల్ల, కన్యలకు త్వరగా వివాహమై మంచి మంచిభర్త లభిస్తాడని నమ్ముతారు.  ఇల్లాలు గడపకు పసుపుకుంకుమలతో పూజచేస్తే, పిల్లలు బుద్ధిమంతులై చెప్పినమాటవింటారని, కూతుళ్ళలాంటికోడళ్ళు , కొడుకుల్లాంటి అల్లుళ్ళు వస్తారని నమ్ముతారు. పసుపు గురువుకు ప్రతీక, కుంకుమ శుక్రునికి ప్రతీక.

గడపను పసుపుకుంకుమలతో పూజిస్తారుగనుక గురుశుక్రులు ప్రసన్నులై శుభాలు సమకూరుస్తారు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా అడ్డుకుంటారు. గడప యీవిధంగా పూజార్హత కలిగియున్నందున గడపను కాలితోతొక్కకుండా దాటుకుంటారు.

 సుషుమ్ననాడి శరీరంలోని నాడులన్నింటినీ కలుపుకుంటూ, నొసటిని కేంద్రంగాచేసుకొని సంకేతాలను మెదడుకుచేరవేస్తూ, నిరంతరం చైతన్యవంతంగావుంటుంది. ఈసుషుమ్ననాడీకేంద్రమైన లలాటంపై కుకుమబొట్టు పెట్టుకోవడంద్వారా ఇతరులదృష్టి (దిష్టి) దోషాలని  కుంకుంబొట్టు అడ్డుకుంటుంది. అంతేగాకుండా సూర్యతాపంనుండికూడా యీబొట్టు రక్షిస్తుంది. లలాటంలో  పీనియల్ గ్రంథివుంటుంది. ఇది ఆరోగ్యకారకమైన హార్మోన్లనుత్పత్తి చేస్తుంది. దానిపై ఒత్తిడిని యీ లలాటకుంకుమబొట్టు తగ్గిస్తుంది. షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం కనుబొమలమధ్య (భ్రూమధ్యము) న వుంటుంది. ఈచక్రంపై అధికారం సాధిస్తే, సాధకునికి అద్భుతశక్తులు లభిస్తాయి. ఈప్రాంతంలో కుంకుమబొట్టుపెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ఉత్ప్రేరితమై సాధకునికి సహకరిస్తుంది. నుదుటిబొట్టు ప్రస్తావన పద్మ, ఆగ్నేయపురాణాలలోనూ, పరమేశ్వర సంహిత లోనూ వున్నది.

 పసుపుకుంకుమలు చేజారి క్రిందపడితే అశుభంగా పరిగణించవలసినపనిలేదు. అది భూదేవికి పసుపు కుంకుమ సమర్పించినట్లు భావించాలి. అలా క్రిందపడిన పసుపు కుంకుమలు తిరిగి వాడుకోకుండా చెట్లపై చల్లేయాలి. దేవాలయమెట్లకు పసుపురాసి కుంకుమబొట్లుపెట్టి మ్రొక్కితే , అదికూడా భూదేవిపూజగానే పరిగణిస్తారు.

 ఇవన్నీ హైందవుల మతవిశ్వాసాలైతే పసుపు క్రిమినాశినిగా వైద్యులు గుర్తించారు. పసుపునీళ్ళు కళ్ళాపిచల్లడం గడపకు పసుపురాయడంవల్ల క్రిములు, పురుగులు యింట్లోకి ప్రవేసించలేవు. దెబ్బలుతగిలినప్పుడు పసుపుపెట్టడానికి కారణం కూడా పసుపుకున్న క్రిమినాశకగుణమే. ఈకారణంగానే స్త్రీలు ముఖానికి వేసుకునే ముఖపట్టీ (ఫేస్ ప్యాక్)లలో పసుపువాడతారు. పసుపుతో నారింజపండు   తొక్కలపొడిగానీ, మంచిగంధంపొడిగానీ, పెసరపిండితోగానీ, వెన్నతోగానీ కలిపి, ముఖపట్టీ (ఫేస్ ప్యాక్) వేసుకుంటారు. ఇందువల్ల ముఖనికికాంతి వస్తుంది.  ఇక ఆయుర్వేదవైద్యంలో పసుపు ఉపయోగం చాలాయెక్కువే. మూగదెబ్బలుతగిలి విపరీతమైననొప్పి వాపువుంటే, పసుపు ఉడకబెట్టి గోరువెచ్చగా వుండగానే పైనపట్టిస్తే, తొందరగా నయమౌతుంది. పసుపు త్రిఫలచూర్ణం కలిపి సేవిస్తే రక్తహీనత నయమౌతుంది. నూతనవధువుకు గర్భాదానసమయంలో కలిగే రక్తస్రావానికి పసుపుకషాయం మంచిమందు. అడ్డసరంఆకులు పసుపు కలిపినూరి సేవిస్తే దగ్గు నయమౌతుంది. ఇవి మచ్చునకొకటిరెండు మాత్రమే. ఆయుర్వేద పసుపు యోగాలు వ్రాయాలంటే, అది మరో ఉద్గ్రంథమే ఔతుంది.

 ఆఖరుగామరోమాట. భర్తచనిపోతే భార్యతన ఐదోతనం (పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు పువ్వులు) కోల్పోవాలనడం సరికాదు. ఇది యేశాస్త్రంలోనూ చెప్పబడలేదు. కనుక పసుపుకుంకుమలు ఉంచుకోవడమా  తీసివేయడమా అన్నది ఆస్త్రీకే వదిలివేయాలిగానీ బలవంతంచేయరాదు. పంచకన్యలు లేక పంచమహాపతీవ్రతల గురించి చెప్పిన యీశ్లోకం చూడండండి

 

శ్లో: అహల్యా ద్రౌపది కుంతీ

       తారామండోదరీ తథా

        పంచకన్యా స్మరే నిత్యం

     మహాపాతక నాశినః


 అన్నారు. ఇందులో కుంతి, మండోదరి, తార వీళ్ళంతా భర్తనుపోగొట్టుకున్నవారే. అయినా పూజనీయులు. వీరి స్మరణవల్ల పాపాలన్నీ హరించుకపోపోతాయన్నారు. కనుక స్త్రీని యెప్పుడూ అపవిత్రగానూ, ఆమె దర్శనం అపశకునంగానూ భావించడం ముమ్మాటికీ తప్పే.  

 ఇక మెట్టెలు గాజులను గురించి కూడా తెలుసుకుందాం. పెళ్ళయిన మహిళకు తప్పనిసరిగా తాళి, పసుపుకుంకుమలతోపాటుగా మెట్టెలు, మట్టిగాజులు ధరింపజేసి అత్తింటివారు మాఇంటిమహలక్ష్మి అని ముచ్చటపడి పిలుచుకుంటారు. కాలిబొటనవ్రేలి ప్రక్కవ్రేలికి వెండితోచేసిన మెట్టెలు ధరింపజేస్తారు. పెళ్ళిలో ఒక ముఖ్యఘట్టంగా వధువుకు మెట్టెలు పెడతారు. వాళ్ళవాళ్ళ ఆచారం ప్రకారం కొందరిండ్లలో పుట్టింటివారు, ఇంకొందరియిళ్ళలో మేనమామ, మరికొందరి యిళ్ళలో వరుడే ధరింపజేస్తాడు. ఎవరు ధరింపజేసినా మెట్టెలవల్ల మేలేజరుగుతుందన్న విషయం గమనింపదగ్గది. పెండ్లిలో వరునికిగూడా మెట్టెలువేస్తారు, గానీ ఆతరువాత వాటిని తీసివేస్తున్నారు. మెట్టెలు వెండితో తయారుజేస్తారు గనుక, సకారాత్మక (పాజిటివ్) ఎనర్జీని అవి భూమినుండి గ్రహించి శరీరానికందిస్తాయి. మెట్టెలువేసిన వ్రేలు భాగంలో నరాల చివరలుంటాయిగనుక, అక్కడ ఒత్తిడిగలుగుతుంది. అందునా వ్రేలు నడిమిభాగం కూడా మెట్టెలవల్ల భూమికి అనుసంధింపబడి వుంటుందిగనుక, వ్రేలుమొత్తనికి ఒత్తిడి (ప్రెజర్) కలిగి, ఆక్యుప్రెజర్ వైద్యవిధానం ప్రకారం,  మెట్టెలవ్రేలినరం గర్భాశయానికి, గుండెకు సంబంధింపబడివుండటం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగేట్లుచేస్తుంది. అందువల్ల ఋతుక్రమం క్రమబద్దీకరింపబడుతుంది. గర్భాశయాన్ని దృఢంగావుండేట్ల్లు చేస్తుంది. సుఖప్రసవానికి, సంతానాభివృద్దికి తోడ్పడుతుంది. గర్భంధరించిన తర్వాత వచ్చే సమస్యలను నివారిస్తుంది. స్త్రీలకు వుండే అధిక కామవాంచ్ఛలను అదుపుజేస్తుంది. వెండివల్ల చర్మవ్యాధులు కూడా అరికట్టబడతాయి.  

 ఇకగాజుల విషయానికొస్తే, గాజుల రాపిడివల్ల చర్మానికి కొంత విద్యుత్ఛక్తి అంది రక్తపోటు క్రమబద్దీకరింపబడుతుంది. మణికట్టుపై గాజుల సున్నితమైన రాపిడివల్ల అక్కడి నరములు ఉత్తేజితమై ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. మట్టిగాజులు వేసుకోవడంవల్ల ఋతుసమయంలో స్త్రీశరీరంలో యేర్పడె నకారాత్మక శక్తి (నెగెటివ్ ఎనర్జి) ప్రక్కవారికి ప్రాకకుండావుంటుంది. గాజులుధరించడంవల్ల స్త్రీలలోని అధికవేడిని తగ్గిస్తుంది. స్త్రీలు గర్భముధరిచివుండగా  సీమంతంచేస్తారు. ఆ సందర్భంగా మట్టిగాజులు ప్రత్యేకంగా వేస్తారు. అందువల్ల గర్భము సురక్షితమౌతుంది. సీమంతంలో  ఒకచేతికి ఇరవైఒకటి మరోచేతికి ఇరవైరెండు గాజులు వేస్తారు. మిగతాసమయాలలో చేతులకు సరిసంఖ్యలో గాజులు వేసుకోవాలంటారు. చేతికున్న గాజులు ఆస్త్రీ సంతానవృద్దిని సూచిస్తాయంటారు. ఇవన్నీ వారివారి మతాచారవిశ్వాసాలుగా మనం భావించవచ్చు. ఏదియేమైనా చేతికివేసుకున్నగాజులు స్త్రీకి అందాన్నిస్తాయి. మెట్టెలసవ్వడి, గాజులరవళి హృద్యంగా వుంటాయన్నది నిర్వివాదాంశం.                                         

       

 

 

Friday, 24 June 2022

తాంబూలం,Taambulam.

 

తాంబూలం

 


హిందూకుటుంబాలలో తాంబూలంలేకుండా యేశుభకార్యమూ జరుగదు. వ్రతాలకుగానీ, పూజలకుగానీ, పెండ్లికిగానీ మరేయితరశుభకార్యాలకేగానీ తాంబూలమిచ్చిపిలవడం ఒకసదాచారం. పూజలో భగవంతునికీ తాంబూలంసమర్పించడం తప్పనిసరి. పెద్దలకు తాంబూలమిచ్చి ఆశీర్వాదంతీసుకోవాలి. ఆఖరుకు సాగనంపేటప్పుడుకూడా తాంబూలమిచ్చి పంపాలి. ఒకశుభకార్యం పురమాయించేటప్పుడూ తాంబూలమిచ్చి పనిఅప్పజెప్పాలి. ఒకకావ్యం అంకితం తీసుకోవాలంటే కవికి తాంబూలమిచ్చి కానుకలివ్వాలి. ఒకపెళ్ళిసంబంధం కుదిరితే నిశ్చితార్థం చేస్తారు. అందులో నిశ్చయతాంబూలమియ్యడమే అతిముఖ్యం. రెండువైపులవారూ తాంబూలాలుమార్చుకుంటేనే సంబంధం కుదిరినట్లు. తాంబూలంతోపాటు, పుష్పాలు, పండ్లు, క్రొత్తబట్టలుకూడా యిస్తారు. కానీ ఏమున్నాలేకున్నా, తంబూలాలుమాత్రం తప్పనిసరి. గురజాడాప్పారావుగారి కన్యాశుల్కం నాటకములో అగ్నిహోత్రావధానులు ఒకముసలానకు తకూతురునిచ్చిపెండ్లిచేయడానికి నిశ్చితార్థంచేసుకొని వస్తాడు. భార్యా బావమరదులు మేమొప్పుకోమంటారు. అప్పుడు అగ్నిహోత్రావధానులు "తాంబూలాలిచ్చేశాను తన్నుకచావండి" అంటాడు. అంటే తాంబూలమిచ్చి మాటచెబితే యికదానికి తిరుగేలేదన్నమాట. ఇక పెండ్లిలో తాంబూలప్రశస్తి వేరుగాచెప్పవలసిన పనిలేదు. వధూవరులకలయిక ఆకూవక్కావలె విడదీయరానిదై వుండాలన్నది ఆర్యవాక్యం.

తాంబూలం భగవంతునకు పూజలోసమర్పిచడం, శతపత్ర(శతదళకమల)ములతో పూజించడంతో సమానమేగాక, సర్వదోషహరమని భావిస్తారు. కొన్ని పూజల్లో కలశస్థాపనచేస్తారు. పాత్ర(చెంబు) లో మంచినీరుపోసి, తమలపాకుతొడిమలు నీటినితాకునట్లు చుట్టూవుంచి పైన కొబ్బరికాయవుంచుతారు. ఆకులతొడిమలకు నీళ్ళుతగులుతుంటేచాలు ఆకులువాడిపోకుండా పచ్చగా కళకళలాడుతూవుంటాయి. ఇట్టి కలశంలోనికి ఇష్టదేవతనావాహనచేసి పూజిస్తారు. ఈవిధంగా తమలపాకులు, తాంబూలం శుభకార్యాలన్నింటిలో అగ్రస్థానం వహిస్తున్నాయి. అంతెందుకూ ఒకవ్యక్తిని మహోన్నతునిగా నిర్ణయించినందుకు గుర్తుగా అతనికి అగ్ర(తొలి)తాంబూలం ఇచ్చి గౌరవించాలి. రాజసూయయాగ చరమాంకంలో శ్రీకృష్ణుడు మహోత్తముడని గుర్తించి అగ్రతంబూలమిచ్చి గౌరవించించాడు ధర్మరాజు.   

 తాంబూలానికి సంబంధించిన పురాణగాథలూవున్నాయి. ఆంజనేయుడు లంకలో సీతాదేవిని దర్శించి, శ్రీరాముని అంగుళీయమిచ్చి తన్నుతాను రామదూతగా నిరూపించుకొనినపుడు, సీతసంతోషించి, తనసంతోషానికి చిహ్నంగా ఏమైనా యివ్వాలనుకున్నది. తనవద్ద యేమీలేకపోవడంతో దగ్గరలోవున్న తమలపాకుతీగనుండి రెండుతమలపాకులు త్రెంచియిచ్చింది. హనుమంతునికి అప్పటినుండి తమలపాకులంటే ఎంతోయిష్టం. అందుకే ఆయనకిష్టమైన తమలపాకులతో ఆకుపూజచేస్తారు. అర్జునుడు యుద్ధంలో విజయంకోసం యజ్ఞంచేయతలపెట్టాడు.  అందుకోసం ఋషులు తొలుత తమలపాకులు అందివ్వమన్నారు. సమయానికి అక్కడ తమలపాకులులేవు. దరిదాపుల్లోదొరకలేదు. వెంటనే అర్జునుడు నాగలోకంవెళ్ళి, అక్కడి నాగరాణినడిగి తమలపాకులు తెచ్చియిచ్చాడట. అందుకే తమలపాకుతీగను నాగవల్లి అంటున్నారు. మరికొందరి అభిప్రాయంప్రకారం తమలపాకుతీగ స్వర్గం(నాకం)నుండి భువికి వచ్చిందట, అందువల్లదానిని నాకవల్లి అని పిలిచారట. అదే కాలక్రమంలో నాగవల్లి అయిందట.

 అన్ని శుభకార్యాలలో, పూజలలో తాంబూలమంటే, ఆకూవక్కా అనే అర్థం. స్త్రీలు బొట్టుపెట్టి తాబూలమిచ్చేతప్పుడు, ఆకులచివర్లు యిచ్చేవారికి వ్యతిరేకదిశలో వుండాలంటారు. ఆకులు మూడులేక ఐదు, వక్కలురెండు, పండ్లురెండు చేర్చియివ్వడం శ్రేయోదాయకం. మంగళకరద్రవ్యాలు ఎనిమిది. వాటిని అష్టమంగళాలంటారు. వాటిలో తాంబూలంకూడా ఒకటి. అష్టమంగళాలుయేవంటే, అవి పుష్పాలు, ఫలాలు, అక్షింతలు, అద్దం, వస్త్రం, తాంబూలం, దీపం, కుంకుమ. భగవదారాధనకు షోడషోపచారాలున్నాయి. అందులోనూ తాంబూలమున్నది. షోడషోపచారాలు యేవంటే, అవి ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, ఆత్మప్రదక్షణం. కొందరు ఆత్మప్రదక్షణానికి బదులు ధ్యానాన్ని చేర్చుకున్నారు.

 మనుషుల ఈతిబాధలు తొలగడానికి వారి రాశినిబట్టి తంబూలాన్ని ఒకప్రత్యేకవారం ఒకప్రత్యేక దైవానికి ప్రత్యేకఫలాలుచేర్చి పూజిస్తే మంచి ఫలితముంటుందని జ్యోతిష్కులుతెలియజేస్తున్నారు. అవి యీవిధంగా వున్నాయి.

 1. మేషరాశివారు తాంబూలంలో మామిడిపండ్లుంచి మంగళవారం కుమారస్వామిని పూజించాలి

2. వృషభరాశివారు తాంబూలంలో మిరియాలులుంచి మంగళవారం రాహువుపూజ చేయాలి.

3. మిథునరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి బుధవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

4. కర్కాటకరాశివారు తాంబూలంలో దానిమ్మపండ్లుంచి శుక్రవారం కాళీమాతను పూజించాలి.

5. సింహరాశివారు తాంబూలంలో అరటిపండ్లుంచి గురువారంనాడు ఇష్టదైవాన్ని పూజించాలి.

6. కన్యారాశివారు తాంబూలంలో మిరియాలుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

7. తులరాశివారు తాంబూలంలో లవంగాలుంచి శుక్రవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

8. వృశ్చికరాశివారు తాంబూలంలో ఖర్జూరపుపండ్లుంచి మంగళవారం ఇష్టదైవాన్ని పూజించాలి.

9. ధనుర్రాశివారు తాబూలంలో కలకండనుంచి గురువారం ఇష్టదైవాన్ని పూజించాలి.

10. మకరరాశివారు తాంబూలలో బెల్లముంచి శనివారం కాళీమాతను పూజించాలి.

11. కుంభరాశివారు తాంబూలంలో నెయ్యివేసి శనివారం కాళీమాతను పూజించాలి.

12. మీనరాశివారు తంబూలంలో పంచదారనుంచి ఆదివారం ఇష్టదైవాన్ని పూజించాలి.

ఇదీ పూజకు, శుభకార్యాలకు సంబంధించిన తాంబూలవిషయం.

 ఇక తాంబూలసేవన విషయానికొస్తే, మనభారతదేశంలో తాంబూలసేవనమొక భోగం, ఒకవిలాసం, ఒకదర్పం, ఒకగొప్పస్థాయికి చిహ్నం. రాజులు తమదర్పం కనబడటానికి ఆకులు వక్కలు సున్నం తోబాటు సుగంధద్రవ్యాలుంచిన వెండిపెట్టెను పట్టుకొనుండే విలాసిని నియమించుకునేవారు. ఆవిలాసినిని తాబూలకరండవాహిని అనేవారు. తాంబూలచర్వణమేగాదు ఆతర్వాత వూసేయాడానికీ  ఒకవిలువైన పాత్రను వాడేవారు. ఆతాంబూలసేవనంలో కూడా ఉదయంవక్కలు, మధ్యహాన్నం సున్నం , రాతిలో తమలపాకులు యెక్కువ వేసుకోవాలని శాస్త్రనిర్ణయం.

  శ్లో: ప్రాతః కాలే ఫలాధిక్యం

        చూర్ణాధిక్యంతు మధ్యమం

        వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ

        తాంబూలమితి లక్షణం---బావప్రకాశిక.

 ఇంకా తాంబూల ప్రాశస్త్యాన్ని సుమతీశతకకారుడు యిలాగొనియాడారు.

 క: తమలము వేయని నోరును

     విమతులతో జెలిమిజేసి వెతఁబడు తెలివిన్

    గమలములు లేని కొలకును

    హిమధాముడులేని రాత్రి హీనము సుమతీ.

 కవితాపితామహుడు అల్లసానిపెద్దన కవితలల్లాలంటే తాబూలం వుండాల్సిదే నంటున్నారు

 ఉ: నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క

     ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త

    ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,

    దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే .  

 రాజులుపోయినా తాంబూలవిలాససేవనం మాత్రం, యేమాత్రం తగ్గలేదు. అది సామాన్యునికీ నేడు అందుబాటులోనే వుంది. తాంబూలంలో ఆకువక్క, సున్నంతోబాటూ, కాచు (దీన్ని

తుమ్మజాతి చెట్టు బెరడునుండి తయారు చేస్తారు) ఏలకలు లవంగాలు, జాజికాయ, జాపత్రి, మెంథాల్, కొబ్బరితురుము గుల్కంద్ వంటి వస్తువులు ఎవరియిష్టానుసారం వాళ్ళు వేయించుకొని సేవిస్తారు. పెండ్లితర్వాత  కొత్తపెండ్లాము భర్తకు ముద్దుముద్దుగా చిలుకలుచుట్టి భర్తనోటికందిస్తుంది. చిలుకలంటే యిక్కడ చేతివేళ్ళకు చుట్టుకున్న తమలపాకులన్నమాట. ఇక వేశ్యాగృహాలలో యీ  చిలుకల వినియోగం ప్రత్యేకంగా  చెప్పవలసిన పనిలేదు. తాబూలానికివాడే తమలపాకులుకూడా చాలారకాలే వున్నాయి. తెల్లాకు, కారపాకు(బనారసి), కలకత్తాపత్తా, కుభకోణంఆకు, వెల్లారి, కలిజేడు వంటివెన్నోవున్నాయి. తాంబూలాన్ని విడెమని, బీడాయని, కిల్లీయనికూడాపిలుస్తారు. వీటిని ప్రత్యేకంగా తయారుచేయగల నేర్పరులున్నారు. వారు తంబూలాన్ని ఒక వ్యాపారవస్తువుగా చేసుకొని అమ్ముకొనుచున్నారు. పట్టణాలలో భోజనహోటళ్ళదగ్గర భోజనానంతరం వేసుకోవడానికి వీలుగా అమ్ముతుంటారు. వీటిలో జర్దాలు, పొగాకువంటివి కలిపిచేసే బీడాలు కూడా దొరుకుతాయి. వీటికి అలవాటుపడి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వాళ్ళూ వున్నారు.

 సాధారణంగా తమలపాకువెనుక కనబడే ఈనెలూ, తొడిమలు తొలగించి తాంబూలంలోవాడుకుంటారు. ఈనెలు తొడిమలు ఆరోగ్యానికి మంచివికావని నమ్ముతారు. ఆయుర్వేదంలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యమున్నది. శ్వాసకాసవ్యాధులలో తమలపాకు చాలాబాగాపనిచేస్తుంది. జీర్ణప్రక్రియకు తోడ్పడుతుంది. గొంతునొప్పిని నయంచేస్తుంది. తాంబూలంలోని తమలపాకుసున్నం వలన ఎముకలు బలపడతాయి. ఇంకా ఎన్నోవ్యాధులకు తమలపాకుకలిపిచేసిన మందులు ఆయుర్వేదంలో వున్నాయి. నెయ్యి చాలాకాలం నిలువవుండటానికి తమలపాకులువేసి నెయ్యిని కాచుకుంటారు. నూనెలుకూడా తొందరగా చెడెపోకుండా వుండటానికి తమలపాకులు వేసివుంచుతారు. తాంబూలం అప్పుడప్పుడు వేసుకోవడం మంచిదేగానీ, అదిలేనిదే వుండలేనంతగా అలవాటుచేసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదియేమైనా తాంబూలం మనజీవనశైలిలో మిళితమైయున్నదనుట నిర్వివాదాంశం.                 

 

 

Tuesday, 14 June 2022

అక్షతలు,akshatalu

 

అక్షతలు



అక్షతలు అంటే అక్షింతలు. అక్షింతలు తెలియని హిందువులుండరు. పండుగలలో, శుభకార్యాల్లో, దేవాలయాల్లో, పూజల్లో, వ్రతాల్లో ఆశీర్వాదంతీసుకునే పిన్నల తలపై పెద్దలు అక్షింతలువేసి దీవిస్తారు. పూజాసమయంలో యేలోటులేకుండా పూజచేయడానికి అక్షతలను సమర్పిస్తారు. అంటే, లభ్యంకాని పూజావస్తువులకుబదులు అక్షతలువేస్తే సరిపోతుందని పెద్దలుచెబుతారు. ఉదాహరణకు బంగారు దేవునికి సమర్పించలేనివారు, బంగారంసమర్పిస్తున్నామని అక్షతలు దైవంపై వేస్తారు. అదే,"హిరణ్యం సమర్పయామి" అని అక్షతలు వేస్తారు, సరిపోతుంది. అంతేగాదు, అన్నంనుండే జీవులు ఉత్పన్నమౌతాయని భగవత్గీత చెబుతున్నది. కనుక  మనకుఉత్పన్న మూలమైన  అన్నము బియ్యమే. అబియ్యమే  భగవంతునకు సమర్పించడమంటే మమ్మల్నిమేము నీకు సమర్పించికుంటున్నాం, శరణాగతిపొందుతున్నాం, అన్న అర్థం వస్తున్నది. ఇదే గొప్పసమర్పణ. ఇంత ఆర్థం భగవంతునివైపు అక్షతలువేయడంలోవుంది

 క్షతముకానటువంటి బియ్యమే అక్షతలు. అంటే విరగనిబియ్యపుగింజలనే అక్షతలుగా వాడాలి. వాటికి పసుపు లేక కుంకుమను కొద్దిపాటినీళ్ళుగానీ ఆవునెయ్యిలేక నువ్వులనూనెవేసికలిపి అక్షతలు తయారుచేసుకుంటాము. వాటిని శుభకార్యాలలో పెద్దలు పెద్దలు, పిన్నల తల(బ్రహ్మరంధ్రం)పై వేసి సుమంగళీభవ! ఆయుష్మాన్‍భవ! శుభమస్తు! అని దీవిస్తారు. అక్షింతలలో పసుపుకలిసి వుండటంతో దీవించేవారి జబ్బులు, ముఖ్యంగా చర్మవ్యాధులు అవీ చేతికుండే చర్మవ్యాధుదులను పసుపు అడ్డుకుని దీవెనలుపొందే వారికి ప్రాకకుండా చేస్తుంది.

 బియ్యం వాడటానికి యింకోగొప్ప కారణమున్నది. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహశాంతికి ఒక్కోధాన్యం, దానంగా జ్యోతిషశాస్త్రజ్ఞులు చెప్పారు. ఆక్రమంలో చంద్రునికి బియ్యం  చెప్పబడింది.  "మనఃకారకో ఇతి చంద్రః" చంద్రుడు మనస్సుకు  అధినాయకుడు. మనస్సు, బుద్ధి, వ్యసనములకు కారకుడు. కనుక బియ్యం తలపైని బ్రహ్మరంద్రంపై వేయడంద్వారా మనోధర్మాలు క్రమబద్ధమై నియంత్రణలోవుంటాయి. విరగని బియ్యం వేస్తారుగనుక దీవెనలు సంపూర్ణంగా నిండునూరేళ్ళు యేలోటులేకుండా హాయిగావుండాలన్న సందేశం అక్షతల్లోదాగివుంది. ఇక పసుపు బృహస్పతికిప్రతీక గనుక అది విద్యాబుద్ధిప్రదాయిని.

 అక్షతలువేసి దీవించడంలో మరోరహస్యం కూడా దాగివుంది. మనదేహంలో ఒకవిధమైన విద్యుత్కేంద్రాలు యిరువదినాలుగున్నాయి. వాటిలో శిరస్సులోని బ్రహ్మరంధ్రస్థానం అతిముఖ్యమైనది. అదిశక్తి ఉత్పత్తికి ప్రసారానికి ప్రధానకేంద్రం. అక్షింతలు వేసేవారు పెద్దలు శ్రేష్ఠులు, గనుక వారిలో యెక్కువగా, సాత్వికశక్తి వుంటుంది. ఒకవేళ తామస రజోశక్తులుంటే, పసుపుదాన్ని అడ్డుకుంటుందిఅందువల్ల సాత్వికవిద్యుచ్ఛక్తి అక్షింతలువేయించుకునే పిన్నలలలోకి ప్రవహించి వారిలో ముందున్నశక్తిని ఉత్తేజితంచేసి, వారుజీవితంలో సక్రమంగా అభివృద్ధిచెందటానికి తోడ్పడుతుంది.     

 పెద్దలు అక్షింతలువేసి దీవించే సమయంలో పిన్నలు వంగి పెద్దల పాదములకు తలనుఆనించి మ్రొక్కడం మరింతశ్రేయోదాయకం. ఎందుకంటే మనిషిలో అయస్కాంతశక్తికూడావుంది. దానికి ఉత్తరధ్రువం తల. దక్షిణద్రువం పాదాలు. పిన్నవారి ఉత్తరద్రువమైన తల, పెద్దల దక్షిణద్రువమైన పాదాలకు సోకినపుడు, ఆకర్షణప్రక్రియద్వారా పిన్నలలోనికి పెద్దల సాత్వికశక్తి ధారాళంగా ప్రసారమై క్షేమకారకమౌతుంది.

 ఇక వివాహసందర్భంలో అక్షతలదీవెనలతోపాటు తలంబ్రాలు(తలప్రాలు)అంటే తలలపై వధూవరులు బియ్యంపోసుకునే, తప్పనిసరి ఆచారం హిందువులలో వుంది. ప్రాలు అంటే బియ్యంగనుక యివీ ఒకరకంగా అక్షతలే, లేదంటే యివి బియ్యంమాత్రమేవధువుచేతిని దర్భలతోతుడిచి దోసిలిలో రెండుమార్లుగా బియ్యంపోసి పైన కొద్దిగా పాలనుచల్లి, తలంబ్రాలను పోయిస్తారు. అదేవిధంగా వరునిచేతకూడా తలంబ్రాలు పోయిస్తారు. ఇందులో కన్య, వరునివంశాన్నివృద్ధిచేయాలని, తద్వారా యిరువంశాలు తరించాలని, తలబ్రాలవలెనే, సమృద్ధిగా ధనధాన్యాలతో తులతూగాలనీ, శాంతి, పుష్ఠి, సంతోషాలతో యేవిఘ్నాలు లేకుండా సహజీవనంచేయాలన్న సందేశం యిందులో యిమిడివుందని విబుధులు చెబుతున్నారు.

 అక్షింతలు అనేమాట, మరోవిధంగా విపరీతార్థంలో కూడా తరచుగా వాడటం తెలుగువారికి పరిపాటి. ఎవరి తప్పునైనా ఎత్తిచూపి దండించడం, లేదా మందలించడాన్ని అక్షింతలువేయడం అని అంటుంటారు. అంతగా అక్షింతలనేమాట తెలుగువారి నోళ్ళలో మెదలుతూవుంటుంది మరి.     

 

Thursday, 9 June 2022

దర్భ, darbha.

 

దర్భ

   

"కుశాగ్రేచ సదావిష్ణుః కుశమధ్యే శివస్మృతః

కుశాంతేచ సదావిధిః కుశః త్రైమూర్తికోవిదుః


హిందువులకు శుభాశూభకార్యాలన్నింటీలో దర్భల  ఉపయోగం తప్పనసరి. దర్భమూలంలో బ్రహ్మ, మధ్యలో శివుడు, కొసలో విష్ణువు విరాజమానమైవుంటారని శాస్త్రంచెబుతున్నది. శ్రీరామునిస్పర్శచే దర్భలు పవిత్రతను సంతరించుకొన్నవని బుధు ఉవాచ. యజ్ఞయాగాదుల నుండి దేవతాప్రతిష్ఠలలోను, పితరులకుపిండప్రదానాలలోనూ, కుంభాభిషేకాది సందర్భాలలోనూ దర్భలు తప్పనిసరి. యాగశాలకలశాలకు బంగారు, వెండితీగలతోబాటు దర్భనుచేర్చిచుడతారు. వినాయకునికి ప్రీతిపాత్రమైనదిగా భావించి గణపతిపూజలో మిగతాపత్రితోబాటు దర్భనుచేర్చి పూజిస్తారు. కృష్ణయజుర్వేద పరాయతంలో దర్భపవిత్రత గొప్పగాచెప్పబడింది. వైదికకార్యాలలో "పవిత్ర" అన్నపేరుతో కుడి ఉంగరపువ్రేలికి దర్భను ఉంగరంగంగాచుట్టి ధరించి కార్యక్రం నెరవేరుస్తారు. ఉంగరంవ్రేలిగుండ కఫనాడి వెళుతుంది. ఆవ్రేలికి దర్భ ఉంగరం ధరించడంద్వారా కఫంనివారించబడి కంఠంశుభ్రపడి వేదమంత్రాలు స్వచ్ఛంగా పలుకగలుగుతారు. అందుకే వేదాభ్యాసంచేసే విద్యార్థులు దర్భ ఉంగరం తప్పక ధరిస్తారు. ప్రేతకార్యనిర్వహనలో ఒకదర్భను ఉంగరంగాచేసుకుంటారు. వివిధశుభకార్యాలలో రెండు, పితృకార్యాలలో మూడు, దేవకార్యాలలో నాలుగుదర్భలు ఉంగరంగా చుట్టుకుంటారు. అందువల్ల అపవిత్రవస్తువులను తాకినా, చెడువార్తలువిన్నావచ్చే దోషం దర్భదారణతో నివారణమౌతుంది, అంతేగాక వారి ప్రాణశక్తి హెచ్చింపబడుతుంది. దర్భలుకోసేటప్పుడు మంత్రపూర్వకంగా కోసుకరావడం మంచిది. ఆమంత్రం యిది

                        విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ

                           నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

 పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు దర్భలు తీసురావడం అత్యంతశ్రేష్టం. సర్వసాధారణంగా

దర్భలు ఆదివారం కోసితెస్తే ఒకవారంవరకు పనికివస్తాయి. అమావాస్యదినం తెచ్చుకుంటే ఒకమాసం, పున్నమినాడు తెస్తే ఒకపక్షం పనికివస్తాయి. అదే శ్రావణమాసంలో తెచ్చుకుంటే సంవత్సరమంతా వాడుకొనవచ్చును. భాధ్రపదమాసంలోతెచ్చుకుంటే ఒకపక్షంలోనే వాడుకోవాలి. శ్రాద్ధకర్మలకోసం తెచ్చిన దర్భలుమాత్రం యేరోజుకారోజే ఉపయోగించాల్సి ఉంటుంది.

 మత్స్య, కూర్మ, వరాహ, పద్మ, నారద, అగ్ని, స్కాంద పురాణాలలో దర్భలప్రస్తావన, పురాణగాధలూ ఉన్నాయి. వరాహావతారంలో హిరణ్యాక్షుని వధించినతర్వాత బ్రహ్మ అవతారపురుషుని చుట్టూ మూడుప్రదక్షణలు చేస్తాడు. అప్పుడు వరాహమూర్తి సంతోషంతో శరీరం విదిలిస్తాడు. అప్పుడు ఆయన శరీరంనుండి కొన్నిరోమాలు రాలి భూమిమీదపడ్డాయి. అవే దర్భలైమొలిచాయి. కూర్మపురాణం ప్రకారమైతే, మంథరపర్వతాన్ని కూర్మావతారమూర్తి వీపుపై అటూయిటూ కవ్వంగా దేవదానవులు త్రిప్పినపుడు అవతారమూర్తివీపుపైనున్న కొన్ని వెండ్రుకలు రాలి పాలసముద్రంలో పడిపోయాయి. అమృతం ఆవిర్భవించినతర్వాత కొద్దిఅమృతం ఆవెండ్రుకలతోకలసి ఒడ్డుకుచేరి, తర్వాత అవే దర్భలుగా మొలకెత్తాయి. మరోకథనంప్రకారం ఇంద్రుడు వృత్రాసురుని సంహరించడానికి సముద్రపుఒడ్డుకువచ్చాడు. వృత్రాసురుడు తడిపొడిగానివస్తువుతో తప్ప యితరంతో చావడు. ఆదివానికున్నవరం  తడిపొడిగాని సముద్రనురగను వజ్రాయుధానికిఅంటించి ఇంద్రుడు ప్రయోగించాడు. వృత్రాసురుడు, క్రిందపడిపోయాడు. ఆయాసంతో నీటికొఱకు తహతహలాడాడు. ఆసమయంలో అతనికి నీరుఅందకుండా చేయడానికి బ్రహ్మ దరిదాపుల్లోన్ని నీటిని గడ్డిమొక్కలుగా మార్చేసాడు. ఆగడ్డిమొక్కలే దర్భలు. మరోకథ ప్రకారం తల్లిబానిసత్వం బాపడానికి గరుడుడు అమృతకలశం స్వర్గమునుండి తెచ్చి నాగులుకోరినట్లు నేలపైవుంచాడు. ఆనేలపైదర్భలుండటంచేత ఆదర్భలు అమృతకలశస్పర్శచే అమృతగుణం పొందాయి.  పాములు స్నానంచేసి వచ్చేలోపల ఇంద్రుడు అమృతకలశాన్ని అపహరించుకపోయాడు. పాములువచ్చి కలశంవుంచిన చోటగల దర్భలను నాకాయి. అందువల్ల నాగులకు దీర్ఘాయువు గలగటమేగాక నాకేటప్పుడు వాటినాలుకలు తెగాయట, అందుకే పాములకు రెండుగాతెగిన నాలుకలున్నాయి.

దర్భలతోఅల్లిన చాపను దర్భాసనం అంటారు. ఈఆసనంపై కూర్చొని ధ్యానంచేయడంద్వారా ధ్యానంవల్లపొందిన శక్తి భూమిగ్రహించకుండా ఆపుతుంది. మంత్రపూరితజలప్రభావం తగ్గిపోకుండా ఉండటానికి ఆజలంలో దర్భవేసి ఉంచుతారు. పూజాసమయంలో సహోదరులూ, భార్యాపిల్లలతో అనుసంధింపజేయడానికి దర్భలను అందరికి తాకిస్తారు. హోమంచేసేసమయంలో నాలుగువైపులా దర్భలులుంచితే దుష్టశక్తులను పారద్రోలి యజ్ఞం నిరాటంకంగా జరిగేట్లు చేస్తాయి. బుధులు అష్టార్ఘ్యాలు చెప్పారు. వాటిలో దర్భకూడా ఉన్నది. అవి పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పుష్పములు, దర్భలు. 12 రకాల గడ్డిమొక్కలను  దర్భలుగా పరిగణిస్తారు. అవి కుశలు, కాశములు(రెల్లు), దూర్వ(గరిక), వీహ్రీ(ఎఱ్ఱబుడమగడ్డి), యవలు, ఉసీరములు(వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు(మొలవగడ్డి), గోదుమగడ్డి, కుందరముగడ్డి, ముంజగడ్డి, పుండరీకములు. ముఖ్యముగా దర్భజాతులను అపకర్మలందు, కుశజాతులను పుణ్యకార్యములందు, బర్హిస్సుజాతులను యజ్ఞయాగాదిశ్రౌతక్రతువులందును, రెల్లుజాతులను గృహనిర్మాణకార్యములందును వాడుట మంచిది. దర్భలను విశ్వామిత్రసృష్టిగా కొందరుభావిస్తారు. పితృకార్యములకు దర్భలను సమూలంగా గ్రహించడం అవసరం. దర్భకొసలు పదునుగావుంటాయి. ఇటువంటి దర్భలు దేవతలఆవాహనుకు ఉపయోగిస్తారు.

 దర్భలలో ఆడా, మగ, నపుంసక దర్భలుంటాయి. మొత్తందర్భ  క్రిందినుండిపైవరకు సమంగావుంటే పురుషదర్భయని, పైభాగంమాత్రమే దళసరిగావుంటే స్తీదర్భయని, అడుగుభాగంమాత్రమే దళసరిగావుంటే నపుంసక దర్భయని పరిగణిస్తారు.

 గ్రహణకాలంలో దర్భలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. గ్రహణకాలంలో చంద్రుని లేక సూర్యుని కిరణాలరేడియేషన్ విషయుల్యమై కీడుచేసే ప్రమాదముంది. ముఖ్యంగా గర్భవతులు జాగ్రత్తగా కిరణాలుతమపై పడకుండా చూసుకోవాలి. అంటే ఇంట్లోనేవుండాలి. నీరు మరియు ఆహారపదార్తాలలోకూడా దర్భవేసి వుంచితే అవి దూషితాలుకాకుండా వుంటాయి. ఈవిషయంపై అధ్యయనంచేసి పదార్తాలు చాలాకాలం చెడిపోకుండా నిలువచేయగల గుణం దర్భలకుందని తెలుసుకున్నారు. కనుక ప్రిజర్వేటివ్‍లుగా దర్భలువాడవచ్చని నిరూపణయింది.

 దర్భలు ఆయుర్వేదంలోనూ, హోమియోపతిలోనూ ఔషదములుగా వాడుతున్నారు. దర్భలతోచేసినమందులు చలువచేస్తాయి. మూత్రం సాఫీగాజారీఅయ్యెట్లు చేస్తాయి. మంటతో మూత్రం బొట్లుబొట్లుగా రావడాన్ని నయంచేస్తాయి. పాలిచ్చేతల్లులకు క్షీరవర్ధినిగా పనిచేస్తాయి. ఉబ్బసము, బంకవిరేచనాలు, కామెర్లు, పైత్యప్రకోపాలు నయమౌతాయి. వీర్యవృద్దికితోడ్పడుతాయి. ఇలా దర్భలు అనేకసుగుణాలు కలిగియున్నాయి.                

 

Friday, 3 June 2022

tulasi, తులసి

 


తులసి

  

శ్లో: యన్మూల్యే సర్వతీర్థాని యన్మధ్యేసర్వదేవతా

                         యదగ్రే సర్వవేదాని తులసిత్వామ్ నామామ్యాహమ్//

 తులసి హిందువులకు పరమపవిత్రమైనది. దేవతాస్వరూపం తులసిని విష్ణుకామిని యని, విష్ణుభూషణమని, విష్ణుపాదస్థల నివాసినియని వైష్ణవులుభావిస్తారు. తులసితీర్థం గంగాజలంతో సమానమంటారు. తులసిలో ఏడురకాలున్నాయి. కృష్ణతులసి, రామతులసి, లక్ష్మీతులసి, విష్ణుతులసి, వనతులసి రకాలు ముఖ్యమైనవి. అన్నీ పవిత్రమైనవే, అయినా కృష్ణతులసి ప్రాముఖ్యమెక్కువ. దైవకార్యాల్లోనూ, పితృకార్యాల్లోనూ తులసీదళాలు తప్పనిసరి. ఇదిలేనిదే దేవతలనుగానీ, పితృదేవతలనుగానీ ఆవాహనచేయలేరు. దుష్టశక్తులని దరిచేరనివ్వదు. అందుకే తులసిచెట్టును ప్రతిగృహంలోనూ పెంచుకుంటారు. కోటవలె రక్షణకల్పించాలని కోటరూపంలో తొట్టిని నిర్మించుకొని అందులో తులసిచెట్టును నాటుకొని, ఇరుసంధ్యలలో దీపంపెట్టి మరీపూజిస్తారు. తులసి ప్రతికూలతలను, వాస్తుదోషాలను తొలగిస్తుంది. శుక్రగ్రహదోషంవల్ల కలిగే వైవాహికసమస్యలు రామతులసిపూజవల్ల తొలగిపోతాయి. శనిగ్రహదోషంవల్ల కలిగే ఆయుర్ధాయసమస్యలు, అనారోగ్యాలు, ఏల్నాటిశనిబాధలూ కృష్ణ(నల్ల)తులసిపూజవల్ల తొలగిపోతాయి.


 తులసికిసంబంధించి అనేకపురాణగాథలున్నాయి. ఈమెతొలుత గోలోకవాసి. తులలేని సౌదర్యవతిగావున తులసియయ్యింది. సర్వలోకాధిపతి శ్రీకృష్ణుని పరమభక్తురాలు. ఈమెది మధురభక్తి. శ్రీకృష్ణమోహంతో ఒకదినమామె మూర్చపోయింది. రాధ ఆమెనుగమనించి కృష్ణప్రేమలో నాతోపోటీపడతావా? రాక్షసివైపుట్టుమని శపిస్తుంది. గోలోకంలోనే వుంటున్న మరొకకృష్ణభక్తుడు సుధామ, తులసిని శపించడం అన్యాయమనీ, శాపమునుపసంహరించమని రాధాదేవిని ప్రాధేయపడ్డాడు. కోపంతోవున్నరాధ తులసికీనీకు యేమి సంబంధం. నీవెందుకు జోక్యంచేసుకుంటున్నావు, నీవుకూడా రాక్షసుడవై జన్మించు అని శపించేసింది తర్వాతరాధాదేవి శాంతించి, తనతప్పు తెలుసుకొని, దయచూపి, నాశాపమునకు తిరుగులేదు. అయినామీరు శ్రీకృష్ణకృపాకటాక్షమునకు పాత్రులై లోకప్రసిద్ధిగాంచెదరని దీవించింది. తులసి కాలనేమిఅనే రాక్షసుని కూతురై జన్మిస్తుంది. సుధాముడు శంఖచూడుడనే రాక్షసుడైజన్మించి తులసిని వివాహమాడుతాడు. ఇది బ్రహ్మవైవర్తపురాణగాథ, ఈపురాణంప్రకారం గోలోకంలో రాధాకృష్ణులు విరాజమానమైయుండి, లోకాలను పాలిస్తుంటారు. త్రిమూర్తులు వారిఆజ్ఞానుసారం అప్పజెప్పిన కార్యనిర్వహణ జేస్తారు. శ్రీకృష్ణుడు విష్ణువుయొక్క అవతారం కాదు. కృష్ణుడే సర్వలోకాధిపతి. శివపురాణంప్రకారం తులసిభర్తపేరు జలంధరుడు. శివుని నయనాగ్నిజ్వలనుండి ఉద్భవించినవాడు. మిలిలినకథ దాదాపు సమానమే. జలంధరుడు మహాబలవంతుడు. దేవతలను ఓడించి స్వర్గంనుండి వారిని తరిమేస్తాడు. దేవతలు శంకరుని శరణుజొచ్చి కాపాడమని ప్రార్థిస్తారు. శంకరుడు విష్ణువుతోకలసి వ్యూహరచనజేస్తాడు. శివుడు జలంధరుని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తులసి కీడునుశంకించి తనపతికి ఆపదకలుగకుండుటకై  ధ్యానంలోనిమగ్నమౌతుంది. జలంధరునితోయుద్ధం శివునకు దుస్సహమౌతుంది. తులసిధ్యానం భంగమైతేనేగాని జలంధరుడు చావడని గ్రహించిన విష్ణువు జలంధరునిరూపంలో తులసిదగ్గరకువెళ్ళి, తులసీ! నేను యుద్ధరంగంనుండి క్షేమంగా తిరిగివచ్చాను, బ్రహ్మరాయబారంవల్ల సంధికుదిరి యుద్ధం ముగిసింది. ఇకనీవు ధ్యానం విరమించు, అన్నాడు. భర్తక్షేమంగా రణభూమినుండి తిరిగివచ్చాడని సంతోషించి తపంచాలించింది తులసి. ఇదేఅదనుగా శంకరుడు జలంధరుని సంహరించేశాడుచారులు పరుగుపరుగునవచ్చి తులసికి జలంధరుని మరణవార్త చెబుతారు. విష్ణువు నిజరూపుదాల్చి, తులసీ! జలంధరుడు లోకకంటకుడు. అతడు శివునిచే మరణించక తప్పదు. మహాపతివ్రతవైన నీధ్యానం భంగమైతేనేగాని అతడుమరణించడు. అందుకే నేనిలాచేయవలసి వచ్చిందంటాడు. తులసి కోపోద్రిక్తురాలై, విష్ణువును శిలగామారమని శపిస్తుంది. అంతేగాకుండా, నావలెనీవూ వియోగబాధననుభవింపుమని శపిస్తుంది. ఆ కారణంగా విష్ణువు గండకీనదిలో సాలగ్రామమైపుట్టి ఆరూపంలోనే పూజలందుకుంటున్నాడు. అలాగే రామావతారంలో సీతావియోగక్లేశాన్ననుభవించాడు. మహావిష్ణువు తులసి శాపాన్నిచిరునవ్వుతో స్వీకరించి ,తులసిని నిందించక, ఆమెననుగ్రహించి తులసీ! నీవు పరమపవిత్రురాలవు. మరుజన్మలో తులసిచెట్టువై పుట్టి, నాతోసమానంగా పూజలందుకుంటావు. తులసీమాలధరింపజేసి, తులసీదళములతోచేసేపూజనాకు  ప్రియాతిప్రియమైవుంటుంది, అని శ్రీమహావిష్ణువు తులసిని దీవిస్తాడు. ఇదీ తులసి పురాణగాథ.              

 

తులసిచెట్టును యింట్లో ఏదిశలోనైనా పెంచుకోవచ్చు. కానీ ఈశాన్యదిశశ్రేష్ఠం. ఇంట్లోకి గాలివచ్చు మార్గంలో పెట్టుకుంటే గాలిశుభ్రమై యింట్లోకి ప్రవేసిస్తుంది. తులసిపూజవల్ల స్త్రీలకువైధవ్యప్రాప్తి కలుగదన్నది గొప్పవిశ్వాసం. తులసి సర్వపాపనాశిని. సంస్కృతంలో తులసిని సురసా, సులభ, బహుమంజరీ, దేవదుందుభి, వృందా అనే నామాలున్నాయి.

 

తులసిమాలధారణకొక ప్రత్యేక స్థానమున్నది. తులసికాండంతో పూసలుతయారుచేసుకొని, మాలలల్లుకుంటారు. ఇవి ఎవరికివారే తయారుచేసుకోవడం మంచిది. కృష్ణజన్మస్థానమైన మథురపట్టణంలోని నిధివన్ మరియు సేవాకుంజ్ వనాలలోని తులసిచెట్లనుండి తయారుచేసినవి విక్రయిస్తారు. వీటికి ప్రత్యేకశ్రేష్ఠత కలదని విశ్వసిస్తారు. మరణమాసన్నమైనపుడు తులసితీర్థం పోస్తారు. అంతేగాకుండా తులసిమాల ధరింపజేస్తారు. అందువల్ల పాపాలన్నీ తొలగిపోయి నేరుగా వైకుంఠం వెళతారని హిందువుల ప్రగాఢవిశ్వాసం. విష్ణుభక్తులు జపంచేసుకోవడానికి తులసిమాల నుపయోగిస్తారు.    

మెడలోమాలగాకూడా నిత్యంధరిస్తారుతులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి,” తులసీస్పర్శనేరైవ నశ్యంతి వ్యాదయో నృణామ్” అన్నది  అర్యోక్తి. తులసిమాల ధరించునప్పుడు,తులసితీర్థం తీసుకునేప్పుడు  యీ మంత్రంపఠించడం  అత్యంత శ్రేయోదాయకం.

      ప్రసీద దేవదేవేశి,  ప్రసీద హరివల్లభే

          క్షీరోదమాధనోద్భూతే  తులసి త్వాం నమామ్యహమ్”

 జపంవల్ల చేతిలోని ఆకుపంచర్ పాయింట్స్ పై ఒత్తిడికలిగి మానసికప్రశాంతతకు దారితీస్తుంది. మాలధారణద్వారా ఒకవిధమైన విద్యుత్ శక్తితరంగాలు ఉత్పన్నమై రక్తప్రసారం సజావుగాజరగడానికి తోడ్పడి తద్వార రక్తపోటు నియంత్రణలోవుంటుంది . ఈశక్తితరంగాలవలన సాత్వికతపెంపొంది స్వరం శ్రావ్యంగామారుతుంది. గుండె, ఊపితిత్తులు క్రమబద్ధంగా పనిచేయునట్లుచేసి రోగాలురాకుండా చూస్తుంది. అతిపురాతనమైన ఋగ్వేదంలోనూ చరకసంహితలోనూ తులసి ప్రస్తావనవుంది. ఇప్పుడుకూడా తులసిగింజలచూర్ణాన్ని, తులసిగింజలనుండి తీసిన తైలాన్ని వైద్యరంగంలో విరివిగా వాడుతున్నారు. గింజలలో ఆంటీఆక్సిడెంట్లు ఎక్కువగావుండటంవలన  రోగనిరోధకశక్తిని పెంచడమేగాకుండా, క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి మనకు రక్షణనిస్తుంది. ఒకగ్రాము తులసిగింజలచూర్ణం రాత్రికి నీళ్ళలోనానబెట్టి ఉదయంపడగడుపున సేవిస్తే వీర్యరక్షణకు, వృద్ధికి సహాయపడుతుంది. అధికబరువునుతగ్గిస్తుంది. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తనాళాలలోక్రొవ్వు నియంత్రణలోవుంటుంది. వయస్సుపెరిగినా చర్మంపై  త్వరగాముడుతలు పడనీయదు. రక్తహీనతరానివ్వదు. విత్తనాలను నమలడంద్వారా నోటిదుర్వాసన పోతుంది. సేవనంద్వారా కడుపులో నులిపురుగుగులు నశిస్తాయి. మలబద్దకం పోతుంది. చర్మవ్యాధులు నయమౌతాయి. బొల్లి, ధనుర్వాతం, ప్లేగువ్యాధులను నయంచేస్తుంది. తులసితైలం, పట్టించడంద్వారా కీటకాలకాటువల్ల కలిగే మంటను నివారిస్తుంది. గాయాలను తొందరగామాన్పుతుంది. పులిపిర్లు రాలిపోయేట్లుచేస్తుంది. కాళ్ళపగుళ్ళును మాన్పుతుంది. అంతెందుకు కరోనాకుకూడా మంచిమందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తులసితైలాన్ని కేశతైలాలలోకూడాకూడా విరివిగావాడుతున్నారు. దీనివల్ల వెంట్రుకలురాలిపోవడం తగ్గుతుంది. తలలోపేలు, చుండ్రుపోయి జ్జాపకశక్తిని పెంచుతుంది. కంటిచూపునుమెరుగుపరుస్తుంది. ఇటువంటి ఐదువందల రుగ్మతలను నయంచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇన్ని ఉపయోగాలుగల తులసిని ఎంతశ్లాఘించినా తక్కువే ఔతుంది.  

 

 

 

 

 

 

పారాణి

  పారాణి పసుపులో సున్నపునీరు చిక్కగాకలుపుకుంటే పారాణి తయారౌతుంది. అదేనీళ్ళగా కలుపుకుంట...